Previous Page Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 35


    ఆరోజు రాత్రి నీకు బాగా గుర్తుందనుకుంటాను. విశాలకు బాగాలేదని చూడ్డానికి రమ్మని వచ్చి పిలిచావు.
    నేను ప్రాణప్రదంగా ప్రేమించే నువ్వు విశాల కోసం ప్రాణాలివ్వడం నాకు సహింపరాని విషయమైంది. ఒర్చుకోలేకపోయాను. హృదయం ఈర్ష్యతో మెలికలు తిరిగిపోయింది. నా కోపమూ, విచారమూ అన్నీ విశాల వేపు మళ్ళాయి. అర్ధం లేని 'పగ' నాలో ప్రవేశించింది. కార్లో కూర్చుని వెళ్ళుతూ 'పగ' తీర్చుకునేందుకు అనేక రకాలుగా ఆలోచించాను. దయ్యాల్లాంటి ఆ ఆలోచనల్లో విశాలను అంతం చెయ్యాలనుకోవడం ఒకటి!"
    నన్ను క్షమించు , భానూ! ఆ క్షణంలో అలాంటి పైశాచికమైన ఆలోచనలు ఎందుకు కలిగాయో నాకే అర్ధం కాదు. మానవత్వాన్నే మరిచిపోయిన నన్ను చూసుకుంటే నాకే అసహ్యమేస్తుంది. ఈరోజు నేను డాక్టర్ని. ప్రాణాలివ్వడమే గానీ తీసుకోవడం కూడదు. భగవంతుడు నా పట్ల ఉన్నాడు గాబోలు! అందుకే నేను హంతకిని కాలేదు! కానీ విశాల పరిస్థితిని చూశాక మరొక ఆలోచన ప్లాష్ లైట్లా మెదడులో కలిగింది. ఆ ఆలోచననే భాషలో పెట్టి నీకు చెప్పాను. నువ్వు నన్ను పూర్తిగా విశ్వసించావు. కానీ నేనే నిన్ను మోసం చేశాను భానూ!
    విశాల మీద నీకు విరక్తి కలిగిస్తే నువ్వు నావాడవవుతావననుకున్నాను. అది సంభవమూ, కాదా అన్న విషయాన్ని గురించి నేను ఆలోచించ లేదు. నాకు కలిగిన అవకాశాన్ని వినియోగించుకున్నాను. నా జీవితంలో నేనిలాంటి నికృష్ణ మైన పని చేస్తానని నేనే రోజూ అనుకోలేదు. అసలలాంటి ఉద్దేశం లేదు కూడా. కానీ నీ హృదయంలో విశాలకు తప్ప మరొకరికి స్థానం లేదని తెలుసుకున్న తర్వాత ఎంత బాధపడ్డానో ఎన్ని కన్నీళ్ళు కార్చానో అది నా సర్వసాక్షికే తెలియాలి! నువ్వా రాత్రి ఇంటికే వెళ్ళలేదని మీనాక్షి చెప్పినప్పుడు నేనలాగే భూమిలోకి ఎందుకు క్రుంగి పోలేదా అనిపించింది కానీ, అమ్మా వాళ్ళ ముందు నా హృదయం లోని భావాలను కొంచమైన తెలియనివ్వలేదు. ఆ విషయంలో మటుకు పనికి మాలిన కౌశల్యాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఇంకో క్షణం కూడా అక్కడ ఉండలేక హైదరాబాదు వచ్చేశాను.
    నువ్వు వచ్చావో లేదో తెలుసుకునేందుకు సుధీరకు రెండు ఉత్తరాలు వ్రాశాను. నువ్వు ఇంటికి తిరిగి రాలేదనీ, నువ్వలా వెళ్ళిపోవడం చేత విశాల పరిస్థితి మరీ విషమించిందనీ అది టైఫాయిడ్ లోకి తిరిగిందని రాసింది.
    క్షణికొద్రేకం వల్ల నేను చేసిన ఒక తప్పిదం రెండు జీవితాలను నాశనం చేసిందని తెలిశాక కూడా నేను బ్రతికే ఉండడం ఆశ్చర్యకరమైన విషయం! రెండుసార్లు జీవితాన్ని అంతం చేసుకోవాలని ప్రయత్నించి మానుకున్నాను. నా జీవితాన్ని అంతం చేసుకోవడం పరిష్కార మార్గం కాదనిపించింది. నేను చేసిన రాక్షసక్రుత్యానికి బలైపోతున్న రెండు జీవితాలను బాగుపరచడం అదే నేను చెయ్యవలసిన పని. అదే చేస్తున్నాను.
    భానూ, మానవత్వాన్ని మరిచి నేనెందుకిలా రాక్షసినయ్యాను. జీవితంలో నాకు కావాలనుకున్నది దక్కలేదు. వద్దనుకున్నవెన్నో లభించాయి. ఈ అంతస్తూ, గొప్ప చదువూ, ఐశ్వర్యమూ నిన్ను నాకు దూరం చేశాయి. విశాలలాగ కులమూ ధనమూ అంతస్తూ లేకుండానూ పోలేదు. సుధీరలా చొరవా, ధైర్యమూ , పట్టుదలా లేనూ లేవు. విశాలనూ కాక, సుదీరనూ కాక విజయనయ్యాను. ప్చ్! అదే నా దురదృష్టము. అందుకే నువ్వు నాకు దూరమయ్యావు.
    ఇంకేం చెప్పను? ఈ పాటికి నేనంటే నీకు ఎక్కడ లేని అసహ్యం కలిగి ఉంటుంది. అందుకు నేను బాధపడను. నన్ను మనస్పూర్తిగా క్షమించమని మటుకు కోరుకుంటున్నాను. విశాల మంచిది. విజయ లాంటిది కాదు. మీ సంతోషమే నేను కోరుకునేది. ఈ విషయం విజయకు ముందు తెలీదా అనుకుంటావేమో! తెలీదు. అప్పుడప్పుడు మనిషి మానవత్వాన్ని మరిచి పోవడం జరుగుతుంటుంది. అది క్షణికమే అయినా కలిగే అనర్ధాలు కోకొల్లలు. అదే జరిగింది నా విషయంలోనూ. అదంతా మరిచిపోయి మన్నించమని కోరుకుంటున్నాను. బహుశా ఈ ఉత్తరం చేరేటప్పటికి నేను హైదరాబాదు లో ఉండను. డిల్లీ లోని మిలటరీ హాస్పిటల్లో రోగుల సేవలో గతాన్ని మరిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను. విజయ ఎప్పుడన్నా గుర్తుకొస్తే అసహ్యించుకోకు. సానుభూతితో ఓ నిట్టుర్పూ చాలు. నాకోసం ఎవ్వరూ బాధ పడవద్దు. మీ ఇద్దరికీ నా శుభాకాంక్షలు. సెలవు.
    క్షమాపణ కోరుకుంటూ -- కన్నీటితో
                                                                                           నీ విజయ"

                              


    సుధీర ఒళ్ళో తల దాచుకుని మెల్లగా రోదించసాగింది. విశాల చెక్కిళ్ళ మీద నుండి రెండు కన్నీటి బొట్లు ముత్యాల్లా రాలి పడ్డాయి. బలహీనంగా ఉన్నా ఎలాగో లేచి కూర్చుంటూ -- "సుధీ" అంది.
    సుధీర తలెత్తి "వద్దు విశాలా! నువ్వు లేవకు" అంది పైట చెరగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ.
    "ఎందుకలా ఏడుస్తావు? విజయ కోసం మనమేమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాము." వ్యధిత కంఠంతో అంది విశాల.
    'అవును." జీరబోయిన గొంతుతో అంది సుధీర.
    "ప్రేమలో అంత ద్వేషముంటుందా, సుధీ?" దిండ్ల నానుకుని వాలుగా పడుకుంటూ బలహీనంగా అంది విశాల.
    'అక్కయ్యనలా అనవద్దు విశాలా!" అంది సుధీర ముఖం ప్రక్కకు త్రిప్పుకుని.
    విశాల బాధగా సుధీర ముఖంలోకి ఓసారి చూసి, గోడవైపుకు తల తిప్పుకుని పడుకుంది.
    సుధీర తలెత్తి 'అక్కయ్య ఎలాంటిదో నీకు తెలీదూ? లోకం దృష్టిలో యింత అదృష్టవంతురాలైన అక్కయ్య యింత నిర్భాగ్యురాలా! జీవితం ఎంత విచిత్రమైంది! భగవాన్ , ఇంత చిత్రమైన జీవితాన్నిచ్చిన నువ్వు ఎంత చిత్రంగా వుంటాడో! నీకెన్ని మాయలు తెలుసో! విజయా! నీ హృదయంలో యిన్ని అగ్ని పర్వతాలు ప్రచ్చన్నంలా ప్రజ్వలిస్తున్నాయని ఈరోజే స్పష్టమైంది. ఎలాంటి పని చేశావు?"
    "సుధీ! విజయ ఆపకారం చేసింది నాకే! కాని విజయ పట్ల , నాకెలాంటి కోపమూ లేదు. నా హృదయం నిండుకూ విజయ పట్ల సానుభూతే వుంది. విజయను చూడగానే ఈర్ష్యతో సుళ్ళు తిరిగిపోయే లోకం ఈ విషయం తెలిశాక ఏమంటుందో?" విశాల తలతిప్పి బాధగా నవ్వుతూ అంది.
    "అసలు అక్కయ్య యిక్కడకు రానట్లయితే యివన్నీ జరిగేవి కావు. అప్పుడే నీ ఆరోగ్యం ఎందుకలా ఉండాలి? బావ వెళ్ళి అక్కయ్యనే ఎందుకు పిలవాలి?"
    "ఎలా జరగాలనుందో అలాగే జరుగుతుంది. నాకు జబ్బు చేసినదానికి కారణం లేకపోలేదు. నీకీ విషయం చెప్పాలనే చెప్పలేకపోతున్నాను." సుధీర ముఖంలోకి చూస్తూ అంది విశాల.
    "ఏవిటి?' ఆదుర్దాగా అడిగింది సుధీర.
    "మురళి చనిపోయాడు!"
    "నిజమా!" నమ్మలేక అడిగింది సుధీర.
    "నిజమా, కాదా అన్న విషయమే నేనూ తేల్చుకోలేక పోతున్నాను. అమ్మకూ, నాన్నకూ ఈ విషయం ఎలా చెప్పాలో తెలీక నాలో నేనే కుమిలి పోతున్నాను."
    "పోనీ, నాతొ చెప్పచ్చుగా?"
    "అసలిది ఎంత నిజమో నాకే తెలీదు."
    "నీకెలా తెలిసింది?"
    "స్కూలుకు ఉత్తర మొచ్చింది."
    "స్కూలు కేలా వచ్చింది?"
    "అదే అర్ధం కావడం లేదు. ఇది నిజమే అయితే అమ్మా నాన్నల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుని భయపడి పోతున్నాను."
    "అలాంటివాడు వున్నా పోయినా ఒక్కటే!"
    "నిజమే! కానీ కన్నకడుపు విషయం మరిచి పోతున్నావు."
    సుధీర భారంగా నిట్టూర్చి "ఎక్కడ పోయాట్ట.?" అంది .
    "మద్రాసులో , ఏదో హాస్పిటల్లో."
    "ఏం?"
    "వొంటి నిండా జబ్బులు, జీవితంలో శారీరక మైన తృప్తే చిదానందమనీ అదంతా ఒకేరోజే జుర్రుకోవాలని ప్రయత్నించే వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు?" విశాల చెంపల మీద జలజలా కన్నీళ్లు రాలాయి.
    "ఏడవకు. అసలే టైఫాయిడ్! ఎక్కువౌతుంది."
    "నన్ను గురించి నేను ఆలోచించడం మానుకున్నాను. పోనీ ఆ హాస్పిటల్ కో ఉత్తరం రాస్తే?"
    "అలాగే రాస్తాను. నువ్వు ప్రశాంతంగా వుండు. ఏమాత్రం ఉద్రేకపడినా నీ స్థితి మరీ దిగజారి పోతుంది. బావ తప్పకుండా తిరిగోస్తాడని నాకు బాగా నమ్మకముంది."
    విశాల సన్నగా మూలుగుతూ దిండ్లలో తల దూర్చింది.
    "సుధీ!" గది గుమ్మంలో నుండే మీనాక్షి ఆదుర్దాగా పిలిచింది.
    సుధీర వెనక్కు తిరిగి ఎవిటన్నట్లు చూసింది.
    "అన్నయ్య బెంగుళూర్లో వున్నాట్ట!" ముఖం నిండుతూ సంతోషాన్ని పులుముకుని అంది మీనాక్షి.
    "ఎలా తెలిసింది?" కూర్చోనున్నదల్లా చివాల్న లేచి మీనాక్షి ముఖంలోకి చూసి అంది సుదీర.
    దిండులో తలదూర్చి వున్న విశాల తలెత్తి మీనాక్షి వేపు చూసింది -- "సజల నయనాలతో.
    "బెంగుళూరు బస్సు డ్రైవర్ చెప్పాడు. రమ్మని ఎంత బ్రతిమిలాడినా రానన్నట్ట" 'ఇక్కడన్నా నన్ను బ్రతకనీ" అంటూ విసుక్కున్నాట్ట. అదేదో ఆఫీసులో క్లర్కు గా ఉంటున్నాడని చెప్పాడు. ఆ ఉత్తరమిలా యివ్వు. నే వెళ్తాను." గబగబా పరుగెడుతున్నట్టు చెప్పింది మీనాక్షి.
    "నువ్వా? నువ్వేం వెళ్తావు? వద్దు. నేనే వెళ్తాను. కానీ విశాలను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీమీద పెట్టి వెళ్తున్నాను." అంది సుధీర.
    'సరే! ఎలాగయినా అన్నయ్యను తీసుకు రావాలి."
    "తప్పకుండా " అని విశాల వేపు తిరిగి "నువ్వు మటుకు ఏ విషయాన్ని గురించి ఆలోచించకు. చేజేతులా ప్రాణం మీదకు తెచ్చుకోకు విశాలా!" అంది సుధీర.
    "ఊ.... నువ్వెళ్ళు." కన్నీళ్లు తుడుచుకుంటూ బలహీనంగా అంది విశాల.
    సుధీర వెళ్ళిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS