Previous Page
వసంతం పేజి 35

                                
    "అరే రక్తం వస్తూంది గోపాలం!" అని వసంత ఆ త్రుతతో ఎర్రగా తడిగావున్న బుష్ షర్ట్ మీద చెయ్యిపెట్టి వెనువెంటనే వెనక్కి తీసుకుంది.
    గోపాలం ఒక్కసారి భయపడ్డాడు. కాని వెనువెంటనే అతనికి వసంత శరీరం మీదవున్న గాయాల మచ్చలు జ్ఞాపకం తెచ్చుకుని చిరునవ్వు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ..... ఫరవాలేదులే....ఇందాకా .....శమ్మీ గోళ్ళు బాగా గుచ్చుకుని ఉంటాయి. ఇంటికి వెళ్ళేక మందు రాస్తాను. అన్నాడు.
    "ఈ గాయాలని వెంటనే
    అతనూ లేచి నిలబడ్డాడు,
    ఇద్దరూ నిశ్శబ్దంగా రోడ్డువద్దకు వచ్చాక. రిక్షా దొరికితే బాగుండును గోపాలం, మండుతోందా!" అంది వసంత.
    "కొంచెం మండుతోంది. పద... నిన్ను దిగబెట్టి యింటికి వెడతాను." అన్నాడు గోపాలం.
    "నువ్వు నన్ను దిగబెట్ట నక్కరలేదు. శమ్మీ ఉంది. చాలు పద. రిక్షా ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం."
    "కొంచెం మండుతోంది. పద... నిన్ను దిగబెట్టి యింటికి వెడతాను." అన్నాడు గోపాలం.
    "నువ్వునన్ను దిగబెట్ట నక్కరలేదు. శమ్మీ ఉంది. చాలు పద రిక్షా ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం"
    కొంచెందూరం నడిచినా రిక్షా ఏదీ కనుపించలేదు.
    అప్పటికి బాగా చీకటిపడి పోయింది.    
    అతను తిరగాల్సిన మలుపు వచ్చేసరికి గోపాలం అప్రయత్నంగా ఆమె యింటివైపు ఆమెతో నడక సాగించేడు. వసంత ఏమి అనలేదు కాని చిక్కటి ఆలోచనల్లో ఉండిపోయిన ఆమె పరిస్థితిని తన పరిస్థితితో సరిపోల్చగలిగాడు అతను.
    వాళ్ళిల్లు చేరుకునేటప్పటికి వెంకట్రామ్ యింట్లోలేడు
    అతన్ని డ్రాయింగ్ రూములో కూర్చోబెట్టి దీపాలువేసి. ఆమె త్వరగా లోపలకువెళ్ళి చేతులు కడుక్కువచ్చి. ముందర బుష్ షర్ట్ తీసెయ్ గోపాలం!" అంది.
    తెల్లబోయినట్లు చూసేడు గోపాలం.
    మరుక్షణం అతనికి జ్ఞాపకంవచ్చింది - యీ అమ్మాయికి తానుకానీ. తనకు ఆమెకానీ కొత్తవాళ్ళు కారని.
    అతను బుష్ షర్ట్. బనీనూ తీసేసి లోపలకు వెళ్ళి వీళ్ళతో గాట్లు పడినచోట కడుక్కువచ్చాడు.
    వసంత తువ్వాలు తెచ్చియిచ్చి అతను తుడుచుకున్నాక పాప్లన్ అందించి.... యిది రాసుకో గోపాలం." అంది.
    గోపాలం చేతితో వీపు తడుముకుంటూ మందు రాసుకోబోయాడు.
    వసంత పాప్లన్ ఆయింట్ మెంట్ అతని చేతిలోంచి తీసుకుని మృదువుగా గాయాలమీద రాసి "ఎలాఉంది యిప్పుడు?" అంది.
    "నువ్వురాసేక బాగుంది." అన్నాడు గోపాలం చిరునవ్వు తెచ్చుకుంటూ. ఆమె ఏమీ జవాబివ్వకుండా లోపలకు వెళ్ళి కొద్దినిముషాల్లో ఒక బనీనూ, బుష్ షర్టూ తెచ్చి యిచ్చింది.
    అతను తొడుక్కున్నాక యివి ఎక్కడివి?" అన్నాడు.
    మరిచిపోయావా? నువ్వు వచ్చేసేటప్పుడు కొన్ని బట్టలక్కడే ఉండిపోయాయి." అంది వసంత.
    "నాన్నగారెక్కడికి వెళ్ళేరు?"
    "ఆయన మఠానికి వెళ్ళిపోయారు. బాగా రాత్రిదాకా రారు."
    ఐదారు నిముషాలు ఎవరూ మాట్లాడలేదు.
    ఆమె అతని ఎదురుగా సోఫాలో కూర్చుని, రెండు చేతులలోనూ ముఖం పెట్టుకుని ఎక్కడో ఆలోచనల్లో వుంది.
    వెయ్యి మాటలు చెప్పాలని అతని హృదయం ఉరకలు వేస్తూంది. గతించిన రెండేళ్ళ ఒంటరితనపు జ్ఞాపకాలు ఆమె సాన్నిహిత్యంలో అతని అంతరాంతరాలలో పేరుకొన్న మమతలు కరగనున్నాయి. వాటితోనే ఆమె తనను విడిచిదూరంగా వెళ్ళిపోయి తనని పెట్టిన బాధలు ఈ ఆలోచనల ఉరకలకి అడ్డు వేస్తున్నాయి.
    అతనికి అక్కడినుంచి వెళ్ళాలని లేదు. కాని. అక్కడ ఉండాలనీలేదు. ఉయ్యాలా ఊగుతున్న యీ ఆలోచనలోంచి అతను కాఫీ తాగుతావా గోపాలం?" అన్న వసంత ప్రశ్నతో యివతలకు వచ్చాడు.
    "ఇంటికి వెళ్తాను వసంతా......ఒదిన చూస్తూ ఉంటుంది." అన్నాడు లేచి నిలబడుతూ గోపాలం.
    "నీ యిష్టం. కాని.... నువ్విక్కడ కెందుకొచ్చావు గోపాలం?" నేను చెప్పినప్పుడే నువ్వు యింటికి వెళ్ళి ఉండవలసింది." అంది. వసంత లేచి నిలబడి.
    "నిన్ను చూడాలని వచ్చాను వసంతా."
    "వసంత గదిలో ఉన్న నాలుగు దీపాలూ ఒక్కసారి వేసింది. అతని వేపు పూర్తిగా తిరిగి నిలబడి "బాగా చూడు గోపాలం" అంది. ఆ క్షణంలో ఆమె కళ్ళు చాలా ఎర్రబడ్డాయి.
    గోపాలం రెండు నిమిషాలసేపు తెల్ల బోయి చూస్తూ ఉండిపోయాడు ఆమె చేష్ట అర్ధం కాక.
    "ఒక్కటి తప్ప మిగిలిన దీపాలు తీసేసి రెండు చేతులు ఆమె భుజాలు మీదవేసి "నా ఉద్దేశం అది కాదని నీకు తెలుసు వసంతా నీకోసం నేను చాలా బాధపడుతున్నాను" అన్నాడు గోపాలం.
    "ఆ మాట నాకు తెలుసు గోపాలం. నీకు జ్ఞాపకమున్న ఆ వసంత యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. ఈ మచ్చలు శాశ్వతంగా ఉంటాయి గోపాలం?" అంది అతని చేతులను తీసేసి ఒక అడుగు వెనక్కి వేసి నిలబడుతూ వసంత.
    నేను బాధపడుతున్నది నీ ఒంటి మీది మచ్చలు చూసికాదు వసంతా! నా కళ్ళల్లో నువ్వు ఎప్పటి లాగే ఉన్నావు - నేను బాధపడుతూన్నది నీ జీవితం మీద వచ్చిన మచ్చకి! మన జీవితం మీద వచ్చిన మచ్చకి.
    అసలు ఏం జరిగింది?"
    "లలిత నీకు చెప్పలేదా!"
    "లేదు."
    "కారు కంట్రోల్ తప్పి ఎలక్ట్రిక్ పోల్ కి గుద్దుకుని తిరగబడిందా అదృష్టం కొద్దీ నేనొక్క ర్తినే ఉన్నాను వెంటనే అంబులెన్స్ రావడం వల్ల ప్రాణం దక్కింది."
    అతను ఆలోచనగా చాలాసేపు అలాగే నిలబడి చివరికి "వెళ్తాను వసంతా." అన్నాడు.
    ఆమె అతనితో గుమ్మందాకా వచ్చింది.
    బయట చిన్నగాలీ, చినుకులూ అప్పుడే ప్రారంభమయ్యాయి. అతను వెళ్ళబోతూంటే ఆపి. "వర్షం వొచ్చేలా ఉంది గోపాలం. ఒక్క క్షణం ఆగు, డ్రైవర్ ని పంపుతాను. డ్రాప్ చేసి వస్తాడు." అంది వసంత.
    కాని డ్రైవరు లేకపోవడంవల్ల తనే డ్రాప్ చేస్తానంది.
    అతను వారించినా వినకుండా ఆమే కారు తెచ్చింది.
    వాళ్ళిద్దరూ యింటికి చేరేసరికి లలిత గుమ్మంలో నిలబడిఉంది.
    గోపాలం కారు దిగగానే లలిత వర్షంలో నిలబడి "లోపలికి రా వసంతా." అంది.
    "తరువాత వస్తాను. ఇప్పుడు కాదు." అంది వసంత.
    "నేను బాగా తడవాలనిఉంటే వాదించు. కాని నిన్నొక్కర్తినే వెళ్ళనివ్వను." అంది లలిత. వసంత కారు దిగివచ్చి గుమ్మందగ్గర నిలబడింది.
    గోపాలాన్నీ, ఆమెనీ అక్కడే నిలబడమని లలిత లోపలకు వెళ్ళి పళ్ళెంలో కర్పూరం తెచ్చి వాళ్ళిద్దరికీ హారతి యిచ్చింది.
    "ఇదేమిటి ఒదినా?" ఒక్కక్షణం, ఆగి.
    "పెళ్ళిలో యిచ్చే హారతి ఇవాళయిచ్చేవు?" అన్నాడు గోపాలం లలిత తలమీద పడిన చినుకుల్లో గదిలోని దీపకాంతి ప్రతిఫలించి అవి చిన్న నక్షత్రాల్లా కనుపిస్తున్నాయి, ఆమె వసంతని దగ్గరగా తీసుకుని విచిత్రమైన సంతృప్తితో "అదినిజమేనయ్యా? అందుకే హారతి. ఈ అమ్మాయిని చెయ్యిపట్టుకుని జాగ్రత్తగా లోపలకు తీసుకురా." అంది వసంతను వదిలి లోపలకువెడుతూ.
    వసంత తలవంచుకుని అలాగే నిలబడింది.
    గోపాలం కొద్ది క్షణాలు ఆగి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని లోపలకు వెళ్ళేసరికి వసంత నెమ్మదిగా అతని చెయ్యి విడచి వెళ్ళిపోయింది.
    గోపాలం గదిమధ్యనిలబడి ఆలోచనల్లో అయిదారు నిముషాలు నిశ్చేతనుడై ఉండిపోయాడు.
    శ్రీనివాస్ వచ్చి- "ఏమిటి బాబయ్యా. అంతగా ఆలోచిస్తున్నావ్?" అన్నాడు.
    "చెప్పినా నీకు తెలియదులే" అన్నాడు మళ్ళీ ఈ ప్రపంచంలోకి వస్తూ గోపాలం,
    "అమ్మ తోరణాలు కడుతూంది. పిన్ని వంట చేస్తూంది. నేను స్వీట్సు తేవడానికి వెడుతున్నాను. సంగతేమిటని అమ్మనడిగితే చెప్పలేదుకాని నాకే తెలిసింది." అన్నాసు శ్రీనివాస్.
    వాణ్ణి మీదకెత్తి పట్టుకుని "ఏమిట్రా నీకు తెలిసింది?" అన్నాడు నవ్వుతూ గోపాలం.
    "చెప్పినా నీకు తెలియదు బాబయ్యా" అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ.
    అదీ నిజమే అనుకున్నాడు గోపాలం.

 

                                                 ---:సమాప్తం:----


 Previous Page

WRITERS
PUBLICATIONS