Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 34


    
    ఊరువరకు ముగ్గురూ కలిసివచ్చారు.


    అతను ఇంట్లోకి వెళ్ళబోతూ ఆదిలక్ష్మితో "ఆదివారం సినిమాకి మీరిద్దరూ రండి" అని చెప్పాడు.


    మధ్యలో అదెందుకు అన్నట్టు చూసిందిగానీ అతను పట్టించుకోలేదు. ఆదిలక్ష్మి తనను శత్రువులాగా చూడడం గమనించనేలేదు ఉమ అతని స్పర్శ తప్ప మరి దేన్నీ మనసు ఫీలవడంలేదు. అతనికి చేయి అందించి గట్టుపైకి లాగడం మరీమరీ గుర్తొస్తోంది.


    స్నానం చేస్తే అతని స్పర్శ పోతుందని చాలాసేపు సందేహించింది. తల్లి మరీ పోరుపెడితే ఇక తప్పదని ఎనిమిదిగంటల ప్రాంతాన దొడ్లో దూరింది. దొడ్డంటే నాలుగు తడికల్ని దడిలాగా కట్టడమే.


    మరుసటిరోజు సుబ్బారెడ్డి పని ఆఖరు. ఆ తరువాత సుధాకర్ ని ఎలా చూడాలన్న దిగులు ప్రారంభమైంది. అతన్నే రోజంతా చూస్తూ కూర్చోవాలనిపిస్తోంది.


    పొలం చేరుకోగానే ఆమె చూపులు అతనికోసం గాలించాయి. కానీ అతను ఎక్కడా కనపడలేదు.


    ఇక ఆ రోజు పనికి మంగళం పాడేసి ఇంటికొచ్చి పడుకుండిపోవాలన్పించింది. మనసంతా ఏదో తీయని బాధతో విలవిల్లాడిపోయింది.


    నారుకట్ట చేతిలో మోయలేని బరువున్నట్టు తోచింది.


    అంతలో అక్కడికి వచ్చాడు సుధాకర్.


    ఒక్కసారిగా ఆమె అనుభవిస్తున్న పరిస్థితిలో మార్పొచ్చింది. ఆ ప్రాంతమంతా సుందరమైన నందనవనంలా అన్పించింది ఆమెకి.


    "మోటర్ వేశావా?" సుబ్బారెడ్డి కాలువలో నీళ్ళు రాకపోవడంతో అడిగాడు.


    "వేశాను. దూరం కదా. నీళ్ళు సాగద్దూ?" అంది ఉమ.


    అంటే అతను ఇంతకుముందు మోటర్ వేయడానికి వెళ్ళాడని అర్ధమైంది. ఇప్పుడతను ప్యాంట్ లో లేడు. చక్కటి డిజైన్ లుంగీని కట్టుకుని పైన గళ్ళచొక్కా వేసుకున్నాడు. తమ కాలనీలో కూడా మగవాళ్ళు లుంగీలు కట్టుకుంటారుగానీ అవి ఇంత డిజైన్ తో ఇంత అందంగా వుండవు. భేదం ఎక్కడుందో ఆమెకి తెలియడంలేదు. అతను ఏ డ్రెస్ లో అయినా స్మార్ట్ గా వుంటాడని ఆమెకి అనిపించింది. మధ్యాహ్నం ఒంటి గంటైంది.


    అప్పటికే అరగంటనుంచి ఇంటికెళ్లాలని కొందరు కూలీలు రాగాలు తీయడం ప్రారంభించారు.


    పొలం ఊరికి దూరం కాబట్టి పన్నెండింటికల్లా పని ముగించెయ్యాలి. కానీ కొంత మిగిలిపోతుంది కాబట్టి మరో కూలీ ఎక్ స్ట్ర్రాగా ఇస్తానని సుబ్బారెడ్డి చెప్పడంతో, మరో అరగంట పొడిగించారు. మొత్తంమీద నాటు అయిపోయిందిగానీ నారు లేకపోవడంతో ఓ రెండు గంటల పొలందాకా నాటు పడక మిగిలిపోయింది.


    "నారు ముందుగానే ఎక్కడైనా తెచ్చుకుని నాటు కోవాలి. మరి నారు ఎక్కడ దొరుకుతుందో చూసుకోవాలి" సుబ్బారెడ్డి కొడుకుతో చెప్పాడు.


    ఇక ఆరోజుకి వచ్చేయాలి.


    అందరూ బావి దగ్గరికి వెళ్ళి మోటార్ నీళ్ళతో చేతులు కడుక్కున్నారు. ఒక్కొక్కరే బయలుదేరారు.


    చివరికి ఆదిలక్ష్మి, ఉమా మిగిలిపోయారు. అందరికంటే ముందు సుబ్బారెడ్డి వెళ్ళిపోయాడు.


    మొదట ఆదిలక్ష్మి కాకుండా ఉమ మోటర్ నీళ్ళతో బురద కడుక్కొని చీరకుచ్చిళ్ళు సవరించుకోవడానికి షెడ్ లోకి వెళ్ళింది. సుధాకర్ ఎటెళ్ళాడో కనిపించలేదు. మోటార్ ఆఫ్ చేయడానికి వెళ్ళుంటాడనుకుంది.


