చీరంజీవి సౌభాగ్యవతి ,మంజులకు -- మీ వదిన అనేక ఆశీస్సులు. మీరందరూ అచట క్షేమమని తలచెదను. నువ్వు వెళ్ళిన తర్వాత భగవంతుని దయ వల్ల రోజురోజుకీ మీ అన్నయ్యగారికి ఆరోగ్యము చేకూరుతున్నది. మునుపటి వలె కాక మందులు శ్రద్దగా పుచ్చుకొనుచున్నారు. నీ సహాయమునకు అన్ని విధాల కృతజ్ఞతలము.
--- మంగళ.
ఉత్తరం చదవగానే హృదయం ఆనందంతో కొట్టుకుంది. ఇంతకన్న కోరేది ఏముంది? ఆప్తులకు ఆరోగ్యము కన్న పెద్ద పండగ ఏముంది? ఉత్తరం చివరి నుంచి ఈ చివరకు రెండు మూడు సార్లు చదివాను. అలా చదువుతుంటే ఒకపాడు ఆలోచన స్పురించి మనసు నంతటినీ కలవర పెట్టింది. మొదట్లో మైమరపించిన ఉత్తరమే చదువుతున్న కొద్దీ అంతా కృత్రిమమైనదనీ, నా కన్ను గప్పడానికి రాయబడిందనీ అనిపించింది.
"నీ సహాయానికి అన్నివిధాలా కృతజ్ఞులము.' నిజంగా మనస్సా నేను చేసిన పనికి అన్నయ్యా సంతోషించి ఉంటాడా? 'అన్నయ్యా , వదినా మీనుంచి నన్నెందుకు వేరు చేస్తున్నారు? నా నుంచి ఎందుకు దాచి పెడుతున్నారు? అవసరం వచ్చినప్పుడు నీకు సహాయం చెయ్యడానికి నేను తగనా? ఈ దీనురాలికి ఆ మాత్రం అవకాశం కల్పించరా?' అని నా మనసు రోదించింది. ఏం చెయ్యడానికి తోచలేదు. మరోసారి ఆ ఉత్తరం చదివాను. శుష్కవిచారం వల్ల కలిసివచ్చే దేముంది? నేను వృధాగా భయపడుతున్నానేమో అనిపించింది. కన్నీళ్లు తుడుచుకున్నాను. వీలయితే ఒకసారి వెళ్ళి రావాలి. ఇప్పట్లో పడుతుందా? మొన్న మొన్ననే వచ్చాను. నేను లేకపోవడం వల్ల సంభవించిన అనర్ధాలు అప్పటికే ఒకటీ ఒకటీ బయట పడుతున్నాయి. కాలగర్భంలో దాగిన కష్ట నష్టాలను మున్ముందు ఇంకా ఎన్నెన్ని ఎదుర్కొనవలసి ఉంటుందో! మరో పది నిముషాలు అలా పదుకుని ఉంటె నిర్మల జ్ఞాపకానికి వచ్చింది. వెంటనే ఆ అమ్మాయి ఎడ్రసునకు ఒక ఉత్తరం రాశాను.
ప్రియ సోదరీ, నిర్మలా!
ఇక్కడకు వచ్చానన్న మాటే గానీ నా మనసు అన్నయ్య దగ్గరే ఉంది. వాళ్ళు ఏం యిబ్బందులు పడుతున్నారో తలుచుకోడానికి కూడా భయంగా ఉంది. అనారోగ్యంతో పాటు ఆర్ధిక యిబ్బందులు కూడా జోడైతే ఎంతటి గట్టి మనస్సు ఉన్నవాళ్ళయినా డీలా పడిపోతారు. ఉల్లాసం కలిగించే కబుర్లు వాడి రోగం మళ్ళిస్తాయని డాక్టరు చెప్పేడు. వాడి ప్రక్కని కూచుని తల నిమురుతూ ఏవేవో కబుర్లు చెప్పి కళ్ళ నీళ్ళు తెప్పించే దాకా నవ్వించాలని ఉంది. వాడి రోగం తగ్గించడానికి నేనే సమర్దురాల్నని నా మనస్సు చెబుతోంది. కాని, పరాయి యింట్లో ఆశ్రయం పొందినదాన్ని, అస్వతంత్రురాల నైన ఆడదాన్ని. నేనేం చెయ్యగలను? చిన్న పిల్లవి నీకేవేవో రాసుకుపోతున్నానెమో? మరోలా అనుకోకు. ఒక ముఖ్య విషయం నీ ద్వారా వింటే గాని నాకు సంతృప్తి ఉండదు. ఇది వరకే ఆ నగ విషయంలో నాకెంతో సహాయం చేసి వయసుకి మించిన బుద్ది ,మంతురాలివనిపించుకున్నావు. ఈసంగతి కూడా రాసి దీనురాలయిన మీ అక్కయ్యకు సహాయం చెయ్యి.
మా అన్నయ్యకు ఎలా ఉంది? మళ్ళీ డాక్టరుకి చూపించారా? వ్యాధి తగ్గుతోందా, హెచ్చుతోందా? బ్లడ్ ఫ్రెషర్ ఇప్పుడెంత ఉంది? గుప్పెడన్నం తినగలుగుతున్నడా? సహజమైన తెలివి తేటలు గల నువ్వు ఈ విషయాలు కనుక్కోడం అంత కష్టమైన పనేం కాదు. మా వదిన ఎలా ఉంది? పిల్లలిద్దరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య వాళ్ళ నుంచి ఉత్తరం వచ్చింది గాని అదేంత మటుకు నిజమో తెలియడం లేదు నిర్మలా!
తిరుగు టపాలో జవాబు రాస్తావని నా ఎడ్రసు గల కవరు ఇందులో పెడుతున్నాను. నీ జవాబు కోసం ఎదురు చూస్తున్నాను.
నిర్భాగ్యురాలు , మంజుల.
ఉత్తరం రంగి చేత పోస్టుకి పంపేశాను. అయన చాలా సేపై వచ్చారని గాని రెండవ కవరు చింపి చదువుతున్నారని గాని నేను చూడనేలేదు.
'చాలావరకూ వెళ్ళిందే కధ! ఇంకా నయం! అన్నారు అయన అ ఉత్తరం పూర్తీ చేసి మడిచి కవరులో పెడుతూ. ఆ ఉత్తరం గురించి నేనేమీ అడగలేదు గాని వదిన ఉత్తరం అయన కిచ్చాను.
'నే చెప్పలేదూ, త్వరలోనే తగ్గిపోతుందనీ -- అన్నీ లేనిపోనీ భయాలు నీకు. ఒకవేళ అంతగా కాని రోగం వచ్చినా వయసులో ఉన్నాడు కనుక, ఇంకా రక్త బలిమి ఉంటుంది గనుక కొన్నాళ్ళు బాధపడినా తగ్గిపోతుంది. అసలు ఇదివరకే తగ్గిపోను. అతడెందుకు సరైన శ్రద్ధ తీసుకోలేదో గాని. నువ్వేం అలా ఉన్నావ్?' అన్నారు.
'ఏమోనండి, ఉత్తరం చదివిన కొద్ది నాకు భయం ఎక్కువౌతోంది. వాళ్ళు నా దగ్గర్నుంచి అసలు విషయం దాచి పెడుతున్నారేమో అనిపిస్తోందండి? అయన ముఖం చిట్లించారు.
'ఏడిసినట్లుంది. కులాసాగా ఉన్నారని రాసినా కుమిలి పోయేదాన్ని నిన్నే చూశాను. దేనికయినా 'అతి' పనికి రాదు. లేచి ఆ కన్నీళ్లు తుడుచుకో. అశుభం కూడాను. ఇదిగో ఈ రెండో ఉత్తరం చూశావా, ఎంత చిత్రంగా ఉందొ!
15
ఆ కాగితాలు చూశాను. అది మధుర నుండి. అది చదువుతుంటే ఉన్న మతి కూడా వూడిపోయిందా అనిపించింది. అదొక పది పేజీల గ్రంధం , ప్రణయ ప్రబంధం.
ప్రియ మంజులా,
జరిగిన విషయాలు ప్రత్యక్షరం మీకు చెప్పుకోకపోతే నేనెలా బతకగలను? నేను యిక్కడకు వచ్చిన వారం రోజులు దాటకుండా ఉత్తర దేశం నుంచి ఉత్తర కుమారుని ఉత్తరం కొట్టుకొచ్చింది. రవికల గుడ్డలా మడిచిన చిన్న నీలం రంగు కాగితం అది, అందులోని అందమైన అక్షరాలతో అయన అడుగుతున్న అంతరాంతరాలు కదిలించే ప్రశ్న ఒక్కటే ఒకటి.
మన్మధుడా,
మనిద్దరం చెయ్యీ చెయ్యీ కలుపుకుని గంగా యమునా కలిసే పవిత్ర నదీ గర్భంలో ప్రతి బింబాలు చూసుకుని ఉవ్విళ్ళూరుదా మనుకుంటే వో కవరు రాసి పారేసి రైలెక్కి పోతావా , ఎక్కడున్నా నా హృదయం నీ కోసం పరిగెత్తుకొచ్చి పట్టుకోగలదని నీకు తెలీదా?
మన్మధుడా జై!
మేమందరం భోజనాలు చేస్తుండగా ఆ కవరు వచ్చింది. మా తమ్ముడు గబగబా మజ్జిగన్నం తినేసి వెళ్ళి ఆ కవరు అందుకున్నాడు. ఆ కవరు చింపేసి నేనంత వద్దంటున్నా వినకుండా పెద్ద గొంతుకతో చదివేశాడు. మా అన్నయ్య వాణ్ణి నాలుగు వడ్డించాడనుకొండి. ఏమైతేనేం కేశవరరావు గారి విషయం మా యింట్లో అందరికీ తెలిసిపోయింది.
'వయసులో ఉన్న పిల్లకి సంబంధం చూసి పెళ్ళి చెయ్యండి అంటే చదువులో పెట్టేరు. ఉద్యోగం చేయిస్తున్నారు. అదీ చాలక పై చదువుల కానీ పై వూళ్ళకి వద్దు మొర్రో అంటే వినకుండా పంపించారు. అది చేసుకొచ్చిన నిర్వాకం చూశారా?' అని మా అమ్మ మొదలెట్టింది. ఆ రెండవ చివర మా మామ్మ అందుకుంది.
'నేనప్పుడే చెప్పెను, ఇలాంటి అఘాయిత్యం ఏదో ఒకటి జరుగుతే గాని ఈ యింట్లో మనుషులకి బుద్ది రాదనీ. అయినా పెద్దవాళ్ళు చెప్పడం పిల్లలువినడం పోయి అట్నించిటు తిరుగబడిందమ్మా మాయదారి కాలం!'
'నీకేం బుద్దుందా , లేదే? ఎవడే ఈకేశవా? మాటాడవేమే సిగ్గు లేకా?' అని ఎప్పుడూ ఏమీ అనని నాన్నగారు అంటుంటే మాత్రం నా కళ్ళమ్మట గిర్రున నీళ్ళు తిరిగి తింటున్న కంచం;లో పడ్డాయి. చెయ్యి కడుక్కు లేచిపోయాను. అన్నయ్య నా వెనకే వచ్చాడు . ఇంట్లో తింటూ తిరుగుతున్నదాన్ని . అందరి ఎదుటా పెరిగి పెద్దదానను ఐనదాన్ని. నేనెలాంటి దాన్నో ఈ యింట్లో ఒక్కరూ ఎరగరా? నామీద ఒక్కరికి నమ్మకం లేదా? ఎన్ని చేసినా ఏం చదివినా ఆడదాని బతుకు అంట్ల గిన్నెల బతుకేనా? నా మొహం మీద చేతుల్ని అన్నయ్య బలవంతంగా తీశాడు.
'నువ్విలా ఏడుస్తూ కూచుంటే మరేం అనుకుంటాం? అసలు జరిగిందేమిటో, వాడెవడో నీకు తెలీదా? చెప్పు. డొక్కు చీల్చి డోలు కట్టిస్తాను. నిజంగా చనువిచ్చి మనసిచ్చినవాడేనా చెప్పు, మక్కలిరగదన్ని పుస్తె కట్టిస్తాను.'
దుఃఖమంతా పోయి ఫక్కున నవ్వొచ్చింది నాకు.
