Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 34

   

    "అబ్బే మికేందుకక్కా శ్రమ. నేను పెడతాలే" అంది దాక్షాయణి.

    "నువ్వు కంగారులో ఉన్నావు. శొంటికి బదులు మరేదో కలిపినా కలుపుతావు. నువ్విక్కడ కూర్చో, నేను పెట్టిస్తాను" అంటూ పిట తీసింది కస్తూరి.

    దాక్షాయణి నిశ్శబ్దంగా ఆ పీట మీద కూర్చుంది.

    కస్తూరి టీ తయారుచేస్తోంది.

     "పొద్దుట భోంచేసి వెళ్ళడా?' అడిగింది కస్తూరి.

    "చేసే వెళ్ళరక్కా! పొద్దున బానేవున్నారు. ఆసలు ఇంత ఆలస్యంగా వచ్చారు. పైగా భోజనం వద్దంటున్నారు" చెప్పింది దాక్షాయణి దిగులుగా.

    "పిచ్చిపిల్లా నిదంతా చోద్యం! మనిషన్నాక తలనొప్పి, వంటి నొప్పులు రాకుండా వుంటాయా? కంగారుపడకు" అంది కస్తూరి ఆప్యాయంగా.

    "పిల్లలు భోంచేశారా?" అడిగింది మళ్ళీ.

    "చేశారక్కా! నిద్రపోతున్నారు" అంది దాక్షాయణి.

    "ఇందా , ఇది తీసుకుని అబ్బాయికివ్వువెళ్ళు" అంది కస్తూరి.

    గ్లాసు తీసుకుని దాక్షాయణి తమ గదిలోకి వెళ్ళింది.

    మాధవరావు మంచం పైన పడుకుని శూన్యంలోకి చూస్తున్నాడు. ఆయన్ని ఆ స్థితిలో చూసేసరికి ఆమెకి కాళ్లు చేతులు ఒనకటం ప్రారంభించాయి.

    `"ఏమండీ, ఇదిగో టీ తీసుకోండి అక్క పెట్టింది" అంది దాక్షాయణి.

    మాధవ నిశ్శబ్దంగా నవ్వి టీ గ్లాసందుకుని తాగసాగాడు.

    దాక్షాయణి అయన పక్కనే మంచంపైన కూర్చుంది.

    క్షణాలు భారంగా గడుస్తున్నాయి.

    టీ తాగి గ్లాసు అందించాడు మాధవరావు.

    "చెప్పండి ఏమైంది? ఎందుకలా వున్నారు?" అడిగిందామె.

    "ఏంలేదులే దాక్షాయణి! నువ్వు భోంచేశావా?" అన్నాడు.

    "మీరు చేయకుండా నేనెలా చేస్తాను?" అంది దిగులుగా.

    "నాకు ఆకలిగా లేదన్నాగా, నువ్వు భోంచేయి" అన్నాడు.

    "కాసేపు ఆగి చేద్దాంలే....మీకు తలనొప్పి తగ్గితే ఇద్దరం కలిసి భోంచేద్దాం" అంది నవ్వుతూ.

    దాక్షాయణికి విషయం చెపితే తనకు మనశ్శాంతి లేకుండాపోతుంది ఇంకా కంగారుపడుతుంది. చెప్పకపోవటమే మంచిది.

    అసలు తమ్ముడు ఇలా చేస్తున్నాడంటే నమ్మలేకపోతున్నాను. మనింట్లో తాగుడే అలవాటులేదు. అలాంటిది దాని కొంపకెళ్ళడం ఛ...తల విదిలించాడు.

    "ఎంటండి తలనొప్పి బాగా వస్తుందా?" అంది దాక్షాయణి కంగారుగా.

    "లేదులేవే, నన్ను విసిగించకు కాసేపు పడుకుంటాను. నువ్వెళ్ళి భోంచేయి ముందు"అంటూ పిల్లల పక్కన నడుం వాల్చాడు.

    దాక్షాయణి అలాగే భర్తవేపు దిగిలుగా చూస్తూ కూర్చుంది.

    ఆమెకు మనసంతా అందోళనగా వుంది. భర్త ఎందుకో తనలో తనే భాధపడుతున్నాడో అర్ధంకావటంలేదు.

    "పెద్దపిన్ని భోంచేశావా?" బయటనుంచే కేకేసింది జయంతి.

    " లేదమ్మా, మీ బాబాయ్ కి తలనొప్పిగా ఉందట, కాసేపు పడుకుంటానని చెప్పారు. కాసేపాగి ఇద్దరం కలిసి చేస్తాం"అంది దాక్షాయణి.

    "తలనొప్పిగా వుందా? అరెరె ఎందుకు?" అంటూ లోపలికొచ్చింది.

    "వద్దులే...లేపోద్దులే! ఇప్పుడే పడుకున్నారు. మనం బయటకెళాదాం పద" అంది దాక్షాయణి కిరోసిన్ లైటు వత్తి తగ్గించి.

    "సరేపద- డాబాపైకి వెళ్ళి కూర్చుందాం" అంది జయంతి.

    దాక్షాయణి జయంతిని నిశ్శబ్దంగా అనుకరించింది.

    ఇద్దరూ కలిసి డాబాపైకి వెళ్ళి కూర్చున్నారు. పెళ్ళికిముందే పైకి మెట్లు కట్టించాడు సర్వోత్తమరావు.

    పైన వెన్నెల తెల్లగా డాబా అంతా పరచుకుంది.

    "అబ్బ! ప్రాణానికి హాయిగా వుంది పిన్ని ఇక్కడ...." అంది జయంతి.


    "నువ్వు భోంచేశావా?" అడిగింది దాక్షాయణి.

    "చేశాను పిన్నీ. నువ్వుకూడా చేసుంటావులే ఇద్దరం కలిసి పైన కాసేపు కూర్చుందమనే పిలిచాను" అంది నవ్వుతు.

    "ఏంటి పిన్ని అదోలా ఉన్నావు ఎందుకు?" అడిగింది జయంతి.

    "ఏంలేదు....మీ బాబాయ్ ఎందుకో అందోళనగా వున్నారు. ఆకలిగా లేదని పడుకున్నారు. ఎందుకో అర్ధంకావటంలేదు" అంది దాక్షాయణి.

    "తలనొప్పిగా వుందంటున్నావుగా....?" అంది జయంతి ఆశ్చర్యంగా.

    "అది ఒట్టి సాకు మాత్రమే అయుంటుంది. అసలు కారణం మరేదో అయుంటుందని నా అనుమానం" అంది దాక్షాయణి.

    "ఇంకేముంటుంది? బాబాయ్ అంతగా బాధపడే సమస్యలేమున్నాయి" అంది జయంతి సీరియస్ గా.

    "అదేకదా నాకర్ధం కావటంలేదు" అంది దాక్షాయణి.

    "నువ్వు చిన్నదానికే కంగారుపడుతున్నావు పిన్నీ, చిన్నపిన్నిలాగా, ఏమి అయివుండదు. తలనొప్పివల్లే అలా పడుకునంటాడు....అందులో ఈరోజు ఎండ బాగా వుంది" అంది జయంతి పిన్నికి ధైర్యం చెపుతూ.

    "అలాగైతే మంచిదే" అంది క్లుప్తంగా.

    "అదే అయుంటుంది. భయపడకు" చెప్పింది జయంతి.

    "పార్వతి పడుకుందా?" అడిగింది దాక్షాయణి.

    "పడుకుందనుకుంటా, బాబాయ్ ఇంకా రాలేదు" అంది జయంతి.

    "ఇంకా రాలేదా? అదేంటి ఇప్పుడు ఎంతయింది టైం?" అడిగింది దాక్షాయణి.

    "పదిగంటలవుతుంది" చెప్పింది జయంతి.

    "మరి పదవుతున్నా ఇంకా రాకపోవటమేంటి?" అంది ఆశ్చర్యంగా దాక్షాయణి.

    అంతలో కింద ఇంటిముందు మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది. ఇద్దరూ కిందకు చూశారు. సోమసుందరం బండి ఆపి, వీధి గుమ్మంలో నుంచి మెల్లగా లోపలికి తెస్తున్నాడు.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS