"ఈ జాకిట్టుగుడ్డలు బావుండలేదన్నావుగా, మళ్ళా ఇవే కుట్టించుకున్నావేం" అన్నాడు తను. "మీరు చేసే ఉద్యోగానికి మీ భార్యనైన నాకు ఈ పాటి జాకిట్టు గుడ్డలు చాలు. మన హోదాకు ఏమీ తీసిపోవు" అన్నది. ఆ రోజున గౌతమి సాధించిన సాధింపు మాటలు, తను పడ్డ కుమిలింపు, వ్యధా ఎన్నిటికీ మరువలేని ఘట్టాలు. ఉద్యోగ మన్నా, ధన సంపాదన న్నా తన మనస్సులో ఏర్పడిన అవ్యక్తమైన అభావనకు ఇలాంటి సంఘటనలు గీటురాళ్ళు. ఉద్యోగమంటే ఈ విముఖత, అయిష్టం ఎందువల్ల ఇంతగా తన మనస్సులో పాతుకు పోయి నట్లు? ఇంత మందికి మనోవ్యధ కలిగించి తను సాధించిన ఘననకార్యం మాత్రం ఏముంది? ఇదంతాకూడా తను తల్లిదండ్రులకు చేసే సేవలోకే వస్తుందా? వృద్దాప్యంలోని తల్లిదండ్రులకు చేదోడుగా ఉన్నట్లే అవుతుందా? తన ఈ అర్ధం కాని చర్యలను అర్ధంచేసుకో లేకనే గౌతమి, గుండె రాయి చేసుకొని వెళ్ళిపోయి ఈ తీరుగా ఉద్యోగం చేస్తున్నదా? తను ఎవరిని ఉద్ధరిస్తున్నట్లు? తన జీవితానికి సాఫల్యత ఏమిటి? తనకు ఇష్టంకాని ఉద్యోగం చేస్తూ ఇంతమందినీ సంతోషపెడుతూ ఉంటమే తన జీవిత ధ్యేయమా? లేక తన మన స్సుకు తృప్తికలిగే తీరున ఉద్యోగం చెయ్యకుండా కాలం గడుపుతూ ఇంతమంది హృదయాల్లో, మనస్సులో సంక్షోభం కలిగించటం న్యాయమా? ఏది సరైనది? ఏది ఆమోద యోగ్యమైనది?
పక్కమీద దొర్లుతూ ఉన్న జానకిరాంకు తండ్రి పిలుపు విలపించింది. గోడగడియారంలో తొమ్మిది దాటింది. కళ్ళు నులుముకుంటూ వెళ్ళి తలొంచుకొని తండ్రి ముందు నిల్చున్నాడు.
"పిలిచారా" మెల్లిగా అన్నాడు తలెత్తకుండానే.
"ఏమీలేదు. ఇంకా నిద్రలేవకపోతే ఏమిటో తెలీక, ఏమైనా సుస్తీగా ఉంటున్నావేమోనని తెల్సుకుందామని పిలిచాను"
అభిమానంతో సిగ్గుపడ్డాడు.
"ఏమీలేదు. కులాసాగానే ఉన్నాను"
ముఖం కడుక్కోటానికి వెళ్ళబోయాడు.
"నీ అనుష్టానంకావించి వెళ్ళేటప్పుడు ఒకసారి మాట్లాడి వెళ్ళు"
ఆజ్ఞాపూర్వకంగా ఉందామాట. మాటలో మనోవ్యధ వ్యక్తమైంది.
ముఖం కడుక్కొంటున్నంత సేపూ జానకిరాం ఆలోచిస్తూనే ఉన్నాడు. తండ్రి మాట్లాడే విషయాలేమిటో అని,
కొడుకు రాకకోసమే వేచి ఉన్నట్టుగా పడక్కుర్చీలో కూర్చున్నారాయన. భార్య వచ్చింది.
"జానకిరాం ను పిలిచారుట ఎందుకూ" అన్నదావిడ.
"ఏం పిలవకూడదా, వాడితో చాలా సంగతులు మాట్లాడాలి. ఈ ఇంటి గౌరవం నాకళ్ళముందే కప్పిపెట్ట బూనుకున్నారీ ప్రబుద్ధులు" ఆయనలో అవమానంతో కూడినకోపం పరవళ్ళు త్రొక్కుతున్నది.
"పరిష్కారం కాని విషయాలు చాలా ఉన్నమాట నిజమే. జానకిరాం మనస్సు ఎటువంటిదో మీకు తెలీంది కాదు. మీ కోపమంతా వాడిమీద వెళ్ళగక్కి వాడి మనస్సు బాధపెట్టకండి. ఈ రకంగా వీడినీ దూరం చేసుకోలేను" కడుపులోని కన్నా ప్రేమ కట్టలు తెంచుకొని కన్నీటి రూపంలో బైటపడగా ఇంక మాట్లాడలేక మెల్లిగా వెళ్ళింది ప్రభావతమ్మ, శాస్త్రిగారి కోపం సగం కరిగిపోయింది. జానకిరాంను నాలుగు దులిపి తన మనోవ్యధనంతా వెళ్ళగక్కి బలవంతాన అతని అభిప్రాయాలను మారుద్దామనుకున్నాడు. భార్య కన్నీళ్లు ఆయన కోపాన్ని చల్లార్చినయ్యి. జానకిరాం వచ్చి తండ్రి ఎదురుగా నిల్చున్నాడు. తలెత్తి కళ్ళద్దాలలోనుంచి కొడుకును నిలువెల్లా చూశాడు శాస్త్రిగారు. నలభైయ్యవ పడిలో పడుతున్న కొడుకుని ఆయన ఏమని కేకలెయ్యగలడు?
"జానకిరాం"
"ఏం నాన్నగారూ"
"నీ కన్న తండ్రినయినా నీ కన్న మించి నేను చదువుకోలేదు. నీ చదువు పూర్తయ్యే టంతవరకూ నీ స్వవిషయాల్లో నేను జోక్యం కలుగ జేసుకోలేదు. అప్పట్లో నిన్నుగురించిన బాధలు నాకేవీ కనుపించలేదు"
తలొంచుకొని మాట్లాడి, తలపైకెత్తి జానకిరాం ముఖంలోకి చూశాడు. తండ్రి మాటల్లోని ప్రతి అక్షరమూ గుర్తుంచుకున్నాడు. ఏమిటీ నాందీ ప్రస్తావన?
'చెప్పండి నాన్నా"
"అట్లా దగ్గరగా కుర్చీలో కూర్చో"
అధికారి ముందు తాబేదారులా, జడ్జీ ముందు ముద్దాయిలా, మేష్టారుముందు విధ్యార్ధిలా నిల్చున్న జానకిరాంను చూస్తుంటే ఆయన మనస్సు చిన్న బోయింది. జానకిరాం చేతులుకట్టుకొని వినమ్రుడై నిల్చున్నాడు.
"కూర్చుంటే చాలా సంగతులు మాట్లాడుకోవచ్చు"
ఈసారి తండ్రి మాట జానకిరాం జవదాట లేదు. పక్కనున్న కుర్చీ ఆయనకు దగ్గరగా జరుపుకొని కూర్చున్నాడు.
తనతో భేటీకి వచ్చిన సమాన ఉజ్జీలా కనుపించాడు ఇప్పుడు.
వాత్సల్యంతో జానకిరాం చేతిని తనచేతులోకి తీసుకున్నాడు. ఆయన మనస్సు కరిగిపోయింది.
"పెద్దవాళ్ళం. బ్రతికినన్నాళ్ళు బ్రతకబోం. తలకొరివి పెట్టవలసినవాడు, వాడి పని ఇదివరకే చేసేశాడు. ఆ రోజుతోనే, వాడు తల్లిదండ్రుల ఋణం తీర్చుకున్నాడు. ఆ నాడు పెద్దవాడు పెట్టివెళ్ళిన తలకొరివి ఈనాటివరకూ మా మనస్సుల్లో నిలువెల్లా మండుతూనే ఉంది. అది ఆరని జ్యోతి- కాదు ఆరని మంట. ఆ మంటలను నువ్వుచల్లార్చ లేక చూస్తూ వూరుకున్నావు ఇన్ని సంవత్సరాల నుంచీ. సకల విద్యాపారంగతుడివి. అన్ని శాస్త్రాలు, కావ్యాలు చదివావు. సరస్వతీదేవి నీ నెత్తినుంది. చదువు నూరిపోసిన ఆ తల్లి నీలో ఏమాత్రమూ ప్రజ్ఞను లేకుండా చేసింది. ఫలితం చదువుకు తగిన ప్రయోజనం కనిపించదు"
తండ్రి మాటలు శ్రద్దగా వినటం తప్ప ఏమీ మాట్లాడలేదు. ఈ నిస్సబ్దత ఆయన మనస్సులో కోపాన్ని రగిల్చింది.
"జీవితం పూలపాన్పూ కాదు, వడ్డించిన విస్తరీ కాదు, కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతయ్యి. ఈ రోజువరకూ నీలో ఉద్యోగం చెయ్యాలనే కోరిక కలగలేదంటే అది నీ ఖర్మ కాదు. బ్రతికి ఉన్నందుకు మా ఖర్మ. ఊరికే గోళ్ళుగింటూ కూర్చుని ఏవో పుస్తకాలూ, గ్రంథాలూ చదువుతుంటే అవ్వేమయినా నీకు బువ్వ పెడతయ్యిరా? ఉద్యోగం చెయ్యకుండా సర్వకాల సర్వావస్తల యందూ మా నెత్తినే ఎక్కి ఉన్నంతలోనే పొట్ట నింపుకుని మాతోనే ఉంటే అది తల్లిదండ్రులకు సేవచేసినట్లే అవుతుందా సంపాదించటం చేతకాక వాజమ్మలా ఇంట్లో తిని కూర్చుంటూ అమ్మకూ, నాన్నకూ సేవ చేస్తున్నానంటే ఆ పరమాత్ముడు మాత్రం హరిస్తాడా? అట్లాగని నువ్వు చదివిన ఏ కావ్యంలో ఉందో చూపించరా? ఎందుకూ పనికి రాని ఆ చదువు ఎందుకు చదివినట్లు? మా నెత్తి నెక్కి ఊరేగటానికా? వాడు అప్రాచ్యుడై వెళ్ళిపోయాడు. నువ్వు మమ్మల్ని అప్రాచ్యుల్ని చేస్తున్నావు." ఆయనకోపం తీవ్రతరమై ఆకాశాన్నంటింది.
"నాన్నా" శ్రీలక్ష్మి వచ్చింది.
"అంత కోపం ఎందుకు నాన్నా. నీ కోపతాపాలు చూసి, ధడిసి అన్నయ్య ఉద్యోగంలో చేర్తాడంటావా" అన్నది శ్రీలక్ష్మి.
శాస్త్రిగారి కోపం దిగజారింది పాదరసంలా.
"అవునమ్మా నిజమే"
శీలక్ష్మి వెళ్ళింది.
"నువ్వు సంపాదన పరుడువి కాదనీ, తన చేతి గాజులకూ, నుదుటి కుంకుమకూ, గజంజాకిట్టు కూ కూడా మమ్మల్నే అడగాల్సు వస్తున్నదనే అభిమానంతో గౌతమి వెళ్ళిపోయింది. పరోక్షంగా నీ భార్యను నువ్వు వెళ్ళగొట్టావు. అందుకు మేం బాధ్యులం కాము. మీ కన్న తక్కువ చదువుకున్నది నీ సలహా సంప్రదింపులు లేకుండానే గౌతమి ఉద్యోగం చేస్తున్నదంటే నిజంగా మనం సిగ్గుపడాల్సిన విషయమే. గౌతమి ఉద్యోగం చెయ్యాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో నువ్వేమయినా ఆలోచించావా? నీ మనస్సులో మార్పు తేవటానికే అట్లా చేసింది. ఏదో ఉత్తరం వ్రాసిందట. సమాధానం రాశావా, మీరిద్దరూ అక్కడ ఆ ఊళ్ళో కాపుర మున్నా మాకు ఇష్టమే. ఇంక నేను చెప్పాల్సిందేం లేదు. నేను వృద్దుడ్ని. నువ్వు బాధ్యత నెరిగిన పెద్దవాడివి. వృద్ధిలోకి రావలసిన వాడివి. ఈ కుటుంబంలో నీ కొడుకులు అప్రయోజకులు. కోడళ్ళు ఉద్యోగాలు చేస్తారు. ఈ మాటలు దశ దిశలూ అంతా చెప్పుకునే టట్లుగా ప్రవర్తించారు. మనకే కాదు. చూసే వారికి, వినేవారికి కూడా నీ ప్రవర్తన సిగ్గుచేటుగా ఉంది. మంచిది వెళ్ళు." లేచి వెళ్ళాడాయన.
ఖిన్నుడైపోయాడు జానకిరాం. ఇంత తీవ్రంగా తండ్రి మాట్లాట్టం ఎప్పుడూ చూడలేదు జానకిరాం. తండ్రి చెప్పినదంతా నిజమే అందులో ఒక్క మాటకూడా కల్పించి చెప్పలేదు. సంవత్సరాలనుంచీ గతించిపోయిన మనః క్లేశాన్ని ఇవాళ ఆయన వెళ్ళబోసుకున్నాడు. తన జీవితమూ, తన ఉనికీ అప్రయోజకత్వంగానే కనిపిస్తున్నది. తనను చూసి ఎవరు సంతోషిస్తున్నారు? సంపాదనపరుడు కాక పోతే కన్నతల్లి దండ్రులకూ, కట్టుకున్న భార్యకూ కష్టంగానే ఉంటుంది. ఇంతమంది మనస్సులకు వ్యధ కలిగించి తను అనుభవిస్తున్న సుఖం సంతోషాలేమున్నయ్యి?
25
ఆ రోజున కృష్ణమూర్తికి గుండెనొప్పి ఎక్కువైంది. స్వాతి డాక్టర్ని పిలిపించింది. డాక్టర్ ఇంజక్షను ఇచ్చి మందిచ్చి వెళ్ళాడు. వెళుతూ కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండమన్నాడు. ఆయాసంతో రొప్పుతూ పడుకున్నాడు కృష్ణమూర్తి. గుండెలు చిక్కబట్టినయ్యి.. ఎక్కువగా మాట్లాడలేక పోతున్నాడు. స్వాతి విచారానికి అంతులేదు. గుండెలు రాస్తూ కూర్చుంది.
"వూపిరి తిత్తులు రెండూ ఎవరో నలిపేసి నట్లుగా ఉంటున్నదీ స్వాతీ. చాలా బాధగా ఉంది." అన్నాడు. ఆయాసపడుతూ కృష్ణమూర్తి.
"తగ్గిపోతూంది. మనస్సులోని మమతా, గుండెల్లోని కలతా ఒక్కసారి పోవు. ఈ నిర్భాగ్యురాల్ని కట్టుకున్న తరువాత అన్ని మమతలకూ దూరమయ్యారు. ఇంక మిగిలింది గుండెల్లోని కలత మాత్రమే. అదే గుండె జబ్బుగా మారింది. దాని కంతకూ కారణం నేనే కదూ" కంఠంలో ఉద్వేగం, నరనరాలలోని మనోవేధనా లయ విన్యాసం చేస్తుంన్నయ్యి. "స్వాతీ, అక్కడే పొరబడుతున్నావు. నిన్ను చేసుకోవటంనుంచి నేను పాడవలేదు. ఒక రకంగా ఆలోచిస్తే నువ్వే నానుంచి బాధలకు గురవుతున్నావేమో, నీ మెడలో తాళిగట్టి భార్యగా నిన్ను చేపట్టానేగాని భర్తగా నాబాధ్యతను నెరవేర్చుకోలేకపోయాను. మొదటి రెండేళ్ళు నన్ను స్వర్గంలో నడిపించావు. నా సమక్షంలోనూ, నా పరోక్షం లోనూ నన్నే స్తుతించావు. అప్పట్లో నిన్ను అనేవాళ్ళు గుర్తుందా" మెల్లిగా నవ్వుతూ ఆమె బుగ్గమీద చిన్న చిటికె వేశాడు. సిగ్గుతో కుంచించుకుపోయింది స్వాతి.
"ఏమనేవారు." ఆ మాటలేవో ఈ రోజున తను విని ఆనందించటానికి అడగలేదు స్వాతి. తమ సంసార జీవిత ఘట్టాలు చర్వితచరణం చేసుకుంటే ఆ ఆనందాతిశయంతో కూడిన భావతరంగాలేమయినా తగ్గేటట్లుగా చేస్తయ్యేమోనని ఆశ.
"ఏమనేవారో నీకు తెలీదా స్వాతీ" ఆయాసం లోనే ఆనందంగా అన్నాడు.
"మీరు చెపితే మళ్ళా వినాలనివుంది"
"ఆ బాపనయ్యని కొంగున గట్టక తిరుగుతుండావా సోతెమ్మా" అనే వాళ్ళు కదూ మీ వాళ్ళంతా" బాధను వెనక్కు నెట్టి నవ్వాడు కృష్ణమూర్తి.
"అప్పుడు మీరేమనుకున్నారో అదికూడా చెప్పండి ఆ మాటలు దాచి పెట్టటం ఎందుకూ" ఓరగా చూస్తూ అడిగింది స్వాతి. ఆ చూపు ఈ స్థితిలో ఇప్పుడు చూడవలసింది కాదు. ఆ చూపుకు విలువ కట్టలేని నాణ్యత ఉంది. ఆ చూపులోనే అందర్నీ ఎదిరించి అతను సేదతీర్చుకున్నాడు. తామిద్దరూ ఉన్నప్పుడే, తామిద్దరూ మాట్లాడు కుంటున్నప్పుడే, ఒకసారిగా అట్లా చూసేది స్వాతి. ఆ చూపులో ఐశ్వర్యాలు కనబడేవికావు. జాతిమత భేదాలు కనబడేవికావు. అపవాదులూ, అనుభవాలూ గుర్తుకొచ్చేవికావు. చల్లని తెల్లని పూర్తి వెన్నెలా, గల గలలాడుతూ స్వచ్చంగా ప్రవహించే సెలయేరులా, వొడ్డును ఒరుసుకుంటూ ప్రవహించే చల్లని నదీ మతల్లిలా ఉంది. "ఆ చూపు కోసమే నేను జీవించి ఉన్నాను స్వాతీ" అనేవాడు. ఆ చూపు చూసి నాలుగయిదేళ్ళయింది. అట్లా చూస్తే తన హృదయంతల్పం మీద శయనించి సేద దీర్చుకుంటాడని ఆమెకు తెల్సు. ఇదివరకు రోజుల్లో ఆ చూపు వెనక కాంక్ష ఉండేది. ఆ కాంక్ష వెనుక కోరిక ఉండేది. ఆ కోరిక వెనుక మనశ్శాంతి ఉండేది. ఆ మనశ్శాంతి వెనుక మానసికోల్లాసం ఉండేది. ఈ నాడు స్వాతి ఆ కోరికలతో ఆకాంక్షలతో చూడలేదు. ఆ అనుభూతులకోసం అర్రులు చాచటంలేదు. ఆ తృప్తిని ఆశించడంలేదు. అతని ఆత్మ తృప్తికోసమే, అతని సంతోషం కోసమే అట్లా చూసింది స్వాతి. అది ఇద్దరికీ తెలుసు.