'ఒహోహో , ఏం నవ్వు, ఏం నవ్వూ -- ఏం సంతోషం , ఏం సంతోషం కేశవా, నారాయణా, మాధవా, గోవిందా ....తర్వాత ఏమిట్రా అన్నయ్యా?' అంటూ కిటికీ దగ్గిర కొచ్చిన మా చెల్లెల్ని 'నువ్వు పోతావా పోవా' అని అన్నయ్య ఒక్క కేకేసేసరికి అదక్క డుండకుండా పరిగెత్తింది. తమ్ముడూ, చెల్లెలూ బడికి వెళ్ళిపోయాక, అన్నయ్యను కూచోపెట్టి సంగతులన్నీ -- మీరు బలవంతాన రైలేక్కించడం తో సహా -- అన్నీ చెప్పెను. ఆ సంగతులన్నీ అన్నయ్య అమ్మనూ, నాన్ననూ కూచ్పోబెట్టి వివరంగా చెప్పేడు.
'ఎందు కనవసరంగా తొందరపడి దాని మనసు నొప్పిస్తారు? అతడు బి.హెచ్. యు లో రిసెర్చి చేస్తున్నాడట. వాళ్ళ ప్రొఫెసర్ కి అతనంటే ఎంతో యిష్టమట. ఫారెన్ వెళ్ళే అవకాశం కూడా ఉందిట. ఈ ఒక్క ఏడాదీ అయిపోగానే పి.హెచ్.డి అయిపోతుంది గనక పెళ్ళికి ఏమాత్రం ఆటంకము ఉండదు. ఈలోగా యిది ఎం.ఏ కూడా అయిపోతుంది.
'ఏమో బాబూ ఏం చదువులో ఏ పెళ్ళిల్లో .....పెళ్ళి కాక పాడైపోయిన ఆడపిల్లల్ని గురించి వింటుంటే మాత్రం నా గుండె బ్రద్దలవుతుంటుంది. అతడికి తల్లీ తండ్రీ లేరంటున్నావ్, కానీ కట్నం లేదంటున్నావ్ , ఏం లోపముందో ఏమిటో.'
అని అమ్మ అనబోతుంటే అన్నయ్య ఖస్సున లేచాడు.
'హృదయమున్న మగాడు కాళ్ళ దగ్గరికి వస్తే అలాగే అంటుంది లోకం మరి. ఇలా అంచనాలు వేస్తారు కాబట్టే మంచివాళ్ళు కూడా ముందుకి రారు. మతులు లేకపోతె సరి" ఈసారి మామ్మ అందుకుంది.
'ఎందుకురా , అలా దాని మీద ఒంటికాలున లేస్తావ్? పెళ్ళి చేసుకునే ముందు కాస్త, మంచీ, చెడ్డా , ముందు వెనకా చూసుకోమూ/ పిల్లాడి కులమేమిటో గోత్ర మేమిటో.'
'అలాగలాగే .... మీరిలాగే మీనా మేషాలు లేక్కేడుతూ కూచోండి. ఇందుకే ఒళ్ళు మండుతుంది. మీరేమో సంబంధాలు తేలేరు. అదేమో దానిమటుకు కది వెతుక్కుంటే ఒప్పుకోరు . భలే.'
ఇంక మా నాన్న మౌనంగా ఉండలేక పోయారు. 'ఎందుకర్రా అక్కర్లేని తర్జన భర్జనలు! పెద్దబ్బాయ్ నువ్వోసారి నరసాపురం వెళ్ళి ఆ అబ్బాయి మంచి చెడ్డ లేవో కనుక్కురా. ఏమాత్రం మనకి నచ్చినా కానిచ్చేద్దాము.'
గంగా సైకతాల మీది గాలి తరంగాలలా పరవశించి పోయింది నా మనసు. అన్నయ్య ఆ మర్నాడు బస్సులోనే వెళ్ళిపోయాడు. ఆ రాత్రికే వస్తాడని ఎంతగానో చూశాను. ఇల్లంతా నిద్రలో మునిగినా నేనోక్కర్తినే అలా కిటికీ దగ్గర కూచుని కనపడే దీపం అల్లా రిక్షా గానూ, రిక్షాలో కనపడిన ప్రతి మనిషినీ మా అన్నయ్యగానే వూహించుకుంటూ అలాగే కూచున్నాను. నిద్ర వస్తే అక్కడే పడుకున్నట్టున్నాను. అమ్మా, మామ్మా అదే విషయం, అదే పనిగా మాట్లాడ్డం , తమ్ముడూ చెల్లెలూ వాళ్ళ వయసుకి మించిన శృంగార ప్రసంగాలు చెయ్యడం, అన్నయ్య ఎంతకీ రాకపోవడం నా ప్రాణం చాలా విసుగెత్తించింది.
