Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 35

 

    "నేను నోరు తెరచి మీకు నాపై వున్నది శిష్యురాలనే వాత్సల్యం కాదనీ ప్రేమ అనీ......నేను ప్రియురాలినే తప్ప శిష్యురాలిని కాదనీ చెప్పనే అనుకోండి, నిజంగానే మీరనట్టు ఆశ్రమ మర్యాదలు మంటగలిసి పోతాయి. ఆడపిల్లను.......నా మాటలనే నిజమని విశ్వసిస్తారు తప్పా మీ మాటలు నిజమనుకోరు. ఒకవేళ మీకు భయపడి ఒప్పుకున్నా చాపకింద నీరులా ఈ విషయం ప్రజలలోకి పాకి మీ పరువు ప్రతిష్టలకు గ్రహణం పట్టక తప్పదు.'
    భారతి చిద్విలాసంగా నవ్వుతూ చెప్పింది.
    విష్ణు చాలాసేపటి వరకూ తెరుకోలేకపోయాడు.
    'అసలు నీకేం కావాలి"
    "అలా అడిగారు బావుంది"
    గలగలా నవ్వింది.....అలా చాలాసేపు భారతి నవ్వుతూనే వున్నది.
    "మిస్ భారతి.....ఏమిటా పిచ్చి నవ్వు?"
    నవ్వడం ఆపి, "విష్ణుజీ...నాది పిచ్చి నవ్వు కాదు.......మీ మీద ప్రేమ పిచ్చి ప్రేమ."
    'అది జరగని పని......'
    "ఎలా జరగదో నేనూ ప్రయత్నిస్తాను......ఇట్స్ మై ఛాలెంజ్......' అని భారతి విసురుగా వెళ్ళిపోయింది.
    విష్ణు స్థాణువులా నిలచిపోయాడు.
    అతని హృదయంలో బడబాగ్ని చెలరేగింది. అగ్ని గోళం బ్రద్దలై లావా ప్రవహిస్తున్నట్టు అతని కళ్ళలో ఎర్రని చారలు ఏర్పడ్డాయి.

                                                      *    *    *    *

    ఆశ్రమంలోకి ప్రవేశించిన వెంటనే విష్ణు గురుదేవులకు ప్రణమిల్లాడు రమేష్.
    "దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవి .....ప్రయాణం సుఖంగా జరిగినదా?"
    తనకు ప్రణమిల్లిన రమేష్ ను ఆప్యాయంగా లేవనెత్తుతూ పరామర్శించాడు విష్ణు.
    "గురూజీ తమరి దయ వుండాలే గానీ సంపూర్ణ భారతదేశాన్ని చుట్టి రాగలను" రమేష్ ఎంతో గౌరవంగా అన్నాడు!
    విష్ణు ఆశ్రమ నిర్వహణలో రమేష్ ఒక శిష్యుడు.
    ఆశ్రమం తరపున తీర్ధ యాత్రలకు వెళ్ళిన శిష్యుల బ్రుదానికి అతడు సారధ్యం వహించాడు. అలా వెళ్ళిన రమేష్ ఆ రోజే తిరిగి వచ్చాడు.
    "గురూజీ .........నా జీవితంలో చూడని ప్రదేశాలను , మహాత్యలను చూశాను. మీరు ఆశ్రమాన్ని వదిలి రాను అన్నారు కానీ వచ్చివున్నట్లయితే ఎంతో బాగుండేది. మాకు తెలియని ధర్మ సందేహాలను వివరించి చెప్పే అవకాశం వుండి వుండేది."
    ఒక నిమిషం పాటు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది.
    "రమేష్ .....నువ్వు మందిరం వదిలి వెళ్ళిన తరువాత చాలా సంఘటనలు జరిగాయి. నీకోసమే నేను ఎదురుచూస్తున్నాను. ముఖ్యంగా మన ఆశ్రమంలో ఇద్దరు శిష్యులు చేరారు. వాళ్ళ పేర్లు భారతి, రీటా!"
    ఎంతో ముఖ్యమయితే తప్ప వేరొకరి విషయాలను గురించి గురువుగారు చెప్పరని తెలుసుకాబట్టి ఎదురు ప్రశ్న వేయకుండా రమేష్ మౌనంగా వింటుండి పోయాడు.
    ఆ ఇద్దరు శిష్యులు ఆశ్రమంలో ఏవిధంగా ప్రవేశించింది మొదలుకుని అప్పటివరకూ జరిగినవన్నీ పూసగుచ్చినట్టు చెప్పడం మొదలు పెట్టాడు విష్ణు.
    భారతి తానను రాజీవ్ పార్కులో కలుసుకున్న యువతే అని గ్రహించినా రమేష్ ఆ సంగతి బయట పెట్టలేదు.
    డైరీల దొంగతనం...విగ్రహాలు నగలతో సహా పోవడం కూడా విన్న తరువాత విష్ణుకు వచ్చిన అనుమానమే .....ఆ ఇద్దరిమీదా రమేష్ కు కూడా కలిగింది.
    "నువ్వు ఈరోజు నుంచి చేయవలసిన పనుల్లో వాళ్ళ ప్రతి చర్యనూ కనిపెట్టడం ఒకటి. ఆ విషయం వాళ్ళకు తెలియకూడదు. అర్ధం అయిందా?"
    'అలాగే స్వామీ....."
    మరొక నిమిషం తరువాత రమేష్ ఆ మందిరంలోంచి బయటకు వచ్చాడు.
    అంతవరకూ ఆ గదిలో జరిగిన సంభాషణను మరో ఇద్దరూ విన్నరన్న విషయం మాట్టాడుకున్న ఆ ఇద్దరికీ తెలియదు.
    ఆ ఇద్దరెవరో కాదు...
    భారతి....రీటా!
    విష్ణు పూజామందిరం అవతలవైపు ఒకరు....ఇవతలి వేపు ఒకరు పొంచి వుండి వాళ్ళ మాటలన్నీ పూసగుచ్చినట్టు విన్నారు.
    అయితే భారతి వింటుందన్న సంగతి రీటాకు కానీ .........రీటా కూడా వింటున్న సంగతి భారతికి తెలియదు.
    రమేష్ బయటకు వచ్చే అలికిడికి అతని కంటబడకముందే ఎవరికి వారే గుట్టుచప్పుడు కాకుండా ఎవరి గదులలోకి వాళ్ళు చల్లగా జారుకున్నారు.
    

                                                        *    *    *    *

    పోలీసు కమీషనరు కార్యాలయం!
    కమీషనర్ పృద్విరాజ్ ముఖం గంభీరంగా వుంది.
    దాదాపు అరగంట నుంచి ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ ఎంతో ఓపిగ్గా తన పరిశోధన వివరాలను ఆయనకు వివరిస్తున్నాడు.
    'సో.....విష్ణులో అతీంద్రియ శక్తులు లేనేలేవంటావు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS