షేమ్ షేమ్
ఆ నిర్మానుష్య వీధిలోంచి రాత్రిపూట నడుస్తున్నాడు కోటేశ్వరరావు. హఠాత్తుగా అతన్ని వెనకనుండి ఎవరో గట్టిగా కౌగిలించుకున్నారు.
కోటేశ్వరరావు గుండెకాయ్ పొట్టలోకి జారింది.
ఎవడో... దారికాచి అటకాయించి దోచుకునేవాడిలా ఉన్నాడు...
అతి ప్రయత్నం మీద గొంతు పెగుల్చుకున్నాడు కోటేశ్వర్రావు.
"బాబ్బాబ్బాబు... నా జేబులో ముప్పయి రూపాయలు ఉన్నాయి... అవి తీస్కుని నన్ను వదిలిపెట్టు"అన్నాడు.
వెనకనుండి పట్టుకున్న వ్యక్తి తన పట్టు ఏమాత్రం సడలించలేదు. పైపెచ్చు నవ్వాడు.
"హిహి..."
"ముప్పయి రూపాయలు సరిపోదా?... పోనీ నా వాచికూడా తీస్కో... నన్ను మాత్రం వదిలిపెట్టు... ప్లీజ్ బాబూ..." బ్రతిమలాడాడు కోటేశ్వర్రావు.
"హిహి...హిహిహి..."
వెనకనుండి నవ్వాడా వ్యక్తి.
"వాచీకూడా సరిపోదా?... పోనీ ఉంగరం కూడా ఇచ్చేస్తా... కంగారుపడి నా పొట్లో కత్తుచ్చుకుని పొడవకు... నా దగ్గరున్నదంతా ఇచ్చేస్తానని అన్నాగా మరి!!?"
"హిహి... హిహిహి..."
వెనకున్న వ్యక్తి తన పట్టు వదిలేసాడు. కోటేశ్వర్రావు తేలికగా ఊపిరి పీల్చుకుని వాచి ఉంగరం తీసి వెనక్కి తిరిగాడు.
ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు.
"శ్రీరాములు!!...
"హోరి!... నువ్వా??... నువ్వేంటి ఇక్కడా?" అడిగాడు కోటేశ్వర్రావు, చిన్ననాటి స్నేహితుడు శ్రీరాముల్ని.
"నేను ఈ ఊరికి ట్రాన్స్ ఫరై వచ్చేశాను. మొన్ననే డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఈ ఏరియాలో కాస్త పనుండి వచ్చాను... నువ్వేంటి రాత్రిపూట రోడ్లమ్మట తిరుగుతున్నావ్?" అడిగాడు శ్రీరాములు.
"ఏం లేదు... సిగరెట్లు కొనుక్కోవడానికి సెంటర్ కి వెళ్లాను... సరేగానీ వెనకనుండి అలా పట్టుకున్నవేం?..."
"చాలాకాలం తర్వాత నిన్ను చూసిన ఆనందంలో కౌగిలించుకున్నా..."
"ఎవరైనా ముందునుండి కౌగిలించుకుంటారు గానీ వెనకనుండి కౌగిలించుకుంటారా ఎక్కడైనా?" బుంగమూతి పెట్టాడు కోటేశ్వర్రావు.
"ముందునుండి కౌగిలించుకోవాలంటే నీ పొట్ట అడ్డొకొస్తుంది మరి!... హి..." అంటూ చూపుడు వేల్తో కోటేశ్వర్రావు పొట్టమీద పొడిచాడు శ్రీరాములు.
"హి..."అన్నాడు కోటేశ్వర్రావు.
"అరే... భలేగా నవ్వుతున్నావే..." అంటూ మళ్లీ పొట్టమీద పొడవబోయాడు. కోటేశ్వర్రావు లటుక్కున అతని చేతిని పట్టుకున్నాడు..." చాల్లే... వీధిలో ఈ సరసాలేంటి?... మా ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం పద..."అన్నాడు.
ఇద్దరూ కోటేశ్వర్రావు ఇంటికి వెళ్లారు.
కాస్సేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడిన తర్వాత "నీ బిజినెస్ ఎలా సాగుతుంది?..." అని కోటేశ్వరరావుని అడిగాడు శ్రీరాములు.
"ఏమంత బాగా సాగడంలేదు. బిజినెస్ లో లాస్ వస్తుంది!!..."అన్నాడు.
"మరిప్పుడు ఏం చెయ్యదల్చుకున్నావ్?"
"వేరే బిజినెస్ ప్రారంభించుదామని అనుకుంటున్నా..."
"ఏం బిజినెస్?" కుతూహలంగా అడిగాడు శ్రీరాములు.
"రాజకీయం బిజినెస్!..." గర్వంగా చెప్పాడు కోటేశ్వర్రావు. "నేను రాజకీయాల్లో చేరిపోయి ఎమ్మెల్యేనయిపోయి... ఆనక మినిస్టర్ని అయిపోయి కోట్లకి కోట్లు సంపాదిస్తా..."
"నీకెంత మంచి ఆశయం ఉందోయ్..." ఆరాధనగా స్నేహితుడి వంక చూస్తూ అన్నాడు శ్రీరాములు."ఇంతకీ నువ్వు ఏ పార్టీలో చేరాలని అనుకుంటున్నావు?"
"అదే తేల్చుకోలేక పోతున్నాను... జంబలకిడిపంబా పార్టీలో చేరాలా లేకపోతే అద్దిరబన్నా పార్టీలో చేరాలా?... ఎటూ నిర్ణయించుకోలేక పోతున్నా..." అన్నాడు కోటేశ్వర్రావు బుర్రగోక్కుంటూ.
"నీకసలు రాజకీయ పరిజ్ఞానం చాలా తక్కువనుకుంటా... అసలు మనదేశ ప్రధాని ఎవరు?... ఆ విషయమైనా తెల్సా నీకు?" అన్నాడు శ్రీరాములు.
కోతెశ్వర్రావ్ శ్రీరాములువంక సీరియస్ గా చూసాడు. "ఏం?!... నేను నీ కళ్లకి అంత వెర్రిబాగులోడిలా కనిపిస్తున్నావా?... మనదేశ ప్రధాని ఇందిరా గాంధీ అని నాకు తెలీదని ఎందుకనుకుంటున్నావ్?
శ్రీరాములు కోటేశ్వర్రావ్ కేసి ఓ క్షణంపాటు ఆశ్చర్యంగా చూసి తర్వాత ఘోల్లున నవ్వాడు.
"ఏడ్చినట్టే ఉంది నీ తెలివి!... ప్రస్తుతం మన దేశ ప్రధాని రాజీవ్ గాంధీ!... ఇంధిరాగాంధీ ఏనాడో చచ్చిపోయింది.
ఆ మాట వినగానే కోటేశ్వర్రావ్ ఘోల్లుమన్నాడు.
"ఆ!... నా ప్రియతమ ప్రధాని ఇంధిరాగాంధీ చచ్చిపోయిందా?...వా..."
శ్రీరాములు అతన్ని ఓదార్చాడు.
"ఊర్కో ఊర్కో... నువ్వు బొత్తిగా న్యూస్ పేపరు చదవ్వాఏంటి?... నీకు రాజకీయ పరిజ్ఞానం అస్సలు లేదు..."
