Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 34


    వెంటనే ప్రసక్తి ప్రారంభించలేదు. సుకృతి వ్యవహారంలో కూరుకుపోయినా అతడి వ్యాపార దక్షత మరిచిపోలేదు. ఉదయం ఇంటికి రాగానే శివ విషయంలో తనకు ఆత్మీయులైన ఒకరిద్దర్ని వాకబుచేశాడు. సంతృప్తి కరమైన జవాబు వచ్చింది. అతడిలోని మోడరన్ అప్రోచ్ ఒక్కటే కాదు తను నమ్మిన పాయింటు కోసం రాజీపడకుండా ఏ స్థాయి మనిషినైనా ఎదిరించగలడని కూడా తెలిసింది.
    "అసోసియేట్ గా మీరు ఎంతకాలం పనిచేశారు?" సూటిగా అడిగాడు శెట్టి.
    ఇదంతా ఏమిటో అర్ధంకాని శివ ఇంకా విస్మయం నుంచి తేరుకోకుండానే "మూడేళ్ళు" అన్నాడు.
    "చాలా తక్కువ అనుభవం కదూ?" సాలోచనగా అన్నాడు శెట్టి "హఠాత్తుగా మీకు సినిమా డైరెక్టర్ గా చేసే అవకాశమే వస్తే?"
    "డైరెక్టర్ గా నిరూపించుకోడానికి అసోసియేట్ గా ఉన్న సీనియారిటీతో పనిలేదనుకుంటాను" తొణక్కుండా చెప్పాడు శివ. "యస్సార్..... సీనియారిటీనిబట్టి డైరెక్టర్ని చేయడానికి సినిమారంగం ప్రభుత్వోద్యోగం లాంటిది కాదు. ఇక్కడ కౌంట్ అయ్యేది క్రియేటివిటీ...."
    శెట్టికి ఈ జవాబు నచ్చింది. నిజమే....పాతికేళ్ళుగా ఫీల్డులో అసిస్టెంట్స్ గానే వుండిపోయారని డైరెక్టర్ ఛాన్సు యివ్వబడిన ఒకరిద్దరు యీ మధ్య దారుణమైన ప్లాపులు తీశారు.
    "అంటే డైరెక్టరు కావడానికి అసిస్టెంటుగా అనుభవం అవసరం లేదంటావ్" చనువుగా అడిగాడు శెట్టి.
    "అనుభవం కావాల్సింది సినిమారంగానికి చెందిన సాంకేతికమైన పరిజ్ఞానంకోసమే! రచయిత కాగితంపై రాసింది తెరమీద దృశ్యంగా మారబడాలీ అంటే ఎవరి పాత్ర ఎంతో తేల్చుకోవడమూ, సంబంధిత వ్యక్తుల నుంచి అందమైన ఫలితాన్ని రాబట్టుకోవడమూ దర్శకుడి పాత్రయితే, ఆ పాత్రని  సాంకేతికమైన వైఫల్యం లేకుండా నిర్వహించడం డైరెక్టర్ పని."
    "మంచి డైరెక్టర్ కావాలీ అంటే అర్హత ఏమిటి?"
    "ముందు కావాల్సింది ఆత్మవిశ్వాసం! తరువాత అవసరమయ్యేది తను చేస్తున్న పనికి సంబంధించిన అవగాహన."
    "ఇప్పుడు దెబ్బతింటున్న సినిమాలకి కారణం డైరెక్టర్ల ఆత్మ విశ్వాసం, అవగాహన లోపం మూలంగానే అంటావా?"