    తాము లేకపోతే ఇంకొకరు అతనితో క్లోజ్ అయిపోతారనే ఆందోళనతో ఉమ, ఆదిలక్ష్మి చివరికి మిగిలిపోయారు. అతను ఎటో వెళ్ళి పోయాడు కాబట్టి ఆదిలక్ష్మి రిలాక్సింగ్ గా బురద కడుక్కుంటోంది.


    షెడ్ లో చీరనంతా విప్పి తిరిగి కట్టుకోవడానికి ఉపక్రమిస్తుండగా ఎవరో వచ్చినట్టు చప్పుడయితే కంగారుగా చీరను ఎదకు అడ్డంపెట్టుకుంది ఉమ.


    ఎదురుగా సుధాకర్. చిలిపిగా అతను ఎక్కడ చూస్తున్నాడో తెలిసి చీరను బొడ్డు దగ్గరకి జరిపింది.


    "కోడూరు దోసపండు కూడా ఇంతగా నవనవలాడుతూ వుండదేమో...." అన్నాడు అతను. దేన్నిచూసి అతనలా అన్నాడో తెలిసి బొడ్డు కనపడకుండా మరింతగా చీరతో అదుముకుంది. ఉమ.


    అతను మరింత చిలిపితనాన్ని జోడించి కొంచెం పైకి చూపును లేవనెత్తాడు.


    అతను ఎక్కడ చూస్తున్నాడో తెలిసి కంగారుగా చీరను తన వక్షస్థలం కనపడకుండా దాచుకుంది.


    "హైబ్రిడ్ రకం" అని నవ్వుతున్నాడు.


    ఏదైనా పండ్లుగానీ, కూరగాయలుగానీ బలంగా, పెద్దవిగా వుంటే అని హైబ్రిడ్ రకాలని అంటారు. అప్పుడతను ఆ విధంగా అనడంలో అసలు ఉద్దేశ్యం ఏమిటో తెలిసి సిగ్గుతో చచ్చిపోయిందామె.


    అతను అక్కడ్నుంచి వెళ్ళడే. దూరంగా వెళ్ళమని చెప్పడానికి ఆమెకి నోరు పెగలడంలేదు.


    అతను ముందుకు వచ్చి ఆమెనలా రెండు చేతుల్తో పొదివి పట్టుకుని తన మీదకు విసురుగా లాక్కున్నాడు.


    తత్తరపాటుకి ఆమె చేతిలోని చీర కిందకు జారిపోయింది. పైన ఏ ఆచ్ఛాదనా లేకపోవడంతో ఆమె ఎదంతా అతనిలోకి హత్తుకుపోయింది.


    అతని చేయి కిందకు దిగుతోంది. అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో ఆమెకి తెలిసిపోయింది. సిగ్గు అరచేయి మందాన ఆమెలో పేరుకుపోతోంది.


    "ఉమా! ఉమా!" ఆదిలక్ష్మి లోకం తల్లకిందులయ్యేటట్టు అరుస్తోంది. ఎప్పుడయితే ఆమె తనపేరు పెట్టి అరిచిందో, ఠక్కున ఈ లోకంలోకి వచ్చింది ఉమ. అతని నుంచి విడిపోయింది. ఏదో అందమైన కల చెదిరినట్లయింది.


    అతను ఆమెనించి ఏదో కావాలన్నట్టు చూస్తున్నాడు. ఓ పిల్లాడి చేతిలోంచి చాక్లెట్ లాక్కుంటే ఎలా అయిపోతాడో అలా అయిపోయాడు. ఆమె అతని చూపుల నుంచి తప్పించుకుని గబగబా బయటికి నడిచింది.


    "ఎక్కడ చచ్చావే- అరిచి అరిచి గొంతు నొప్పెడుతోంది" ఆదిలక్ష్మి కోపగించుకుంది.


    "చీర కట్టుకొస్తున్నాను" అంతే విసురుగా తను కూడా జవాబు చెప్పింది ఉమ.


    లేకుంటే కనుక ఆదెమ్మ అంతటితో ఆపదు.


    అదృష్టంకొద్దీ అతను తన వెనకే షెడ్ నుంచి రాలేదు. లేకుంటే ఆదెమ్మ కంట్లో పడిపోదురు. ఆదెమ్మకు తెలిసిందో ఇక కథ కంచికికాదు. ప్రతి ఇంటికీ పోతుంది. అందరి దగ్గరికీ వెళ్ళి సినిమాకథ లెవెల్లో మొత్తం స్టోరీనంతా సంగీతం, నటన దగ్గర్నుంచి దర్శకత్వం వరకు తనే నిర్వర్తించి మరీ చూపిస్తుంది.


    ఇద్దరూ బయలుదేరారు. పాపం ఆదిలక్ష్మికి విషయం తెలియకపోవడంవల్ల సుధాకర్ వస్తాడనే అయిదు నిముషాలకోమారు వెనక్కి తిరిగితిరిగి చూస్తోంది.


    ఇంటికొచ్చి అలా మంచంమీద వాలిపోయింది ఉమ. భోజనం చేయడానికి కూడా లేవలేదు. చిత్రం కాకపోతే మరేమిటి? ఉదయం నుంచి అంత పని చేసినా ఆకలి ఎత్తకపోవడం, షెడ్ లో తనను అతను కౌగలించుకోవడం తప్ప మరేదీ గుర్తుకురావడం లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS