"మామగారు వెళ్ళారుగా? ఇంకా మీరెందుకూ?" సాగదీసింది వరూధిని.
వెంకటపతికి భార్యకంఠంలోని మాధుర్యం తప్ప, మాటల్లోని అర్ధం బోధపడలేదు.
"పొలం నాటేస్తుంటే వెళ్ళకుండా ఎట్టావుంటారూ?" అమాయకంగా అన్నడు వెంకటపతి.
"ఎలాగా? ఇలా!" అంటూ వరూధిని వెంకటపతి చెయ్యిపట్టుకొని ముందుకు లాక్కుంది.
మధ్యాహ్నం స్టెయిన్ లెస్ స్టీల్ క్యారియర్ తో సాంబయ్యకు అన్నం తీసుకొని పొలం వచ్చాడు జీతగాడు.
గనెం మీద కూర్చొనివున్న సాంబయ్య జీతగాడ్ని "అదేక్కడిదిరా?" అన్నాడు.
"వెండిదానికిమల్లె మెరిసిపోతాంది. అమ్మగారు తవరికి వణ్ణం ఈ అరల్లో పెట్టి పంపించారు" అన్నాడు జీతగాడు ఉబ్బితబ్బిబ్బైపోతూ.
"చిన్న దొరేడిరా? ఇంతవరకూ రాలేదు." సాంబయ్య కొడుకుని గురించి అడిగాడు.
"చిన్నయ్యగోరా? ఇంటిదగ్గరే వున్నారు దొరా!"
"పొలాన నాట్లువేస్తుంటే ఇంటిదగ్గిరేం చేస్తున్నాడ్రా వాడు?"
గట్టుమీద కూర్చొని భోజనం చేస్తున్నంతసేపూ సాంబయ్య ఆలోచనలు కొడుకుమీదే సాగాయి.
తొమ్మిదోఏటనే కొడుకును వ్యవసాయంలోకి దించాడు. వెంకటపతి పదో ఏటనే కాడీ మేడీ పట్టుకొన్నాడు. వాడు లేకుండా పొలాన ఒక్క పనీ జరగదు. వాడు లేకుండా పొలం దున్నలేదు. నాటు పడలేదు. కుప్పలు వేయలేదు. ఈరోజు తూరుప్పొలం నాటువేస్తుంటే వెంకటపతి రాలేదు. పొలంలో నాట్లు వేస్తుంటే వెంకటపతి ఇంటిదగ్గర కూర్చోగలడని తను కలలోకూడా అనుకోలేదు.
ఎండకు మెరుస్తున్న క్యారియర్ గిన్నెలు సాంబయ్య దృష్టిని ఆకర్షించాయి. తన కొడుకు వెంకటపతి ఈ మెరుగులు జిలుగులు ఆకర్షించాయా? కోడలొచ్చి నిండా మూడురోజులన్నా కాలేదు - వాడు ఎంత దూరమైనాడు? చేలో దిగి నాతువేస్తున్న కూలీలను హెచ్చరించే వెంకటపతి ఏడీ? చేలో తిరుగుతున్నా సాంబయ్య గుండెల్లో గుబులు ముసురుకొంది.
ఇంటికి వచ్చిన సాంబయ్య కాళ్ళన్నా కడుక్కోకుండా కొడుకుకోసం వెతికాడు.
వారగావేసివున్న పడమటి గది తలుపుతోసి లోపల కొచ్చిన సాంబయ్య స్తంభించిపోయాడు. గిర్రున వెనక్కు తిరిగి గొడ్ల సావిట్లోకి వెళ్ళి తల పట్టుకొని కూర్చున్నాడు.
"అసలు సంధ్యవేళ! అసుర సంధ్యంటారు! ఏమిటిది? వీడు-" ఇంక సాంబయ్య ఆలోచించలేకపోయాడు.
"ఆ ముసలాయన కేమన్నా బుద్ది వుందా?" వెంకటపతిని తోసివేస్తూ అంది వరూధిని. వెంకటపతికి కూడా అలాగే అనిపించినట్లుంది. చిరాగ్గాలేచి గదిలోనుంచి బయట కొచ్చాడు.
12
వరూధిని కాపురానికొచ్చి నెలరోజు లయింది. పుట్టింట్లో జరిగే పద్దతులూ, సంప్రదాయాలు, అన్నీ అత్తవారింటికి దిగుమతి చేసింది వరూధిని. సాంబయ్యకు మొదటి వారంరోజులూ కొత్తగానూ, వింతగానూ తోచినై. మరో వారం గడిచేసరికి కోడలి రాకతో తన అంతస్తూ, హోదా పెరిగినట్లు తోచింది. తిండి సుఖమూ పెరిగింది. ఏ నిముషానికి ఏది కావాలో కాళ్ళముందుకు వచ్చి వాలిపోతోంది. ఎటొచ్చీ వచ్చిన చిక్కల్లా వెంకటపతికి పనిమీద ధ్యాస తగ్గటమే. భార్య కాపరానికి వచ్చిన కొత్తలో ఇలాగే వుంటుందనీ, తర్వాత కొత్త బలుపుతీరి మామూలుగా అయిపోతాడనీ, సాంబయ్య తనకు తానే సర్దిచెప్పుకున్నాడు. మరొక విషయం సాంబయ్య మనసునుపట్టి పీకసాగింది. ఇంటి ఖర్చు బాగా పెరిగినట్టు కనిపిస్తూంది. కాని తన కొడుకుగానీ, కోడలుగానీ డబ్బు అడగలేదు. బహుశా కోడలు తన తండ్రి దగ్గర తెచ్చుకున్న డబ్బు వాడుతుందేమోనని తృప్తిపడ్డాడు. కాని ఆ రోజు బుచ్చమ్మ వచ్చి చేతులు నలుపుకుంటూ తన ముందు నిలబడేసరికి త్రుళ్ళిపడ్డాడు.
"బాబుగారూ!"
"ఊఁ"- సాంబయ్య ముఖం చిట్లించుకొన్నాడు.
"నా నెల జీతం!"
"ఎంతా? ఏమిటీ కథా?"
"ఎంతెక్కడిది బాబూ! ముఫ్ఫై."
"నెలకు ముఫ్ఫైరూపాయలా? అదీ అన్నం పెట్టి?"
"మిమ్మల్ని ఎక్కువేఁ అడగలేదు బాబుగారూ! బలరామయ్యగారిచ్చించే మిమ్మల్ని అడుగుతున్నాను." అంది బుచ్చమ్మ.
"అయితే ఆ బలరామయ్యే ఇస్తాల్లే, తీసుకో!" అన్నాడు సాంబయ్య.
బుచ్చమ్మ బిత్తరపోయింది. సాంబయ్య హాస్యమాడుతున్నట్లు కూడా కన్పించలేదు.
"అదేంటి బాబుగారూ! తమరింట్లో పనిచేసి ఆరినెట్టా అడిగేది?" అంది బుచ్చమ్మ.
"మాకు అచ్చమ్మలూ బుచ్చమ్మలూ అక్కర్లేదు" అని సాంబయ్య బనీను జేబులోనుంచి రెండు పదిరూపాయల నోట్లు తీసి బుచ్చమ్మ ముందుకు విసిరాడు.
"ఇంద! ఈ ఇరవయ్ తీసుకొని పో! ఈ రోజునుంచి నువ్వు మాకు అవసరం లేదు" అన్నాడు సాంబయ్య.
బుచ్చమ్మ కుక్కిన పేనులా డబ్బు తీసుకొని వరూధిని దగ్గిరకెళ్ళి భోరున ఏడ్చింది.
"ఎందుకు బుచ్చమ్మా ఏడుస్తావ్? ఊరుకో నేను మీ దొరగారితో మాట్లాడతాలే" అంది వరూథిని.
"ఆ రాత్రి మునగతీసుకొని పడుకొన్న వరూథిన్ని సాగదీసేసరికి వెంకటపతికి తల ప్రాణం తోకకు వచ్చినట్లు అయింది. అలక వహించిన వరూథిన్ని చూస్తుంటే వెంకటపతి గుండెలు తహతహలాడిపోయినై."
"చెప్పవా? ఎందుకూ కోపం?" అనునయిస్తూ అడిగాడు వెంకటపతి.
"బుచ్చమ్మ వెళ్ళిపోతానంటుంది."
"ఓసి! దానికే ఇదయిపోవాలా?"
"మరి బుచ్చమ్మ వెళ్తే ఎట్లా? నా చిన్నప్పటినుంచి మా ఇంట్లోనే వుంది. నన్ను కనిపెట్టుకొని వుంది. మా అమ్మ ఎప్పుడూ జబ్బుతోనే పడుంటే, బుచ్చమ్మే నన్ను సాకింది." ముక్కు చీదేస్తూ అంది వరూథిని. ఎర్రబడిన ముక్కూ, ఉబ్బిన, కళ్ళతో ఇంకా అందంగా కన్పించింది వరూధిని వెంకటపతి కళ్ళకు.
"బుచ్చమ్మతో నేను మాట్లాడతాగా! ఎట్టా అయినా అది ఉండేటట్లు చూసే పూచీ నాది. ఊరుకో మరి" అన్నాడు వెంకటపతి భార్య తల నిమురుతూ.
మూటా ముల్లేకట్టుకుంటున్న బుచ్చమ్మదగ్గిరకొచ్చి "బుచ్చమ్మా! మీ అమ్మగారు ఎట్లా ఇదయిపోతుందో చూశావా? నా మాట విను, ఉండిపో!" అన్నాడు వెంకటపతి.
బుచ్చమ్మ మూట కిందపెట్టి వెంకటపతికేసి ప్రశ్నార్ధకంగా చూసింది.
"బుచ్చమ్మా! అయ్యగారు అంతగా చెప్తుంటే ఇకా ఆలోచిస్తావెందుకు? ఉండు, నీకే లోపం లేకుండా చూసుకుంటారు అయ్యగారు." భర్త వెనగ్గా నిలబడి, పాటపాడే సృతిలో అన్నది వరూధిని.
"చిన్నబాబుగారి మాట నే నెట్టా కాదనగలను అమ్మాయిగారూ?" అని ఓ క్షణం ఆగి "అయ్యగారిష్టం! మీ ఇష్టం!" అని వంటగదికేసి నడిచింది.
పొలాన్నుంచి వచ్చిన సాంబయ్యకు గడపలో కూర్చుని లాంతరు తుడుస్తూ బుచ్చమ్మ కన్పించింది. ఆవిడను చూసీచూడనట్టు ఇంట్లోకి వెళ్ళాడు సాంబయ్య. రెండు మూడురోజులుంటే అదేపోతుందిలే అనుకొన్న సాంబయ్య ఆలోచనలో పడ్డాడు. ఈ ముండ ఇంకా ఎందుకున్నట్లు? ఇరవై రూపాయలకు ఒప్పుకొని వుందా? ఇరవై రూపాయలైనా అదెందుకు ఇంట్లో? ఇద్దరి మనుషులకు చేసిపెట్టటానికి?... కోడలు ఆమాత్రం చేసి పెట్టలేకపోతుందా? ఇంత వండి వార్చలేనిది ఇంట్లో వుండి ఏం ప్రయోజనం? అసలు కోడల్ని కాపరానికి తెచ్చుకొన్నది ఎందుకు? ఇంత కాసి పోసి ఇల్లు కనిపెట్టుకొని వుంటుందనే గదా? అది చేసేదేమీ లేకపోగా దానికొక దాసీముండా? బలరామయ్య కూతురు కోడరికానికి వచ్చిందా లేక కోట ఏలటానికి వచ్చిందా? అయ్యో పాపం అని దాన్ని ఈ ఇంట్లో కాలుపెట్టనిచ్చాడు.
ఏంది అది చేసే బరువుపనులు? తన భార్య దుర్గమ్మ ఎంత పని చేసేది? అది కాపరానికి వచ్చిన కొత్తలో అత్త తన కోడలిచేత పొలంపనులు చేయించలా? వంచిన నడుం ఎత్తకుండా చాకిరి చేసేది బతికినంత కాలం. ఆడకూతురంటే అలా వుండాలి. ఆ మాటకొస్తే తన తల్లీ పొలం పని చేసేది. ఏవో ఆ రోజులు వేరు. వెంకటపతి పెళ్ళాన్ని పొలంపని చెయ్యమనలేదే? ఇంటిపని చూసుకోవడానికేం? గాడా? మొగుడికి వండి పెట్టడానికి కూడా వళ్ళు బరువేనా? అయినా ఆదేం ఆడది? ఎప్పుడూ పడగ్గది వదిలిరాదు! ఆ షోకు లేమిటి? ఆ కులుకు లేమిటి? దీన్ని అదుపులో పెట్టకపోతే లాభంలేదు. అదుపులో పెట్టాల్సినవాడు దాని మొగుడు. వాడే దాని మోజులోపడి తన్నుకుంటున్నాడు. ఏదో కొత్త కాపరం మోజులో వున్నాడని ఇన్నాళ్ళూ వూరుకున్నాడు. చూస్తూ కూర్చుంటే వెంకటపతి యెందుకూ పనికిరాకుండా పోయేలా వున్నాడు.

