23
"భానూ!
లోకం దృష్టిలో కొంతమంది అదృష్టవంతులుంటారు. కానీ వాళ్ళు నష్ట జాతకులే. అలాంటి వాళ్ళలో ఒకదాన్ని నేను. ఇలా వ్రాస్తున్నందుకు ఆశ్చర్య పోతావేమో! ఉత్తరం పూర్తిగా చదువు. నీకే తెలుస్తుంది.
నా జీవితాన్ని ఆనందమయం చేసుకునేందుకు భగవంతుడు ఎన్నో అవకాశాలను ఇచ్చాడు. కానీ నేనే వాటిని సరిగ్గా వినియోగించు కోలేకపోయాను. అందుకనే దేవుణ్ణి గానీ, సంఘాన్నీ గానీ దూషించడం లేదు. అంతా స్వయంకృతం.
నువ్వు మొట్టమొదట మా ఇంట్లో కాలు పెట్టిన రోజు -- ఆరోజు బహుశా నీకు గుర్తుండదేమో- నాకు బాగా గుర్తు. అప్పుడే వికసిస్తున్న నా హృదయ కుసుమాన్ని నీకు అంకితం చేశాను. నువ్వు మా యింటికి వస్తావని తెలిసినప్పటి నుండి అమ్మ నన్ను ఊరికే కవ్వించేది. 'మీ బావ వస్తాడే, విజయా!' , 'వాడెలే నీ మొగుడు!' , ఈ యింటికి పెద్దల్లుడు వాడే నమ్మా!'- ఇలా రోజుకోసారయినా అంటూ ఉండేది. నాకు తెలీకుండానే నిన్ను ఆరాధించసాగాను.
నాన్నకీ మాటలు బొత్తిగా ఇష్టం లేదు. అమ్మ యిలా అన్నప్పుడల్లా ముఖం చిట్లించే వాడు. "మీ అమ్మ మాటలు వినకు, విజయా!" అనేవాడు. నిన్నా యింటికి అల్లుడుగా చేసుకోవడం నాన్నకు బొత్తుగా యిష్టం లేదని అమ్మకూ, నాకూ ఇద్దరకూ బాగా తెలుసు.
'విజయకు అసాధారణమైన తెలివి తేటలున్నాయి' అనే వాళ్ళు చాలామంది. నాన్నకు కూడా నా తెలివి తేటలే నా యెడ శాపంలా పరిణమించాయి. నాన్న నా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. విదేశాల్లో చదివించి తీరాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందుకనే నా చదువు సంధ్యల విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఆ విషయాలన్నీ నీకు బాగా తెలుసు. నేనేరోజన్నా కాస్త చదువు విషయంలో అలక్ష్యం చేసినా నాన్న నన్ను చాలా తీవ్రంగా శిక్షించేవాడు. నిన్నూ, నన్నూ ఒకచోట చూసినప్పుడు కళ్ళెర్రచేసేవాడు. నువ్వలాంటి విషయాలన్నీ గుర్తించి ఉండవు. ఆ విషయం నాకు బాగా తెలుసు. నన్నుమటుకు నువ్వు కాస్త దూరంలోనే ఉంచేవాడివి. ఎందుకో నాకర్ధంయ్యేది కాదు. నాన్నకు నువ్వు భయపడేవాడివేమో?
ఇంటర్ లో యూనివర్శిటీ ఫస్ట్ వచ్చాను.మెడిసిన్ లో చేరాను. అప్పటికి మనిద్దరి మధ్యా దూరం మరీ ఎక్కువైంది. ఇందుకు నువ్వు బాధ పడ్డట్టు అనిపించలేదు గానీ నేను మటుకు చాలా బాధపడ్డాను. నీకు నన్నివ్వడమన్న విషయాన్ని అమ్మ గూడా పూర్తిగా మరిచిపోయింది అప్పటికి! నాకు నువ్వు తగవన్న అభిప్రాయం కలిగింది అమ్మకు కూడా!
మెడికల్ కాలేజీ లో కూడా నా కెరీర్ ఉజ్వలంగా ప్రకాశించింది. నాన్న కోరిక ప్రకారం విదేశాలకు వెళ్ళాను. మీరంతా కలిసి ప్రత్యేకమైన ఓ అంతస్తు నిర్మించి అందులో నన్ను కూర్చోబెట్టారు. నన్నొక అసాధారణ వ్యక్తిగా, అదృష్టజాతకురాలిగా చిత్రించి నా కళ్ళకు పొరలు కలిగేటట్లు చేశారు. నాకోసం నల కుబరుడూ, బృహస్మటీ, కుబేరుడూ అయిన అదృష్ట జాతకుడు వేయి కన్నులతో ఎదురు చూస్తున్నాడనీ . ఒకరోజు పుష్పక విమానంలో వచ్చి అమాంతం నన్ను తీసుకు వెళ్తాడనీ అమ్మా, నాన్నా, బంధువులు , స్నేహితులు చివరకూ నువ్వు నాకు చెపుతూ వచ్చారు. ఉహు.... నన్ను మోసం చేశారు. కాదు, నాశనం చేశారు.
కానీ, నే నే రాజకుమారుడి కోసమూ ఎదురు చూడలేదు. చిన్నతనం లోనే నీకు అంకితం చేసిన హృదయం లో నీకు తప్ప మరొకరికి స్నానం లేదు. కానీ మనిద్దరికీ మధ్య అఘాతం లాంటి దూరం ఏర్పడింది. నన్ను గురించి నేను చాలా గొప్పగా ఆలోచించేదాన్ని. నా అంతస్తు నుండి దిగి వచ్చేందుకు ఏమాత్రం యిష్టపడేదాన్ని కాదు. నేను విదేశాల నుండి వచ్చిన డాక్టర్ను. శ్రీమంతురాలిని. నువ్వు బి.ఏ. పాసయి కేవలం పొట్టకూటి కోసం ఉద్యోగం చేసుకొంటున్న బడి పంతులవు! మనిద్దరి మధ్య దూరాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకున్న నాన్న! దూరంగా పారిపోతున్న నువ్వు! ఎంతని ప్రాకులాడను నేను!
నా అంతస్తు నుండి దిగి నీ దగ్గరకు నాకు నేనై రాలేకపోయాను. నా చుట్టూ పక్కల ఉండేవాళ్ళు కూడా నన్నా అంతస్తు నుండి దిగనిచ్చే వారు కాదు. ఇందులో నీ తప్పు కూడా కాస్త లేకపోలేదు. 'విజయా! నువ్వెక్కడున్నానా దానివే' అని ఒక్క మాట అనుంటే? నా జీవితమూ, అదృష్టమూ వేరే బాటల్లో నడిచేవి! నువ్వెందుకంత క్రూరంగా , కఠినంగా మౌనంగా ఉన్నావు భానూ? నా జీవితాన్నెందుకిలా అర్ధరహితంగా చేశావు?
అంతకూ పరోక్షంగా నీకీ విషయాన్ని ఎన్నోసార్లు తెలియజేసాను. నువ్వది తెలుసుకోలేక పోయావు. అసలు నీకలాంటి భావమే లేదనిపిస్తుంది. కానీ నా హృదయంలోని నీ ముందు పెట్టను నా అంతస్తు అడ్డు పడింది. ఏ అదృశ్య'శక్తో నా నోటిని కట్టివేసింది.
నేను విదేశాల నుంచి తిరిగి వచ్చిన రోజు విందు జరిగింది. ఆరోజు నిన్ను చూడాలని ఎంత అత్రపడ్డానో నువ్వంత ఆలస్యం చేశావు. నువ్వు బహూకరించిన పుస్తకంలోకి ఆత్రంగా చూశాను ఏం వ్రాశావో అని. 'ప్రాణాధికమైన విజయకు' అని ఉండవలసిన చోట మాములుగా 'చిరంజీవి విజయ ప్రభాదేవికి" అని ఉంది. ఆరోజు నువ్వు వెళ్ళిపోయేటప్పుడు సుధీరతో దెబ్బలాడి వెళ్ళావు. వరండాలో నే నిల్చోనున్న నేను నిన్ను కవ్వించాను. ఎందుకనుకున్నావు? నీ మనసులో విషయం స్పష్టంగా తెలుసుకుందామని . కానీ నేననుకున్న ఫలితం కనిపించనే లేదు.
నాన్న నా ప్రతి చర్యనూ గమనిస్తూ ఉండేవాడు. నాన్నకు భయపడి నా అనురాగాన్ని దాచుకున్నానని చెప్పలేను గానీ, నాన్న నన్ను కూర్చోబెట్టిన అంతస్తు లో నుండి నాన్న కళ్ళ ముందే దిగిరాలేక పోయాను.
నాన్న చనిపోయాక సుధీరను నీకివ్వాలని అమ్మ తీర్మానించింది. నేను చేసుకుంటానని అమ్మతో చెప్పలేక పోయాను. సుధీరను నువ్వు చేసుకోవడం నాకిష్టం లేదు. బహుశా కారణం యిప్పుడు నీకు తెలిసే ఉంటుంది. అమ్మ పెట్టబట్టింది. సుధీర ఒప్పుకుంది. నువ్వు మౌనంగా ఉండిపోయావు. నేను ఏమనలేక హైదరాబాదు వచ్చేశాను. తర్వాత నిన్నెవరో కొట్టారనీ , బాగా దెబ్బలు తగిలాయనీ సుధీర ఉత్తరం వ్రాసింది. హైదరాబాదు లో ఉండలేక పోయాను. ఆరోగ్యం బాగాలేదని నెపం పెట్టుకుని నిన్ను చూడ్డానికి వచ్చాను. ఈ విషయం ఎవరికీ తెలిసేందుకు వీల్లేదు కూడా. దుర్భేద్యమకైన కంచు గోడలు నా హృదయం చుట్టూ కట్టుకున్నాను. వాటిని చేదించి హృదయంలోపలకు తొంగిచూసే అవకాశం ఎవరికీ లేకపోయింది.
నిన్ను చూసేందుకు వచ్చినప్పుడు తెలుసుకున్నాను. సుధీర నిన్ను చేసుకోదని, సుధీర మనస్తత్వం నాకు బాగా తెలుసు. అణగారి పోయిన ఆశలు చిగిర్చాయి. ఇక మనిద్దరికీ మధ్య ఏ అడ్డంకు రాదనుకున్నాను. సుధీ నిన్ను చేసుకోనని ఖచ్చితంగా చెప్పాక నిన్ను పిలిపించాను. ఆరోజు నీ మాటల్ని బట్టి నీ జీవన భాగస్వామిని ఎన్నుకున్నవనీ, ఆమె తప్పకుండా నేనే అయుంటానని అనుకున్నాను!' నీ ముందు నాకు రహస్యాలేమున్నాయి, విజయా!' అని నువ్వు మాములుగా అన్నమాటలే నాకు విపరీతార్ధాన్ని యిచ్చాయి. నువ్వు తప్పకుండా నావాడవవుతావన్న ధైర్యం తోనే హైదరాబాదు వచ్చేశాను.
తీరా హైదరాబాదు వచ్చాక నేను చేసిన తప్పిదం తెలిసి వచ్చింది. ఆరోజు కూడా నా అంతస్తు నుండి దిగి నీ దగ్గరకు రాలేకపోయాను. కానీ నా చుట్టూ నేను గోడలు కట్టుకుని నీ కందని అంతస్తులో కూర్చుంటే నువ్వు దూరమై పోవడం తధ్యమన్న విషయం అప్పటి కప్పుడే ఒకసారి రుజువైంది. ఈసారి నిన్ను కలుసుకున్నప్పుడు నా హృదయాన్ని నీ ముందు పెట్టాలని తీర్మానించుకున్నాను. ఆ సమయంలోనే సుందరాన్ని చూడ్డానికి రమ్మని నువ్వు వైరిచ్చావు. ఎన్నో ఆశలతో రెక్కలు కట్టుకొని వాలాను. ప్చ్! అంతా అయిపొయింది. నీకూ, విశాలకూ పెళ్ళి నిశ్చయమైందని సుధీర చెప్పినప్పుడు నా జీవన జ్యోతే అరిపోయినట్లయింది. ఏమీ చెయ్యలేక, నిశ్శబ్దంగా నా దుఃఖాన్ని నాలో నేనే మింగేశాను.
భానూ, జీవితం చిత్రమైతే , మనసు మహాచిత్రమైనది. రాగద్వేషాలు, ప్రతి మనసు లోనూ ఉంటాయి. కానీ వాటిని ప్రకటించే విధానంలోనే ఆ వ్యక్తీ చదువూ, సంస్కారమూ వెల్లడవుతాయి. తన అంతస్తుదిగి శేఖరం మెడలో పూలమాల వేసింది సుధీర. ఆపని నేను చెయ్యలేక పోయాను. అదే సుధీర చేసింది. నేను చెయ్యలేని పనిని సుధీర చెయ్యడం నాకిష్టం లేదు. ఈర్ష్యా ద్వేషాలు నా హృదయంలో నుండి తొంగి చూశాయి. సుధీరను బెదిరించాను. తోబుట్టువని కూడా చూడక సుధీర జీవితాన్ని గూడ నాశనం చెయ్యాలనుకున్నాను భాను!
