"ఏమైనా మాట్లాడు రాంబాబూ" అంది సరోజ.
"ఆ....మాకు నిజానికి మీ నర్సింగ్ హోమ్ ని వదలడం ఇష్టం లేదు. కానీ మీరు ప్రేమిస్తున్నట్టు తెలిశాక ఇంక ఆ నర్సింగ్ హోం లో మాకేంటి ఇంటరెస్ట్ వుంటుంది. అందుకే డిస్చార్జ్ అయి బయటికి వచ్చేశాం" అన్నాడు రాంబాబు.
"ఇప్పటికి ఈ డైలాగ్ వందసార్లు చెప్పావ్. వేరే ఏమైనా మాట్లాడు రాంబాబు" అంది సరోజ.
ఇలాంటి సందర్భాల్లో ఎలా మాట్లాడాలో రాంబాబుకి బొత్తిగా తెలీదు.
మాట్లాడ్డాడానికి ఏదో ఒక టాపిక్ దొరకాలికదా అని చుట్టూ చూశాడు.
పార్కులో దూరంగా బుట్టలో పల్లీలు అమ్ముకునే కుర్రాడు కనిపించాడు.
"అటు చూడు" అన్నాడు రాంబాబు సరోజతో.
సరోజ తల ప్రక్కకి తిప్పి చూసింది.
"అబ్బ....! ఎంత అందంగా వున్నాయో" అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ.
"పల్లీల్లో కూడా అందాన్ని చూసే నిన్ను నేను మెచ్చుకోకుండా వుండలేకపోతున్నా సరూ!"
"నేను అందంగా వున్నాయన్నవి పల్లీలుకావు. అక్కడున్న విరబూసిన గులాబీలను" కాస్త సీరియస్ గా అంది సరోజ.
రాంబాబు నాలుక కర్చుకున్నాడు.
"ఓహ్....నేను నిన్ను చూడమంది పల్లీలు అమ్మే కుర్రాడిని....! చూశావా....వాడి వయసు పన్నెండేళ్ళు వుంటాయేమో! కానీ అప్పుడే వాడి భుజాలమీద ఎంత బాధ్యత పడిందో! ఈ వయసు నుండే వాడు సంపాదనలో పడ్డాడు....అన్నట్టు ఉడకబెట్టిన పల్లీలంటే ఇష్టమా, వేయించిన పల్లీలంటే యిష్టమా?"
హుషారుగా అడిగాడు రాంబాబు.
సరోజ రాంబాబు వంక సీరియస్ గా చూసింది.
రాంబాబు ఇబ్బందిగా నవ్వాడు.
"ఓహ్....ఐయామ్ సారీ....నీ ముందు కూర కూర్చుని నేను సరిగా మాట్లాడలేకపోతున్నా....పోనీ నువ్వు మాట్లాడకూడదూ?" అన్నాడు.
"ఆ ప్రక్కకి చూడు" అంది సరోజ.
రాంబాబు ప్రక్కకి తిరిగి చూశాడు.
"చాలా బాగుందికదూ సీనరీ?" అడిగింది.
"అవును....చూడవా అమ్మేవాడు....వాడి చుట్టూ అమాయకంగా కేరింతలుకొట్టే పిల్లలూ. ఓహ్! బ్యూటిఫుల్ సీనరీ" అన్నాడు రాంబాబు సంబరంగా.
"నేనంటున్నది చుడువా సీనరీ కాదు....ఆకాశంలోని ఆ ఇంద్రధనసూ....వెండితునకల్లా ఆ తెల్లని మబ్బులూ, ఆ సీనరీ గురించి."
రాంబాబు నాలిక్కర్చుకుని ఇబ్బందిగా నవ్వాడు.
ఆ పార్కులోనే మరోమూల....
చిన్నారావ్, సునీతలు కూర్చుని వున్నారు. సునీత హటాత్తుగాలేచి నిలబడింది.
"ఏంటి అప్పుడే లేచి నిలబద్దావ్?" అడిగాడు అయోమయంగా.
"ఏం లేదు....నీ మాటల సొంపుల్ని తట్టుకోలేక అంది సునీత.
"మీ ఫ్రెండు రాంబాబు కూడా నీ టైపులోనే మాట్లాడతాడా?"
చిన్నారావ్ ఇబ్బందిగా నవ్వాడు.
"పాపం! అక్కడ మా సరోజ ఏం అవస్థలు పడుతుందో! ఇంక ఇక్కడ కూర్చోడం ఎందుకూ....పద పోదాం."
"అంటే ప్రేమించిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో మాకు ప్రాక్టీస్ లేదుకదా" నసిగాడు చిన్నారావ్.
"ఇద్దరూ ఓ పని చెయ్యండి. మాతో మాట్లాడ్డం ప్రాక్టీస్ చేసి వేరే వాళ్ళని ప్రేమించండి" అంటూ గబగబా పార్కు గేటువైపు అడుగులు వేయసాగింది సునీత.
"సునీ....సునీ....నా మాట విను" అంటూ ఆమె వెనకాల పడ్డాడు చిన్నారావ్.
* * * *
కొద్దిరోజులు గడిచాయ్....
రాంబాబు, చిన్నారావ్ లు ఇద్దరూ సరోజ, సునీతల ప్రేమలో పూర్తిగా మునిగిపోయారు.
ఆ రోజు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ పోలీస్ స్టేషన్ లో ఎంటర్ కాగానే రాంబాబు, చిన్నారావ్ లు కాళ్ళు నేలంకేసి ధన్ మని బాది సెల్యూట్ చేశారు.
"ఊ....నేను లేనన్ని రోజులూ స్టేషన్ లో మీ ఇష్టం వచ్చినట్లు తోక ఝాడించారా?" అనడిగాడు అప్పారావ్.
"అది మీకే తెలియాలి. మాకెలా తెలుస్తుంది సార్? హిహిహి...." నవ్వాడు చిన్నారావ్.
అప్పారావ్ అర్ధంకానట్టు చూశాడు.
"అదే సార్! మరి మీరు కుక్క కిడ్నీని పెట్టుకున్నారుగా?" అన్నాడు రాంబాబు అతనికి అర్ధమయ్యేలా చెప్తూ.
"హబ్బా...." బాధగా తలపట్టుకున్నాడు అప్పారావ్.
"మీరా విషయం ఇంకా మర్చిపోలేదా?"
"మేం మర్చిపోవాలన్నా మర్చిపోలేం సార్. ఆ విషయాన్ని మీరు మాకు ప్రతిక్షణం గుర్తుచేస్తూనే వుంటారు" అన్నాడు రాంబాబు.
"నేను....? నేనెందుకు గుర్తుచేస్తాను? అదేమైనా శుభకార్యమా నేను మాటిమాటికి గుర్తుచేస్కోడానికీ, మీకు గుర్తుచేయడానికీ?" చికాకుపడుతూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
"అంటే మీరు గుర్తుచెయ్యాలని చెయ్యరుసార్. మీకు తెలీకుండానే అంతా ఆటోమాటిక్ గా జరిగిపోతుంది సార్" అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
"ఇందాక మీరు స్టేషన్ లోకి ఎంటరయ్యేప్పుడు కుక్కలా నాలిక ఇంత బారుని బయటికి చాపి ఉంచి వచ్చారు సార్" అన్నాడు రాంబాబు.
