"మందు, మగువ పార్టీ ఈ పూట లేనట్లేనా" నిరాశగా అడిగాడు జగదీష్.
"మగువపార్టీ నే వెళ్ళిన తరువాత నువ్వు చేసుకో! ఏడుగంటలకి నీతో కలసి కొద్దిగా మందు సేవిస్తాలే. అంత బాధపడకురా నాయనా! ఎక్కువ పుచ్చుకుంటే డాడీ పసిగడతారు. అందుకనే లిమిట్ గా తీసుకుంటాను. మరోసారి కలుసుకోమా! అనుభవించామా! డోంట్ వర్రీ!" కిరణ్ అన్నాడు.
"మనది అంతా గాలిబ్ తత్వంకదా! అందినపుడే అందాలు అందుకుని పొందేవాళ్ళంకదా! అనుకోవటమేం ఖర్మ. ఎన్నిసార్లు పొందలేదు. ఏమిటో ఇప్పుడే ప్చ్..."
"మరీ అంత నిరాశపడకు."
"అంతేలే నిరాశపడిచేసేదేముంది?
అక్కడితో ఆ ప్రసక్తివదిలి గతంలో వాళ్ళు చేసిన ఘనకార్యాలు చెప్పుకుంటూ కూర్చున్నారు.
మాటల మధ్యలో కిరణ్ అన్నాడు.
"ఈ మధ్య నేనొక కథ చదివాను. చాలా బావుంది. ఒకతను పొరబాటున ఒక అమ్మాయిని హత్యాచేస్తాడు. అతనిని నీడలా వెంటాడే మరో అమ్మాయి హంతకుడికి, హతురాలికి మధ్య జరిగే సంభాషణ అతనికి తెలియకుండా రికార్డ్ చేస్తుంది. అంతేకాక అతడు ఆమెనిహత్యచేసేటపుడు ఫోటోలు కూడా తీస్తుంది. ఆపనిచేసి.....అతనిని బ్లాక్ మెయిల్ చేస్తుంది." నీకు నేను సహకరిస్తాను. నీమీద హత్యానేరం లేకుండా చేస్తాను. నీవు నన్ను పెళ్ళాడాలి అంటుంది.
గత్యంతరం లేని పరిస్థితులలో అతను ఒప్పుకుంటాడు. ఇరువురు కలిసి ఆమె డెడ్ బాడీని అర్దరాత్రిపూట సముద్రం లోకి తోసేస్తారు. అది జరిగి సంవత్సరకాలం దాటిపోతుంది. ఎట్టి పరిస్థితులలోనూ అతని హత్యానేరం బయటపడదు. కానీ అన్నమాట ప్రకారం ఆమెని పెళ్ళిచేసుకున్నా, రాక్షసగుణం కల ఆమె భర్తని చీటికి మాటికి బెదిరిస్తూనే వుంటుంది. భర్తనే బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకువెళ్ళి తన విలాసాలకి తగలబెడుతూ వుంటుంది. అతను ఆమె బాధ భరించలేక పూర్తిగా విసిగిపోయిన పరిస్థితులలో ఒక నిర్ణయానికి వస్తాడు.
ఆ నిర్ణయం!
నే మొదట చేసింది పొరపాటున హత్య.
ఇపుడు దీనిని నిజంగానే హత్యచేయాలి.
ఇలాంటి డెవిల్ ని బ్రతకనివ్వకూడదు. అలా అనుకుని తీవ్రంగా ఆలోచించి, రెండు మూడు ప్లాన్ లు తయారు చేస్తాడు. ఆ రెండు మూడు ప్లాన్ లు కూడా పనిచెయ్యవు.
ఒక హత్య చేసినవాడికి రెండవ హత్య చేయటం అంత కష్టంకాదు. కానీ ఇక్కడొక కష్టంఉంది. మొదటి హత్య తాలూకా సాక్ష్యాధారాలు, ఫోటోలు. వాళ్ళమాటలు రికార్డ్ చేసిన కాసేట్ ఆమె ఎక్కడో దాచింది. తొందరపడి ఆమెని హత్యచేస్తే రాక్షసి పెళ్ళాన్ని వదిలించుకోవడం అయితే అవుతుందికాని, సాక్ష్యాలు మాత్రం ఎక్కడో అక్కడ వుండే వుంటాయి. అవి మళ్ళీ బయట పడితే మళ్ళీ అతని బ్రతుకు క్షణం క్షణం భయమే. మరోసారి చిక్కుల్లో ఇరుక్కోక తప్పదు.
తెలివిగా ఆ సాక్ష్యాలు సంపాదించి, ఆమెని యాక్సిడెంట్ లో చంపేయాలి. ఆ సాక్ష్యాలు ఎలా సంపాదించాలి? యాక్సిడెంట్ ఎలా చెయ్యాలి?
"ఇది రా జగదీష్ ఆ కథ. సగం వరకూ చదివాను. ఇంతవరకూ చదివిన తరువాత మిగతా కాయితాలు ఆ నవలలో లేకపోవడంవల్ల ఆ తరువాత ఏం జరిగి వుంటుందా! అని ఎంతో ఆలోచించాను. కాని, నా బుర్రకు తట్టలేదు" తన కథనే అటు ఇటూ మార్చి చెప్పాడు కిరణ్.
కిరణ్ వచ్చింది కూడా ఇందుకే. ఇలాంటి విషయాలలో జగదీష్ చాలా తెలివిగలవాడు. ఏదన్నా సలహా చెబుతాడేమోనని తన కథని కధగా వినిపించాడు. జగదీష్ ఎంత ప్రాణస్నేహితుడు అయినా, నిజం చెప్పలేక పోయాడు.
జగదీష్ అంతా విని పకపకా నవ్వి అన్నాడు. ఏముందీ ఈ కధలో. ఇలాంటి కథలు నేను సవాలక్ష చదివాను," చాలా తేలికగా పెదవి చప్పరిస్తూ అన్నాడు.
"నీకు తెలుసు కదా! నేను కధలు చదవను. తోచక ఏదో నవల పేరు... ఆ "డెత్" ఆ నవల చదివాను. నేను అంత ఇంట్రస్ట్ గా చదివాను కాబట్టే దానిలో చివరి పేజీలు ఎగిరిపోయాయి. క్రైమ్ స్టోరీస్ నువ్వు చాలా చదువుతావు కాబట్టి చివరికి ఏం జరిగిందో నువ్వు వూహించి చెప్పగలవని నిన్ను అడిగాను," కిరణ్ అన్నాడు.
"తను చదివిన కొన్ని క్రైమ్ నవలలో సంఘటనలు తీసుకుని, యాక్సిడెంట్ గా హత్య చేయటం అనేది, ఏ నవలలో ఎవరు ఎలా చేసిందీ చెప్పాడు. అలా యాక్సిడెంట్ చేసినట్లుగా హత్యచేసినా కొన్ని కథలలో హంతకులు ఏదో ఒక పొరపాటు చేసి పోలీసులకు పట్టుబడేవారు. కొందరు హంతకులు మాత్రం తప్పించుకుని హాయిగా తిరిగేవారు" అంటూ జగదీష్ ఆ కధలన్నీ టూకీగా చెప్పాడు.
"మరి బ్లాక్ మెయిల్ చేసి దాచిన రహస్యాన్ని ఎలా కనుక్కోగలిగేవాడు హంతకుడు!" కిరణ్ అడిగాడు.
"నవలలో అయితే రైటర్ ముందే ఆలోచించుకుని పెట్టుకుంటాడు కాబట్టి, కధలో తనకు తోచినట్టు రాస్తాడు. కథ వేరు నిజ జీవితం వేరు కాని, బ్రదర్ హత్య చెయ్యటం కన్నా అంత క్రితం దాచిన రహస్యాన్ని వెలికి తీయడమే కష్టం. బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా, కాకులు దూరని కారడవిలో, చాలా సీక్రెట్ ప్రదేశంలో దాస్తారు. అదేదో వాళ్ళ నోట్లోంచే బయటకు రావాలి కాని కనిపెట్టడం చాలా అసాధ్యం," అన్నాడు జగదీష్.
"సీక్రెట్ ప్లేసెస్ అంటే ఎలా వుంటాయి?" అడిగాడు కిరణ్.
"ఐరన్ సేఫ్ లో సీక్రెట్ అరలో దాయొచ్చు. భూమిలో ఎక్కడన్నా పాతేయవచ్చు. కుండీలో దాచి పైన మట్టిపోసి దానిమీద ఏ క్రోటన్సో నాటొచ్చు. బాంక్ లాకర్ లో దాయొచ్చు. ఫలానా ప్లేస్ అని ఏం చెబుతాము. ఎవరి వీలునుబట్టి వాళ్ళు అతి భద్రంగా దాస్తారు. సీక్రెట్ అన్నమాటే" జగదీష్ అన్నాడు.
ఇంకేమనాలో తెలియక "నిజమేలే" అన్నాడు కిరణ్.
కొద్దిసేపు ఆగి ఏదో గుర్తుకురాగా "ఓ చిత్రం చెప్పనా!" అన్నాడు జగదీష్.
"చెప్పనా అని అడగడం ఎందుకు? చెప్పు!"
"నే చదివిన ఒక కధలో ఒకతను మరి అతనిని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు." "నీవు! ఫలానా తప్పుడు పని చేస్తుండగా చూశాను. ఫోటో తీశాను. ఆ ఫోటోస్ పేపర్లోకి ఎక్కిస్తే నీ పరువు బజారున పడుతుంది. అంతేగాదు నీకు మరణశిక్ష కూడా ఖాయం".
దాంతో బెదిరిపోయి ఆ పెద్ద మనిషి బ్లాక్ మెయిలర్ చెప్పింది నమ్మి అడిగినప్పుడల్లా డబ్బులిచ్చేవాడు. అలా ఆశతో డబ్బు ఖర్చుపెట్టిన తరువాత, ఆఖరున పెద్దమొత్తం పుచ్చుకుని, నీకు ఫోటోస్ సాయంత్రానికి అందిస్తానని చెప్పి, బ్లాక్ మెయిలర్ సాయంత్రానికి ఫోటోస్ అందించకపోగా, ఫోన్ చేసి శాశ్వతంగా అతని జీవితం నుండి దూరంగా వెళ్ళిపోతాడు..."
జగదీష్ చెబుతూంటే మాటల మధ్యలో అడ్డుతగిలి కిరణ్ ఆత్రుతగా అడిగాడు "బ్లాక్ మెయిలర్ ఏమని ఫోన్ చేశాడు?"
