"చూడండి. నా కంటిపాపల్లో మీ కంటిపాప మిల మిల్లాడుతూ మెరుస్తున్నంత కాలం ఎవ్వరూ మిమ్మల్ని నా నుండి వేరు చెయ్యలేరు. అట్లా వేరు చెయ్యటానికి ఆ పరమాత్ముడికికూడా మనస్సు ఒప్పదు. నా జీవితంలోని ప్రతి సన్నివేశం లోనూ మీరుకనిపిస్తారు. మీ జీవితంలోని ప్రతి ఘట్టానికి నేను అడ్డు వస్తూనే ఉన్నాను. ఏ దృష్టి తో చూసినా మీరు ముందుకు పోలేకుండా ఉన్నారు. మీ పురోభివృద్ధికి ఆటంకం కలిగించే నేను క్షంతవ్యురాలినే అంటారా"
ముత్యాలలాంటి కన్నీటి బొట్టు వెచ్చగా అతని చెంపల్ని తాకాయి.
"ఏడుసున్నావెందుకు స్వాతీ, నేనేమయినా అన్నానా" పసివాడిలా భయపడుతూ అన్నాడు.
"లేదండీ ఏడవడంకాదు. సంతోషషాతిశయాన్ని మనస్సులో నింపుకున్నాను. కాని అది పొంగి పొర్లింది. మానసిక భావదర్పణమే కన్నీరు" అన్నది కళ్ళు తుడ్చుకొని.
"స్వాతి వాన నా మీద కురిపిస్తున్నావా"
లాలనగా అడిగాడు. పొడి దగ్గుతో ఆయాసం హెచ్చింది.
'దగ్గుతో మళ్ళా ఆయాసం హెచ్చుతున్నది. నామాటవిని కాస్త విశ్రాంతి తీసుకోండి."
"ఇంతకన్నా విశ్రాంతి ఏంకావాలి స్వాతీ. నువ్వు కాకపోతే ఏ భార్య నాకు ఇంత విశ్రాంతినిస్తుందో చెప్పు. ఈ గుండెజబ్బువాడితో నేను సుఖపడే దేమిటని దాని దారి అది చూసుకునేది. ఆ పని నువ్వు ఎందుకు చెయ్య......' అర్దోక్తిలోనే తన చేత్తో అతని నోటిని కప్పేసింది.
'క్షమించండి. మీ నోరు మూశాననుకోకండి. మీ చివరి మాటలు వినలేక ఈ పని చేసాను. కల్లోకూడా అనకూడని, వినకూడని మాటలు మాట్లాడవద్దని మిమ్మల్ని అర్దిస్తున్నాను!!' అతని రెండు చేతులతో తన ముఖాన్ని కప్పుకొంది.'
"పోనీలే స్వాతీ ఏదో ఎగతాళికి అన్నాను. ఇంకెప్పుడూ అననులే. ఒక్క కోరిక తీరుస్తావా."
"తప్పకుండా మీ ఆరోగ్యానికి భంగం రాని ఏ కోరికనైనా తీరుస్తాను. నాకు కళంకంరాని ఏ కోరికనైనా శిరస్సున ఉంచుకొని ఆచరిస్తాను."
నవ్వాడు కృష్ణమూర్తి.
"అమ్మ దొంగా, అర్దోక్తిలోనే ఎంత మధురంగా మాట్లాడావు. వివాహానంతరం మన జీవితాన్ని గానం చేస్తావా?"
ఆశ్చర్యంతో అతని చేతులను తన చెంపలకు రాసుకున్నది.
"మన జీవితం గానం చేయవలసిన కోవలోనిదా, అలాంటి పుణ్య దంపతులకూ మనం" కన్నార్పకుండా చూసింది. ఆ చూపులో పదేళ్ళ జీవితం కరిగి ఉన్నది.
"అవును స్వాతీ. మన పదేళ్ళ జీవితమూ ఒక్క సారికళ్ళకు కట్టినట్లుగా చిత్రించగలవా. అదంతా వింటే నా గుండెజబ్బు తగ్గుతుందేమోనని నా ఆశ. మన జీవితంలోని మధుర సన్నివేశాలు నాకన్న నువ్వే ఎక్కువగా చెప్పగలవు. ఆయాసందర్భాలలో నేను ఒక శ్రోతను మాత్రమే" అన్నాడు.
బరువుగా శ్వాస పీల్చింది స్వాతి. ఆమె పది సంవత్సరాలు వెనక్కు వెళ్ళింది. ఆమెవైపే చూస్తూ ఆమె వళ్ళో తల ఉంచి పడుకున్నాడు కృష్ణమూర్తి. అతని మనస్సు ఆమె చెప్పే సంఘటనలను చిత్రీకరిస్తున్నది.
* * *
"ఏమిటి స్వాతీ! అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావ్ అంత తీవ్రమైన కొత్త విషయాలేం లేవే."
సెకండరీ గ్రేడు ట్రైనింగు ఇద్దరూ పాసయి కొత్తగా ఇల్లు తీసుకుని కాపురం పెట్టిన మొదటి రోజు అది.
"ఏదోనండి, మనిద్దరం వచ్చేసినాక నాకు ఏంటో గుబులుగానే ఉంటోంది. ఈ రోజుకి ఓటలు భోజనమే అయినా, నే నొండితే మీకు పనికొస్తదా అని నా మీమాంస" అన్నది స్వాతి.
కృష్ణమూర్తి నవ్వాడు. స్వాతి చిన్న మనస్సు అతనికి పెద్ద సమస్యయింది.
"నువ్వెవరివి స్వాతీ!"
"మీకు తెలియదా."
"నీచేత చెప్పిద్దామని."
"కాలానికీ, కులానికీ ఎదురీత ఈది నన్ను స్వీకరించిన మహానుబావులు మీరు. మీ భార్యని నేను."
"బావులూ, చెరువులూ కాదు స్వాతీ మహానుభావులు. వత్తులు పలకటం నేర్చుకోవాలి మరి."
స్వాతి సిగ్గుపడింది. తన మాటల ఉచ్చారణలో ఎంతో తేడా కనిపిస్తున్నది. ఆ తేడా ఇంక రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి.
"నా మనస్సు మీదయినా, నేను మీ ఇల్లాలిని అయినా, ఎంత చదువుకున్నా యాపచెట్టుని మాయిడికాయలు కాస్తయ్యా చెప్పండి" అన్నది స్వాతి.
కృష్ణమూర్తి పొట్ట చెక్కలయ్యేటట్లుగా నవ్వాడు. స్వాతి బిత్తరిచూపులు చూస్తూ కూర్చుంది ఖంగారుపడి.
"స్వాతీ, మళ్ళా అను. యాపచెట్టూ, మాయిడి కాయానా? మళ్ళా అను, వేపచెట్టు, మామిడి కాయ అనాలి, తెల్సిందా."
సిగ్గుతో ముఖం రెండు చేతులతోనూ కప్పు కుంది స్వాతి. చేతి వేళ్ళ సందుల్లోంచి మిలమిల మెరిసే ఆమె నేత్రద్వయంలోని వెలుగును చక్కగా చూడగలిగాడు కృష్ణమూర్తి.
ఈ అందాల భామ, బంతిపువ్వులాంటి పసిడిరేకులను వెదజల్లే మాటల పొందికను నేర్చుకో బూని మళ్ళీ ఎప్పటికప్పుడే అడుగులో హంసపాదు వేస్తున్నది. ఈ మేలిమి బంగారాన్ని ఆవరించిన మకిలిని వదిలించి నా కనుగుణ్యమైన తీరుగా మలచుకుని జీవయాత్ర సాగించాలి. తనవారు కాదన్నా, పైవారు పెదవి విరిచినా, పెన్నిధిలా నేను తన జీవితాన్ని దిద్దుకోగలననే ఆశతోనే నన్ను పెనవేసుకున్నది.ఈ మానిక్యాన్ని సానబట్టి ప్రకాశింప చెయ్యాలి. నా జీవితధ్యేయంలో ఇది మొదటి ప్రకరణ, అని తలపోశాడు కృష్ణమూర్తి.
"స్వాతీ."
"ఏం స్వామీ" కళ్ళు రెపరెప లాడిస్తూ" చూసింది స్వాతి.
"నీ కాటుక కళ్ళల్లోని వెలుగు నన్ను దిగ్భ్రాంతుడ్ని చేస్తున్నది. నీ మనస్సులోని సద్భావాలు నన్ను కప్పేసినయ్యి. నీ హృదయంలోని అమృతఝరులు నామీద పన్నీటి జల్లులా చిలకరించిన ట్లయి నన్ను ఉన్మత్తుడ్ని చేసినయ్యి. నాలుగు అమృతవాక్కులు కూడా మాట్లాడావా నా జీవితం తరించినట్లే, భాషాపరిజ్ఞానం అలవర్చుకుంటా వుగా."
ఆమె అరచేతిని తన చెంపలమీదికి తీసుకుని రాచుకుంటూ అన్నాడు కృష్ణమూర్తి. అరమోడ్పు కన్నులతో తలెత్తి చూస్తూ భర్త హృదయం మీద వాలిపోయింది స్వాతి.
"నాచేతి భోజనం మీకు అభ్యంతరం లేదుగా" ఆదరణగా అడిగింది స్వాతి.
"భార్య చేతి భోజనం ఏ భర్తకూ నిషిద్ధం కాదు. భార్యాభర్తల మధ్య పనికివస్తుంది, పనికి రాదనే ప్రశ్నలే ఉదయించకూడదు. మనస్సులోని ఆంతర్యాలు, అనురాగాలూ కలిసి ఆనందమయ గృహ సామ్రాజ్యాన్ని ఏలే దంపతుల్లో ఈ రకమైన భేదాభిప్రాయాలకు ఎన్నడూ తావుండకూడదు. ఆ భేదం నీలో కనిపించినప్పుడు నన్ను దూరం చేసుకోవాలనే ఉద్దేశ్యం నీలో కలిగినట్లుగానే నేను భావించుతాను. ఆ పరిస్థితికి ఆ పరమాత్ముడు మనల్నెప్పుడూ తీసుకురాడు." అన్నాడు కృష్ణ మూర్తి ఆమె కనుపాపల్లో తన ప్రతిబింబాన్ని చూస్తూ.
వంట ప్రారంభించింది స్వాతి.
"మీకు ఏమంటే ఇష్టం."
"నాకా నువ్వంటేనే ఇష్టం."
"ఆ సమస్య నా మెళ్ళో తాళి కట్టినప్పుడే తీరి పోయింది. ఏ కులంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా ఎన్ని జన్మలకయినా మీరే నాకు భర్త కావాలని అనుక్షణమూ ఆ దేవదేవుడ్ని ప్రార్ధిస్తాను."
"అబ్బా ఎంత ఆశ!" ఎగతాళిగా అన్నాడు కృష్ణమూర్తి. ఖిన్నురాలైంది స్వాతి. ఆమె ముఖ కవళికల్నీ, మనస్సులోని మూగబాధనీ గ్రహించాడు కృష్ణమూర్తి.
"నిన్ను కవ్వించి, ఏడిపించి, నవ్విస్తే నాకు సరదాగా ఉంటుంది స్వాతీ, మరేమీ అనుకోకు. మన హృదయస్పందన ఎప్పుడూ, ఏ పరిస్థితుల్లోనూ ఒక్కటే, అవును కదూ."
తల వూపి నవ్వింది స్వాతి.
"ఇంక చెప్పండి, మీకు ఏ కూరయితే ఇష్టమో, వంకాయ ఇగురు చెయ్యమన్నారా, కాకరకాయ పులుసు చెయ్యమన్నారా, బెండకాయ పాలకూర చెయ్యమన్నారా, ఉల్లిపాయేసి పొప్పుచారెట్టమన్నారా" అన్నది స్వాతి.
మందహాసంతో చూశాడు కృష్ణమూర్తి.
"అన్ని కూరలూ అట్లా ఉంచు. ఆ పొప్పుచారేంటో కాయి ఇయ్యాల. ఉల్లిగడ్డ నంజుగుంటూ తిందాం" అన్నాడు.
స్వాతి కళ్ళలో నీరు నిండింది. మనస్సు అవ్యక్త వ్యధతో నిండిపోయింది. ఎంత జాగ్రత్తగా మాట్లాడినా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత అందచందాలతో విరాజిల్లుతున్నా, ఎంత నిర్మలమైన మనస్సుతో మానసిక పరిణితిని ఉన్నత స్థాయికి తెచ్చుకుంటున్నా పలుకు భేదంతో బయటపడి పోతున్నానని బాధపడింది స్వాతి.
"పంచమురాలికి, వంకర మాటలే నిల్చి పోతయ్యేమో, ప్రపంచమూ, పరిస్థితులూ, ప్రభావాలూ అనుకూలంగా ఉన్నా పుటకతో వచ్చిన పలుకు భేదం పుఠం వేసినా పోదేమో" అన్నది స్వాతి కళ్ళొత్తుకుంటూ.
ఆమె కళ్ళు తుడిచాడు కృష్ణమూర్తి.
"స్వాతీ, బాధపడకు. మనస్సు ప్రధానంగాని, పలుకు ఎట్లా ఉంటే ఏం" అన్నాడు.
"కాదండీ, మీ అభిప్రాయం తప్పు. మనస్సు అందరికీ కనబడదు. పలుకు అందరికీ తెలుస్తుంది. అందరికీ అర్ధమౌతుంది. నా మాటలు విని మీరు చిన్నబుచ్చుకుంటే నా మనస్సు తరుక్కుపోతుంది. ఆదర్శవివాహమని అంతా వేనోళ్ళ పొగడినవారే కులతత్వాలు గుర్తుకు తెచ్చి మనల్ని ఆ నోళ్ళతోనే అవమానంతో కృంగిపోయేలా చేస్తారు. ఒక ఆదర్శం కోసం అందర్నీ దూరం చేసుకుని ఆత్మసాక్షిగా పరమాత్మ సాక్షిగా నన్ను మీ అర్దాంగిగా చేసుకున్నా, అర్ధంలేని మాటలతో మన హృదయాలు తూట్లు పడేలా చేస్తారు. ఈ జీవిత సమరం మన జీవితాలు ఉన్నంతవరకూ నడిపించ గలరు కొంతమంది. అలాంటి పరిస్థితుల్లో మీరు నన్ను దూరం చేసుకోరు కదూ" అన్నది. ఆమె కంఠం ఆవేశంతో జీరవోయి పూడిపోయిన ట్లయింది.
"ఒక్కమాట గతాన్ని తవ్వుకుని ఎవరో ఏదో అంటారని మనం మనం కుమిలిపోవటం భీరువుల లక్షణం. సూర్యచంద్రాదుల సాక్షిగా నేనుగా నా జీవితాన్ని ఎన్నడూ నాశనం చెయ్యను."
తృప్తిగా భర్త ముఖంలోకి చూసి నవ్వి అతనికి అభివందనం చేసింది.
"ఇవ్వాళ ప్రధమంగా నా చేతివంట చవిచూద్దురుగాని, వంటచేసే విధానంలో దోషమున్నా అంతా పూర్తయ్యే వరకూ నన్ను మీరు సరిపెట్టవద్దు. నా తప్పులు నేను తెల్సుకునేలా తరువాత చెబితేచాలు" అన్నది స్వాతి.

