Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 34


    ఆ రోజు ఆదివారం.....! ధృతి మొదటిసారిగా ఇంటికి వెళ్ళకుండా ఔట్ హౌస్ లో వుండిపోవడం.
    
    ధర్మానందరావుగారూ, ప్రేమ్ షటిల్ ఆడుతున్నారు. ఆమె తలుపు తీసుకుని రావటం చూసి ప్రేమ్ చాలా ఆనందంగా- "అంకుల్! ఎక్స్ క్యూజ్ మి" అంటూ ఆమెవైపు పరుగెత్తి, "ఏమిటీ ఇంటికి వెళ్ళలేదా?" అని అడిగాడు.
    
    "వెళ్ళాలనిపించలేదు" చాలా క్యాజువల్ గా అంటూ తల ఎత్తిన ఆమె - అక్కడ ధర్మానందరావుగారు నిలబడి తనకేసి అదోలా కళ్ళు చిన్నవిచేసి చూడ్డం గమనించగానే మాటలు రానట్లు ఆగిపోయింది.
    
    ఆయన చిన్నగా నవ్వాడు.
    
    "నేను నా వాళ్ళని విడిచి వుండలేను, ఒకవేళ నేనొప్పుకున్నా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు" అన్న అమ్మాయి ఈనాడు "ఇంటికి వెళ్ళాలనిపించడంలేదు" అంటుందంటే, ఇది ఆయన విజయంగా భావిస్తున్నారేమో అనిపించింది ఈ క్షణంలో ధృతికి.
    
    "మా కొలిగ్ లీలని ఇవాళ పిలిచాను..." అంది తనని తాను సమర్ధించుకుంటూ.
    
    "మంచిపని చేశావ్! ఐయామ్ హేపీ" అన్నాడు ప్రేమ్.
    
    లీల పదింటికల్లా వచ్చేసింది. ఆమెతోబాటే లోకంలో వున్న సంపదంతా వచ్చేసినట్లుగా అనిపించింది. ఒక్కక్షణం ఊపిరి పీల్చుకోడానికి కూడా ఆగకుండా కబుర్లు చెప్పసాగింది.
    
    ధృతి ఇంటి పరిస్థితులు అడిగి తెలుసుకుంది. తన గురించి పెద్దగా చెప్పలేదు కానీ లీల ఉద్యోగం చెయ్యడం ఆమె కుటుంబానికి ఎంతో అవసరం అని మాత్రం ధృతి తెలుసుకుంది. పెద్ద కుటుంబం! ఒక అక్కకి పెళ్ళయింది. ఇంకా లీలా, ఆమె తరువాత ఇద్దరు ఆడపిల్లలు, తమ్ముడూ, తమ్ముడు టెన్త్ తప్పి, ఏదో చేస్తున్నానంటాడట. కానీ ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదంట! ఇవన్నీ కూడా చాలా చమత్కారంగా, హాస్యంగా చెబుతున్న లీలని ఆశ్చర్యంగా చూసింది ఆమె.
    
    లీలతో మాట్లాడ్తూనే వంట పూర్తి చేసింది. ప్రేమ్ కూడా సమయానికి హాజరయ్యాడు. ఇద్దరూ ఒకేలాంటి మనస్తత్వాలున్నవాళ్ళు కావడం వలన ప్రేమ్, లీలా కబుర్లలో పడ్డానికి ఎక్కువ టైం పట్టలేదు. అతన్ని ఇక్కడే భోజనం చెయ్యమని అడగటం, అతను ఒప్పుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి.
    
    పెరట్లోంచి అరిటాకులు తీసుకొచ్చి అందరికీ వడ్డించింది ఆమె.
    
    చక్కెరపొంగలి చూసి "ఓహ్! ఇదంటే అంకుల్ కి ఎంతో ఇష్టం" అన్నాడు ప్రేమ్.
    
    "మీరు కానివ్వండి! నేనిప్పుడే వస్తాను" అంటూ డిష్ లో చక్కెర పొంగలి పెట్టుకుని ఆయన ఇంటివైపు నడిచింది ధృతి.
    
    ఆయనకీ జ్వరం వచ్చి తగ్గాక ఆ ఇంటివైపు మళ్ళీ వెళ్ళలేదు.
    
    సుబ్బరాజే తొంగిచూసి "మీరా! రండమ్మా!" అంటూ లోపలికి వెళ్ళిపోయాడు.
    
    ఆమెకి అతన్ని అనుసరించక తప్పలేదు.
    
    లోపల ఆయన భోజనం చేస్తున్నారు. ధృతిని చూడగానే "ఏదో తెచ్చినట్లున్నావ్" అన్నారు నవ్వుతూ.
    
    "చక్కెరపొంగలి! మీకిష్టమని ప్రేమ్ చెప్పాడు" అంది.
    
    ఆయన గబగబా ఓ స్పూన్ తో తీసుకుని నోట్లో వేసుకుని, కళ్ళు మూసుకుని, ఓ నిమిషం అలాగే వుండిపోయారు.
    
    ఆమె "వెళ్ళొస్తాను" అంటూ కదలబోతుండగా.....
    
    "చిన్నప్పుడు మా చెల్లి చేసేది ఇలాగే మళ్ళీ ఇన్నాళ్ళకి తింటున్నాను. అదే రుచి....." అన్నారు మంద్రంగా.
    
    ఆమె ఆయనవైపు చూసింది సంభ్రమంగా ఆయన మోహంలో నాటకీయంగానీ, అసహజత్వంకానీ మచ్చుకి కూడా కనిపించలేదు.
    
    "వస్తాను' అని వెనక్కితిరిగి వచ్చేస్తుంటే మనసంతా తేలికయినట్టూ, కాళ్ళు గాలిలో తేలిపోతున్నట్టూ అనుభూతి కలిగింది.
    
    లీల సాయంత్రందాకా వుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక మనసు గదిలో నిశ్శబ్దపు గోడలమీద ఆలోచనా నీడలు కదలాడసాగాయి. ఇంట్లోవాళ్ళు ఏమనుకున్నారో? తనకోసం బాగా ఎదురుచూసుంటారు తల్లి "నా మాటలవల్లే అది రాలేదు" అని బాధపడిందేమో? తండ్రి అన్నం తినకుండా కూర్చున్నారేమో! "నవీన్.... నవీన్ తనకోసం ఎదురుచూసి.... చూసి బహుశా రేపు ఫోన్ చేస్తాడేమో!"
    
    "లేదు అలా చెయ్యడు" అనుకుంది మళ్ళీ అతను యిలా చిన్న చిన్న చర్యల ద్వారా తన మనసుని బైటపెట్టడు. అసలు పెద్దగా పట్టించుకునే స్వభావం కాదు. ఈవారి కలిసినప్పుడు 'ఆదివారం ఎందుకు రాలేదూ?" అని అడగను కూడా అడగడు. చెప్తే వింటాడు అంతే!
    
    సాయంత్రం చెట్లకి నీళ్ళు పెట్టసాగింది ధృతి.
    
    ధర్మానందరావుగారి డ్రైవర్ దగ్గరికి వచ్చి, నమస్కారం పెట్టి "మా ఊరెళ్ళిపోతున్నానమ్మా!" అన్నాడు.
    
    "అదేమిటి! ఎందుకూ?" అడిగింది.
    
    "నా కొడుక్కి మంచి ఉద్యోగమయింది. ఇంకా ఏం కొలువు చేస్తావూ! వచ్చెయ్యమని ఒకటే గొడవ" అన్నాడు. అతని మోహంలో ఎంత ఆపుకోవాలన్నా, దాగని సంతోషం కన్పిస్తోంది. కొడుకు ప్రయోజకుడు అవడాన్ని మించిన సంతోషం ఏముంది కన్నతండ్రికి!
    
    "మంచిదేగా! అయ్యగారు ఏమన్నారూ?" అంది.
    
    అతను తలగోక్కుంటూ "ఆ.... ఏదో అన్నారులెండి. ఆ మారాజంతే, మాట మామిడి అల్లం" అన్నాడు.
    
    ఆమె కుతూహలంగా "ఏమన్నారూ?" అనడిగింది.
    
    అతను కొంచెం తటపటాయించి, నెమ్మదిగా - "ఈ కొడుకులనీ, కూతుళ్ళనీ నమ్ముకుని, వున్న ఉద్యోగం వదిలి వెళ్ళడం అంత మంచిది కాదు. బాగా ఆలోచించుకుని వెళ్ళు అన్నారు" అన్నాడు.
    
    ఆమె నవ్వుతూ "అలా అంటారని నేను ఊహించాన్లే నువ్వేం మనసులో పెట్టుకోకు. వెళ్ళిరా భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS