Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 34


    రవి సమాధానం చెప్పలేదు.
    అంతలో లాయర్ విశ్వేశ్వరం గారు కూడా వచ్చేరు.
    అందరూ మంచం దగ్గరికి రాగానే ఎవరూ చెప్పకుండానే అమ్మమ్మగారి మరణం సంగతి తెలిసిపోయింది. ప్రశాంతంగా నిద్రపోయినట్టుగా వుందామె. నిశ్చింతగా నిర్వికారంగా మృత్యువును ఆహ్వానించిందామె. బదులు తీరిపోయినట్టుగా వుందామె ముఖం.
    అందరికీ ఆశ్చర్యం! దుఃఖం.
    అందరిలోనూ ముందుగా వెంకట్రామయ్యేతేరుకున్నాడు. "బాబూ! చావు పట్టుకులకి మనం కర్తలంకాము అయిందేదో అయిపోయింది. జరుగవలసింది చూడండి!"
    తలూపేడు రవి.
    తర్వాత యధావిధిగా ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు జరిగాయి. భూనభోంతరాళాలు దద్దరిల్లేట్టుగా దుఃఖిస్తుందనుకున్న స్వప్న మూగగా నిలిచిపోయింది. తనను కన్నతల్లి ఆమెని కన్నతల్లి యిద్దరూ ఒకేసారి కాలగతి చెందుతూ వుంటే ఆమెకి చిత్రం అనిపించింది. "బ్రతికి నన్నాళ్ళూ దూరంగా వైరంగా బ్రతికినా చావు యిద్దర్నీ కలిపేసింది ఎంత చిత్రం?" అనుకుంది.
    తర్వాత అపరకర్మలు అన్నీ రవి చేతిమీదుగా ఆ యింటి హోదాకి తగ్గకుండా అనూచాన ప్రకారంగా జరిగేయి.
        
                                         25
    
    దాదాపు రెండు నెలలు గడిచేయి.
    అమ్మమ్మగారికి అంత్యక్రియలు నిర్వహించి ఇండు. రాగానే అడ్వొకేట్ ఆమె రాసిన విల్లు తెచ్చి చదివాటికి యధాతధంగా ఆ క్రితం రాత్రి ఆమె చనిపోవటానికి ముందు ఏం చెప్పిందో అందులో అదే రాసి వుంది. వివరంగా చెప్పేడంతా. ఆస్తి వివరాలూ యిచ్చాడు.
    ఆ ఆస్తి అంతా ఆమె భర్తగారిది. ఆయన పిత్రార్జితం, స్వార్జితం అంతా కలిసి భార్యకి రాశిచ్చాడు. సంపూర్ణ హక్కులతో ఆమె ఇష్టం వచ్చిన రీతిగా వ్యవహరించేందుకు హక్కు కల్పించాడు. వాళ్ళకి ఏకైక పుత్రిక సుందరమ్మ. ఆమె ఏకైక సంతానం స్వప్న. అంచేతే యాస్తి అంతా స్వప్నకే రాసేసింది ఆమె.
    దాయాదులు చిక్కులు పెట్టేందుకు కానీ, కోర్టులకి లాగి అనవసరంగా ఖర్చు పెట్టించేందుకు కానీ వీల్లేకుండా వీలు రాసేసింది. అయితే అందులో ఆమె తన అనుభవం, తన తెలివి తేటలు అన్నీ చూపించింది.
    ఆస్తి అంతా స్వప్నదే! కానయితే ఆమె ఎవరిని పెళ్ళి చేసుకుంటుందో అంత హక్కు రావటంతోపాటుగా ఆస్తి మొత్తం అయివేజులో తనకి సగభాగం వెళుతుంది. ఆస్తి ఉమ్మడిగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మెయ్యకూడదు.
    ఏ పరిస్థితులలో నయినా భార్యాభర్తలు విడిపోయినట్టయితే ఆస్తి అంతా స్వప్న భర్త అయిన ఆ వ్యక్తే అజమాయిషీ చేయాలి. అందులో సగ భాగం అయివేజు స్వప్న కు యివ్వాలి. ఇద్దరూ కలసి మెలసి జీవించిన తర్వాత సంతానం కలిగితే ఆస్తి అంతా ఆ సంతానానికే తప్ప ఆ యిద్దరికి హక్కు వుండదు. ఆ విషయం స్పష్టంగా రాయించిందామె. ఎవరయినా ఈ ఆస్తికి ట్రస్టీల్లాగా వ్యవహరించి, ఆకుటుంబ మర్యాదలు నిలిపేట్టుగా వ్యవహరించాలే తప్ప తమ యిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు.
    స్వప్నని, రవిని ప్రత్యేకంగా కూర్చోబెట్టుకుని విల్లు వివరంగా చదివి వినిపించాడు లాయరు.
    అంతా విన్న స్వప్న ఏమీ అనలేదు. రవి కూడా ఏమీ అనకుండా స్వప్న వైపు చూశాడు.
    "అమ్మమ్మగారు మీ యిద్దరి చేతులూ కలిపారు అదే మీకు పాణిగ్రహణం. మీ ఇష్టాలు, అభిరుచులు ఎలా వున్నాయో నాకు తెలియదు. కానీ ఆమె అలా మీ చేతులు కలిపినపుడు మీ రిద్దరూ విముఖత వ్యక్తంచేయలేదు. అందువల్ల మౌనంగా అంగీకరించినట్టే అనుకుంటాను!"
    రవి ఆ మాటలకీ సమాధానం చెప్పలేదు.
    స్వప్న మాత్రం చివ్వున తెలెత్తి చూసింది.
    "స్వప్నా! అమ్మమ్మగారు చనిపోయినా ఆమె ఆత్మ ఈ యింటి చుట్టూరా తిరుగుతూనే వుంటుంది. ఆమె పట్టుదల, ఆమె దక్షత, సమస్యల్ని పరిష్కరించడంలో ఆమెకి గల చాకచక్యం, పనిమనుషుల్ని, పాలేర్లని అందర్నీ ఆకట్టుక రావటంలో ఆమెకి గల ప్రజ్ఞ అన్నీ నీకూ వున్నాయి.
    పైగా నువ్వు గ్రాడ్యుయేట్ వి.
    కాబట్టి నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీకు అంతా తెలుసు. ఆమె కోరిన చివరి కోరిక ప్రకారం మీ యిద్దరికీ పెళ్ళి చేసే బాధ్యత నాపై పెట్టింది. ఇప్పుడిప్పుడే పెళ్ళి ప్రసక్తి వద్దు. అయిదారు నెలలు గడవనీ మీరిద్దరూ ఈసరికే ఒకరిపై ఒకరు ఒక అభిప్రాయన్ని ఏర్పరచుకుని వుండొచ్చు. అయితే ఆ పరిస్థితి వేరు. ఇక జరగబోయేది వేరు.
    అందుకే మీ యిద్దరూ ఒకరి నొకరు అర్ధం చేసుకుందుకు ప్రయత్నించండి. అభిప్రాయాలు కనుక్కుని వ్యవహరించండి!
    "ఇదిగో విల్లు! దీని ప్రతి నావద్ద ఒకటుంది. అమ్మమ్మగారు దీనిని రిజిష్టరు చేయించారు!"
    సమాధానమేమీ చెప్పకుండా విల్లు అందుకుంది స్వప్న. ఆమె మనస్సులో ఏముందో ఆ ఇద్దరూ గ్రహించలేకపోయారు.
    విశ్వేశ్వరంగారు బయటకి నడవబోతూ రవి వైపు చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS