Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 33

 

    "అదేం?"
    "అతనికి రాజమండ్రి ట్రాన్స్ ఫరయింది. అందుకే అతను ముహూర్తం ముందుగానే పెట్టించేసుకున్నాడు. పెళ్ళి కాగానే అమ్మాయిని తీసుకు వెళ్ళి పోతానన్నాడు. అందులో కాదనడానికేముంది సరేనన్నాను. కానీ శ్రావణ మాసానికి మాత్రం తప్పకుండా అమ్మాయిని పంపాలని చెప్పాను. అలాగే నన్నాడు."    
    "బాగుందయ్యా ...ఇంతకీ అల్లుడేక్కడ పని చేస్తున్నాడేమిటి?"
    "యునైటెడ్ బిజినెస్ ఇన్ ఫర్ మేషన్ బ్యూరో"
    హరినారాయణ గారు ఉలిక్కిపడ్డారు. "వరుడి పేరు?"
    "సుబ్బారావు!"
    హరినారాయణగారికి కళ్ళు తిరిగి నట్లయింది. అయన మరేం మాట్లాడకుండా స్నేహితుడి వద్ద సెలవు తీసుకున్నారు.
    అక్కణ్ణించి అయన సత్యనారాయణ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటి ముందు టులెట్ బోర్డు ఉంది.
    హరినారాయణగారి ఒళ్ళు ఉడికి పోతోంది. స్నేహితులిద్దరికీ ఒకేసారి ట్రాన్స్ ఫరయిందా? అయన ఆ చుట్టూ పక్కల వాకబు చేయగా తెలిసినదేమిటంటే ఆ ఇంటికి టులెట్ బోర్డు చాలా కాలంగా ఉంటోందనీ ఇటీవల ఒక పది రోజుల కాలం మాత్రం ఒక స్త్రీ ఇద్దరు యువకులూ అందులో ఉన్నారనీ.
    హరినారాయణగారికి వెంటనే ఏ విషయమూ బోధపడలేదు. కాసేపు ఆలోచించేక ఆయనకు తెలిసింది సత్యనారాయణ , సుబ్బారావు పూర్వమేక్కడో ఏదో చిన్న రూమ్ లో ఉండి వుంటారు. తల్లి వస్తుందని తెలియగానే ఇక్కడి ఇల్లు తీసుకుని ఉంటారు. అయితే ఇద్దరికీ ట్రాన్సు ఫరవుతుందని ముందుగా తెలియదా? తెలిసి కూడా ఇల్లు తీసుకున్నారా?
    మర్నాడు హరినారాయణ గారు "యునైటెడ్ బిజినెస్ ఇన్ ఫర్ మేషన్ బ్యూరో"కి వెళ్ళారు. అక్కడ ఆ ఆఫీసు లేదు. అందులో ఇప్పుడొక బట్టల దుకాణం ఉంది. అయన ఆశ్చర్యంగా ఆ బట్టల దుకాణం యజమానిని అడిగాడు. "ఎన్నాళ్ళయింది ఈ షాపు ఓపెన్ చేసి" అని.
    "నిన్ననే ప్రారంభించాం . ఇంకా పది రోజుల ముందే ప్రారంభించవలసినది కానీ ఎవరో యునైటెడ్ బిజినెస్ ఇన్ ఫర్ మేషన్ బ్యూరో వాళ్లట. ఓ పది రోజుల పాటు తాత్కాలికంగా ఇందులో ఆఫీసు పెట్టుకుంటా మన్నారు. పది రోజులకు వాళ్ళు హెచ్చు అద్దె ఇస్తాననడం వల్ల దీని ఓనర్ నన్నో పది రోజులు ఆగమని రిక్వస్ట్ చేశాడు. నేనూ ఒప్పుకున్నాను."
    హరినారాయణగారు తెల్లబోయి "మరి ఆ ఆఫీస్ ఏమయింది?' అన్నాడు.
    "ఈ ఊళ్లోనే ఎక్కడో వాళ్ళ సొంత బిల్డింగ్ ఉన్నదట. అందులోకి మార్చేశారు."
    "మీకు అ అడ్రస్ తెలుసా?"
    "తెలియదు.."
    "హరినారయనగారికి అంతా అయోమయమై పోయింది. చిరాగ్గా అయన ఇంటి దారి పట్టారు.
    
                                    5

    పరంధామయ్య ఒకరోజు విచారంగా కనిపించాడు. "నాకేమిటో భయంగా ఉంది హరీ" అన్నాడు.
    "ఏం జరిగింది?"
    "అమ్మాయిని తీసుకువద్దామని నిన్న రాజమండ్రి వెళ్ళాను. అల్లుడిచ్చిన ఇంటి నెంబరు ఎక్కడా దొరకలేదు. నిన్న రోజల్లా వాకబు చేశాను. ఆ ఊళ్ళో యునైటెడ్ బిజినెస్ ఇన్ ఫర్ మేషన్ బ్యూరో " అనే పేరుతొ రిజిస్టర్ అయిన ఆఫీసే లేదట"
    "వ్వాట్" ఆశ్చర్యపడ్డారు హరినారాయణగారు.
    పరంధామయ్య కాళ్ళూ చేతులూ ఆడడం లేదు.
    ""ఏమిటో నాకంతా అయోమయంగా  ఉంది. మంచి సంబంధమని ఆశపడి నా చిట్టి తల్లిని ముక్కూ మొహం తెలియని వాడి చేతిలో పెట్టాను. కానీ ఇప్పుడు నాకేదో భయంగా ఉంది."
    "కంగారు పడకు. అమ్మాయినించి నీకు ఉత్తరాలు వస్తుండేవి కదా?
    "వస్తుండేవి కానీ....."
    "ఊ.....కానీ....."
    "ఆ అడ్రసున్న వీధిలో ఉన్న పోస్టాఫీసు లో ఎంక్వయిరీ చేశాను నేను రాసిన ఉత్తరాల చిరునామా తెలియక ఆ ఉత్తరాలను బట్వాడా చేయలేదుట. వెనక్కు తిప్పి పంపడానికి ఉత్తరం మీద నా అడ్రస్ లేదు. నేను బయల్దేరి వస్తున్నట్టు రాసిన ఉత్తరం కూడా పోస్టాఫీసు లోనే ఉంది."
    "చాలా ఆశ్చర్యంగా ఉందే!"
    ఇరువురు ఎందుకైనా మంచిదని పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కంప్లైంట్ చేశారు.

                                     6
    పోలీసులు రంగంలో ప్రవేశించాక కొన్ని వోవరాలు బయట పడ్డాయి.
    ఉషకు జరిగిన లాంటి పెళ్ళిళ్ళు అదే రోజున ఆంధ్రప్రదేశ్ లోని చాలా పట్టాణాలలో జరిగాయి. యునైటెడ్ బిజినేస్ ఇన్ ఫర్ మేషన్ బ్యూరో దేశమంతటా ఆ పది రోజులు మాత్రమే పని చేసింది. అందరూ పరంధామయ్య లాగే మోసపోయారు.
    ఎంత ప్రయత్నించినా ఆ బ్యూరో తాలూకూ మనుషులెవ్వరూ పోలీసులకు దొరకలేదు. అయినా పోలీసులు ప్రయత్నాలు మానలేదు. ఆ బ్యూరో లోని మనుషుల్ని చూసిన వాళ్ళూ, హరినారాయణ, పరంధామయ్య ఇలా బాగా గుర్తు పట్టగల వాళ్ళు కూడా ఉన్నారు. కాస్త అనుమానించ దగ్గ మనిషి ఎవరు కనబడ్డా అతని ఫోటో తీసి అలాంటి వ్యక్తులకు పంపించేవారు పోలీసులు. కానీ ఆ ముఠా యెంత పకడ్భందీగా ఈ ఏర్పాట్లు చేసిందో ఏమో ఎవ్వరి ఆచూకీ కూడా దొరకలేదు. బ్యూరో కి సంబంధించిన మనిషి ఒక్కడంటే ఒక్కడు దొరికితే ఎంతో బాగుండేది!
    అసలు ఈ పెళ్ళిళ్ళ వెనుక ఉన్న మర్మమేమిటి? వివాహానంతరం వధూవరుల అంతర్ధానం కావడానికి కారణ మేమిటి? ప్రస్తుతం బ్యూరో ముఠా ఏం చేయాబోతోంది?
    ఈ విషయం అంతుబట్టడం లేదు. ముఠా వ్యక్తులు చాలా తెలివి తేటలతో వ్యవహరించారు. బ్యూరో ని వివాహమైన తక్షణం ఎత్తేసినా ఆ విషయం అందరికీ తెలియనివ్వలేదు. ఆఫీసు చిరునామా మారిందనే భ్రమలో ప్రజలనుంచారు. వివాహానంతరం వధువుతో సహా మాయమైపోయినా తామేక్కడో ఉంటున్నా మన్నా భ్రమ వధువు బంధువులకు కలిగుంచేరు ఉత్తరాలు ద్వారా . ఆ ఉత్తరాలన్నీ వధువు చేత ముందుగా రాయించి ఉంటారు. వాటిని తెలివిగా వారాని కోక్కటిగా పోస్టు చేయించారు. ఇక్కడ కూడా వారెంతో జాగ్రత్తతో వ్యవహరించారు. ఉత్తరాలన్నీ ఒక ఊళ్లోంచే పోస్టయినా అన్నీ ఒకే పోస్టాఫీసులో పోస్టు కాలేదు.
    ఉత్తరాలు క్రమం తప్పకుండా వస్తుండడం వల్ల ఎవ్వరికీ ఏ అనుమానం రాలేదు. ఈలోగా వాళ్ళకు తమ కార్యక్రమాలను సక్రమంగా నడిపించుకుందుకు కావలసినంత వ్యవధి చిక్కింది.
    కానీ ఏది ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఒక్క మనిషి కూడా దొరకలేదు. అన్నీ విషయాలూ కేవలం ఊహతోనే తెలుసుకోవలసి వస్తోంది.
    ఈ విషయానికి హటాత్తుగా అనుకోకుండా క్లూ దొరికింది.
    పరంధామయ్యగారి పెద్దన్నగారబ్బాయి కామేశ్వరరావు కెయిరో లో ఇండియన్ ఎంబసీ ఆఫీసులో పని చేస్తున్నాడు. అతను అనుకోకుండా ఆ పట్టణంలో ఉషను ఒక షాపులో చూశాడట. ఆమెతో మాట్లాడుదామనుకునే లోగానే ఆమె కారులో ఎవరితోనో వెళ్ళిపోయిందిట. ఉష కెయిరో ఎలా వస్తుందని అతనికి అనుమానం కలిగింది. ఒకవేళ తన కళ్ళే తనని మోసం చేశాయేమోననే అనుమానంతో ఉష క్షేమ సమాచారాలు తెలుపమని ఇంటి కతనుత్తరం రాశాడు.
    ఈ ఉత్తరం పరంధామయ్య గారిలో ఎటువంటి సంచలనాన్ని కలిగించినపప్పటికి ఉష అంతర్ధానం వివరాలు జవాబుగా రాశాడు.
    కామేశ్వర్రావు కెయిరో లో పరిశోధన ప్రారంభించాడు. ఉష కనబడ్డ రోజునే అతను ఆమె గురించి ఆ షాపులో అడిగాడు. ఆమె వివరాలు తెలియలేదు. కానీ ఆమెతో ఉన్న వ్యక్తీ చిరునామా దొరికింది. చిన్నాన్న నుంచి జవాబు రాగానే అతను ఆ వ్యక్తిని కలుసుకున్నాడు. కామేశ్వరరావు చెప్పిన పోలికలూ తేదీ వగైరాలు విని ఆ వ్యక్తీ ఆమె పేరు షబ్నమ్ అనీ, ఆమె వేశ్య అని చెప్పాడు. కామేశ్వరరావు నిరుత్సహ పడకుండా ఆ షబ్నమ్ చిరునామా ఇమ్మన్నాడు. ఆ చిరునామాకు వెళ్లి చూస్తె షబ్నమ్ , ఉష అని తెలిసిపోయింది. అంతేకాదు ఇంకా చాలా వివరాలు తెలిశాయి.
    వివాహం పేరిట మోసగించి, అందమైన అడ పిల్లల్ని సేకరించి మనిషికి పది వేలచోప్పున అరేబియన్లకి అమ్ముతున్న ముఠా సంగతి, వివరాలు ఆమె చెప్పింది. అన్నీ చెప్పి అన్న దగ్గర ఆమె ఏడ్చింది. ఆమె ఇష్టానికే మాత్రమూ సరిపడని జీవితం గడుపుతోంది. అప్పటి కప్పుడు ఆమెను రక్షించే పరిస్థితిలో లేడు కామేశ్వరరావు అతను ఇండియన్ ఎంబసీ ఆఫీసులో ఒక సామాన్య ఉద్యోగి. అతను విషయాలను వివరిస్తూ చిన్నాన్నకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలోని వివరాలు పోలీసులకు బాగా ఉపయోగించాయి. ముఠా వ్యక్తులు దొరకసాగారు.
    ముఠా వ్యక్తులు దొరకడం ప్రారంభించేక పోలీసులకు చాలా సందేహాలు తొలిగి పోయాయి. విశాఖపట్నం లో బ్యూరో లో ఉద్యోగస్తులుగా నటించి వ్యక్తులు హైదరాబాద్ ప్రాంతంలోని వారు రాజమండ్రిలోని బ్యూరో ఉద్యోగస్తులు బరం పురం ప్రాంతం మనుష్యులు తామ కార్యక్రమం ముగిసిన అనంతరం ఎవరి ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళి పోయి హాయిగా ఉంటున్నారు. అందుకే వాళ్ళను పట్టుకోవడం సాధ్యపడలేదు. ఒక నిర్ణీత మైన తేదీకి వారి కార్యక్రమం ముగిసి పోవాలి. అందుకే సుబ్బారావు, సుజాతను వదిలి ఉషను వెతుక్కువలసి వచ్చింది. మిగతా విషయాల్లో పోలీసుల ఊహలన్నీ కరెక్టే.
    పరాయి దేశంలో చిక్కుకు పోయిన ఉష వంటి అమాయకురాండ్రను రక్షించి వెనక్కు తీసుకురావాలని పోలీసులు నిశ్చయించుకున్నారు. ఈ విషయంలో వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలెట్టారు.
    ఈ విశేషాలను శ్రద్దగా ఫాలో అవుతున్న సుజాత ఒకరోజు తనలో తానె ఇలా అనుకుంది. "ఉషను ప్రభుత్వం తిరిగి దేశానికి తీసుకు రాగలదు కానీ ఆమె భవిష్యత్తు ఏమిటి? ఆమెను సానుభూతితో అర్ధం చేసుకుని సహకారాన్నిచ్చె స్థాయికి భారత దేశంలోని మగవాళ్ళు ఇంకా చేరుకోలేదు. ఆవిధంగా చూస్తె నేను చాలా అద్రుష్టవంతురాల్ని సుబ్బారావు నన్నే వివాహం చేసుకుని ఉంటె!" ఈ ఆలోచనే ఆమెను వణికించి వేసింది.
    అవును నిజమే! సుజాత అదృష్టవంతురాలు! అదృష్టం కొంత మందిని ధన రూపంలో వెతుక్కుంటూ వస్తుంది. మరికొంత మందిని కీర్తి రూపంలో వెతుక్కుంటూ వస్తుంది. సుజాతకు అదృష్టం టైఫాయిడ్ రూపంలో వెతుక్కుంటూ వచ్చింది మరి!  


                                       ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS