"ఇదెవతి రా నాయనా! పూతనకి చెల్లెలా! తాటకికి మేనత్తా! శరీరం మొత్తం కప్పుతూ సరి అయిన ఆచ్చాదన (గుడ్డలు) లేకపోగా రాక్షసులు కట్టుకున్నట్టు రంగు రంగుల పొట్టిలంగా, పైనేమో రిబ్బన్ ముక్క చుట్టుకుని నడినెత్తి నేమో సిగ ముడి. మెడలోను, చేతులకి ఉసిరి కాయంత రంగు రంగు పూసల దండలు. కాళ్ళకి మాత్రం కిలో వెండితో చేసిన కడియాలు.
శీతల్ మళ్ళీ మంచంమీద నుంచి లేచి కూర్చుంది.
వెండి పళ్ళాన్ని మంచం పక్కనే వున్న బల్లమీద పెట్టి లేసు పక్కకి తొలగించి వెండి కూజాలోంచి మంచి నీళ్ళు వెండి గ్లాసులోకి వంచి 'తినండి అమ్మగారూ' అనో, 'ఫలహారం స్వీకరించు రాకుమారీ!' అనో మొత్తానికి తినమనే అర్ధంతో కంగాళి భాషలోనే ఆ పూతన మాట్లాడింది.
ఒకపక్క వళ్ళు మంట, మరో పక్క అసహాయత మరో పక్క చేతకాని కసి, వేరోపక్క ఆకలి....అన్ని కలగాపులగంగా వచ్చాయి శీతల్ కి. "నువ్విక్కడినుంచి దయ చెయ్యి" అంది కోపంగా.
పూతమ్మగారు పిసరంత కూడా కదలకపోగా మళ్ళీ దిక్కుమాలిన భాషలో ఏదో అని పక్క ద్వారం వేపు చేయి చూపించి ఆ తర్వాత నేలకు అతుక్కుపోయినట్లు అలాగే అక్కడే నిలబడింది.
చేతికందిన వస్తువు తీసుకుని దాని ముఖానికేసి కొడదామనుకుంది. అలాంటి పనుల వల్ల ప్రయోజనం లేదని అంతలోనే ఆ ప్రయత్నం విరమించుకుని లేచి అది చూసించిన ద్వారంకేసి నడిచింది శీతల్.
శీతల్ వెనుకనే పూతనమ్మ వచ్చింది.
ఆ ద్వారంలోంచి బైటికి వెళితే మరో గది వచ్చింది కాని అటునుంచి వేరే బైటికి పూర్తిగా వెళ్ళడానికి మరో దారిలేదు. ఆ గదిలో ఎటాచ్డ్ బాత్ రూమ్, లావెట్రీ లాంటిదని చూస్తూనే గ్రహించింది శీతల్. 'అమ్మయ్య' అనుకుంది.
శీతల్ బాత్ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకుంది ఓసారి ఆ గదినంతా పరిశోధించింది. అనుమానాస్పదంగా ఏమీ కానరాలేదు.
అయిదు నిమిషాల తర్వాత శీతల్ బాత్ రూమ్ నుంచి బైటికి వచ్చింది. పూతనమ్మ ఇంకా అక్కడే వుంది.
"ఇంకా ఇక్కడే దేనికి? వెళ్ళు" అంది.
'ఇది కదిలేటట్లు లేదు. నేలకి పాతేసిన రాటలాగా ఎలా నుంచుందో! ఈ ఫుడ్ తింటేగాని జిడ్డు వదలదేమో! అనుకున్న శీతల్ ఏమాత్రం ఆలోచించదలచు కోలేదు తీరుబడిగా కూర్చుని టిఫెన్ తింది.
పెద్ద వెండి కంచంలో చిన్న చిన్న వెండి బాక్స్ లు వున్నాయి. చక్కగా వాటికి మూతలు కూడా వున్నాయి. ఒక్కో బాక్స్ లో ఒక్కో అయిటమ్ చొప్పున ఇడ్లీ, పూరి కూర, సొమాసి, పెసరట్టు, ఉప్మా, ఇవి చాలక చాలా రకాల స్వీట్స్.
తనకి కావాల్సినవి తింటూ 'నేను గ్రీసులోను లేను ఇంగిలిపీచు దేశంలోను లేను. సుబ్బరంగా ఇండియాలో వున్నాను. ఇదేదో వీళ్ళ నాటకం' అనుకుంది. తినడం పూర్తి చేసి "కాఫీ ప్రాణిని నేను. ఇచ్చట కాఫీ అను పానీయం దొరకదా తల్లీ!" అనడిగింది.
పూతనమ్మ మళ్ళీ కంగాళి భాషలో జవాబు యిచ్చింది. అది అలా మాట్లాడుతుండగానే మరో తాటకి ఫారెన్ లో ఈ మధ్యనే లేటెస్ట్ మోడల్ గా వచ్చిన వెండి డబుల్ డక్కర్ లాంటి ప్లాస్క్ తో వచ్చింది. ఏ పానీయ మయినా ఒక దానిలో పోసినవి వేడిగా, మరొకదానిలో పోసినవి కూల్ గా వుంటాయి.
ఇప్పుడు వచ్చిన తాటకీదేవి రెండు ప్లాస్క్ లు ఓపిన్ చేసి ఓ గ్లాసులో పొగలుకక్కే వేడి కాఫీ, మరో గ్లాసులో కూల్ డ్రింక్ లాంటిది పోసి శీతల్ ఎదురుగా బల్లమీద పెట్టింది.
శీతల్ రెండు గ్లాసుల వంక మార్చి మార్చి చూసి "ఈ రెండు పానీయాలు వేరు వేరుగా తాగమనా! కలిపి తాగమనా తల్లీ అర్ధం?" అంది.
శీతల్ పెదవి కదపడంవల్ల మళ్ళీ కంగాళి భాషలోనే జవాబు ఇచ్చారు.
ఆ భాష ఏమిటో శీతల్ కి తెలియదు. కంగాళి భాష అని తనే పేరు పెట్టింది.
ఇప్పుడు ఒకరికి తోడు ఇద్దరు వుండేసరికి వాళ్ళకదో అలవాటు అనుకున్నట్లు ఏది మాట్లాడాల్సివచ్చినా కలిసే మాట్లాడుతున్నారు.
'ఇద్దరు వుంటే ఇద్దరే కలిసి మాట్లాడుతున్నారు. ఇక నలుగురంటే నలుగురు కలిసి మాట్లాడుతారేమో!" అలా అనుకున్న శీతల్ అదే నోటితో బాప్ రే అని కూడా అనుకుని కాఫీ తాగింది.
పూతనమ్మ, తాటకీదేవి ఏమీ మాట్లాడలేదు టిఫెన్లు పెట్టుకొచ్చిన వెండి కంచం, ప్లాస్క్ తీసుకుని కంగాళి భాషలో ఏదో చెప్పి, బహుశా వెళ్ళొస్తానేమో వెళ్ళిపోయారు.
'మీద పడి నాలుగు ఉతికితే ఏం చేసేవారో! ఆ ఏం చేస్తారు తిరిగి నాలుగు ఉతుకులు ఉతుకుతారు. లేదంటే గోల దేనికి? ఈ నాటకం ఎన్నాళ్ళు సాగనుందో సాగనియ్యి అనుకుంది శీతల్. అంతేగాని భయపడలేదు. ఇది జిత్తులమారి లంక మామ పనని కూడా అనుకుంది.
కాఫీ, టిఫెన్ సుష్టుగా పొట్టలోకి చేరాయి. శీతల్ కాళ్ళూ చేతులూ ఊరుకోలేదు. గదంతా తిరిగి చూసింది. తర్వాత గది బైటికి వద్దామని చిరుగంటల పరదా (వాల్ కర్టెన్) తొలగించి గుమ్మం దాటి బైటికి రాబోయింది.
రాజుల కాలంలో సిపాయిలు బల్లాలు పుచ్చుకుని గుమ్మం దగ్గర అటూ ఇటూ తిరుగుతూ సహారా కాస్తున్నవారు.
అలా గుమ్మం అవతల బల్లాయి (శూలంలాగా వుండేవి) ధరించివున్న ఇద్దరు నీగ్రోల్లాంటి వాళ్ళు శీతల్ చూసి రెండు బల్లాలని ఎక్స్ ఆకారంలో పెట్టి గుమ్మానికి అడ్డంగా నుంచున్నారు. శిరస్సు వినమ్రంగా వంచి కంగాళి భాషలో ఏదో అన్నారు.
