"యస్ సర్...అయాం అమితేష్..." అన్నాడు అక్కడున్న ఆఫీసర్ తో.
"థాంక్యూ...యువర్స్ కాల్" ఫోనందించాడాయన.
"మిస్టర్ అ....మి...తే....ష్ ష్ ష్!!! అనవసరంగా నువ్వు రిస్క్ తీసుకొని సారథ ని ఫాలో అయి ప్రయోజనం లేదు..."
ఎక్కడో దూరపు కొండల మీద నిల్చుంటే....లోపల అడవుల్లో ఓ నైటింగేల్ కూస్తున్నంతటి చల్లటి, తియ్యటి కంఠం మృదువుగా చెప్పింది.
"బాస్టర్డ్ నువ్వెవరు__?" అరిచినంత పనిచేశాడు అమితేష్.
ఆఫీసర్ అవాక్కయి చూస్తున్నాడు.
"తెలీదా....హహహ....మ...వు...ని...క...ను"
అవతలి లైను కట్టయింది. అతడు హర్ట్ అయి కోపంగా క్రెడిల్ నుంచాడు. ఈడియట్ అని తిట్టి వేగంగా బయటికి పరిగెత్తుకొచ్చాడు.
అప్పటికే కొందరు బిజినెస్ మాగ్నెట్స్ శరత్ ని పూలదండలతో ముంచెత్తుతూ రిసీవ్ చేసుకుంటున్నారు. అమితేష్ దూరంనుంచి చూస్తూ నిలుచున్నాడు.
8
నిఖిల్ నడుస్తున్నాడు ఒంటరిగానే...అప్పటికి చీకట్లుపడి రెండు గంటలయ్యిందేమో! టాంక్ బండ్ మీద విద్యుత్ వెలుగులు పర్చుకున్నాయి. అక్కడక్కడా తెలుగు కళామూర్తులు వైభవంగా నిల్చున్నారు. ధీరులు, వీరులు, కవులు, శాంతికాముకులు, వీరనారీమణులు, చరిత్ర విలసిల్లిన మహనీయుల టేబుల్ సమావేశంలా నిల్చున్న విగ్రహాలు...బురదలో తామర నిల్చున్నట్టు, ఆత్మాహుతుల అండగా, పాపాల కుండలిగా ప్రసిద్దినొందిన హుసేన్ సాగర్ హృదయం మీద శాంతి జైత్ర యాత్రికుడు ఆ అందమైన బుద్దుని విగ్రహాన్ని చూస్తూనే నడుస్తున్నాడు నిఖిల్. నగరం గుండెల మీద మెరుస్తున్న, ఖరీదయిన నెక్లెస్ రాయిలా తళుక్కుమంటోంది__దూరంగా బిర్లామందిర్. స్కూటర్ని పార్కింగ్ లో పెట్టి వచ్చి మెరుస్తున్న నీళ్ళ అందాలలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు. అతడి ఆలోచనలన్నీ నిర్లిప్త గురించే__
సుగాత్రి వాళ్ళకు బాబు పుడితే నిర్లిప్త మరింత కృశించిపోవటం ఖాయం. నిఖిల్ కు గుర్తొచ్చింది. అసలు లోపం తనలోనే వుందని కాలేజీ రోజుల్లో సైకిల్ మోటార్ల మీద పిక్ నిక్ లు వెళ్ళినపుడు స్పీడ్ లో అదుపు తప్పి బోల్తాపడిపోయింది. ఎక్కడో దూరంగా ఎగిరిపడి తను!! డాక్టర్లు పరీక్షించి రతి సుఖం వున్నా ముందు ముందు పిల్లలు కలిగే అవకాశాలు లేవని తేల్చారు. అప్పుడు ఆ వయసులో ఆ విషయం తేలికగా తీసుకున్నా ఇప్పుడది ఎంతటి నరకమైపోయింది...? తమలాంటి దురదృష్టవంతులు ఇంకెంత మందో ఈ దేశంలో!!
ఈ విషయాన్నే నిర్లిప్త దగ్గర దాస్తున్నాడు. కానీ మరో నిజం అతనికి తెలియదు. ఆమె కూడా తనలాంటి లోపాన్ని....అంతకంటే భయంకరంగా తనకు జరిగినా అన్యాయాన్ని దాచిపెట్టుకుంటుందని__ఎవరికీ వారే తమ లోపాన్ని కప్పిపుచ్చుకుంటున్నారని.
అతడు ఆలోచిస్తున్నాడు__
ఎవరైనా అనాధను దత్తత తీసుకుంటే బావుంటుందని__కానీ నిర్లిప్త ఏనాడో కొట్టిపారేసింది. అతని మనసు కూడా ఎందుకో అంగీకరించటం లేదు. ఆమె ఒప్పుకోలేదు. ప్రేగు తెంచుకున్న ప్రేమ....దత్తత తీసుకున్న బిడ్డమీద వుండదని-లోకం నింద నుంచి తప్పించుకోవడం తప్ప....మాతృత్వం పంచలేమని? పంచుకున్న రక్తం అనాధ బిడ్డలో కనిపించదని. తరచి చూస్తే ఆమె మాటల్లో కొంత వాస్తవం వుండొచ్చు...ఎవరో కామంతో కనిపారేసిన బిడ్డలు మనకు వద్దంది. ఆప్యాయత పెంచుకోక__కడుపుని పెంచుకొని అబార్షన్ లతో తీసిన మాంసపు ముద్దల మీద మనం కూడా మమకారం పెంచుకోలేకపోతాం అంది.
మరెందుకీ అడాప్షన్??
లోకం నిందనుంచి బయటపడటానికి!!
ఆస్తి వారసత్వాన్ని అంటగట్టడానికి__ఏమో ఎవరు చెప్పగలరు? మొత్తానికి తమకో బిడ్డ వుంటే బాగుండేది. తను ఒక్కసారి కదిపి చూస్తే ఎంతకూ ఒప్పుకోలేదు ఆమె ఏడాది క్రితమే! ఆనాటి నుంచీ నేటి వరకూ ఆ విషయమే ఎత్తలేదు తను మళ్ళీ!!
ఎత్తి నిర్లిప్త మనసును గాయపరచటం ఇష్టం లేక.
ఆప్యాయత, అనురాగం నిండిన ప్రేమలతో ఇద్దరం ఇలాగే చచ్చిపోదాం గానీ చెత్తకుప్పల మీద బిడ్డలు మనకు వద్దని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పినప్పటి నుండి అడాప్షన్ గురించి ఆలోచనే తనకు రాలేదు.
కానీ ఈ సమస్యకు పరిష్క్రుతి ఎలా??
ఎలా??
ఎలా??
ఎలా??
శరత్ తీసుకున్న నిర్ణయమేమిటి? దత్తత తీసుకోకుండా సుగాత్రి కడుపునా పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా! డబ్బున్న వాళ్ళు...డి అండ్ సి లాంటి పద్దతి లాంటిదేమయినా అవలంబిస్తారేమో? తమలాంటి మధ్య తరగతి వాళ్ళు అలాంటి పద్దతుల గురించి ఆలోచించటం అనవసరం.
ఓ జంట రబ్బరు బొమ్మలా వున్న పాపను ఆడిస్తూ నిఖిల్ ముందు నుంచి వెళ్ళారు. ఆ జంటను చూసి ముఖ్యంగా ఆ పాపను చూసి ముచ్చటేసింది అతనికి.
ఇలాంటి చోట్లకు చాలా సాయంత్రాలు నిర్లిప్తను తీసుకువచ్చినా__అలాంటి జంటలను చూసి వేదనతో ముడుచుకుపోయినట్టుండేది. ఇంట్లోలా చలాకీగా వుండలేకపోయేది. అదే తమకూ ఓ పాప వుంటే_నిర్లిప్త ప్రవర్తన ఇంకెంత బాగుండేది?
ఆలోచనల్లోంచి బయటపడి__ఆదుర్దాగా టైం చూసుకున్నాడు. పావు తక్కువ తొమ్మిది!! అరె! ఆలస్యమయింది. నిర్లిప్త గాభరా పడుతుండొచ్చు అనుకొని గబగబా స్కూటర్ దగ్గరకొచ్చి వేగంగా పోనిచ్చాడు.
ఇల్లు చేరేసరికి తొమ్మిదయింది. తలుపులు వోరగా వేసి వున్నాయి. కట్టబోయిన వాడల్లా-లోపల్నుంచి ఏవో మాటలు విన్పించి ఆగిపోయాడు. తలుపు సందులోంచి భార్గవ కనిపిస్తున్నాడు. నిర్లిప్త మాట వినిపిస్తోంది గానీ కనిపించటం లేదు. ఏదో సీరియల్ నవల గురించి చెపుతున్నాడు భార్గవ__ఆమెకు కూడా నవలల పిచ్చి ఎక్కువే! అయితే ఆ మాటలు విని వచ్చేవాడె తలుపు తోసుకొని...కానీ భార్గవని చూసి....భార్గవని చూసి కాదు.....భార్గవ చూస్తున్న చూపులు నిర్లిప్త వైపు- నిఖిల్ ను ఆపేశాయి.
