Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 34


    "ఈ పూట మీ వర్క్ రాదండీ. సారీ రేపు ఉదయం మీ పనితోనే ప్ర్రారంభిద్దాం. మీకు వేరే ఏదైనా పని వుంటే చూసుకోండి" - అన్నాను.
    "థాంక్సండి" అన్నాను.
    "రక్షించావు నాయనా" - అనుకున్నాను.
    ఆర్టిస్టులందరూ థియేటర్ లోనే సెటిలయి పోయారు. రెండు గంటలకి సరిగ్గా లూప్ వేసి పని ప్ర్రారంభించాను. అందరూ మాట్లాడుతున్నారు. కాన్సన్ ట్రేట్ చెయ్యలేకపోతున్నాను. ప్రొడ్యూసర్లతో చెప్పి, ఆర్టిస్టులందరికీ బైట కుర్చీలు వేయించి కూర్చోపెట్టించాను. వర్క్ ఉండేటప్పుడు కావాల్సిన వాళ్ళని మాత్రం పిలిచి, మాట్లాడించి బైటకి పంపించేస్తున్నాను. అంటే -నేనూ, ఆ లూప్ లో మాట్లాడాల్సిన ఆర్టిస్టులు మాత్రమే థియేటర్లో వుంటున్నాం. నాలుగు గంటలయ్యేసరికి పదిహేను లూప్స్ పూర్తి చేశాను. మధ్యలో నాలుగయిదు చోట్ల చిన్న చిన్న డైలాగ్స్ లిప్ కి సరిపోయేలా మార్చాల్సి వచ్చింది. శ్రీశ్రీగారి ఆదేశం ప్రకారం, మార్చిన లూప్స్ నెంబరూ, వేసిన డైలాగ్ వేరే పేపర్లో రాసిపెట్టుకున్నాను. లూప్ కోసం ఎదురుచూస్తూ రాబోయే లూప్ లో వచ్చే ఆర్టిస్టులెవరూ అని నా కుర్చీలో కూర్చొని చూస్తున్నాను.
    ఇంతలో ఇంజనీర్ రూమ్ లో నుండి థియేటర్లో వున్న స్పీకర్లో "సరోజా" అన్న పిలుపు విని తుళ్ళిపడ్డాను. వెనక్కి తిరిగి చూసి రూమ్ లోకి పరుగెత్తాను.
    
                            *    *    *
    
                                              నాకో విస్కీ కావాలి!
    
