Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 34

 

    ఆదరాబాదరాగా టిఫిన్ చేస్తున్నాడు.


    విప్పారిత నేత్రాలతో చూస్తూ ఉండిపోయింది. పసిపాపలాంటి మనసేమో కదూ! రాత్రి అంత బాధ పెట్టినా ఎంత తొందరగా మరిచిపోగలిగాడు!


    గుంభనగా ఉంటాడని భయపడితే ఇంత ఆకతాయితనాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఆకట్టుకుంటున్నాడేమిటి? తనలాంటి రిజర్వ్ డుగా వుండే అమ్మాయి ఎక్కువ అల్లరి చేసే అబ్బాయినే ఇష్టపడుతుందా?


    తల పైకెత్తి చూసి "ఏమిటి?" అన్నాడు.


    తొట్రు పడింది. మరుక్షణం నవ్వింది తల వంచుకుని, "అనుకోలేదు."


    "మొత్తం టిఫిన్ తినేయగలననా?"


    "ఏడ్చినట్టుంది" అంది ఉక్రోషంగా . "నేననేది అది కాదు!"


    "మరి?"


    "కవితలు రాసే మగవాడంటే ఎప్పుడూ ఏదో ఆలోచనల్లో నిమగ్నమై ముక్తసరిగా మాట్లాడుతూ....."


    "కనిపించని ఏ లోకాన్నో చూస్తూ గడుపుతాడని అనుకునుంటావ్. చూడు నంబర్ వన్. నేను అంత పెద్ద కవిని కాను. నెంబర్ టు. నువ్వనుకునే కవిలా ప్రవర్తించలేను. ఎందుకంటే అంత పరాకుగా ఉంటే బ్యాంకు ఆఫీసరుగా బ్యాంకును బోలెడంతా నష్టానికి గురిచేసే అవకాశముంది కాబట్టి."


    "మీ బామ్మ - చెప్పింది లెండి."


    "ఏమని?"


    "ఇంకేముందిరా?" గదిలోకి ఎంటరైపోయింది. మాణిక్యమ్మ. "నువ్వు మొత్తం మీ తాత పోలికే అని, అడగ్గానే పెట్టకపోతే అన్నం మీద అయినా అలుగుతావని."


    "కానీ సుఖ మేముంది?" నోరు జారిపోయాడు.


    "సుఖ మేమిట్రా?"

    
    "అదేనే నువ్వంత చెప్పినా అవతల మనిషికి అర్ధం చేసుకునే సామర్ధ్యం ఉండాలి కదా అని."


    "అలా అమ్మాయి గురించి పన్నేత్తు మాటన్నా పళ్ళు రాలగోడతానోరే! అసలు నీ తహతేమిటి, అమ్మాయి అంతస్తేమిట్రా? నువ్వు కలతో అయినా.....'


    "బామ్మా!" చేతులు జోడించాడు ఇక ఆగేట్టు లేదని, "ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకోవే!"


    "గుర్తు చేసుకోబట్టే అనగలుగుతున్నార్రా!"


    "నేను చెప్పే గతం నువ్వనుకునే గతం కాదే! నీకూ ఒకనాడు పెళ్ళయింది కదా! అప్పుడు తాతయ్యా, నువ్వు ఇలాగే విడిగా, కూర్చుని మాట్లాడుకునేవారుగా......ఆలాంటప్పుడు మీ అత్తగాని, మీ నాన్నమ్మ గాని ఇలాగే ప్రత్యక్షమైపోయేదా?"


    ఈప్రశ్న అడిగి ఎంత తప్పు చేశాడు అంటే మాణిక్యమ్మ సరాసరి మంచ మెక్కి కూర్చుంది. "అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఒకనాడు ఏం జరిగిందంటే, మా పెళ్ళయిన కొత్తలో ఓ అర్ధరాత్రి మీ తాతయ్యకు అర్జెంటుగా అల్లంకొమ్ము అవసరం పడింది."


    నలిబిలి అయిపోతూనే అన్నాడు, "అదేమిటి పాపం! తాతయ్య కొమ్ములు తిరిగిన మగాడన్నావు. అల్లం కొమ్ముతో అవసరమేం పడింది?"


    "చెప్పేది వినరా భడవా! నీలాగే మీ తాతయ్యకూ పైత్యం ఎక్కువగా ఉండేది. ఓ రాత్రి ఏమైంది....."


    "టైమైంది" లేచాడు బ్యాంకుకి వెళ్ళాలన్నట్టుగా.


    "చెప్పేది వినరా!"


    "అర్ధమైంది ఇంకొద్దు."


    "ఆ అల్లంకొమ్ము...."


    "కొన్నెరకు తినిపించు" కిన్నేరను ఓరగా చూస్తూ అన్నాడు _"ఎందుకంటే అర్ధరాత్రి పూటా కిన్నెరకూ పైత్యం ప్రకోపించే అలవాటున్నట్టుంది"


    బయలుదేరి ద్వారం దాకా వెళ్ళిన రాఘవతో అంది --"నేను కారులో డ్రాప్ చేయనా?"


    "వద్దు .....నాకు స్కూటరుందిగా!"


    "ఉంది కాని, మీరిప్పుడు వీర్రాజుగారి అల్లుడు."


    "అంతే తప్ప నీ భర్తని కాదంటావ్!"


    "ఇదిగో....."


    "అంతే కదా కిన్నూ!" బడలికగా పక్క కోరిగిన భగ్న ప్రేమికుడిలా అన్నాడు." రాత్రి నీ ప్రవర్తన ఆ సత్యాన్నే నిరూపిస్తుంది."


    నవ్వాపుకుంటూ అంది---" పోనీ మధ్యాహ్నం కారులో వస్తాను."


    "ఎందుకు?"


    "లంచ్ పట్టుకుని."


    "పొలంలో మొగుడికి భోజనం పట్టుకెళ్ళినట్టు అదేమిటి?"


    "సరే ......సాయంకాలం తొందరగా రండి. కారు డ్రైవింగ్ నేర్పుతాను.'


    "ఇది బాగుంది." దగ్గరకు లాక్కోవాలనుకున్నాడు కాని, వెనుక బామ్మ కనిపించడంతో ఆగి, వేగంగా బయటికి నడిచాడు.


    "అదమ్మావాడి తీరు. కొంత అర్ధమైందిగా? అయినా నువ్వేం జంకకు. ఏమైనా అడ్డం దిడ్డంగా అల్లరి చేశాడనుకో. అర్ధరాత్రి వేళైనా సంకోచించకుండా పిలువ్. తెల్లవార్లూ గదిలో కూర్చుని మరీ వెధవా తిక్క కుదురుస్తాను!"


    కిన్నెర జవాబు చెప్పలేదు. స్వచ్చమైన మనసులెలా ఉంటాయన్న అన్న సత్యాన్ని తెలుసుకుంటున్నట్టు వెళ్ళి బామ్మ పక్కన కూర్చుంద


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS