24
సాయంత్రం ఆరు గంటలైంది. చలికాలం కావడం చేత ఆరుగంటలకే బాగా చీకటి పడింది. వీధుల్లోని విద్యుద్దీపాలన్నీ ఒక్కసారిగా వెలిగాయి. కారు మెల్లగా ప్రాకుతూ వచ్చి రాఘవయ్య మాస్టారింటి ముందు ఆగింది. సుధీర కార్లో నుండి దిగి తాళం పెట్టి వున్న తలుపు వేపు చూసి ఆశ్చర్యపోయింది. మరుక్షణమే వెయ్యి ఆలోచనలు ఒక్కసారిగా తలలో తిరిగాయి. మనసంతా అసంతృప్తిగా, గజిబిజిగా తయారయింది. "తాళం వేసి ఉంది" అంది స్టీరింగు ముందు కూర్చుంటూ.
ప్రక్కనే కూర్చుని ఊహాలోకంలో తేలిపోతున్న భానుమూర్తి ఉలిక్కిపడి సుధీర ముఖం లోకి చూశాడు.
"ఇంటికి తాళం పెట్టి ఉంది" అంది సుదీర కారు కదిలిస్తూ.
భానుమూర్తి భయంగా, ఆందోళనగా చూశాడు సుధీర వేపు.
భానుమూర్తి భయాన్ని అర్ధం చేసుకున్న సుధీర కళ్ళు సూటిగా రోడ్డు మీదకు తిప్పి కారు నడపసాగింది.
'అందరూ ఏమయ్యారంటావు?' అన్నాడు కాసేపటికి మెల్లగా , భయంగా.
"ఏవో..... ఎక్కడి కన్నా వెళ్ళారు గాబోలు" అంది చూపులు త్రిప్పకుండానే.
"నిన్న నువ్వు వచ్చేటప్పటికి విశాల బాగుందా?"
దానికి సుధీర ఎలాంటి జవాబూ చెప్పలేదు. తల కొద్దిగా ఊపింది.
ఔనన్నట్లో, కాదన్నట్లో భానుమూర్తి కి అర్ధం కాలేదు. విహ్వలుడై చూశాడు సుధీర వేపు.
సుధీర అలాగే నిశ్చలంగా కారు నడుపుతుంది.
భానుమూర్తి ముఖంలో ఉండి వుండి రంగులు మారుతున్నాయి. కళ్ళు లోపలకు పీక్కుపోయి, భయంగా , చంచలంగా ఉన్నాయి. ప్రతి చిన్న శబ్దానికి ఉలిక్కిపడి చూస్తున్నాడు. ఆలోచనల వల్ల ముఖం మరీ గంబీరంగా ఉంది.
సుధీర ఓరగా చూసింది. "మరీ అంతగా ఆలోచించకు " అంది.
"ఎవర్ని గురించి?"
"విశాలను గూర్చి."
"కాదు.... విజయ...."
తర్వాత భానుమూర్తి గొంతులో మండి మాట రాలేదు. ఒకే ఒక కన్నీటి బొట్టు 'టప్' మని రాలి చెక్కిలి మీద పడింది.
"ఆ దురదృష్టవంతురాల్ని గురించి ఆలోచించకు, బావా?" వస్తున్న ఏడుపును మింగి అంది సుధీర.
భానుమూర్తి విచలితుడై ముఖం ప్రక్కకు త్రిప్పుకున్నాడు.
సుధీర పెదిమలు బిగించి కారు వేగం హెచ్చించింది.
'మరి కాస్సేపటికి కారు బంగళా ముందు ఆగింది. వాళ్ళ కొరకే వరండాలో కాచుకోనున్న నౌకరు పరుగెత్తుకుంటూ కారు దగ్గరికి వచ్చాడు.
"మీనాక్షమ్మగారు ఈ హాస్పిటల్ కు రమ్మన్నారు."అన్నాడు చొక్కా జేబులో నుండి కాగితం తీసి సుధీర చేతిలో పెట్టుతూ.
ఇద్దరి మనస్సుల్లో ఏ ఆలోచనైతే ఇంత వరకూ దాగి వుందో అదే నిజమైంది. కారు శరవేగంగా , హాస్పిటల్ వేపు పరిగెత్తింది. ఒకరితో ఒకరు మాట్లాడుకొనే భయపడ్డారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు తేలిపోతూ మౌనంగా ఉండిపోయారు.
కారు దిగి ఇద్దరూ పరిగేట్టినట్లే నడిచారు. మీనాక్షి వరండాలోనే ఎదురైంది.
"అన్నయ్యా!ఇంత ఆలస్యంగా వచ్చావెం?' అంది గుడ్ల నీరు కుక్కుకుంటూ.
"విశాలకేలా వుంది?' ఆ ఒక్కమాటే అనగలిగాడు భానుమూర్తి.
"డేలీరియం స్టేజిలో ఉందట. ఇప్పుడేవారెం చూసిన ప్రయోజనం లేదు" అంది మీనాక్షి సూటిగా భానుమూర్తి ముఖంలో కి చూడలేక కళ్ళు క్రిందకు వాల్చి.
భానుమూర్తి కుర్చీలో కుప్పగా కూలిపోయాడు.
"నన్నక్కడే ఎందుకుండనిచ్చావు కాదు, సుధీ?' అన్నాడు దోసిట్లో ముఖం దాచుకుంటూ.
సుధీర అలాగే చిత్తరువులా నిల్చుండి పోయింది. గోడవారగా వేసి వున్న బెంచి మీద కూర్చొనున్న రాఘవయ్య మాస్టారూ, కృష్ణ వేణమ్మ అసలీ లోకంలో ఉన్నట్లే లేరు.
మురళి చనిపోయాడని విశాల పలవరించడం, చావు బ్రతుకుల్ మధ్య విశాల పోరాటం ఆ ముసలి వాళ్ళిద్దరికీ వజ్రాఘాతకంలా అయింది.
"నేను డాక్టరు దగ్గరి కెళ్ళి మాట్లాడుతాను. నువ్వేం బాధపడకు , బావా!" అంటూ సుధీర నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది.
"చూడండి , సుధీర గారూ! మీరింతగా ప్రాధేయపడాలా?అది మా కర్తవ్యం" అన్నాడు డాక్టరు , సుధీర మాటలు విన్నాక.
సుదీర మరేం మాట్లాడలేక పోయింది.
అందరూ వరండాలో కూర్చుని ఎవరి ఆలోచనల్లో వాళ్ళు తెలిపోసాగారు.
మీనాక్షి ఏడు కొండల వాడికి ముడుపు కట్టుకుంది.
ఒక్కొక్క నిముషమే మెల్లగా -- బరువుగా కదిలి పోతుంది. క్రమంగా గంటలు నిమిషాలలోకి మారాయి.
సరిగా రాత్రి పది గంటలకు విశాలకు తెలివి వచ్చింది. మెల్లగా మంచంలో కదిలింది.
మీనాక్షి , సుధీరా, భానుమూర్తి ఆత్రంగా చుట్టూ చేరారు.
"విశాలా! బావ వచ్చాడు చూడు!" విశాల చెవిలో గొణిగింది సుధీర.
విశాల కళ్ళెత్తి చూసింది.
"జరిగినదంతా మరిచిపో, విశాలా!"అన్నాడు భానుమూర్తి విశాల చేతిని తన చేతిలోకి తీసుకుని.
"మరిచిపోయెందుకు ప్రయత్నిస్తాను కానీ విజయ మీద మీరేం కోపం పెట్టుకోకండి!" అంది విశాల నీరసంగా.
"ఊహు.... విజయ ఎవరని? ఆత్మ వంచన చేసుకున్న అభాగ్యురాలు! కోపగించుకోవడమా!" విచలిత కంఠంతో అన్నాడు భానుమూర్తి.
సుధీర గోడవైపు కు తిరిగి కన్నీళ్లు తుడుచుకుంది.
మీనాక్షి కిటికీలో నుండి దూరంగా చీకట్లోకి చూస్తూ కన్నీటిని దాచుకోను ప్రయత్నించింది.
25
"అత్తయ్యా! నువ్వేన్నన్నా చెప్పు. నేను మటుకు ఈపని చేసి తీర్తాను. నువ్వోప్పుకున్నా లేకున్నా సుధీరా శేఖరం ల పెళ్ళి దగ్గరుండి నా చేతుల మీద జరిపిస్తాను. నువ్వెన్ని తిట్టినా నాకు సమ్మతమే!" అన్నాడు భానుమూర్తి లలితమ్మతో.
"అదేమిటి భానూ! ఆ అబ్బాయి కులమేమిటి? అంతస్ట్టేమిటి? అది సరే, బుద్ది లేక అందనుకో! నువ్వెలా అంటున్నావు! అదే నా కాశ్చర్యం!" అంది లలితమ్మ ఆశ్చర్యంగా బుగ్గ మీద వేలేసుకుని.
"ఆశ్చర్య' పడవలసిన విషయం ఇందులో ఏం లేదు. మనందరి స్వార్ధానికి, సంకుచిత్వానికి బలై మనకు దూరంగా వెళ్ళిపోయింది విజయ. చూస్తూ చూస్తూ సుధీర క్కూడా అలాంటి జీవితాన్నే యివ్వాలనుకోవడం న్యాయం కాదత్తయ్య! అది గొప్పతనం అవుతుందేమో గానీ మంచితనం మటుక్కాదు."అప్రసన్న వదనంతో అన్నాడు భానుమూర్తి.
విజయ మాట ఎత్తేసరికి లలితమ్మ ముఖంలో విచార కారుమేఘాలు అలుముకున్నాయి. తను ఏ మాట చెప్తే ఏమవుతుందోనని మౌనంగా ఆలోచిస్తుండిపోయింది.
సుందరం వరండా లో నుండి వచ్చి సోఫాలో కూర్చుంటూ -- "ఏమిటి భానూ! అమ్మ ఏమంటుంది?' అన్నాడు.
"ఇష్టపడ్డం లేదు."
'అయితే నీకీ విషయం తెలుసన్న మాట!" అంది లలితమ్మ మరీ ఆశ్చర్యపోతూ.
"తెలుసమ్మా!" అన్నాడు సుందరం నవ్వుతూ.
"తెలిసే ఊరుకున్నావా?"
"ఊరుకోక ఏం చెయ్యను?"
"సుధీరకు...."
సుందరం మధ్యలోనే అడ్డుపడి -- "ఊహూ ప్రయోజనం లేదు. సుధీర విజయ కాదు" అన్నాడు విచారంగా నవ్వుతూ.
'అయితే ఈ పెళ్ళి జరిగి తీరాల్సిందేనా?"
"ఆహా!"
"నాకిష్టం లేకున్నా?"
"ఇష్టపడాలి."
'అంతేనంటావు?"
"అవును!"
లలితమ్మ మరేం మాట్లాడలేక పోయింది. ఆలోచిస్తుంది. తన జీవిత కాలంలో ఎన్నో మార్పులు జరిగాయి. కాలమే కొన్ని మార్పులు తనతో పాటు తీసుకు వస్తుంది. తనకిష్టమున్నా లేకున్నా ఆ మార్పును అంగీకరించి తీరాలి.
విశాలా, మీనాక్షీ -- ఇద్దరూ రిక్షాలు దిగి లోపలికి వచ్చారు.
సుధీర లోపలికి వెళ్ళి అందరికీ కాఫీలు తెచ్చింది.
కాఫీలు త్రాగాక - వాచీ చూస్తూ - "ఊ.... ఇక ఐదు నిమిషాలు ఉంది. తయారు పడాలి సుధీ!"అన్నాడు భానుమూర్తి.
"ఎక్కడికోయ్ , భానూ, ఆ హంగామా?' అన్నాడు సుందరం సిగరెట్టు వెలిగించి.
"కొండ మీదకు."
"ఇప్పుడా ? ఎందుకు?"
"నేను మొక్కుకున్నాను, బావా! విశాలకు బాగయితే యిద్దరూ ముందు స్వామి దర్శనాని కొస్తారని" అంది మీనాక్షి.
"అయితే నువ్వెందు కెళ్తున్నట్లు, సుధీ?" అన్నాడు సుందరం నవ్వుతూ.
"ఆమాత్రం ఊహించలేవా?"
"ఉహూ....నాకేం తోచడం లేదు."
"శేఖరంతో పెళ్ళి నిశ్చయమైతే వస్తానని మొక్కుకుంది గాబోలు!" కళ్ళెత్తి భానుమూర్తి వేపు చూసి నవ్వి అంది విశాల.
"నేనేం అలా మొక్కుకోలేదు." మూతి ముడిచి అంది సుధీర.
"లేదులే! సుధీ బదులు నేనే మొక్కుకున్నాను" అన్నాడు భానుమూర్తి నవ్వుతూ.
అందరూ ఘోల్లుమని నవ్వారు. తనకేం అక్కర్లేదనీ, కేవలం ప్రేక్షకురాలిగానే ఉండి పోదామని అనుకున్న లలితమ్మ కూడా నవ్వకుండా ఉండలేక పోయింది.
"ఊ....ఇంకా అలాగే నిల్చున్నావేమిటి? వెళ్ళి తల దువ్వుకో"అన్నాడు భానుమూర్తి సుధీర ముఖంలోకి చూసి.
"దువ్వుకుంటుందిలే! వాళ్ళ కవి కుమారుడింకా రాలేదుగా?' ఫక్కున నవ్వి అన్నాడు సుందరం.
మీనాక్షి, విశాల ముసి ముసిగా నవ్వుతూ కూర్చున్నారు.
"కవి కుమారుడికి పేరు లేదు గాబోలు!" తెచ్చి పెట్టుకున్న కోపంతో అంది సుధీర.
"నువ్వలాగే పిలిచేదానివటగా?' అన్నాడు సుందరం అమాయకంగా ముఖం పెట్టి.
'సుధీర ముఖం సిగ్గుతో కందిపోయింది. "అబ్బ! మహా తెలిసినట్టు!" అంది కాసేపటికి తలెత్తి.
"నాకు తెలీకపోవడమేమిటి? శేఖరమే స్పష్టంగా నాతొ చెప్తెను? బాగా ఎద్పించవటగా? మొత్తానికి గట్టిదానివేలే!" అన్నాడు సుందరం వచ్చే నవ్వాపుకుంటూ.
"అవును పాపం! నువ్వు రావలసింది సాయానికి.
'అప్పుడు లేననుకో! ఇప్పుడు వచ్చేశానమ్మాయ్! జాగ్రత్త! మెత్తని వాడు కదా అని మరీ ఏడ్పించేవు!"
సుధీర వచ్చే నవ్వాపుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.
భానుమూర్తి హడావుడిగా వరండా లో నుండి హాల్లోకి, హల్లో నుండి వరండాలోకి కాసేపు తిరిగాడు. తిరిగి వచ్చిన సుధీరను చూసి "ఇదుగో సుధీ! ఇతనే కవిత్వంలో పడిపోయాడో? ఏమైనా యిలాంటి వాళ్ళతో చిక్కే!" అన్నాడు అదంతా సుదీర తప్పయినట్లు.
"నువ్వు ఎన్ని గంటలకు రమ్మన్నావు?"
"సరిగా పదింటికి."
"ఏమో మరి!" అంటూ సుధీర వరండాలోకి వచ్చి రోడ్డంతా కలయజూసింది. శేఖరం జాడే లేదు.
పదిన్నరయినా శేఖరం రాలేదు. సుధీర మనసులో రకరకాల ఆలోచనలు పరుగులు తీశాయి. అవ్యక్తమైన భయమేదో ఆమె హృదయాన్ని కలచి వేసింది. తను కుటుంబంలో కలతలు తీసుకురావడం ఇష్టం లేక ఎటన్నా వెళ్ళి పోలేదు గదా? సుధీర గుండెలు గుభిల్లు మన్నాయి. వరండాలో స్తంభాన్ని కానుకుని అలాగే వీధిలోకి చూస్తూ నిల్చుంది.
