Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 36


    "అంతకంటే ఎవరి దగ్గరయినా డ్రయివర్ వుద్యోగం...." అంటూ ఏదో స్ఫురించినట్లు ఠక్కున ఆగిపోయింది.
    
    నవీన్ ఆమె ఆగిపోయేసరికి "ఊ..... చెప్పు...." అన్నాడు.
    
    "చెప్తే ఏమీ అనుకోకూడదు మరి" అంది చాలా సందేహిస్తున్నట్లు మొహం పెట్టి.
    
    అతను తన పనిలో మునిగిపోయి "అనుకోనులే....చెప్పు తొందరగా" అన్నాడు.
    
    "ధర్మానందరావుగారి డ్రయివర్ పని మానేశాడు. ఆయన దగ్గర ఆ పోస్ట్ ఖాళీగా వుంది. కానీ...."
    
    "కానీ నీకిష్టం లేదా?" అడిగాడు.
    
    ఆమె మాట్లాడలేకపోయింది.
    
    "ఒక డ్రయివర్ నీ ఫ్రెండని చెప్పుకోవడం నామోషీగా అనుకుంటున్నావా?" అడిగాడు ఆమె కళ్ళలోకి చూస్తూ.
    
    "అదికాదు - ఆయన దగ్గర కాస్త కష్టమే."
    
    "చూద్దాం! నువ్వేమీ సిఫార్సు చేయనక్కర్లేదు. నేనే రేపు వెళ్ళి ప్రయత్నిస్తాను."
    
    "విష్ యూ బెస్టాఫ్ లక్."
    
    "థాంక్యూ!"
    
                                                                  * * *
    
    ధృతి అంత టెన్షన్ ఎప్పుడూ అనుభవించలేదు. నవీన్ లోపలికి వెళ్ళి పది నిమిషాలయింది. వెళ్ళేటప్పుడు తన ముందునుంచే వెళ్ళాడు కానీ పలకరించలేదు. పేపర్ లో ప్రకటన చూసి కాబోలు ముగ్గురు నలుగురు ఇంటర్వ్యూకి వచ్చి వెళ్ళారు.
    
    లీల వచ్చి ఏదో చెప్పింది. ధృతి మనసు అక్కడ లేదు. ఏదో ఆలోచిస్తోందని తెలుసుకుని వెళ్ళిపోయింది.
    
    నవీన్ గదిలోంచి బయటికి వచ్చాడు. అర సెకనుపాటు ఆమెవైపు చూసి చిన్న నవ్వు నవ్వి తల వంచుకుని వెళ్ళిపోయాడు.
    
    ఆ నిమిషం నుండీ అతను ఫోన్ చేసి ఇంటర్వ్యూ వివరాలు చెప్తాడేమోనని ఎదురుచూస్తూనే గడిపింది. కానీ అలాంటిదేమీ రాలేదు.
    
    సాయంత్రం సన్నజాజి పందిరి క్రింద నిలబడి మొగ్గలు కోస్తూ కూడా ఆ విషయమే ఆలోచించసాగింది.
    
    "ధృతీ!" అని ప్రేమ్ పిలిచాడు.
    
    ఆమె అటు చూసేసరికి అతనూ, ధర్మానందరావుగారూ కలిసి లాన్ లో కూర్చుని ఛెస్ ఆడుతూ కనిపించారు. వారి దగ్గరికి నడిచి "గుడ్ ఈవినింగ్" అని విష్ చేసింది.
    
    "కూర్చో!" అన్నారాయన తల పంకించి.
    
    ఆమె వారి ఆటనే శ్రద్దగా గమనించసాగింది.
    
    "ఏ రోజు గెలుపు నాదే అంకుల్" ముందుకి వంగి హుషారుగా చెప్పాడతను.
    
    ఆయన వెనక్కివాలి చిరునవ్వు నవ్వారు.
    
    తన బంటు జరుపుతూ "డ్రయివర్ కుదిరాదా?" అడిగాడు ప్రేమ్.
    
    ధృతి వూపిరి బిగబట్టి ఎదురుచూడసాగింది ఏం చెప్తారోనని.
    
    "ఇంటర్వ్యూకి ముగ్గురు నలుగురు వచ్చి వెళ్ళారు. నాకు మాత్రం ఒకతను బాగా నచ్చాడు" అన్నారు.
    
    ఆమె ఆతృతగా ఎదురుచూడసాగింది తర్వాత ఆయన చెప్పబోయే వివరాలకోసం.
    
    "చెక్!" అన్నాడు ప్రేమ్.
    
    ఆయన కనుబొమలు ముడిచి ముందుకి వంగారు తన రాజుని తప్పించడం కోసం.
    
    ఆమెకి ఆ నిమిషంలో ప్రేమ్ మీద పీకలదాకా కోపమొచ్చింది.
    
    ఆయన ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా దృష్టి ఆటమీదే కేంద్రీకరించి ఆడసాగారు.
    
    ఆయన చెప్తూ ఆపేసిన విషయాన్ని పొడిగించేంత చనువు లేదు ధృతికి. అందుకే ఓరిమిగ ఎదురుచూసింది కాసేపు. ఆయన ఆ విషయమే మరిచిపోయినట్లు కనిపించారు.
    
    ప్రేమ్ కూడా పెద్దగా శ్రద్ద పెట్టలేదు దాని గురించి.
    
    "నీ ఆటకట్టు ఇంక" అన్నారు ప్రేమ్ తో.
    
    "అంకుల్!" అన్నాడతను చిన్నపిల్లాడిలా గునుస్తూ.
    
    "సుబ్బరాజు! ఇది తీసెయ్" అన్నారు.
    
    ధృతి లేచి నిలబడి "వెళ్ళొస్తాను సర్!" అని వెనక్కి తిరిగేసరికే "ఇంతకు ముందు చేసిన ఉద్యోగం ఎందుకు మానేశావ్? అనడిగితే అతను ఏం చెప్పాడో తెలుసా?" అన్నారు.
    
    "ఎందుకు మానేశాడటా?" ప్రేమ్ అడిగాడు.
    
    "నేను మానేయలేదు. ఒకర్ని కొట్టాను. అతనే తీసేశాడు" అని తడబడకుండా చెప్పాడు" అని ఓ నిమిషం ఆగి చిన్నగా నవ్వి చెప్పారు.
    
    "ఆ మాటలు చెప్పేటప్పుడు అతని కంఠంలో ధ్వనించైనా నిజాయితీ నిర్భయత్వం, ఎన్ను తప్పు చేయలేదన్న ఆత్మవిశ్వాసం నాకు నచ్చాయి."
    
    "ఎందుకు కొట్టాడు?"
    
    "ఏమో! అది నాకనవసరం అనిపించింది. అతను నిజానికి ఏ కారణం చెప్పినా ఫరవాలేదు. అటువంటిది నిజాయితీగా నిజం చెప్పాడు. అందుకనీ.....
    
    "కొంపదీసి అతనికి ఉద్యోగం ఖాయం చేశారా?" ప్రేమ్ కాస్త భయంగా అడిగాడు.
    
    ఆయన పెద్దగా నవ్వేస్తూ "మధ్యన నీకెందుకయ్యా భయం? కావలిస్తే నువ్వు అతన్ని డ్రైవ్ చేయమని అడగకు. నీకెటూ డ్రైవింగంటే యిష్టమేగా?"
    
    ధృతి చిన్నగా నవ్వుకుంటూ తన వాటావైపు నడిచింది.
    
    ప్రేమ్ మరుసటిరోజు ప్రొద్దుటే వికారాబాద్ వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఆమెకి చెప్పే వెళ్ళాడు. "నేను లేనప్పుడు నువ్వు ఎలా గడుపుతావో" అన్నట్లు మాట్లాడాడు. ఆమెకి నవ్వొచ్చింది. ఒకరు అతి వృష్టి..... మరొకరు అనావృష్టీనూ.
    
    పది గంటలకల్లా ధర్మానందరావుగారి కారు గ్యారేజిలోంచి బయటి కొచ్చింది. నవీన్ దిగి డోర్ తెరుస్తూ ఔట్ హౌస్ వైపు చూశాడు.
    
    ధృతి వెంటనే చిరునవ్వు నవ్వింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS