మిస్టర్ ముకుందం
బూట్లు కట్టుకొని, వాటిని మరికొంచెం నిగనిగలాడేట్టు తుడిచి నెక్ టై బిగించుకొంటూ నిలువుటద్దం ముందుకెళ్ళి నిలబడ్డాడు మిస్టర్ ముకుందం. చిన్నప్పుడు మేనమామ బహూకరించిన జర్మన్ గోల్డు పిన్నును టై మధ్యలో అమర్చాడు.
నిలువుటద్దంలో తన ప్రతిబింబాన్ని అన్ని కోణాలనుంచీ పరిశీలించి చూసుకొని సంతృప్తిగా నిట్టూర్చాడు. అతనికి అద్దాన్ని ముద్దెట్టుకోవాలనిపించింది. అతనికి ఆ అద్దం అంటే వల్లమాలిన అభిమానం. ఆరోజు ఆ అభిమానం హృదయం అంచుల్ని తాకింది.
మిస్టర్ ముకుందానికి చిన్నప్పటినుంచీ నిలువుటద్దంలో తనను చూసుకోవడం ఇష్టం. తన స్నేహితుడు రామం ఇంట్లో నిలువుటద్దం ఉందని తెలిసి అతనితో స్నేహం చేశాడు. నిలువుటద్దం వున్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళనే భావం వుండేది మిస్టర్ ముకుందానికి చిన్నప్పుడు.
అవకాశం దొరికినప్పుడల్లా మిస్టర్ ముకుందం రామం ఇంటికి వెళ్ళేవాడు. తన ప్రతిబింబాన్ని ఆ నిలువెత్తు అద్దంలో అన్ని కోణాల నుంచీ చూసుకొంటూ మురిసిపోయేవాడు.
ఏనాడూ ఎవరూ అతన్ని అందంగా వున్నావన్న పాపాన పోలేదు. మనసులో ఓమూల ఆ బాధ పుష్పంలో పురుగులాగా తొలుస్తూనేవుంది అతని మనస్సును.
లోకం తీరే అంత! ఇతరుల్లోని సుగుణాలను చస్తే మెచ్చుకోదు. తనకేం? తను లక్షణంగా వుంటాడు. ఆ సంగతి ఒకళ్ళు చెప్పాలా ఏం?
తనను తనే బుజ్జగించుకొనేవాడు మిస్టర్ ముకుందం.
ముకుందం మొదటి జీతం అందుకొన్ననాడు మొదట కొన్న వస్తువు ఈ నిలువుటద్దం. ఇదికూడ ఒక కారణం, అతనికి ఆ అద్దం అంటే అంత అభిమానం కలగటానికి.
మరోసారి అద్దంలో చూచుకొన్నాడు. దువ్వెన పళ్ళలా నిటారుగా నిక్కపొడుచుకొని నిల్చున్న జుట్టు కనిపించింది. జుట్టును మరోసారి బ్రష్ చేశాడు. అణిగినట్టే అణిగి అంతలోనే నిటారుగా లేచి నిల్చుంది జుట్టు. చీటికిమాటికి చీవాట్లు వేసే ఆఫీసరు ముందు నిలబడ్డ ఆత్మాభిమానంగల గవర్నమెంటు సర్వెంటులాగ.
ముకుందానికి తన జుట్టుమీద వల్లమాలిన కోపం వచ్చింది.
కాని పాపం! ఏంచేస్తాడు? అది తన జుట్టయిపోయింది. లేకపోతేనా? తనకు అందుబాటులో వున్న మరొకరి జుట్టయితేనా? గుండు కొట్టించి దానిపని పట్టేవాడు.
తన ఆలోచనకు నవ్వొచ్చింది మిస్టర్ ముకుందానికి.
ముఖానికి పౌడర్ రాసుకొన్నాడు. రుమాలుతో స్టేజిమీద నటునిలా అతి జాగ్రత్తగా అద్దుకున్నాడు. మరికొంచెం పౌడరు రుమాలు మడతల్లో చల్లుకుని జేబులో పెట్టుకున్నాడు.
మరోసారి ముఖాన్ని చూసుకొని అద్దంముందునుంచి కదలబోయిన ముకుందానికి మనస్సులో తుమ్మ ముల్లు గుచ్చుకున్నట్టయింది.
అతనికి తన నడుం సన్నగా పీలగా అసహ్యంగా వున్నట్టు కన్పించింది. గతుక్కుమన్నాడు.
ఎన్ని టానిక్కులు తాగినా ప్రయోజనంలేందే? తను అంత పీలగా వుంటాడని ఇంతకుముందెప్పుడూ అనిపించలేదు. కాకపోతే కొంచెం సన్నం అనిమాత్రం అనుకొనేవాడు.
గబగబా వెళ్ళి పెట్టె తెరచి తనకున్న ఆ ఒకే ఒక కోటును తీసి వేసుకొన్నాడు మిస్టర్ ముకుందం.
మరోసారి అద్దంలో చూసుకొని "హమ్మయ్య" అంటూ నిట్టూర్చాడు సంతృప్తిగా.
క్రితంరోజు కొన్న "సెవెన్ హెవెన్స్" గుర్తొచ్చింది.
"అరెరే! మర్చేపోయాను. గుర్తుండటానికి నాకు అలవాటుంటేగా?" పైకే అనుకున్నాడు మిస్టర్ ముకుందం.
టేబుల్ మీదవున్న సెంట్ బాటిల్ అందుకొని చెవుల వెనకా షర్టుకూ పులుముకొన్నాడు.
సాయంకాలపు చల్లగాలి కిటికీలోనుంచి ముకుందాన్ని పరామర్శించింది.
చేతి గడియారం చూచుకొన్నాడు.
"ఛ? ఇంకా ఐదుకూడా కాలేదు" విసుక్కున్నాడు.
కాలానికి కాళ్ళు లేవనీ, డేక్కుంటూ నడుస్తుందనీ మొదటిసారిగా అనిపించింది ముకుందానికి.
అప్రయత్నంగానే ముకుందం చెయ్యి ఫాంటు జేబులో జొరబడి ఒక ఉత్తరాన్ని బయటికి లాగింది. ఆ ఉత్తరాన్ని పెదవులకు ఆనించుకొన్నాడు. ఆనందంతో మెరిసిపోతున్న కళ్ళతో కవరుమీదవున్న తన పేరును....ముత్యాల్లాంటి అక్షరాల్లో వున్న తన పేరును తనివితీరా చూసుకొన్నాడు.
అంత అందమైన అక్షరాలు వ్రాసిన ఆ చెయ్యి ఇంకెంత అందంగా ఉంటుందో? అంత అందమైన చెయ్యిగల ఆ అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో?
మిస్టర్ ముకుందానికి చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథ జ్ఞాపకం వచ్చింది.
"అనగనగా ఒక కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి. ఆ అడవిలో రాజకుమారుడొకడు, మంత్రికుమార సమేతుడైన పంచకళ్యాణి గుర్రంయెక్కి ఆగమేగాలమీద పయనిస్తున్నాడు. అకస్మాత్తుగా గుర్రం ఆగిపోయింది. ఆశ్చర్యంతో గుర్రం దిగాడు రాకుమారుడు. మంత్రి కుమారుడు కూడా దిగాడు.
పంచకల్యాణి గుర్రం ముందుకాలుయెత్తి నిల్చుని ఉంది. మంత్రి కుమారుడు వంగి పరిశీలించాడు. ఆ గుర్రం కాలుకు ఒక పొడవాటి వెంట్రుక చుట్టుకొని వుంది. దాన్ని తీసి రాకుమారునికి చూపించాడు మంత్రి కుమారుడు. అది చూస్తూనే దాని సౌందర్యానికి ముగ్ధుడై మూర్ఛపోయాడు రాకుమారుడు.
కొంతసేపటికి తన మూర్ఛ తాను తెలుపుకొని లేచి కూర్చున్నాడు రాకుమారుడు.
"ఆహా! ఏమా వెంట్రుక సౌందర్యం! ఇంత సుందరమైన జుట్టుగల ఆ సుందరి సౌందర్యం ఎటువంటిదోగదా? మంత్రికుమారా! ఆమెలేని నా జీవితం వ్యర్థం. ఎన్ని ఇక్కట్లకు గురైనా సరే ఆ అద్వితీయ సౌందర్యరాసిని వెతికిపట్టుకోవాలి, బయలుదేరు" అంటాడు రాకుమారుడు.
తనకు ఆ కథ తల్చుకున్నప్పుడల్లా నవ్వొచ్చేది. కాని ఆ కథలో నిగూఢార్థం ఇప్పుడు తనకు తెలిసింది. తనకు ఆ దస్తూరి చూడగానే మూర్ఛరాలేదుగాని వచ్చినంత పనయింది.
ముకుందం ముసిముసిగా నవ్వుకుంటూ ఉత్తరం విప్పి చదవసాగాడు.
"ప్రియమైన అనూరాధా!"
ఇంత కాలానికి మిమ్మల్ని చూసే అదృష్టం నాకు లభించబోతుంది, ఎంతో కాలంగా నా ఊహాల్లోనే కదుల్తూ, కదిలిస్తూ, కవ్విస్తూన్న నా అభిమాన రచయిత్రిని కలుసుకొనే, క్షణం దగ్గర్లోనే వుందనే భావం నన్ను సంతోష సాగరంలో ముంచేస్తుంది. ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను. ఆదివారం సాయంకాలం మిమ్మల్ని కలవటానికి మీరు నిర్దేశించిన స్థలానికి తప్పక వస్తాను. ఆరుగంటలకు తప్పక వస్తాను.
ఇట్లు,
మీ
సుధారాణి"
"మీ సుధారాణి!"