పదకొండు గంటల ప్రాంతంలో దూరంగా వస్తూ కనిపించాడు శేఖరం.
సుధీర గుండెల మీద నుండి పెద్ద బరువేదో తొలగి పోయినట్లయింది. ఒక్క ఉదుటున హాల్లోకి వచ్చి ఆ విషయం చెప్పింది.
"పదింటికి రమ్మంటే పదకొండుకా రావడం?" అన్నాడు భానుమూర్తి చిరుకోపంతో.
"ఓ సెకండు కూడా అటూ యిటూ కాకుండా పనిచేసేది మెషీను! మనుషులు కాదు" అన్నాడు శేఖరం చిరునవ్వుతో.
"మెత్తనివాడెం కాదమ్మా . గట్టివాడే! సుధీ, జాగ్రత్త!" అన్నాడు భానుమూర్తి.
అందరూ ఫక్కుమని నవ్వారు.
"ఊ.... ఇప్పటికే ఆలస్యమైంది. ఇక బయల్దేరండి!" భానుమూర్తి తొందరచేశాడు.
"మీరేనట్రా , భానూ , వెళ్ళాల్సింది? మేమూ రాకూడదా?' తమాషాగా నవ్వి అన్నాడు సుందరం.
"నిక్షేపంలా రావచ్చు."
"ఒంటరిగానే!"
"పోనీ , జంటను తెచ్చుకో! అత్తయ్య అమ్మాయిని చూసి పెట్టిందేమో కనుక్కో!" అన్నాడు భానుమూర్తి తన చమత్కారానికి తనే మురిసిపోతూ.
"అమ్మే చూదాలేమిటి? నువ్వు చూడకూడదూ?"
"నేనా?"
"ఏం?"
"నాకెవరు తెలుసు?"
"చెల్లెలే వుందిగా?"
భానుమూర్తి ఆశ్చర్యంతో బొమ్మలా కూర్చుండి పోయాడు. కాసేపటికి తేరుకుని-- "సుందరం!" అన్నాడు.
"దురాశకు పోయానేమో గదూ?" వ్యధిత కంఠంతో అన్నాడు సుందరం.
"నేనేం చెప్పను, సుందరం? ఆ విషయం మీనాక్షినే అడుగు!"
అప్పటికే మీనాక్షి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సుధీరా, విశాలా, లలితమ్మ ఏదో సినిమా చూస్తున్నట్లు చూస్తుండిపోయారు.
లలితమ్మే అందరి కన్నా ముందుగా తేరుకుంది. "సుందరం! నిజంగా మీనాక్షిని చేసుకుంటావా?"ఆనందంతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.
"మీనాక్షి నన్ను చేసుకుంటుందో , లేదో అడుగు" అన్నాడు సుందరం.
లలితమ్మకు ఎక్కడ లేని బలం వచ్చింది. లేచి మీనాక్షి ని వెదుక్కుంటూ వెళ్ళింది. మీనాక్షి దోసిట్లో ముఖం దాచుకుని కూర్చోనుంది.
"నువ్వీ యింటి కోడలివేనె, మీనాక్షి! బావను చేసుకుంటావు కదూ?" అంది లలితమ్మ మీనాక్షి ముఖాన్ని కప్పి ఉన్న చేతులను తొలగిస్తూ.
మీనాక్షి కళ్ళల్లో నీళ్ళు నిండి ఉన్నాయి.
"అత్తయ్యా!' అంటూ లలితమ్మ భుజం మీద తల వాల్చింది.
"నాకు తెలిసే తల్లీ! నువ్వు కాదనవని" అంది ఆనందాశ్రువులు అడ్డుకుంటూ లలితమ్మ.
అప్పటికే అందరూ గదిలోకి చేరుకున్నారు. విశాల కుంకుమ తెచ్చి మీనాక్షి నుదుటి మీద పెట్టింది.
కుంకుమతో కళకళలాడుతున్న చెల్లెలి ముఖం చూసి తృప్తిగా శ్వాస తీశాడు భానుమూర్తి.
మూడు జంటలతో కారు కొండ మీదకు బయల్దేరింది.
సమాప్తం