    చాలా జటిలమైన ప్రశ్నది! అయినా కంగారుపడలేదు శివ. "నిజానికి ఏ దర్శకుడూ ఓ ప్లాప్ సినిమా తీయాలనే సంకల్పంతో సినిమా పూర్తి చేయడు. కానీ ఫ్లాపులవుతుంటాయి. అయితే చాలా ఫ్లాపులకి కారణం అవగాహన లోపమే అన్నది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఒక దర్శకుడికి తనమీద తనకు నమ్మకం వుండొచ్చు. సినిమా విజయానికి అదొక్కటే కారణం కాదు. ప్రజల టేస్టుకి సంబంధించిన అవగాహన కావాలి. కారణం ఈ ప్రోడక్టుకి సంబంధించి కస్టమర్సు ప్రేక్షకులు కాబట్టి మార్కెట్ లో మనదైనందిన జీవితానికి అవసరమైన చాలా వస్తువులు దొరుకుతున్నా ప్రజలు ఆకర్షితులయ్యేది కొన్నింటికి మాత్రమే. దానికి కారణం ఆ వస్తువులోని నాణ్యత ఒక్కటే కాక మారుతున్న ప్రజల అభిరుచులను బట్టి ప్రోడక్ట్ ఉత్పత్తిలో చేయబడుతున్న మార్పులు కూడా......పాతికేళ్ళ క్రితంనుంచి ఉత్పత్తి అవుతున్న టూత్ పేస్ట్ కంపెనీ అప్పటినుంచి ఒకే మూసలో తన ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి పంపడంలేదు. ట్యూబ్స్ పరిమాణాల్ని మార్చుతుంది. పబ్లిసిటీ టెక్నిక్స్ ని వైవిధ్యంగా అమలు చేస్తూంది. కొత్తగా లవంగనూనేదో జెల్ లాంటి మరో రకమైన కెమికల్ నో దంతక్షయం కాకుండా కలిపి ప్రజల అవసరం తీర్చటానికి కృషి చేత్శున్నట్టు చెప్పుకుంటూ వుంటుంది. అంటే అలా ఏదో ప్రజల్ని ఉద్దరించడం కాదు. ఆ ప్రోడక్ట్ పాతబడిందన్న ఆలోచనకి అవకాశమివ్వకుండా జాగ్రత్త పడటం" క్షణం ఆగాడు శివ. "సినిమా ఎక్కువగా ఫ్లాప్ కావటానికి కారణం ఈ పాతబడిన మూసలో వస్తున్నాయన్న ప్రేక్షకుల ఆలోచనే....."
    చాలా ఏకాగ్రతగా వింటున్నాడు శెట్టి.
    "అలా అని కొత్తదనమూ అంటే నిన్నదాకా 'అమ్మ'ని పిలవబడుతున్న తల్లి పాత్రని "గుమ్మ"ని పిలవడం కాదు, సీతని రావణుడు ఎత్తుకు పోవడం పాత విషయం కాబట్టి సీతే రావణుడుతో లేచిపోయేట్టు చేయడం కాదు. ప్రపంచంలో ప్రతి కథా పాతదే అయినా ఆ కథని కొత్తగా చెప్పడం....అదే కొత్తదనం అంటే.... నిన్న మొన్నటిదాకా భర్తచేత టార్చర్ చేయబడుతున్న స్త్రీ పాత్ర మీ పాదాలదగ్గర యింత చోటివ్వండీ అంటూ కుమిలిపోతుంటే స్త్రీలూ ఆమోదించరు. అయితే యిప్పుడు సాంఘికపరమైన మార్పులు చోటు చేసుకుని ఫెమినిస్ట్ ఉద్యమాలు మొదలయ్యాయి. అన్యాయాన్ని ప్రతిఘటించాలన్న ఆలోచన స్త్రీ ప్రేక్షకుల్లో మొదలైంది. కాబట్టే తిరుగుబాటు ధోరణిగల స్త్రీ పాత్రలున్న సినిమాలు ఎక్కువగా ఆదరించబడుతున్నాయి. అంత మాత్రం చేత స్త్రీ తిరుగుబాటు ధోరణికి అర్ధం ఆమెను తిరుగుబోతుగా పదిమందితో కాపరం చేయడమని మనం తెరమీద ప్రభోధిస్తే స్త్రీలే ఆమోదించరు. అంటే ససాంఘికమైన పురోగమనాన్ని హర్షిస్తున్నారే తప్ప పతనమనే తిరోగమనాన్ని అంగీకరించరనేగా..... సో.....దీన్నిబట్టి ఏ దర్శకుడైనా ఒప్పుకోవాల్సింది ఒక్కటే. మారుతున్న సామాజిక పరిస్థితుల్ని బట్టి మనం కథల్ని తయారు చేయాలి. ఆ కథలు ప్రజలకి దగ్గరగా తమని తాము ఐడెంటిఫై చేసుకునే ధోరణిలో వుండాలి. నేనన్నది ఈ అవగాహన గురించి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS