ఆవేశంగా అని ఆమెవంక తేరిపారచూసిన గోపి తృళ్ళిపడ్డాడు.
ఆమె కళ్ళలో నీరు!
"హమ్మాయ్ గోరూ మీరు - మీరు ఏడుస్తున్నారా అమ్మాయ్ గోరూ?" కంపిస్తున్న గొంతుతో అన్నాడు గోపి.
"కాదు - ఇవి దుఃఖంతో వచ్చిన కన్నీళ్ళు కావు! ఇవి ఆనందభాష్పాలు. నా అభిమానాన్నీ, అప్యాయతనీ ఇంత చక్కగా అర్థం చేస్కున్నవుగా? - అందుకనే నా కళ్ళనుండి ఆనందభాష్పాలు పెల్లుబుకుతూ ఉన్నాయ్!" ఆమె గొంతుతో వ్యంగ్యం.
"హమ్మాయ్ గోరూ!" గోపి బాధగా అని జుట్టు పీక్కున్నాడు. అతని గొంతులో పశ్చాత్తాపం.
"నేను నీకు డబ్బులు ఎక్కువగా ఇద్దామనుకుంది ఎర్రగా బుర్రగా వున్న నీ రూపం చూసి మోజుపడి కాదు! నేను బేరం ఆడింది రెండు రూపాయలకే అయినా నువ్వూ రిక్షా తొక్కుతుండగా సడెన్ గ ఎదురుగాలి మొదలైంది - అప్పుడు కష్టపడి నువ్వూ రిక్షా తొక్కుతుంటే నా హృదయం ద్రవించిపోయింది. నీలో ఏదో సంస్కారం కూడా నాకు కనిపించింది. అందుకనే - అందుకనే నీకు బేరం అడిగినదానికంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇద్దామని ఆశపడ్డాను. పోనీలే ఈ దురదృష్టవంతురాలి అభిమానం, ఆప్యాయతా నీకు అక్కరలేకపోతే సరే. నేను నీకు ఇవ్వాల్సిన రెండు రూపాయలు కూడా ఇవ్వనులే."
పైట కొంగుతో కళ్ళు తుడుచుకుని రెండడుగులు ముందు కేసింది ఆమె.
ఆమె మాటలకు గోపి కంగారుపడ్డాడు.
"హమ్మాయ్ గోరూ. ఆగండి అమ్మాయ్ గోరూ."
ఆమె ఆగింది.
"నా రెండు రూపాయలు ఇవ్వండి అమ్మాయ్ గోరూ." బుర్రగోక్కుని అన్నాడు గోపీ.
ఆమె కిలకిలా నవ్వింది.
"ఊ... అలా రావాలి దారికీ."
ఆమె గోపి చెయ్యి పట్టుకుని దాంట్లో వందరూపాయల నోటు పెట్టి తన చేతితో అతని గుప్పిలి మూసి ఓసారి ప్రేమగా అతని కళ్ళలోకి చూసి, అతని భుజంతట్టి చకచకా అడుగులు వేస్కుంటూ ముందుకు వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళినవైపే ఆరాధనాభావంతో చూశాడు గోపి.
"ఆహా! ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా మంచితనమే. ఎటుచూసినా ప్రేమా ఆప్యాయతలే." అనుకున్నాడు.
తర్వాత ఓసారి ఆమె ఇచ్చిన వందరూపాయల నోటువంక ఆరాధనగా చూసి దాన్ని ఊరంతటికి వినిపించేలా గట్టిగా శబ్దంవచ్చేలా ఛుపుక్ అని ముద్దుపెట్టుకుని జేబులో పెట్టుకున్నాడు.
ఓసారి హుషారుగా విజిలేసి రిక్షా ఎక్కి పెడల్ మీద కాలేసి ఓ తొక్కు తొక్కాడు గోపి.
హాచ్చర్యం.
రిక్షా కాస్త కూడా ముందుకు కదల్లేదు.
"ఏందబ్బా. రిక్షా ఇలా బిగుసుకుపోయింది!" అనుకున్నాడు.
మళ్ళీ గట్టిగా పెడల్ మీద కాలేసి తొక్కాడు.
ఊహూ. ఈసారి కూడా రిక్షా కదల్లేదు.
"డుర్ ర్ - హె - హె -" అన్నాడు హ్యాండల్ మీద గుద్దుతూ. వెనుకనుండి కిలకిలా నవ్వు వినిపించింది.
గోపి అయోమయంగా వెనక్కి తిరిగి చూశాడు.
వెనకాల సీతాలు! రిక్షాని వెనుకనుండి రెండు చేతుల్తో గట్టిగా పట్టుకుని ఉంది.
రిక్షా ఎందుకు ముందుకు కదల్లేదో అర్థమయింది గోపికి.
"ఏయ్ నువ్వా?"
సీతాలు మళ్ళీ కిలకిలా నవ్వింది.
"ఏంటి గోపీ.... డుర్ హెహె అంటున్నావ్? ఇది రిక్షా అనుకున్నావా లేపోతే ఆవో గేదో అనుకున్నావా?"
"నిన్నూ..."
గోపి రిక్షామీంచి క్రిందికి ఒక్క దూకు సీతాలు చెవి పట్టుకుని మెలేశాడు.
"అమ్మా. అబ్బా - వదులు గోపీ." అంది బాధని నటిస్తూ.
"ఉహూ... నిన్ను నేను చచ్చినా వదలను."
సీతాలు గోపివంక ఆరాధనగా చూస్తూ అంది.
"నాకు కావలసింది కూడా అదే గోపీ."
"ఆ!-" నోరు తెరిచాడు గోపి.
అదే అవకాశాన్ని తీస్కుని సీతాలు గోపిచేతిని విదిలించుకుని ఒక్క పరుగు తీసింది.
"ఏయ్ సీతాలూ... ఆగు... ఆగు-"గోపి సీతాలును వెంబడించాడు.
సీతాలు ఆగలేదు... రివ్వున తూనీగలా ముందుకు పరుగెత్తింది గలగలా నవ్వుతూ.
గోపి కూడా పార్కులోకి పరుగుతీశాడు కానీ సీతాలు అక్కడ కనిపించలేదు గోపికి
"సీతాలూ... సీతాలూ" సీతాలుకోసం అన్ని దిక్కులూ చూస్తూ పిలిచాడు గోపి.
కానీ ఏ దిక్కునుండి సమాధానం రాలేదు.
గోపికి అర్థం అయిపోయింది సీతాలు ఎక్కడో దాక్కుని తనని ఏడిపిస్తుందని.
అతను బుంగమూతి పెట్టి రెండడుగులు వేశాడు.
"ఆహా...హా...ఆ..."
వెనుకనుండి రాగం వినిపించింది.
గోపి ఆగి చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ సీతాలు కనిపించలేదు.
"ఓహో...హో... ఓ..."
ఈసారి ప్రక్కవైపు నుండి రాగం వినిపించింది
గోపి ఏమాత్రం ఆలశ్యం చెయ్యకుండా చటుక్కున ఆవైపుకు తిరిగాడు.
అక్కడ కూడా సీతాలు కనిపించలేదు.
ఈసారి మూతి మరీ ముందుకు చుంచెలకలా పెట్టి అలుగుతూ నాలుగడుగులు ముందుకేశాడు గోపి.
అంతలో ఒక పొదలోంచి చెంగున గోపిదారికి అడ్డుగా దూకి బ్యాలెన్స్ తప్పి, నేలమీద వెల్లకితలా పడి, వెంటనే చటుక్కున పైకిలేచి పిర్రలకంటిన దుమ్ము దులుపుకుని ఒక్క గెంతు గెంతి పాటందుకుంది సీతాలు.
"మగవాడా, వగకాడా
పగవాడా నా మసాలా వడా."
గోపీ ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని సీతాలు చేస్తున్న చిందులు చూస్తున్నాడు. ఎప్పుడూ యాసగా మాట్లాడే సీతాలు హఠాత్తుగా మంచి భాషతో పాట పాడ్తుంది. ఎప్పుడూ చక్కగా మాట్లాడే తను ఇందాక తన రిక్షాలో ఎక్కిన ఆమెతో యాసగా మాట్లాడిన విషయం అతనికి గుర్తుకు రాలేదు.
గోపి మొహంలో ఫీలింగ్స్ తో సంబంధంలేకుండా సీతాలు పాట పాడ్తూ, డ్యాన్స్ చేస్తూ గోపిని కవ్వించసాగింది.
"పొంగిన పరువం నీదేరా
నింగిని జాబిలి నువ్వేరా
జాగు సేయక దరి చేరరా
నాగు పాము బుస వయసిదిరా..."
సీతాలు వెనక్కి వెనక్కి గంతులేస్తూ వెళ్తూ పాడ్తుంది.
గోపి ముందుకు అడుగులు వేస్తూ ఆమెని అనుసరించసాగాడు.
కానీ వాళ్ళిద్దర్నీ పొదలమాటున నక్కుతూ నక్కుతూ ఒకమనిషి గమనిస్తూ వస్తున్నాడన్న విషయం వాళ్ళకి తెలీదు.
ఆ వ్యక్తి ఎవరో కాదు.
సంతానం!
పాట పూర్తికాగానే సీతాలు ఒక్క జంప్ చేసి గోపిని కౌగిలించుకుంది.
గోపికూడా లటుక్కున సీతాలు చుట్టూ చేతులు వేసి బిగించాడు.
వెంటనే సీతాలు కళ్ళనీళ్ళు పెట్టుకుని బోరుమంది.
"ఏంటి సీతాలూ? - ఏమైంది?" వీపు నిముర్తూ అడిగాడు గోపి.
"ఇన్ని రోజులూ ఎక్కడికి వెళ్ళావ్ గోపీ - నీమీద నేనెంత బెంగెట్టుకున్నానో తెల్సా?" వెక్కుతూ అంది సీతాలు.
"ఇప్పుడు వచ్చాగా?" కౌగిలి బిగిస్తూ లాలసగా అన్నాడు గోపి.
"ఇంక నీకు దూరంగా ఉండలేను గోపీ...నిన్ను సూడకుండా ఉండలేను."
"పోనీ రోజూ మీ ఇంటికొచ్చి కనబడ్తాగా?"
"ఊహూ - ఏం వొద్దు... నాకేం అలా వొద్దు-"
"మరి?"
