Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 34

  

       రాజమ్మ పిన్ని నిజంగానే వెళ్ళిపోగలదు - నాన్న ఒక్కడూ ఇక్కడ వుండిపోతే - ఎలాగా - ఈ సమస్య పరిష్కరించేదెవరు - ఎంతో స్నేహంగా వుండే లలితని పరిస్థితులు తనకి దూరం చేశాయి. - నిజంగా తనకి మంచి ఫ్రెండే కరువైపోయిందే...మొదటి సారిగా శారద కళ్ళలోకి నీళ్ళొచ్చాయి. - ఈ అవకాశం పోగొట్టుకుంటే తనకి తిరిగిరాదు. ఈ సమస్యని ఎలా తట్టుకుంటుందీ - శారద తలుపేసుకునిలోపల పడుకుంది ఏమన్నాకానీ - ఏం జరగాలనుంటే అది జరుగుతుంది!
   
    "పదవమ్మా - నేనూ వస్తాను - ఈ నాలుగు బట్టలూ అందులో పడేయ్ నేనెవరికీ అక్కర్లేదు. పిల్లలు లేని వాళ్ళు లేరని ఏడుస్తారు - ఉన్నవాళ్ళ ఖర్మయిది - ఏనాటి శత్రువో నాకడుపున ఇలా పుట్టింది. నేను మన ఊరికి దగ్గర వృద్దాశ్రమంలో చేరిపోతా. నాలుగు డబ్బులు పడేస్తే నాకెవరయినా తిండి పెడతారు. టిక్కెట్టు డబ్బులుపోనీ, మళ్ళీ ఇంకో రెండు టిక్కెట్లుకొనుక్కుందాం..రాజారావు, రాజమ్మ ప్రయాణ మయ్యారు అక్కడ ఒక్కనిముషం ఉండబుద్దిపుట్టలేదు వాళ్ళకి.
   
    తలుపేసుకో - లోపల శారద విందో లేదో కానీ, తలుపు దగ్గరా వేసి వెళ్ళిపోయారు రాజమ్మ పిన్ని రాజారావు.
   
    నిద్రపోతున్న శారదకి ఒక్కసారిగా మెలకువవచ్చింది. ఇల్లంతా చీకటి - ఇల్లంతా నిశ్శబ్దం - గబుక్కునలేచి లైటు వేసింది - నాన్న గదిలో లేడు రాజమ్మా లేదు, వాళ్ళ సామనులూ లేవు - తనకోసం చేసి తెచ్చిన జంతికలపొట్లం, గూట్లో కనిపించింది శారదకి.
   
    తనెంత స్వార్ధ పరురాలో - కన్నతండ్రిని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టేసిందికదా! దేనికోపం ఈ ఆరాటమంతా - బొంబాయి ప్రయాణం కోసమే - అవునుమరి నాన్న ఒరిగిపోయే వృక్షం - తను పెరగాల్సిన వృక్షం - అన్నీ మనమంచికేలే !- ఒక్క నిముషం మనసుకొంత కదిలినా మరునిముషం సద్దుకుంది శారద! - తన వస్తువులు, నగలు, చీరలు ఒకటోకటీ తీసి విడిగా పెట్టుకోటం మొదలుపెట్టింది.
   
                                       *    *    *
   
                                            14

   
    అనుకున్నటైముకి రామనాధం ఆఫీసుకొచ్చాడు రామం. రామాన్ని చూసి చాలా సంతోషించాడు రామనాథం -
   
    'కూచో - వచ్చేస్తాడు' అన్నాడు 'అమ్మాయిని కూడా తీసుకురమ్మంటాను'
   
    'ఒద్దండీ. ఇప్పుడే వద్దు - ఫోటో చూస్తే ముందు కొంత అభిప్రాయం ఏర్పడుతుంది. తరువాత చూస్తాను' నెమ్మదిగా అన్నాడు రామం లోపలనుంచి ఫలహారం, కాఫీ అందాయి రామానికి.   
   
    శంకర్ కి ఫోను చేశాడు రామనాథం - శంకర్ దగ్గర పిల్లఫోటో జాతకం వున్నాయి. రెండు రోజులక్రితమే తీసుకున్నాడువాటిని.
   
    రామం అనుకున్నాడు మనసులో ఫోటో తనకి నచ్చితే, అమ్మని పిలిపించి సంబంధంకుదుర్చేసుకోవాలి - ఎందుకంటే, లలిత తనపైన అనవసరమైన ఆశలు పెంచుకుంటుందనే భయం కలిగింది. నిన్నహోటల్లో కూర్చుని మాట్లాడుతుంటే - గాయత్రి తనని చేసుకుంటుందో చేసుకోదో తనకి తెలియదు - ఇవన్నీ ఆలోచిస్తే ఈ సంబంధం కుదిరితే మంచిదే రామం అటు ఇటు చూస్తున్నాడు - ఇంకా రాడేమిటి ఆ శంకర్ ఎవరో.
   
    'ఇతనే రామం. నే చెప్పిన అబ్బాయి' అన్నాడు 'బాబూ నాకు జాతకాలలో నమ్మకం లేదయ్యా. వయసు ఎక్కువ తక్కువలతో పనిలేదు - నిజం చెప్పాలంటే నాకు గోత్రంతో కూడా పనిలేదు - ఒకరికొకరు నచ్చాలి - ఆ తర్వాత జీవితం ఎలా మలుచుకోవాలో ఇద్దరూ అనుకోవాలి అంతే - ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే దైవర్సీ అనే మాట ఒకటి మన సమాజంలో వుంది చూడు - తప్పెవరిదన్నాకానీ - ఆసరే, ఇవన్నీ అనవసరమైన విషయాలు - నీకు అన్నదమ్ములు ఎవరైనా"
   
    'లేరండి - నేనొక్కన్నే - మా అమ్మగారున్నారు" -
   
    "ఆవిన్నీ తీసుకురాలేదుమరి"
   
    "ఇక్కడుండరండి" రామనికి చిరాగ్గా వుంది ఈ ప్రశ్నలకి జవాబు చెప్పటం.
   
    "ఊళ్ళో పిల్ల వుండగా పిల్లని చూడక ఫోటో ఏమిటయ్యా" రామం నవ్వి ఊరుకున్నాడు. ఫోటో జేబులోంచి తీయడేం - 'ఫోటోలో కన్నవిడిగా బాగుంటుంది. ఇదిగో' ఫోటో చేతికిచ్చాడు. అందరూ చూస్తుండగా ఫోటో చూడ్డానికి మొహమాటపడ్డాడు రామం.
   
    'ఏమీ తొందరలేదు - జేబులోపెట్టుకో - ఆలోచించుకుని నెమ్మదిగా చెప్పునీ అభిప్రాయం 'రామనాథం రామంతో, అనగానే, రామం ఫోటో జేబులోపెట్టుకున్నాడు.
       
    'వస్తానండి' లేచాడు రామం.
   
    'అయితే ఎల్లుండి కేసు అయిపోతుంది - వదిలించేద్దాం' అన్నాడు రామనాథం రామం నవ్వి వెళ్ళిపోయాడు.
   
    ఇంటికెళ్ళగానే ఫోటో తీసిచూసి ఆశ్చర్యపోయాడు - ఏమిటిది ఈ ఫోటో, ఫోటో - అదేమిటి - మనిషిని పోలిన మనుషులుంటారా - మళ్ళీ మళ్ళీ చూసాడు ఆ ఫోటో - పేరు భ్రమరాంబ అని చెప్పాడు. మరి - రామనికి ఇది తమాషాగా అనిపించింది - ఈ విషయం లలితకి తెలుసా. తెలియదా - తెలియకపోవచ్చుకూడా - కొంత దూరం జరిగాక చెప్పచ్చు ననుకొన్నాడేమో రాజారావు! - ఫోటోను జాగ్రత్తగా కవర్లో పెట్టి దాచేశాడు రామం. ఆ ఫోటో మనసుని ఏ విధంగానూ కలవరపరచలేదు.
   
    రామం మనసు గాయత్రి చుట్టు పరిభ్రమిస్తోంది. ఈ విషయం ఎలా బయటపెట్టాలో - తల్లి ద్వారా కదిలించటం కుదరదు - వితంతువును, అదీ ఒక పిల్లాడి తల్లిని చేసుకుంటానంటే అంగీకరించటం కష్టం. తల్లి ఏమీ అనక ఊరుకున్నా అంగీకరించి మాత్రంకాదు, తనపై ప్రేమతో మాత్రమే. ఆ విషయం స్పష్టంగా తెలుసురామానికి. మరెవరున్నారూ - ఎవరుండాలీ - తనే వున్నాడు, గాయత్రికి ఉత్తరం రాస్తే - ఏమనుకుంటుందో, - అయినా తనకి అడ్డదోవలెందుకూ - కృష్ణమూర్తి మాష్టారికే ఉత్తరం రాయాలని నిశ్చయించుకున్నాడు రామం.
   
    అతి జాగ్రత్తగా, ఎంతో బాధ్యతగా, మాటలు తూచితూచి రాసాడు ఉత్తరం!
   
    సమాధానం కోసం రోజూ ఎదురు చూడటం ప్రారంభించాడు. రామనాథం ఆఫీసులో అడుగుపెట్టగానే గుర్తొచ్చింది ఫోటో గురించి అడిగితే ఏం చెప్పాలీ అని. రామనాథం కోర్టుకెళ్ళే హడావిడిలో ఈ విషయం పట్టించుకోలేదు. కోర్టు వ్యవహారం అనుకున్న ప్రకారం జరిగిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS