వాళ్ళలా అనుకుంటుండగానే లైట్లు వెలిగినాయ్ . ఎరుపు, పసుపు, నీలం మొదలైన అనేకరకాల బల్బులు ఒక్కసారిగా వెలిగి బృందావనం లోని సౌందర్యాన్ని ద్విగుణీ కృతం చేసాయి. కొన్ని పౌంటేన్ల నీళ్ళు ఎరుపు రంగులో కొన్ని నీలం రంగులో, కొన్ని ఆకుపచ్చని కాంతి లో అలా రకరకాలుగా మారిపోయినాయ్. చీకటి ప్రవేశిస్తున్న కొలదీ బృందావన్ మరింత అందాన్ని, శృంగారాన్ని ఒలకబోస్తూ యాత్రీకు లందరి మన శ్శరీరాలనూ యిట్టే వశపరచు కుంది.
కళ్యాణి ! కాంతారావు ఏదో కలలో లా నడుస్తూ మెల్లగా నడుస్తున్నారు. పిల్లలు కూడా ఎన్నడూ చూడని ఆ దివ్య సౌందర్యానికి ముగ్ధులై చేష్టలుడిగి చూస్తూ ఉండి పోయేరు.
ఓపక్క అన్ని లైట్లు వెలుగుతున్నా అవన్నీ రంగు బల్భులవటం వల్ల గార్దేన్సు లో 'కాంతి' ఎక్కువగా లేదు. పది గజాల దూరం అవతల ఉన్న వ్యక్తులు ముఖాలు కూడా స్పష్టంగా కనపడనంత 'డిమ్' గా ఉన్నది కాంతి. ఆ గార్డెన్స్ లో ఎక్కడా చూసినా వయసు లో ఉన్న జంటలే ఎక్కువమంది కనిపించేరు. విదేశీయులు, దేశీయులు , ప్రేమికులు , దంపతులు ఎందరెందరో ఒకరినొకరు. అంటి పెట్టుకుని, యింకా కొంత మందయితే చేతులతో ఒకరి నడుము నొకరు బంధించి వేసి, చుట్టూ ఉన్న మిగతా ప్రయాణీకుల ధ్యాసే లేనట్లు తామసలు యీ ప్రపంచానికి చెందిన వ్యక్తులే కానట్లు మత్తుగా నడుస్తూ తమ కాళ్ళు ఎటు తీసుకుపోతే అటు పోతున్నారు.
కాని ఆ సమయంలో ఆ ప్రదేశం లో అలాటి ప్రవర్తన ఎవరికీ విడ్డూరంగా కనపడటం లేదు. పైగా ఎంతో సహజంగా ఉన్నట్లు కూడా ఉంది. ఆ బృందావన్ వారికోసమే సృష్టింపబడినట్లు ప్రతి జంటా ఆ సమయంలో భావించసాగేరు.
ఆ గార్డెన్ లో అన్ని వందల బల్బులు వెలుగుతున్నా , ఆ జంటల కళ్ళల్లో వెలుగుతున్న శృంగార రేఖల కాంతి ముందు ఆ బల్బుల కాంతి, వాటి పైన ఉన్న చంద్రుని కాంతి కూడా వెలాతెలాబోతోంది.
కాంతారావు , కళ్యాణి వెళ్ళి ఒక గుబురు దగ్గర, గార్దేన్సు లో ఒక మూల చతికిల బడ్డారు. ఆ అలికిడి కి గాడాలింగనం లో ఉన్న హనీమూన్ జంట అదిరిపడి ఒక్కసారిగా విడిపోయేరు. అది చూసి కళ్యాణి, కాంతారావు ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. అప్పటి వరకు వాళ్ళిద్దరూ ఒక్క మాటైనా మాట్లాడుకోలేదు.
ఏదో విపరీతమైన భావో ద్రేకంతో వారిరువురి కంఠలు పూడుకు పోయినాయ్.
కళ్యాణి , కాంతారావు పిల్లలను పక్కనే నేలమీద కూర్చో పెట్టేసరికి వాళ్ళు రంగు రంగుల పౌంటై న్ల వంక కళ్ళప్పగించి చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నారు.
చివరకు కాంతారావు 'పాపం, వాళ్ళను మనం డిస్టర్బ్ చేసినట్లున్నాం' అన్నాడు నవ్వుతూ.
కళ్యాణి కి ఆ మాటలకు ఎందుకో సిగ్గనిపించింది. మరోకప్పుడైతే అలాటప్పుడు కళ్యాణి కూడా నవ్వుతూ ఏదో జోక్ వేసేదే కాని, అప్పుడు మాత్రం కళ్యాణి మనసు చాలా చిత్రంగా ఉంది. శోభనం గదిలోకి అడుగు పెట్టిన కొత్త పెళ్ళి కూతురు లా భర్త మాటలకు సిగ్గుల మల్లె మొగ్గయి తల వంచుకుంది.
ఆ భంగిమ లో కళ్యాణి ని చూస్తూనే పిచ్చెక్కినట్లయింది కాంతారావు కు. కళ్యాణి ఒళ్ళో తల పెట్టి నేల మీద కాళ్ళు జాపి పడుకున్నారు కాంతారావు. ఆమె ముఖాన్ని తన రెండు చేతులతోనూ పట్టుకుని, వంగి ఉన్న ఆమె ముఖాన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఆ చప్పుడుకు ఉలికిపడి చూసేరు పిల్లలిద్దరూ.
తన స్థానం లో తండ్రి కూర్చోవటం ఏమాత్రం సహించలేక పోయింది పాప. నాన్న అలా అమ్మ మీదకు ఎందుకు ఎగ బ్రాకుతున్నాడో ఎంతకీ అర్ధం కాలేదు బాబిగాడికి. ఐనా ఏదో మహావిపత్తు మాత్రం సంభావించబోతోందని అతీంద్రియ శక్తి వల్ల గ్రహించేడు వాడు.
దాంతో పిల్లలిద్దరూ తండ్రి మీద కలియ బడ్డారు అక్కడ నుండి లెమ్మని. పాప తండ్రి జుట్టు పీకింది. బాబిగాడు తన చిన్న చేతులతో పిడికిలి బిగించి తండ్రి వీపు మీద గుద్దేడు 'నాన్నా లే, లే!' అంటూ.
కాని వాళ్ళ గోడును వినే స్థితిలో లేడు కాంతారావు. ఎన్ని అవాంతరాలు వచ్చినా నేరవని పర్వతారోహకునిలా శిఖరాల నదిరోహించి, లోయలను స్పృశించి చివరకు తన గమ్య స్థానాన్ని చేరుకొని విజయ గర్వంతో ఊపిరి బిగపట్టేడు.
ఆ క్షణంలో పూబాలలు కిలకిల నవ్వినాయ్. ఫౌంటేన్లు ఎగసి పడినాయ్. ఇంద్ర ధనస్సులు మెరిసినాయ్. నక్షత్రాలు జలజల మని రాలిలాయ్. సమస్త బృందావనమూ మధురోన్మాదంతో ఊగిసలాడింది.
నాలుగు పెదవుల మధ్య అమృతం కురిసింది. ఐతే అమృతం కూడా అప్పుడప్పుడు కారంగా ఉంటుంది. కనుక కళ్యాణి పెదవి చురుక్కుమంది. 'అబ్బా! అంటూ భర్త ముఖాన్ని అవతలకు నెట్టి వేసింది కళ్యాణి.
ఇదే అదనుగా పాప వచ్చి తండ్రికి తల్లికీ మధ్య ఏర్పడిన జాగాలో తన స్థావరం ఏర్పరచుకుని కూర్చుంది.
బాబిగాడు తండ్రిని కొట్టి కొట్టి అలసి పోయి, తండ్రి అమ్మను వదిలి యివతలకు రాగానే రొప్పుతూ నిలబడ్డాడు.
వాడి ముఖాన్ని చూస్తూనే కాంతారావు కి నవ్వొచ్చింది. వాణ్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. 'ఎందుకురా నన్నట్లా కొట్టేవు?' అనడిగేడు లాలనగా.
'మలి- నువ్వు అమ్మని ఎందుకు కొత్తేవు?' అనడిగేడు బాబిగాడు.
'నేను అమ్మని కొట్టలేదురా నాన్నా! ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోలేదూ , అలాగే అమ్మని కూడా ముద్దు పెట్టుకున్నాను.'
'ఛా!' అంటూ నవ్వేడు బాబిగాడు సిగ్గుగా.
'చూసేరా వాడికున్న బుద్ది మీకు లేకపోయింది. పిల్లలు ముందు అలాటి మాటలు, చేష్టలు చెయ్యకండి. వాళ్ళు ఎంత పసి వాళ్ళయినా కాస్తో కూస్తా వాళ్ళకి కూడా అర్ధమవుతుంది.' అన్నది కళ్యాణి.
ఇంతలో ఏదో కలకలం వినిపించి అటు దిక్కుగా చూసేరు వాళ్ళు దగ్గరగా పోతున్న ఒకతనిని పిలిచి 'ఏమిటి విశేషం? ఎందుకటుగా పోతున్నారు జనం? అనడిగేడు కాంతారావు.
'ఏదో హిందీ సినిమా షూటింగ్ జరుగుతోందిట, యాక్టర్స్ ను చూట్టానికి వెళ్తున్నాం.' అంటూ అతను పరుగు పెడ్తూ వెళ్ళేడు.
హిందీ సినిమా తారలనగానే వాళ్లకు కూడా చూడాలని కుతూహలం కలిగి వెళ్ళేరు.
ప్రఖ్యాత సినీతార లెవరో వచ్చేరట కాని షూటింగు జరిగే ప్రదేశం లో మాత్రం లేరు. వాళ్ళు అక్కడే ఉన్న దాస్ ప్రకాశ్ హోటల్ లో మకాం వేసేరట. ప్రస్తుతం జరుగుతున్న షూటింగు లో ఒక కొత్త నటి డాన్సు చేస్తూ పాట పాడుతోంది. నారింజ రంగు లో ఉన్న పరికిణీ కట్టుకుని, దాని మీద నీలం రంగు గౌను తొడుక్కుని, దాని పైన ఎర్రటి పల్లె వాటు వేసుకుని , చేతులకు గాజులు, కాళ్ళకు గజ్జెలు పెట్టుకుని ఆమె డాన్సు చేస్తుంటే ఆవిడ నటించే చిత్రము సాంఘికమో, పౌరాణికమో ఏదో తేల్చుకోలేక పోయేరు ఆమె దుస్తులను బట్టి.
నిండు మేకప్ లో ఉన్న ఆ సినిమా తార అందంగా లేకపోగా ఆవిడ అలంకరణ వెగటుగా, ఆమె నటన అతి సామాన్యంగా ఉంది. 'సినిమాల పిచ్చి బాగా ఉండి అవన్నీ నిజంగా జరిగే యన్నంత కుతూహలం తో చూసే మనుష్యులను తీసుకొచ్చి ఒకసారి సినిమా షూటింగు చూపించినట్లయితే జన్మలో వాళ్ళు సినిమాలు చూడరు. సినీ తారల ఫోటోలు పడక గదిలో పెట్టుకుని పూజించరు' అంది కళ్యాణి.
అప్పటికి ఏడున్నరయింది. కొంచెం చలిగా ఉండటం వల్ల వేడివేడి టీ తాగుదామని, రెండు విజిటబుల్ కట్ లెట్ల కు , రెండు టీ కి, అర్దరిస్తే వాటన్నిటి నీ తెచ్చి దాంతో పాటు ముప్పై రూపాయల బిల్లు కూడా సర్వర్ చేతి కిచ్చేసరికి కాంతారావు కళ్ళకు చీకట్లు క్రమ్మినాయ్.
మళ్ళీ బస్సులోకి వెళ్ళి కూర్చునే వరకు అతనా షాక్ నుండి తేరుకోలేదు.
'మన హైదరాబాద్ లో క్వాలిటీ , ...ఎన్ని ఫస్ట్ క్లాస్ హోటళ్ళు లేవు? ఐనా యింత దారుణంగా ఎవరూ చార్జి చెయ్యరే!' అన్నాడు రుమాలుతో మొహం తుడుచుకుంటూ.
'ఇది పిక్నిక్ స్పాట్. అందునా బృందావనం.
సినిమా తారలు కూడా యిక్కడ బస చేస్తారంటే అది యెంత గొప్ప హోటలో ఊహించండి. అందుకే ఓ పది రూపాయలు 'టిప్' ఎక్కువగా తీసుకుని ఉంటాడు బాధపడకండి.' అంటూ అతనిని ఓదార్చింది కళ్యాణి.
ఆరాత్రి పడుకో బోయే ముందు కళ్యాణి ని దగ్గరకు తీసుకుకోగానే అంతకు మునుపే తాము చూసి వచ్చిన రంగురంగుల బృందావన సౌందర్యం గుర్తు కొచ్చింది. కాంతారావు కి. పిల్లలు పక్కన ఉండబట్టి ఊరుకున్నాడు కాని లేకపోతె కళ్యాణి ని ఆ సమయంలో ఊరికే అలా కూర్చోనిచ్చే వాడా తను? ఇప్పుడు కల్యాణి తనదగ్గర ఉన్నా బృందావన్ లేదు. ఎలా? ఐనా ఊహాశక్తి తోనే బృందావన్ ని ఆ హోటలు గది నాలుగు గోడల మధ్య ఊహించుకుని , అందులో కళ్యాణి పచ్చని గరిక మీద పడుకుని ఉన్నట్లుగా భావించి, తృప్తి పొందేడు కాంతారావు.
* * * *
మర్నాడు ఉదయం లేచి , టిఫిను తీసుకుని, బస్సులో ఊటి కి ప్రయాణమయ్యారు కాంతారావు వాళ్ళు. దక్షిణ భారతదేశం లోని ఆ అందాల సీమను చూడాలని ఎన్నో సంవత్సరాలు గా కలలు కంటోంది కళ్యాణి. ముఖ్యంగా తమ పెళ్ళయిన రోజు నుండి హనీమూన్ యాత్రలో ఒక భాగంగా ఊటీని చూడాలని ఎంతగానో ఉవ్విళ్ళూరింది. అలాటి అందమైన ప్రదేశాన్ని కొన్ని గంటలలో చూడ బోతున్నానన్న ఆలోచన ఆమెకు ఎంతో థ్రిల్ ని కలిగించింది.
మైసూర్ స్టేటు నుండి, తమిళనాడు స్టేటు లోని ఊటీకి వెళ్ళబోయే ఆ బస్సు మధ్యలో సరిహద్దు ప్రాంతం లోని చెక్ పోస్టు ల దగ్గర ఆగటం , అక్కడి అధికారుల అనుమతి తీసుకుని బస్సు కదలగానే మళ్ళీ రెండు బొంగులు క్రిందికి వాలి సరిహద్దు ను చూపటం అంతా చిత్రంగా ఉంది చూడటానికి.
