ఆ సాయంకాలం అక్కడే మీటింగు. ఇసకవేస్తే రాలకుండా జనం మీటింగుకు వచ్చారు. కొండా వెంకటప్పయ్యా, ఇంకా ఎవరెవరో మాట్లాడారు. కని ఎవరు మాట్లాడినా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మాట్లాడినట్టు లేదు. ఆయన మాట్లాడుతుంటే వినేవాళ్ళు పరవశమై పోయినారు.
"....అయితే ఇంగ్లండంటే ఏమిటనుకున్నారు. మన మద్రాసు రాజధానంత కూడాలేదు. మనమంతా వెళ్ళి ఉచ్చపోస్తే మునిగిపోతుందన్నమాట. నే చూసే వచ్చాలే!"
పిల్లలంతా గొల్లున నవ్వటం, నిజంగానే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఇంగ్లండులో చాలాకాలం వుండివచ్చాట్ట. అటువంటివాడే బ్రిటీషువాళ్ళ పరిపాలన దగాఅని చెబుతున్నాడు. ఇంత గొప్పవాళ్ళు జాతీయోధ్యమంలోకి వస్తున్నారంటే ఇంకేం కావాలి?
సుందరానికి ఉపన్యాసాలన్నీ అర్ధంకాకపోయినా వాటిని ఎంతో భక్తితో విన్నాడు. ఇంత వైభవంగా ప్రారంభమైన ఈ స్కూల్లో చేరకుండా ఇంగ్లీషువాళ్ళకు ఎదురుతిరగలేని ఆ పాత స్కూల్లో చదవటం ఘోరమైనతప్పు, పిరికితనం, గాంధీకీ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకూ, కొండా వెంకటప్పయ్యకూ మిగిలిన వాళ్ళకూ కూడా ఎంతో అన్యాయం!
"ఏంరా, పీయెన్నార్? మనంకూడా రేపటినుంచీ ఈ జాతీయ విద్యాలయంలో చేరదాం?" అన్నాడు సుందరం.
నాగేశ్వార్రావు ఆటే ఉత్సాహం కనబరచలేదు.
"ఈ క్రొత్తబడి నాలుగు కాలాలపాటు నడిస్తే అప్పుడు చూడొచ్చు లెమ్మన్నాడ్రా మానాన్న," అన్నాడు వాడు.
అదికూడా బాగానే ఉందనుకున్నాడు సుందరం. ఒక ఒకవేళ ఈ బడి సాగదేమో అనే ఆలోచన వాడికి రానేలేదు. ఈ బడి ఎట్లాగూ సాగుతుంది. అటువంటప్పుడు ఎప్పుడు చేరితే నేం? ఈ విధంగా వాడు తన అంతరాత్మను సమాధాన పరుచుకున్నాడు.
కాని నాగేశ్వర్రావు అన్న శ్రీరామ్మూర్తి మాత్రం తండ్రి సలహా వినిపించుకోకుండా బడి మానేశాడు. లేకపోతే అతను ఆయేడు స్కూలు ఫైనలు ఫాసై ఉండవలసింది.
పికెటింగు హడవుడి తగ్గి మళ్ళీ స్కూలు యధాప్రకారం నడవటం ఆరంభించేసరికి సుందరం క్లాసులోవాళ్ళు ముగ్గురు నలుగురు చదువు చాలించినట్లు తెలిసింది. అందులో ఒకడు సుందరానికి కనబడి, తాను ఇకముందు తమ స్వగ్రామం వెళ్ళి సంస్కృతం చదవ బోతున్నానని చెప్పాడు. వాడికేం? వాడికి బోలెడంత ఆస్తిఉంది. చదువుకున్నా వాడు ఉద్యోగం చెయ్యడు.
రోజులు గడుస్తున్నాయి. దాదాపు రోజూ ఊళ్ళో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఉపన్యాసాలిస్తూనే ఉన్నాడు. సుందరం వాటికోసం పోతూనే ఉన్నాడు. ఏదో సరదాకబుర్లు చెబుతాడు గోపాలకృష్ణయ్య. "... అబ్బాయిలూ, శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడికి భగవద్గీత చెప్పినట్టు నేనూ చెబుదును, కాని ఇప్పుడు టైములేదు. అందుచేత నేను మీకు చెప్పేదల్లా ఏమంటే... ఇదిపాత ఉద్యమాలల్లే ఆగేదికాదు. ఈసారి స్వరాజ్యం తెచ్చామన్నమాటే... మీరు ఈ దేశద్రోహకరమైన చదువు మానేసి నిజమైన జాతీయవిద్య నేర్చుకోండి...."
కొంతకాలం గడిచింది.
ఒకనాటి సాయంకాలం సుందరం, నాగేశ్వరరావూ జాతీయ విద్యాలయం మీదుగా పెద్దబజారు పోతూ లోపలికి వెళ్ళారు. సుందరానికి పెద్ద ఆశాభంగమయింది. పందిరి లేదు, జనంలేరు, పెళ్ళిళ్ళు కళలేదు. అది నిజంగా జాతీయ విద్యాలయం తప్పుకాదు. అయినా సుందరానికి కదేదో లోపంగా కనిపించింది. విద్యాలయంలో ఏడెనిమిదిమంది విద్యార్దులు మాత్రమే కనిపించారు. ఇద్దరు ముగ్గురు రాట్నాలమీద నూలు తీస్తున్నారు. ఒకడు ఏకులుచేస్తున్నాడు. ఇంకొకడు నవారు నేస్తున్నాడు. మిగిలినవాళ్ళు తాటాకుచాపలమీద గోడకు చేరగిలబడి కూర్చున్నారు. ఒక్కమేష్టరూ కనిపించలేదు. హోస్కూలునుంచి వచ్చి చేరిన ఇద్దరు మేష్టర్లలోనూ ఒకాయనమాత్రమే ఇంకా పనిచేస్తున్నాడనీ, రెండోఆయనా, పైనుంచి వచ్చిన మరి ఇద్దరు మేష్టర్లు సరిగా రావటంలేదనీ, జాతీయ విద్యాలయానికి డబ్బులేదనీ తెలిసింది.
౧౩
శేషగిరి మావయ్య వచ్చాడు. ఆయన వేషమంతా మారిపోయింది. మామూలుగా ఉండే ఉద్యోగి అవతారమే లేదు. ముతక ఖద్దరుబట్టలు వేసుకున్నాడు.
"ఉద్యగం మానేశానమ్మా!" అన్నాడు శేషగిరి సీతమ్మగారితో.
"అయ్యో అదేమిట్రా?" అన్నదావిడ.
"ఆ. ఎవరు చేస్తారు బాడఖోపని? దేశంకన్నానా? అందుట్లోనూ గవర్నమెంటు ఉద్యోగం!"
"అందరూ చెయ్యటంలా? కాకపోయినా స్వరాజ్యం అయిపోయిందిటగా ?" అన్నది సీతమ్మగారు.
శేషగిరి పెద్దగా నవ్వి. "స్వరాజ్యం అయిపోవటమేమిటి? అది వచ్చేదాకా ఈ కొరివి చల్లారుతుందా? రావణాసురుడి కాష్టంకాదూ? అదేమో నిమిషాలమీద వచ్చేదనుకున్నవాళ్ళు జావకారిపోయారు. గాని ఈ ఉద్యమం అయిపోవటమంటూ ఉండదు. ఇక ముందు దేశాన్ని ఎట్లా నడిపిస్తాడో ఆ మహాత్ముడి మీద ఆధారపడిఉంది. మనం అయన చెప్పినట్టు చెయ్యవలసిందే" అన్నాడు.
"ఏముందీ చెయ్యటానికీ?"
"ఏం లేకేం? ఇంటింటా రాటం తిరగాలి. ఊరూరా జాతీయ విద్యాలయం నడవాలి. అస్పృశ్యత పోవాలి. జనమంతా ఏకం కావాలి. నలభై కోట్ల గొంతులూ 'వందేమాతరం! మండేరాజ్యం!" అని అరిస్తే స్వరాజ్యం వస్తుందా, దానితల్లో జేజెకూడా వస్తుందా!" అన్నాడు శేషగిరి.
