Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 33

 

    "లెమ్మంటుంటే !" పూరేకుల్లా చెంపల్ని తాకుతున్న వేళ్ళను బట్టి అర్ధం చేసుకున్నాడు బామ్మ కాదని.


    వెనువెంటనే ఇప్పుడు తానేక్కడున్నది స్పురణకు రావటంతో ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు.


    పక్కమీద తన పక్కన కూర్చుని వుంది కిన్నెర ! తలంటు స్నానం చేసిన కిన్నెర దేవకన్యలా అనిపిస్తుంది. బ్లూ షిఫాన్ చీరలో శిల్పంలా ఉంది.


    "మీ బామ్మనుకున్నారా?" చిలిపిగా నవ్వింది.


    జవాబు చెప్పలేదు.


    "మాట్లాడమంటుంటే......"


    "ఇంచుమించు మా బామ్మతో పాటు మా యింట్లోనే వున్నట్లుగా ఉంది."


    "అదేం!"


    "అంతకుమించి ఏం జరిగిందని......" ఉడుకుమోత్తనంగా లేచాడు.


    నవ్వాపుకోలేకపోయింది. రాత్రి కోపాన్నిప్పుడు సశేషంలా ప్రదర్శిస్తున్నాడు.


    "జరిగితే తప్ప తొలి రాత్రి కాదా!"


    "కాదని ఎలా అనగలను? అంటే మాత్రం నువ్వు ఊరుకునే ఆడపిల్లవా?" బాత్రూమ్ లోకి వెళ్ళబోయాడు.


    "మిమ్మల్ని నిద్ర లేపింది బాత్రూమ్ లోకి పంపటానిక్కాదు. బెడ్ కాఫీ తాగమని చెప్పటానికి"


    "అవసరం లేదు"


    "అవసరం లేదా? అలవాటు లేదా?"


    "జవాబు ఏదన్నా కాని, రెండింటికి పెద్ద తేడా లేదు" ఆమె చేతిని విడిపించుకుని సీరియస్ గా వెళ్ళబోతుంటే కోపంగా చొక్కా కాలరు పట్టుకుంది.


    తొట్రుపడిపోయాడు. "ఇదేమిటి దౌర్జన్యం?"


    "దీన్ని దౌర్జన్యం అనరు"


    "మరేమంటారు?"


    "ప్రేమంటారు"


    "బయటేవరితోనైనా అనేవు"


    "అంటేనేం?"


    "రోడ్డు మీద వెంటపడే మగాళ్ళ కాలర్లు పట్టుకోవడం మానేస్తారు."


    పకాల్న నవ్వింది. పడి పడి నవ్వింది.


    అమాంతం పైకెత్తుకుని బాత్ రూంలోకి లాక్కుపోవాలనిపించింది. తమాయించుకున్నాడు.


    "బాగా కోపమొచ్చిందేమో కదూ!" గోముగా అడిగింది అతడి భుజం మీద తలానించి.


    "వద్దు ఈ టైపు ఆంగికంతో నన్నింకా రెచ్చగొట్తోద్దు. అనక రెచ్చిపోయిన నన్ను చూసి ఇంతకాలం ఎంతమంది అమ్మాయిల దగ్గర రెచ్చిపోయారూ అని నిలదీసి అడగొద్దు" బాత్ రూంలోకి పరిగెత్తినట్టు వెళ్ళాడు.


    "ఫర్వాలేదు, ఈయన్ని బుజ్జగించడం పెద్ద సమస్య కాదు' అనుకుంది.


    అయిదు నిమిషాలపాటు షవర్ కింద తడిసిన రాఘవకు నిజంగా ఇప్పుడు ప్రశాంతంగా వుంది.

    
    పాపం.....తొలి రాత్రిగా.....పిచ్చి పిల్ల భయపడి ఉంటుందనుకున్నాడు. పైగా ఈ తొలి రాత్రి భయాల గురించి వారపత్రికల్లో చాలా మంది డాక్టర్లు చెప్పిన జవాబులు గుర్తుకు రావడంతో అది సహజమేగా అని బలంగా నమ్మేశాడు కూడా.

 

    బాత్ రూంలో నుంచి బయటకు వచ్చిన రాఘవ ఉహించలేదు. కిన్నెర బ్రేక్ ఫాస్ట్ కూడా పడక గదిలోకి తీసుకోచ్చింది.


    చీర చెంగుతో అతడి చెంపలపై యింకా ఆరని నీటి బిందువుల్ని తుడుస్తుంటే రెప్పలార్పకుండా చూస్తూ ఉండిపోయాడు.


    "క్షణం పాటు కిన్నెర చూపులు అతడి చూపులతో కలిసి విడిపోయాయి ......."ఏమిటలా చూస్తున్నారు?" అంది టీపాయ్ మీద బ్రేక్ ఫాస్ట్ సర్దుతూ.

 

    అతను చూపు మరల్చలేదింకా.


    "మిమ్మల్నే!"


    "నమ్మలేకపోతున్నాను కిన్నెరా!"


    "ఏమిటి?" కావాలనే చిలిపితనాన్ని ప్రదర్శించింది. "బ్రేక్ ఫాస్ట్ ఈ గదిలోకి తీసుకొస్తాననా?"


    "గాడిద గుడ్డేం కాదూ?" మొహం మాడ్చుకున్నాడు. "పొయిటిక్ సెన్స్ లేదు కాని, పోయిట్రీ ని ఇష్టపాడుతుందట పెద్ద!"


    కిసుక్కున నవ్వింది.


    "వద్దు." దీర్ఘం తీస్తున్నట్టుగా అన్నాడు మోచేతిని మొహానికి అడ్డం పెట్టి. "అలా నవ్వొద్దు. ఆ టైపు మందహాసంతో వ్యర్ధమైపోయిన మొదటి రాత్రి గురించి మనసు వికలం చేసుకుని కుమిలే దుస్టితిని నాకు కలిగించోద్దు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS