Previous Page Next Page 
వసంతం పేజి 34


    "అడిగేందుకేముంది వొదినా?"
    "చాలా ఉంది-నువ్వడిగితే చెప్తాను"
    ఆమె చాలా గంభీరంగా చూస్తోంది. ఆటగా ఈ సంభాషణ జరగడంలేదు.
    "చెప్పు వొదినా..."
    చాలాసేపు మాట్లాడలేదు లలిత, ఆమె ఏం ఆలోచిస్తూందో అతనికి అర్ధంకాలేదు. అతను కష్టంగా తన ఉత్సుకతని దాచుకుని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.
    "ఒక మాట అడుగుతాను చెప్పు..." అంది చివరికి లలిత. ఆశ్చర్యంగా చూశాడు గోపాలం.
    "నీ గురించి నువ్వు చాలా ఆలోచించుకున్నావు కాదూ?"
    "అవును వొదినా..."
    "బాగా ఆలోచించి చెప్పు. ఆమెని నువ్వు ఏ ఉద్దేశంతో పెళ్ళి చేసుకున్నావు?"
    ఆశ్చర్యంగా చూశాడు గోపాలం. కాని, ఈప్రశ్న ఏదో ఉద్దేశంతో ఆమె అడిగిందని అతనికి తెలుసును.
    ఏ ఉద్దేశంతో?- ప్రేమిద్దామని, సుఖపడదామని...కాని. ఆమె తన అంతరాంతరాల మాట అడుగుతోంది...
    "ఆ విషయం నీకూ తెలుసును వొదినా ... ఆ రోజుల్లో నీ దగ్గర ఏమీ దాచలేదు...."
    "ఇప్పుడు మళ్ళా చెప్పు"
    "ఆమె అందంచూసి...కాని, క్రమంగా ఆమె మీద ప్రేమ పెంచుకున్నాను.....
    "ముఖ్యంగా ఆమె అందంగా ఉందని. ఏం?    
    ఆమె కళ్ళల్లోకి చూడలేడతను. తన అంతరాంతరాల చీకట్లలో దాచుకున్న మాటలు నిర్దయగా ఈ నిజాల వెలుతురులోకి లాగి తనని సిగ్గుపరుస్తోంది వొదిన...
    "అవును."
    "తరువాత?"
    "చెప్పలేను వొదినా? ... కొద్దికాలం ఆమె అంటే ప్రాణంఐనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ననుకుంటాను..."
    "తరువాత ఆమె నీకు దూరం ఐపోయింది?
    "అవును"
    చాలాసేపు లలిత మాట్లాడకుండా కూర్చుంది. అతనికి ఏమీ అర్ధంకాలేదు.
    ఆమెలేచి వెళ్ళబోతూంటే, ఎందుకై ఇవన్నీ అడిగేవు వొదినా?" అన్నాడు ఉద్వేగంగా. తన ఆంతర్యం వెలుతురులో తనకి గర్వం కలుగజెయ్యలేదు.
    దీపం వెలిగింది గుమ్మంలో నిలబడి "వసంత- చాలా మారిపోయింది గోపాలం! అందుకని అంది లలిత.
    "ఏమిటి వొదినా నువ్వంటూన్నది?"
    "వసంత అప్పటి బంగారు బొమ్మకాదు గోపాలం!.... కలకత్తాలో ఆమె పెద్ద ఏక్సిడెంట్ లో గాయపడింది- ఆ మచ్చలు ఆమె రంగుమీద మరీ ప్రత్యేకంగా కనిపిస్తాయి. మూడునెలల ట్రీట్ మెంట్ తరవాత కాని ఆమె హాస్పిటల్ వదల్లేదు-"
    నీరసంగా నిలబడ్డాడు గోపాలం. అతనికి ఆమెమాటలు పూర్తి తాత్పర్యం బోధపడేసరికి చాలా క్షణాలు పట్టేయి.
    "ఐతే...నా కెందుకు నువ్వైనా రాయలేదు వొదినా?"
    "అక్కడ ఎవ్వరూ రాయకుండా అడ్డుపెట్టింది వసంత - నన్నూ రాయనివ్వలేదు.
    "గాడ్!"
    "అందుకే అన్నిఅడిగేను గోపాలం!...నీలోతు నాకూతెలీదు..."
    ఆమె వెళ్ళిపోయింది. చాలాసేపు కూర్చుని అతనూ బయటికి వెళ్ళిపోయాడు. తిరిగి తిరిగి రాత్రివొచ్చాడు. లలిత మళ్ళీ వసంతమాట ఎత్తలేదు. వారంరోజులదాకా అతనూ ఆమాట ఎత్తలేదు వొదినతో.

                               *    *    *

                                36

    సూర్యాస్తమయం కావొస్తూంది.
    సముద్ర తరంగాల సంచలనం గోపాలంలో వింత వింత భావాలని కలుగజేస్తూంది. ఆ అనంత తరంగాల్లో వెయ్యి ధ్వనులు.
    ఒక్కొక్క కెరటం ఒక్కొక్క గాథ - ఎవరికీ అర్ధంకాని కథ.
    తనకథ లాగ...
    ఒక్కొక్క కెరటమే ఆనందంతో ఉప్పొంగి పోయి నవ్వుతూన్న నురగల అలంకారాలతో ఉవ్వెత్తుగాలేచి జీవితానందంతో లాగ ఒరుసుకుని వొచ్చి క్షణంలో నాశనం ఐపోతూంది - తీరంలో కొంచెంసేపు - తరువాత తరంగం వొచ్చేదాకా - కొంచెం ఆర్ద్రత మాత్రం వొదులుతూ,
    తన జీవిత మాధుర్యంలాగ.
    అర్ధంలేని ఆలోచనా శకలాల్లో అతనికి లల్లీ జ్ఞాపకం వచ్చింది.
    ఎవరి చిట్టితల్లి? ఈ జీవన సముద్రంలో ఒక తరంగం ఆ అమ్మాయి కూడా.
    లేచి నిలబడ్డాడు.
    ఎర్రగా, చల్లటి అగ్ని గోళం లాగ పడమటిఆకాశంలో కనుపిస్తూనే ఉన్నాడు సూర్యుడు.
    నెమ్మదిగా అడుగులువేశాడు గోపాలం. ఇన్నాళ్ళు తనని లోలోన తినేస్తున్న ఆలోచనలు అతన్ని త్వరగా నడవనియ్యడం లేదు. కాని, ఒక్క ఆలోచన యీరోజు అన్నిటినీ జయించి అతన్ని ఆశ్వాశిస్తోంది.
    కొంచెం అడుగులు వెళ్ళేసరికి ఎవరిదో కుక్క అరవడం ప్రారంభించింది. అలిసిపోయి నట్లు, మరుక్షణం అతని భుజాల మీదా, వీపు మీదా కుక్క కళ్ళుపెట్టి అతన్ని నాకేప్రయత్నం చేయసాగింది.
    బిత్తరపోయి, దాన్నించి తప్పించుకునే ప్రయత్నంచేసే తొందరలో అతని ఆలోచన లన్నీ స్వరక్షణ మీదికి మళ్ళేయి.
    "శమ్మీ! శమ్మీ ! యూ - రోగ్ ..."
    వెనక్కి తగ్గిందికుక్క. అతను కంఠస్వరం గుర్తించి వెనక్కి తిరిగేడు. అనంత క్షణాల కాలంపాటు అతని మనస్సూ జ్ఞానేంద్రియాలు పనిచెయ్యలేదు.
    గొలుసుపట్టుకుని శమ్మీని దూరంగాతీసి, "సారీ గోపాలం.... ఆపలేకపోయాను" అంది వసంత, అలసటతో బలంగా ఊపిరితీస్తూ.
    ఉద్రేకంలో అతనూ తీవ్రంగా ఉచ్చ్వాస నిశ్వాసాలు చేస్తున్నాడు. ముందర అతనికి వసంత బాగా కనిపించలేదు. క్రమంగా పట్టిపట్టి చూశాడు.
    రెండు, బుగ్గలమీదా పెద్దపెద్ద మచ్చలు! నుదుటిమీద అడ్డంగా కాల్చినట్టు నాలుగంగుళాలమచ్చ.
    మేడమీదికి పడి పడకుండా కత్తిరించిన జుత్తు.
    చాలాసేపు ఆమెను పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు గోపాలం.
    కుక్క అతనిమీద అభిమానం చూపడంతో దానిగోళ్ళు అతని బుష్ షర్టుని చింపి వీపుమీద కొంచెం లోతుగా గాట్లు చేశాయ్. రక్తం కొంచెం కొంచెంగా చిమ్ముకుని వస్తూ కలుగజేనున్న బాధ కూడా అతనికి తెలియలేదు. బిత్తరపోయినట్టు నిలబడ్డ వసంతనించి కళ్ళుకానీ, మనస్సుని కానీ తిప్పుకోలేకపోయాడతను.
    ఆమె తెల్లటి చేతిమీద యింకొక పెద్ద మచ్చని చూడగానే గోపాలాని కెన్నో జ్ఞాపకాలు కొద్ది క్షణాల్లో చిందరవందరగా వచ్చాయి. ఆ ప్రాంతంలోనే, బీచ్ లో... ఎంతో కాలం క్రిందట చూసిన వసంత. ఆనాటి ఆమె చక్కటి చేతులూ, తరువాత ఆమెతో తాను గడిపిన కొద్ది చక్కటి రోజులూ- అన్నీ అతనికి జ్ఞాపకం వచ్చాయి.
    "కూర్చో వసంతా!" అన్నాడు గోపాలం. చివరకు నీరసంగా. ఇద్దరూ కూర్చున్నాక మళ్ళీ నిశ్శబ్దం ఆక్రమించుకుంది వాళ్ళ మధ్య. నిశ్శబ్ధాన్ని భంగపరుస్తూ చివరకి .... "సారీ గోపాలం" అంది "చాలా కాలమైపోయింది నిన్ను చూచి. ఇవాళ. యిక్కడ, యిలా కలుసుకోవడం చాలా విచిత్రంగా ఉంది కాదూ?" అన్నాడు ప్రయత్నించి గోపాలం.
    "అవును." అంది వసంత.
    "షికారు వొచ్చేవా?" అన్నాడు గోపాలం.
    "అవును-ఇవాళ మరీ తోచక యిక్కడ తిరుగుదామని వచ్చాను. నువ్వు బెజవాడ వెళ్ళిపోయావుట?"
    అవును వసంతా, యాక్స్ డెంటయి చాలాగాయపడ్డావు. కనీసం నాకు ఉత్తరం రాసి ఉండవలసింది." అతడి కళ్ళు మళ్ళీ ఆమె మచ్చలమీద సంచరించేయి. అప్రయత్నంగా వసంత చేతులు ఆమె బుగ్గలమీదకు పోయాయి. ఆమె కళ్ళల్లోకి వచ్చిన బాధల జ్ఞాపకాలనీ జ్ఞాపకాల బాధలనీ అతను గమనించలేకపోయాడు. కాని...." అన్నీ త్యజించాక మళ్ళీ నా విషయాల బాధలతో నీ శాంతిని చెడగొట్టాలనిపించలేదు గోపాలం," అని ఆమె అన్నప్పటి మాటల్లో ఉన్న బాధని మట్టుకు అతను గమనించకుండా ఉండలేకపోయాడు. అతను జవాబు ఏం చెప్పాలో తెలియక ఇసకని పరీక్షిస్తూ అలాగే ఉండిపోయాడు. క్రమంగా వీపుమీద మంట ఎక్కువ అవడంవల్ల అతనికి బాధ తెలిసి వస్తూంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS