ఆమె మాటలకి అతని కళ్ళు మెరిశాయి. 'వస్తానమ్మా' అంటూ మరోసారి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు.
"ధృతి!" అంటూ పిలుపు వినిపించి అటుకేసి చూసింది.
"ఓసారిటు వస్తావా? చిన్న పనుంది" అన్నారు బాల్కనీలో నిలబడిన ధర్మానందరావుగారు.
ఆమె నీళ్ళు పెట్టడం ఆపి, అటువైపు నడిచింది.
"చిన్న లెటర్ టైపుచెయ్యాలి" అంటూ అప్పటికప్పుడే 'డ్రైవర్ కావాలి' అంటూ అందుకు కావాల్సిన అర్హతలూ, తనిచ్చే జీతం వివరాలూ అన్నీ డిక్టేట్ చేసి టైపు చేయించారు.
"రేపు పేపర్లో ఎడ్వర్ టైజ్ చేయిద్దాము" అని చెప్పారు.
"ఏ పనైనా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని ఆయన అనుకోరు. రేపటి దాకా అక్కర్లేదు, ఏ పనైనా కాసేపు అయ్యాక చేద్దాం అనుకుంటే చాలు బద్ధకం పెరిగిపోతుంది. ఆయనలోని ఈ చురుకుదనం ధృతికి చాలా నచ్చుతుంది.
* * *
"పోయిన ఆదివారం రాలేదేం? ప్రేమ్ ఎక్కడికైనా తీసుకెళ్ళాడా" అడిగింది తల్లి.
ధృతి అసహనంగా చోసోతూ "మీరు కంగారుపడలేదా? కనీసం ఎదురు చూడలేదా?" అంది.
"పోయినసారి వచ్చినప్పుడు 'ధృతి ఆదివారాలు ఇలా వచ్చేస్తుంటే చాలా బోర్ గా వుంది అంకుల్' అన్నాడులేమ్మా అందుకు" అన్నారు సీతారామయ్య అందుకే కమగారుపడలేదన్నట్లు.
"అందుకు కాదు నేను మానేసింది" గట్టిగా అంది.
"పోనీలే! ఎందుకైనా మంచిపనే చేశావు" అంది సుభద్ర.
తల్లి ఇలా ఎందుకు అందో అర్ధంకాక ప్రశ్నార్ధకంగా చూస్తుండిపోయింది ఆమె.
"అక్కా! నవీన్ నీ కోసం...." కృతి ఏదో చెప్పబోతుండగా......
"నీ ట్యూషన్ టైమైంది వెళ్ళు" అని కసురుకుంది సుభద్ర.
"నవీన్ సంగతి ముందు చెప్పి వెళ్ళు" అంది ధృతి.
"నీ కోసం ఆ రోజు చాలాసార్లు వచ్చి వెళ్ళాడు" అని చెప్పి వెళ్ళిపోయింది కృతి.
"హు! వస్తాడు, రాక ఏం చేస్తాడూ? పెద్ద కలెక్టరీ వెలగబెడుతున్నట్లు భావించుకుని, అంతగా వేషాలు వేసి వున్న ఉద్యోగం కాస్తాపోగొట్టుకున్నాడు. కుండలు డింకీలు కొడుతుంటే రాక ఏం చేస్తాడు?" అంది వెటకారంగా సుభద్ర.
ధృతి దిగ్గున లేచి నిలబడుతూ "నవీన్ ఉద్యోగం పోయిందా?" అంది.
"ఆ....ఆ ఓనర్ని పట్టుకుని చితకతన్నాడు. అసలు పోలీసులు జైల్లో పెట్టేశారు. సమయానికి మీ నాన్న వెళ్ళి అడ్డుపడ్డారు" అంది ముఖం అంతా చిట్లించి సుభద్ర.
ఆమె వెంటనే తండ్రి దగ్గరికెళ్ళి "అసలు ఏం జరిగింది నాన్నా?" అని అడిగింది.
సీతారామయ్య అంతా వింటూనే వున్నాడు- "ఎవరో అబ్బాయికి పనిలో వుండగా ఏక్సిడెంట్ అయింది కాబట్టి, ఆసుపత్రి ఖర్చులు ఓనర్ని భరించమని అడిగాడుట, దానికి ఆయన ఏదో తలతిక్కగా అన్నాడుట. మాటామాటా పెరిగి, నవీన్ ఆయనమీద చెయ్యి చేసుకున్నాడు. నేవెళ్ళి సర్ది చెప్పాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆయన పోలీసులకి ఫిర్యాదు చేసేవాడే" అన్నాడు.
ఆమె ఇంక నిమిషం కూడా అక్కడ నిలబడలేకపోయింది.
పడిపడి వెళ్ళిపోతున్న కూతుర్ని చూస్తూ "భగవంతుడా! దీని బుద్ది మార్చు!" అంటూ తల కొట్టుకుంది సుభద్ర.
ధృతి వెళ్ళేసరికి నవీన్ ఏదో సీరియస్ గా రిపేర్ చేస్తున్నాడు. ఆమెని చూసి తలెత్తి "రా...రా" అన్నాడు నవ్వుతూ.
ఆమె వెళుతూనే "వామనమూర్తిని కొట్టావట" అంది.
అతను కనుబొమలెగరేసి "పేపర్లో పడిందా? అప్పుడే నీకు తెలిసిందీ" అన్నాడు.
"సంతోషించానుగానీ! నిజమేనా నేను విన్నది?" అంది.
"నీతో చెప్పినవాళ్ళమీద నీకు అంత నమ్మకంలేదా?" అన్నాడు నవ్వుతూ.
"వాళ్ళ సంగతి ఎలా వున్నా నీమీద మాత్రం గొప్ప నమ్మకం కదా! తొందరపాటు కష్టాల్నే కాదు, నీకు నష్టాల్నీ తీసుకొస్తుంది అన్న సిద్దాంతాన్ని నమ్ముతావని."
"నేను తొందరపడ్డానని ఎలా నిశ్చయించుకున్నావు?"
"ఒక వ్యక్తిమీద చెయ్యి చేసుకోవడం తొందరపడటం కాదా?"
"ముందు నిదానంగానే చెప్పి చూశాను."
"వినలేదని కొట్టావు కదూ?"
"పూర్తిగా వినకుండా ఖండించటం, రెచ్చిపోవడం తప్పే! ఆ మాత్రం సహనం కూడా లేని వ్యక్తితో చర్చించుకోవడం యింకా పెద్ద తప్పు అని తెలుసుకున్నాను. అందుకే.....అలా...."
"ఎవరినయినా శారీరకంగా హింసించడం మానసికంగా బలహీనమయిన వాళ్ళు చేసే పని నువ్వు తొందరపడ్డావనే అనిపిస్తోంది."
"ఫరవాలేదు నా తొందరపాటు ఒక ప్రాణాన్ని కాపాడగలిగింది. నాకు అంతే చాలు. రెండు తినగానే వెంటనే డబ్బు అందజేశాడు. సరైన వైద్యసహాయం అంది పిల్లవాడు బ్రతికాడు. లేకపోతే యిచ్చేవాడా?"
"సర్లే! ఇప్ప్దుడేం చేస్తున్నావు మరి?"
"చూస్తున్నావుగా! ఇలా దొరికిన ప్రతి పనీ చేస్తున్నాను" అన్నాడు స్క్రూ డ్రయివర్ తో మిక్సీ ఓపెన్ చేస్తూ.
ధృతి అతన్నే గమనించసాగింది. ఇందాకట్నుంచి తనతో మాట్లాడుతూ కూడా అతను చకచకా తన పని తను చేసుకుంటూనే వున్నాడు. ఏకాగ్రత అనేది గొప్పవరం. అందరికీ రాదు.
"రఫీ ఆటో ఇప్పిస్తానన్నాడు. రేపు వెళ్ళి అడగాలి."
"ఒద్దు! నువ్వు ఇదివరకటి నవీన్ వి కాదు. ఇప్పుడు చాలా ఉద్రేకపరుడిలా మారావు. నీ ఈ స్వభావానికి ఆటో నడపడం సరిపడదు" అంది వెంటనే అడ్డుపడుతూ.
"నేను అన్నింటికీ వుద్రేకపడనూ, ఉద్రేకపడాల్సినచోట శాంతిసూత్రాలూ వల్లించనూ."
