నిట్టూర్చాడు గోపాలం: తనకీ వసంతకీ మధ్య బంధాలు ఏనాడో అంతం ఐపోయాయి... తను జీవితం ఈ కాల ప్రవాహంలో ఒక పొరపాటు. ఆ ప్రవాహమే ఆ పొరపాటుని సరిదిద్దుతోంది.
ఈనాడు వసంత ఏం అనుకుంటూంది?
అదీ తనకి తెలీదు - బహుశా పోతోన్న సిరిసంపదల కోసం బెంగపెట్టుకుంటూందా? మహా నగరం వొదిలి రావాలని బాధపడుతోందా?
ఆమె సంగతి తెలిస్తే బాగుండును.
కాని తానామెకి ఉత్తరం రాయడు....ఆ చేష్టలో ఆమె తన ఓటమిని మాత్రమే గమనిస్తుంది. రెండేళ్ళు తన ఆత్మగౌరవంతో ఆడుకుంది వసంత. చివరికి తానన్నీ వొదిలి ఇవతలపడగలిగాడు - మళ్ళీ ఆ వలలో తాను పడడు.
వేడిగా ఉంది రాత్రి. చిన్నగదిలో తిరుగు తోన్న ఫేస్ ఏమీ ఉపశమనం కలిగించగలగడం లేదు.
ఆరుబయట కొంత చల్లగా ఉంటుంది...
కాని, అక్కడ దోమలు మరీ ఎక్కువ.
మళ్ళీ నిట్టూర్చాడు గోపాలం. ఆ రాత్రికీ, తన జీవితానికి చాలా పోలిక కనిపించింది అతనికి.
* * *
నెలరోజులు గడిచేసరికి ఈ జీవితానికీ అలవాటుపడిపోయాడు గోపాలం. వేడిగాలి అతని నిద్ర పోగొట్టడం లేదు; దోమలతన్ని తెల్లవార్లూ మేలుకొలపడం లేదు; ప్రతీ రోజూ అతనికి వసంత జ్ఞాపకం రావడం లేదు; అనుక్షణం అతనికి తన జీవితసమస్య కాని, తన జీవితపు అసంపూర్వత్వం కాని జ్ఞాపకం రావడంలేదు. ముళ్ళ మీద అతను పడుకున్నాడు - కాని, అవీ అలవాటైపోయాయి.
కొత్త పంథాలో పడ్డ ఈ జీవితంలో అతనికి స్నేహితులూ దొరకలేదు. తనతోటి లెక్చరర్ తో అతను ముభావంగా ఉండకపోయినా వాళ్ళ చర్చల్లో, వాళ్ళ నవ్వుల్లో అతను పూర్తిగా నిమగ్నుడు కాకపోయేవాడు; వాళ్ళలాగ చిన్న విషయాలకి నవ్వలేకపోయేవాడు; వాళ్ళలాగ విద్యార్దినులనిగురించి హాస్యోక్తులు చెప్పలేక పోయేవాడు. తరుచు అతను లైబ్రరీలోనే కూర్చుని ఏదో చదువుకోడమో. రాసుకోడమో చేసుకునేవాడు.
అతను ఉంటూన్న ఇల్లు కాలేజీకి రెండు మైళ్ళకన్న కొంచెం ఎక్కువే ఉంది దూరం ప్రతిరోజూ వెళ్ళిరావడం ఇబ్బంది ఐపోయి, సైకిల్ కొనుక్కున్నాడు.
ఆ ఇంటి ఆవిడ చాలావిచిత్రమైన మనిషి... ఆమెకి ఇద్దరు కొడుకులు. పెద్దాయనకి పెళ్ళయింది. చిన్నవాడు చదువుకుంటున్నాడు. వాళ్ళు అతనికి వారంలో ఒకసారికన్న కనిపించరు. ఇంటావిడమాత్రం అతను సాయంత్రం వొచ్చేసరికి గార్డెన్ లో ఏదో పనిచేస్తూ అతన్ని చూసి నిలబడి: ఏం విశేషాలు బాబూ?" అనేది.

అతను తన వివాహం సంగతి ఆమెతో చెప్పలేదు - పెళ్ళయిందా? అని ఆమె అడిగితే, "భార్య లేదు" అని సమాధానం ఇచ్చేడు. బహుశా ఆ అర్ధసత్యాన్ని ఆమె అతను కావాలన్నట్టే అర్ధం చేసుకుని ఉంటుంది.
"ఏమీలేవమ్మా!" అని సమాధానం ఇచ్చి అతనుమీదకి వెళ్ళిపోయేవాడు.
సుమారు ప్రతిరోజూ ఇదే మామూలు ఐపోయింది. ఆమె ఆ ప్రశ్న చాలా విధాలుగా వెయ్యడంకన్న ఎక్కువ మాట్లాడేది కాదు! ఆ ప్రశ్న వెయ్యకుండా ఉండేదీకాదు.
అందుచేతనే ఒకరోజు ఆమె తానురావడం చూసి మామూలుగా వేసే ప్రశ్నకి బదులు "నెల్లూరు ఎలాగ ఉంటుంది బాబూ?" అని అడగడం అతనికి కొంచెం ఆశ్చర్యం కలగ జేసింది.
"తెలీదమ్మా....ఏం?" అన్నాడు గోపాలం. ఆగి.
"పెద్దవాడికి బదిలీ ఐపోయింది" అంది ఆమె.
ఆమె బాధలో కొంచెం తనూ పంచుకున్నాడు గోపాలం- ఐతే, మీకు దూరంగా వెళ్ళిపోతారన్నమాట ఆయన!... పాపం!" అన్నాడు గోపాలం.
అప్పటికే అలసిపోయినట్లు నిట్టూర్చి ఆమె తలమాత్రం ఊపి మొక్కలకి నీళ్ళు పొయ్యడానికి వెళ్ళిపోయింది.
ఆమె మీద చాలా జాలివేసింది. కాని మరో వారంరోజులతరవాత పెద్దకొడుకు వెళ్ళిపోతూ, తనదగ్గర సెలవు తీసుకోడానికి వొచ్చినప్పుడు అతని ఆనందం గమనించి తికమకపడ్డాడు గోపాలం. కాని, ఇదే జీవితమార్గం అని ఒప్పుకున్నాక అతనికి ఆమెమీద మరీ అభిమానం కలిగింది.
ఇలాగ సాగుతోన్న జీవితంలో మళ్ళీ చిన్న తుఫాను లేవదీసింది అన్నయ్య రాసిన ఉత్తరం:
"చి" గోపాలానికి:
ఇక్కడ అందరమూ క్షేమంగా ఉన్నాము. నువ్వు చాలాకాలంనించి ఉత్తరం రాయలేదు. మమ్మల్ని మరిచిపోయావని అంటూంది మీ వొదిన.
వారంనించి లలితకి వొంట్లో ఏం బాగా లేదు. జ్వరం. నిన్ననే కొంచెం నయం ఐంది. మరో పదిరోజులదాకా మామూలుగా అయే సూచన లేదు.
ఆఫీసుకి సెలవు పెట్టేను,
పది రోజులకిందట వసంత, వెంకట్రామ్ ఈ ఊరువొచ్చారు. నాలుగు రోజుల క్రితం వసంత వొచ్చింది. అప్పటినించీ ప్రతి రోజూవొచ్చి చాలాసేపు కూర్చుని సహాయం చేస్తూంది,
నీకు సెలవులు ఎప్పుడు? తిన్నగా ఇక్కడికి వొస్తానని అనుకుంటున్నాను. తప్పకరా.
వెంటనే ఉత్తరం రాయి. ముఖ్యంగా నీ జీవితం ఎలాగ ఉందోరాయి. హోటల్లో తింటూ చిక్కిపోయా ననుకుంటాను - కాలేజీ ఎలాగ ఉంది.
శశిరేఖ మీ వొదినకి ఉత్తరం రాసింది.
గ్రహించవలెను
రామం."
నాలుగుసార్లు ఉత్తరం చదివాడు గోపాలం' లలితని గురించి అతను ముందర గాభరాపడ్డాడు ఆమె విషయం ప్రతిరోజూ రాయమని అన్నయ్యకి ఉత్తరం రాసి పోస్టుచేసి వొచ్చి పుస్తకం తీశాడు చదవడానికి.
ఆ రాత్రి అతని చదువు సాగలేదు.
35
దసరా సెలవుల్లో ఇంటికి వెళ్ళడం అంటే ఎక్కువ ఇష్టంగా అనిపించలేదు గోపాలానికి. విశాఖపట్నంనించి వొచ్చేసేటప్పుడు అతనికి వీలైనంత త్వరలో మళ్ళీ రావాలనిపించింది, మొదటి కొంచెం సెలవు తీసుకుని ఐనా వెడదామనిపించింది. తరవాత వొదినకి వొంట్లో బాగులేదని అన్నయ్య రాసినప్పుడు చాలా ఆతృత పడ్డాడు, కాని వసంత అక్కడ ఉండడం అతనికి ఇంటికి వెళ్ళే ఉత్సాహాన్ని తగ్గించింది.
ఇంక మూడు రోజుల్లో సెలవులనగా అతను తీవ్రంగా ఆలోచించేడు ఇంటికి వెళ్ళాలావొద్దా అని. అక్కడికి వెడితే వసంతని కలుసుకోక తప్పదు: ఆ మాట వొదిన జాగ్రత్త పడుతుందని. అతనికి నిశ్చయంగా తెలుసును.
ఆ తరవాత?
వసంత ఏం చేస్తుంది? ఆమె తనకి క్షమాపణ చెప్పే మనిషికాదు- ఆమె దృష్టిలో తానే నేరస్థుడు......వొదిన ఈ చిన్న విషయాలు ఆలోచించదు- దహించుకుపోయిన తన ఆత్మ గౌరవం మీద ఆమెకి గౌరవం లేదు...
తనకోసమే వచ్చానని వసంత అనుకుంటుందా?
వెళ్ళకపోయినా వసంత తనని పిరికివాడిగా చూడవొచ్చును- ఈసారి తన దౌర్భల్యాన్ని వొదిన ముందూ దాచలేడు. ఆమె బాధపడుతుంది కూడా...
ఏం చెయ్యాలో తెలీని పరిస్థితిలో అన్నయ్య దగ్గరినించి మళ్ళీ ఉత్తరం వొచ్చింది- తన కోసం ఎదురు చూస్తున్నామని- వొదినకి బాగా కులాసాగా ఉంది;తాను వొచ్చే వివరాలు తెలియజెయ్యమని.
వెళ్ళకతప్పదని తెలుసును గోపాలానికి...అంతకుముందు ఏ ఆలోచనలున్నా ఈ ఉత్తరంతో నిశ్చయానికి వొచ్చాడు. కాని, ఆ ఉత్తరంలో వసంత ప్రస్తావమే లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది అతనికి... కావాలనే అమెమాట వొదిలేశారా?
కాలేజీనించి రాగానే ఇంటామే పిలిచి, పళ్ళెంలో చాలా ఫలహారాలు పెట్టి ఇచ్చింది.
ఏం విశేషమమ్మా?" అన్నాడు గోపాలం.
"చిన్నవడి పుట్టిన రోజు....మీదేం విశేషం బాబూ? చాలా సంతోషంగా ఉన్నావు?" అంది ఆమె,
నవ్వి, "సెలవులొస్తున్నాయికదా!" అన్నాడు గోపాలం, మెట్లెక్కి మీదికి వెళ్ళిపోతూ.
కాని. తనకి తెలియకుండానే ఏవో ఆనంద రేఖలు తనలో వెలుస్తున్నాయని గుర్తించేడు గోపాలం. స్నానంచేసి ఆరు బయట కూర్చుని "వసంత ఉంటే ఎంత బాగుండును!" అనుకున్నాడు,
మరుక్షణం వసంత చాలా కాలంనించి కన్న ఎక్కువగా. దగ్గరగా అతని ఆలోచనల్లోకి వొచ్చింది. ఆమె సౌందర్యం అతన్ని చాలా కలవరపెట్టింది.
ఆమె తనకి దగ్గిరగా. తన మనసుకి సన్నిహితంగా వొచ్చి తనని పులకరింపజేసిన రోజు జ్ఞాపకాలు ప్రవాహంలాగ ముంచెత్తేయి అతన్ని ఆరోజులు రావు! అని నిట్టూర్చాడు.
ఆమె తనకి దూరంగా. ఉదాసీనంగా తొలగి పోయి. తనని బాధల్లో ముంచెత్తిన రోజులుఅతనికి జ్ఞాపకం వొచ్చాయి. ఆ రోజులూరావు! అని ఆశించేడు- తాము ఇంక సమాంతర రేఖాలు. అనంతంలోనే కలుసుకోవడం...
వసంత నవ్వినట్లయింది.
గదికి తాళంవేసి చరచర బయటికి నడిచేడు గోపాలం- తన ఆలోచనలు తననే సిగ్గు పరుస్తున్నాయి. అంత నీచుడు కాదుతాను. వసంతని మరిచిపోగలడు .... ఆమె తనదికాదు. ఆమె లోకం వేరు. ఆమె అభిరుచులు వేరు...
సెకండ్ షో సినిమాచూసి ఆలస్యంగా వొచ్చి నిద్రపోయాడు గోపాలం! అతని ఆలోచనలు నిద్రపోలేదు.
అతను ఇంటికి చేరేసరికి రెండుదాటింది - తలుపుతీసిచూసి. "రాగోపాలం నువ్వు కాదేమో నని భయపడ్డాను!"అంది వొదిన,
ఆమె గొంతుకలోని వాత్సల్యం అతన్ని కదిపివేసింది.... గత వారాల్లో ఆమెని విమర్శించిన ఆలోచనలు జ్ఞప్తికి వొచ్చి సిగ్గుపడ్డాడు.
"చాలా నీరసించిపోయావు వొదినా." అన్నాడు ఆమెనిచూసి. బాగా తగ్గిపోయింది.
"నీరసం తప్ప బాధలేదు గోపాలం...ఈ కారణాన్నైనా పది కిలోగ్రాములు తగ్గితే మంచిది!"
అతని స్నానం అయాక అన్నంపెట్టి, "మీ అన్నయ్య ఎక్కడికో వెళ్ళేరు - రాత్రిదాకా రారు..." అంది లలిత.
"శ్రీనివాస్ ఏడీ?" అని అడిగాడు గోపాలం.
"వాళ్ళ స్కూలులో ఏదో నాటకం వేస్తారట- వీడికి అందులో పాత్ర. రిహార్సల్ కి వెళ్ళేడు"
"పెద్దవాడై పోయాడు వాడు?"
"ఆఁ...చిన్నతనం పోకుండా పెద్దతనం అల్లరి -"
చాలాసేపు విశేషాలన్నీ చెప్ప, అతనిమాట అడిగింది. లలిత. అతని ఇల్లూ, ఉద్యోగమూ, అక్కడజీవితం - అన్నిటినిగురించీ అడిగి ఇంటి విశేషాలన్నీ చెప్పింది - కాని, ఆమె ఆలోచించి మాట్లాడుతున్న విషయం అతను గమనించకుండా ఉండలేకపోయాడు.
అతను చాలా విషయాలు అడిగాడు. ఈ కొద్ది కాలంలోనూ ఇక్కడ చాలా జరిగింది.
అన్ని మాటలు అయాక టైమ్ చూసి, "అరే ఐదున్నర ఐపోయింది. మాటలో పడి పోయాం. కాఫీ ఇస్తాను" అని లోపలికి వెళ్ళిపోయింది లలిత.
కొంతసేపటి తరవాత కాఫీ తెచ్చి ఇస్తూ, "చాలా విశేషాలు అడిగావు గోపాలం!. కాని-" అని అడిగింది లలిత.
"ఏమిటి వొదినా?"
"వసంత మాట అడగలేదు నువ్వు!"
ఆమె అతని కళ్ళల్లోకి చూస్తూంది అతని ఆలోచనల్ని చదువుతూన్నట్టు.