    "ఎంతసేపయిందండీ వచ్చి" అనడిగాను.
    "చాలాసేపయింది" అంటే.
    "అరగంటైంది అన్నారు. ఉద్దరించారు" - అని బుంగమూతి పెట్టాను.
    "మాట..." అని ఏదో అడగబోయారు. విసురుగా థియేటర్లోకి వచ్చేశాను. పాపం వారు కూడా నా వెనకాలే వచ్చేశారు.
    శ్రీశ్రీగారు థియేటర్లో వుంటే మాత్రం. వారు పనిచేసే టేబుల్ ముందున్న కుర్చీలో నేను కూర్చోను. ఎదురుగా మరో కుర్చీ వేసుకునే అలవాటు. అలాగే కూర్చున్నాను. చేసిన వర్క్ అంతా కాగితం మీద మార్పులతో సహా వారికి చూపించాను.
    "ఎన్ని లూప్స్ తీశావు?" అనడిగారు.
    "పదిహేను" అన్నాను.
    "ఇన్నేనా-?" అన్నారు.
    నాకు ఒళ్ళు మండిపోయింది. "వేళాకోళంగా వుందా?" అన్నాను.
    "ప్చ్...చిన్న చిన్న బిట్స్ లాగేసి వుంటావు" అన్నారు.
    "టోటల్ పిక్చర్లో రెండు వందల యబహయి లూప్స్ కట్ చేసి వున్నాయండి. రెండు గంటల్లో పదిహేను లూప్స్ పనితక్కువా?" ని అడిగాను.
    ఆయన మనసులో పొంగిపోతున్నా బయటికి మాత్రం పొక్కలేదు.
    "ఆర్టిస్టులంతా కనిపించరేం?".
    "బైట కూర్చున్నారుగా".
    "కూర్చున్నారా? కూర్చోపెట్టించావా?".
    "తెలుసుకుంటే సరి" అన్నాను.
    ఇంతలో లూప్ వేశారు.
    'శ్రీశ్రీగారు వచ్చేదాకా ఈ లూప్స్ వెయ్యాలి. వచ్చిన తర్వాత వెయ్యాల్సిన లూప్స్ ఇవి' అని ముందే ఆపరేటర్స్ కి లిస్ట్ ఇచ్చేశాను.
    శ్రీశ్రీగారు థియేటర్ లోకి రాగానే వేశారు చూడండి. చాలా పెద్ద లూప్. పెద్ద క్లోజప్, ఒక ఫుల్ పేజీ డైలాగ్.
    నాకే జాలేసింది. కాని ఏం చేస్తాం? ఎప్పుడైనా తీయాల్సిందేగా? అందుకే ముందు ఆ లూపే వేయించాను. లూప్ వెయ్యగానే దగ్గరికి పిలిచి కూర్చోపెట్టుకున్నారు. "సరోజా! నేను చెప్పింది జాగ్రత్తగా విను. ముందు డైలాగుల గ్యాప్స్ నోట్ చేసుకో. తర్వాత లిప్ మూమెంట్ ఫాలో అవు. ఇది ఇలా చెయ్యాలి. అది అలా చెయ్యాలి. ఇదీ పద్దతి" అని చాలా ఇంట్రస్టింగ్ గా డబ్బింగ్ టెక్నిక్ చెప్పడం ప్రారంభించారు.
    "లూప్ వేసి పది నిముషాలయిపోయిందండీ" అన్నాను.
    "అవనీ సరోజా! నేనేమైనా వెధవనయి చెప్తున్నానా? ఒక కాల్ షీట్లో చెయ్యాల్సిన పని చేసేశావు. కాస్త స్పీడ్ తగ్గించు. ఈ ఒక్క లూప్ ఆలస్యమయినంత మాత్రాన కొంప మునిగేదేవీ లేదు. నోరు మూసుకొని  నేను చెప్పినట్టు చెయ్యి.
    ఈ పుస్తకంలో ఒకే టేకయిన లూప్స్ తాలూకా నెంబర్లన్నీ నాట్ చేసుకో. అప్పుడు నీకు మొత్తం లూప్స్ లో టేక్ చేసిన లూప్స్ ఎన్నో, చెయ్యాల్సిన వెన్నో అన్న లెక్క కళ్ళముందు కనిపిస్తూ వుంటుంది ఇదీ డబ్బింగ్ చేసే పద్దతి" - అని ఆ ఒక్క లూప్ కి మాత్రం అరగంట టైం తీసుకున్నారు.
    తను రాసిన డైలాగ్ నా చేతికిచ్చి మాట్లాడించి, లిప్ ఫాలో అవుతూ చెయ్యాల్సిన మార్పులు చేసి "ఓకే సరోజా! ఆర్టిస్టుని పిలిపించి మాట్లాడించు" అని చెప్పారు.
    ఆ లూప్ లో చాలా ట్రిక్స్ తెలిశాయి. అటువంటి మహానుభావుడి దగ్గర డబ్బింగ్ నేర్చుకునే అవకాశం లభించినందుకు ఎంతో గర్వించాను. నా అంతటి అదృష్టవంతురాలు లేదని పొంగిపోయాను.
    "స్ట్రయిట్ పిక్చర్స్ కి రాయడం చాలా తేలిక సరోజా! డబ్బింగ్ కి రాయమను తెలుస్తుంది" అని అడుగడుక్కీ అనేవారు.
    కానీ అప్పట్లో దాని గురించి అట్లే మాట్లాడడానికి నాకు అనుభవం చాలదు. కనుక ఏమీ అనకుండా, 'నిజమేనండీ' అని మనసులో మాత్రం అనుకొనే దాన్ని.
    వారి కరక్షన్ లో తయారైన అంత పెద్ద డైలాగ్, ఆర్టిస్ట్ రెండుసార్లు రిహార్సల్స్ చేసుకున్న తర్వాత ఒకే టేక్ లో ఒకే అయిపోయింది. ఎడిటర్ కోరికమీద సేఫ్టీ టేక్ ఒకటి తీసుకున్నాం. ఎంత పెద్ద దైలాగాయినా తీసే పద్దతి తెలుసుకున్నాక నాకు కాస్త ధైర్యం వచ్చింది.
    ఆ రోజు మొత్తం నలభై లూప్స్ తీశాం. శ్రీశ్రీగారు చాలా సరదాగా వున్నట్టు కనిపించారు. కారణం అర్ధం కాలేదు.
    "ఈరోజు బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటాన"ని కారెక్కుతూ చెప్పారు.
    "ఎందుకని" అడిగారాన్నా.
    "దొరకిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు" అన్నారు.
    "ఎవర"ని అడిగా.
    "ఇద్దరం కూడా".
    "అర్ధం కాలేద"న్నా.
    "ఒక కాల్ షీట్లో నేను లేకుండా నీకు ఛాన్సు వదిలితే నువ్వెలా పనిచేస్తావో, ఆర్టిస్టుల్ని ఎలా మెయిన్ టెయిన్ చేస్తావో, లిప్ కుదరకపోతే మార్పులేలా చేస్తావో, డైలాగ్స్ మార్చే శక్తి నీకు ఎంతవరకు వుందో...ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని సమయం కోసం ఎదురు చూస్తున్నాను" అన్నారు.
    "అయితే ఫరవాలేదంటారా?" అని అడిగాను.
    "దానికేం గానీ - పిలిచినా పలక్కుండా అలిగి అలా వెళ్ళిపోయావేమిటి?" అనడిగారు.
    "అడిగిన మాటకి జవాబివ్వకుండా దాటెయ్యడానికి మీ తర్వాతే! మాట వరసకైనా మెచ్చుకోరు" అన్నాను.
    "ఇంటికి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో" అని మమ్మల్ని ఇంట్లో దింపేసి వెళ్ళిపోయారు. నన్ను మెచ్చుకాలేదని కృంగిపోలేదు కానీ వారి ఉదారస్వభావానికి మనస్సులోనే కృతజ్ఞత లర్పించాను.
    శక్తి సామర్ద్యాలుండే మనిషి అని తనకి తోస్తే మాత్రం, ఎవరైనా సరే వాళ్ళపట్ల ఆయన చూపే శ్రద్ద, వాళ్ళ అభివృద్దికి చేసే ప్రయత్నం ఇంతా అంతా కాదని అర్ధం చేసుకున్నాను.
    అలాగే అదే పిక్చర్ లో చాలామందికి అవకాశాలిచ్చారు. ఇరవైమంది కొత్త ఆర్టిస్టుల్ని డబ్బింగు ఫీల్డుకి పరిచయం చేశారు.
    నాకూ అంటూ ఓ ప్రత్యేకస్థానం ఏర్పరచాలనుకున్నారు. అందుక్కావలసిన లక్షణాలు నాలో వున్నాయని వారికి తెలుసు.
    ఆ మాట నాతో అనకుండా, నేనెంత చాకిరీ చేసినా మెచ్చుకోకుండా ఒక్కొక్క మెట్టూ నన్ను పైకి ఎక్కించడానికి వారు ప్రయత్నిస్తున్నారని గ్రహించినపుడు 'ఈ మహానుభావుడి ఋణం ఏ విధంగా తీర్చుకుంటాం' అన్న ఆలోచనతో అలసిపోయేదాన్ని.
    
                           *    *    *
    
    మర్నాడు ప్రొడ్యూసర్లు "నిన్న ఒక్క లూప్ కి అరగంట వేస్ట్ అయ్యింద"ని బాధ వెలిబుచ్చారు.
    "మరి రెండు గంటల్లో మేం చేసిన పనికో సార్! ఒకో లూప్ టైం అలాగే తినేస్తుంది. అయితే మాత్రం ఏం సార్? ఒకే టేక్ లో ఓకే అయిపోలేదా?
    అయిదారు టేక్ లు అవాల్సిన మాట శ్రీశ్రీగారు అంత కరెక్ట్ గా ఆ లూప్ చెక్ చేసి వుండకపోతే అయేదికాదు. ఆ ఒక్కటే నాలుగు లూప్ ల లెక్క సార్!" అన్నాను.
    వారు భయపడుతూ, "ఆయనతో మాత్రం ఈ మాట అనకండమ్మా" అన్నారు.
    "అంటే మీ పిక్చర్ అయినట్టే" అన్నాను.
    ఇంతలో - "ఏమిటి మీ డిస్కషన్" అంటూ శ్రీశ్రీగారొచ్చి అడిగారు.
    "ఏమీలేదండి. డబ్బింగు పూర్తవడానికి ఇంకా ఎన్ని కాల్ షీట్లు అవుతుందా? అని డిస్కస్ చేస్తున్నాం" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS