"ఏమైనా చెయ్యి! ప్రతిమ అపార్ధం చేసుకోకుండా మాత్రం చూడు!"
"ఒక అనాధను ఆదుకొన్నంత మాత్రాన అపార్ధం చేసుకొంటే, ఇక ఆ మనిషి ఏం మనిషి అనుకోవాలి?" అరుణ్ విసుగ్గా బయటికి వచ్చాడు.
సంధ్య, అరుణ్ కారులో బయల్దేరారు.
కారు వెడుతున్న దారిలో ఏ ఏ వీధులున్నాయో చెబుతున్నాడు అరుణ్, సంధ్యకు. ఎత్తుగా కనిపిస్తున్న బంగళాలు.... ఇది ఉస్మానియా హాస్పటల్ అని, ఇది హైకోర్టు అని..... అన్నీ వివరించి చెబుతున్నాడు. చివరికి అబిడ్స్ లో కారు ఆపి దిగాడు.
ముందు బట్టల షాపులోకి దారి తీశాడు.
అతడు ఖరీదైన చీరలు తీయిస్తూంటే, "అరుణ్! అంతంత ఖరీదువి వద్దు! మా అమ్మా నాన్నా బ్రతికి ఉన్నప్పుడు కూడా నేను కట్టలేదు! ఇప్పుడు థర్మానికి కట్టాలంటే నా మనస్సొప్పడంలేదు!" అంది సంధ్య.
"ఇది ధర్మమా?" అరుణ్ తెల్లబోయాడు. "సంధ్యా! నీకు నేను ఏం చేస్తున్నా ఏం చేసినా చిన్ననాటి స్నేహితురాలివన్న ఆత్మీయతతో చేస్తున్నాను తప్ప మరో విధంగా నువ్వు చూడకు!" సంధ్య అభ్యంతరాలకు సంకెళ్ళు వేస్తున్నట్టుగా అన్నాడు.
ఆ తరువాత అతడు తనకోసం ఏం తీసుకొంటున్నా ఏమనలేకపోయింది సంధ్య. కాని, నగలషాపుకు వెళ్ళి తనకోసం బంగారు చెయిన్ ఖరీదు చేస్తుంటే మాత్రం ఊరుకోలేకపోయింది! "ఇంత ఖరీదు చేసే వస్తువు నా కోసం ఎందుకు కొంటావు? అది లేకపోతే ఇప్పుడైమైంది?" అంది కొంచెం గాబరాతో!
"ఒక ఆడపిల్ల బోసిమెడతో నా ఇంట్లో తిరుగుతూంటే చూడలేను! ఇక ఖరీదు సంగతంటావా, ఇది నా ఒక రోజు సంపాదనని మించదు. నా చిన్ననాటి స్నేహితురాలికి ఈపాటి బహుమతి ఇవ్వకూడదా? భగవంతుడి దయవలన నేనిప్పుడు మంచిస్థితిలోనే ఉన్నాను!"
"నువ్వు నీ స్థితిని బట్టి ఇస్తావు! అందుకొనేందుకు నా తాహతు చూచుకోవద్దా?"
"స్నేహితుల మధ్య తాహతు ప్రసక్తి దేనికి?"
ఆ తరువాత చాలానే కొన్నాడు అరుణ్. టాయ్ లెట్ సామాను, హాండ్ బాగ్, తన బట్టలు పెట్టుకోడానికి సూట్ కేస్ మొదలైనవి.
ఇంటికి వస్తూనే ప్రతిమ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పిందని చెప్పింది జానకమ్మ. సంధ్యకోసం అరుణ్ కొన్న వస్తువులన్నీచూసి ఆమె కనుబొమలు ముడిపడ్డాయి.
సంధ్యకు ఒకగది కేటాయించి, ఆమె సామానంతా అందులో ఉంచాడు.
* * *
"సంధ్యా! నీ భవిష్యత్ కార్యక్రమానికి ప్లాన్ వేద్దాం! నువ్వు ఎంతవరకు చదువుకొన్నావు?"
"సెవెంత్ పాసయ్యాను!"
"టెంత్ ప్రెవేట్ గా పరీక్ష వ్రాస్తావా, ట్యూషన్ పెడతాను!"
"వచ్చిందంతా మరిచిపోయాను!"
"మర్చిపోతే గుర్తు చేసుకోవడం ఎంతసేపు? చదువు, పెళ్ళి- ఈ రెండే మనముందున్నవి! ఈ రెంటిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేయాలి, చదువుకొంటానంటే ట్యూషన్ పెడతాను! చదువొద్దంటే, నీ పెళ్ళికి పెద్దనౌతాను! సంబంధాల వేట ప్రారంభిస్తాను!"
"చదివి నేను పరీక్షలు పాసయ్యేసరికి ముసలిదాన్ని అయిపోతాను గాని కటింగ్ నేర్చుకొంటాను. అరుణ్, నాకెన్నాళ్ళనుండో కటింగ్ నేర్చుకోవాలని ఉంది. అరుణ్! కుట్లు అల్లికలంటే నాకెంతో ఇష్టం!"
"సరే! సాయంకానికల్లా కుట్టుమిషన్, టైలర్ వచ్చే ఏర్పాటు చేస్తాను!"
జానకమ్మకి ఆ సంగతి తెలిసి మంటగా అనుకొంది. 'వీడి దర్జా కాలిపోనూ! ఇంటికే టైలర్ ని రప్పిస్తాడట. దాన్ని సెంటర్ కి పంపిస్తే నేర్చుకోదేమిటి?'
* * *
రవీంద్ర భారతిలో వరదబాధితుల సహాయార్ధం ప్రఖ్యాత సినీతార నృత్యప్రదర్శనం జరుగుతూంది. అరుణ్ టికెట్లు తీసుకొన్నాడు.
