Previous Page Next Page 
అపస్వరం పేజి 34


    ఒకవారం గడిచేసరికి శాముకు పల్లె వదలి ఎన్నో ఏళ్ళయినట్టనిపించింది. ఇహ ఉండలేక పోయాడు. కృష్ణయ్యగారి అనుమతి పొంది, వెళ్ళి పొయ్యాడు.
    శాము వెళ్ళిన మరునాడే మీర తలనొప్పి, జ్వరాలతో మంచం పట్టింది. కృష్ణయ్యగారు, గోపాల్ మీద కోపంతో,
    "వీడికేం తెలీదు. మీరను వెంట పెట్టుకొని ఒకటే తిరగటం. అలసటకాదా మరి. ఒట్టి మనిషి కూడా కాదు. జ్వరం రాక ఏమవుతుంది" అని చిందులు త్రొక్కారు. దగ్గరగా నున్న డాక్టరును పిలిచి చూపించారు.
    ఆయన లేడీ డాక్టరుకు చూపించటం మంచిది అని సలహా ఇచ్చారు.
    కమలమ్మగారు మీరను తీసుకొని చెలువాంబా హాస్పిటలుకు వెళ్ళారు. ఉదయం ఎనిమిదింటికి కాఫీ తాగి బయలుదేరితే డాక్టరుని చూడటానికి పన్నెండయింది. ఆసుపత్రి వరండాలో వేసిన బల్లలమీద కడుపుతో నున్న ఆడవారు పాలిపోయిన మొహాలతో కూర్చున్నారు. గర్భపాతంవల్ల నీరసించిన స్త్రీలనుండి నేలలు నిండిన స్త్రీల వరకు అన్ని రకాలవారూ ఉన్నారక్కడ.
    వారి దైన్యావస్తనుచూసి, ఆడబ్రతుకుపైనే రోత కలిగింది మీరకు.
    పట్టు చీర కట్టుకుని మోకాలిదాకా తెల్లటి కోటు వేసుకొని, స్టెతస్కోపు మెడలో వేసుకొని తెల్లటి బూడ్సులతో వెడుతున్న లేడీ డాక్టర్లను చూసి మీర హృదయంలో వెనుకటి ఆకాంక్ష భూతంలా పైకి లేచింది. తనకూ అదృష్టం ఉండి ఉంటే ఇక్కడే వారితోటి డాక్టరై ఉండేది. తనకా అదృష్టం లేదన్న తలంపుతో ఆమె కళ్ళల్లో నీరు తిరిగాయి.
    తెల్ల చీర కట్టుకున్న నల్లటి నర్సు బయటికి వచ్చి "నెం. 151" అని పిలవగానే మీరలేచి గదిలోకి వెళ్ళింది. మీర వెంబడే కమలమ్మగారూ వెళ్ళారు.
    మెడికల్ ఆఫీసర్ మీరను పరీక్షించారు. ఆమె మొహం కోపంతో కందగడ్డయింది. పెట్టుకున్న అద్ధాలు తీసి, తుడిచి మళ్ళీ పెట్టుకున్నారు కొంచం కోపంతో.
    "నువ్వు రావటం ఇదే మొదటిసారి కదూ?" అన్నారు.
    మీర ఆమె తలలోని తెలుపు మిశ్రితమైన నల్లటి వెంట్రుకలువేపు చూస్తూ "ఔను" అంది.
    "ఆరోనేల వచ్చిందికదా! ఇంతవరకు రాక పోవటమేం?" అంటూ కమలమ్మగారివేపు తిరిగి
    "మీ అమ్మాయా?" అన్నారు.
    "అవును."
    డాక్టర్ కోపంతో "అమ్మాయిని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళకండి. ఇక్కడే వో పదిహేనురోజు లుండాలి. కాన్పు మామూలుగా అవదు. 'డయల్టేషన్'కు చోటేలేదు. ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి" అన్నారు.
    డాక్టర్ మాట విని భయంతో మీర మొహం తెల్లబడింది. పెదవులు వణికాయి డాక్టరది గమనించి మృదువుగా.
    "నువ్వేం భయపడకమ్మా. ఆపరేషన్ చాలా సులువు. నువ్వు పురిటి నొప్పులు కూడా అనుభవించక్కర్లేదు. నొప్పులు ప్రారంభ మవగానే తెలివి తప్పించి ఆపరేషన్ చేసేస్తాం" అని చెప్పి ఇంజక్షన్, టానిక్కులు రాసిచ్చారు.
    నర్సు, మీరను స్పెషల్ వార్డుకు తీసుకెళ్ళింది.
    కమలమ్మగారికోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు కృష్ణయ్యగారు. ఆమె రాగానే, గాబరాతో డాక్టరు చెప్పిన విషయాలన్నీ భర్తతో చెప్పారు.
    "ఈ కాలం పిల్లలకు వంట్లో సత్తువన్న మాటే ఉండదు. మా కాలంలో అంతా ఈ డాక్టర్లే ఉన్నారా? ఏడెనిమిది మంది పిల్లల్ని కనేవారుకారా? ఇప్పటి పిల్లల శరీరమంతా పాడు చదువుతో చచ్చుబడిపోయింది." అని గొణిగారావిడ.
    ఆపరేషన్ అనగానే గుండె గభీల్ మంది కృష్ణయ్య గారికి.
    "ఇదేం గ్రహచారం దాపరించిందిరా దేముడా" అనుకుంటూ "ముందు వెళ్ళి దేము డెదుట నేతి దీపాలు వెలిగించు" అని చెప్పారు. కమలమ్మగారు చేతులు కడుక్కొని దేముడిముందు నేతిదీపాలు వెలిగించి, దణ్ణం పెట్టుకున్నారు.
    క్రుస్నయ్యగారు, భార్య రావటం ఆలస్యమవుతుందేమోనని అన్నమూ చారు వండి ఉంచారు.
    "కమలా, క్యారియర్లో అన్న మిస్తావా ఆసుపత్రికి వెళ్ళివస్తాను"
    "ఊ. అలాగే మీర పెట్టె తాళం చెవి ఇచ్చింది. ఏభై రూపాయలు తీసుకెళ్ళి ఇంజక్షన్లు అవి తెచ్చి పెట్టండి." అంటూ కమలమ్మగారు మీర పెట్టె తెరచి ఏభై రూపాయలు తీసుకొని మళ్ళీ పెట్టె తాళం వేసేశారు.
    కృష్ణయ్యగారు నర్సులను అడిగి, మీర ఉన్న వార్డు కనుక్కొని లోపలికి వెళ్లారు. పడకమీద కూర్చున్న మీర కృష్ణయ్యగారు భోజనం తేవటం చూసి,
    "పెదనాన్నా, ఇంకా రెండు రోజులు అన్నం తినొద్దన్నారు డాక్టరు" అంది.
    "అయితే మరేం తీసుకుంటావ్?"
    "పాలు బ్రెడ్డు ఇక్కడే ఇస్తారు. పళ్ళు తినొచ్చట. డబ్బు తెచ్చారా?"
    "ఆఁ తెచ్చానమ్మా."
    మీర, డాక్టరు రాసిచ్చిన చీటీ కృష్ణయ్యగారి కిచ్చి "ఈ ఇంజక్షన్లు బత్తాయి పళ్ళు తెచ్చి పెట్టండి..... అలాగే వచ్చే టప్పుడు కాస్త పేపరు, కాలం, కవరు తీసుకురండి. ఆయనకు ఉత్తరం రాయాలి."
    మీర వుత్తరం అందిన మరుసటిరోజే ఆతృతతో పరుగెత్తుకొంటూ వచ్చాడు శాము. ఇంటికి కూడా వెళ్ళకుండా, స్టేషన్ నుండి తిన్నగా ఆస్పత్రికే వచ్చాడు. మీరవున్న వార్డు వెతుక్కుని వచ్చే సరికి, మంచంమీద కూర్చుని పండువలచి తింటూంది, మీర. నర్సు మీర దగ్గరనుంచొని, ఒకటే కబుర్లు చెప్పేస్తోంది. శాము లోపలికి రాగానే, మాట లాపేసి, అతని వేపే చూస్తూ బయటికి వెళ్ళిపోయింది.
    మీర అతని ముఖంలోని కంగారును చూసి నవ్వింది. శాము కుర్చీని మంచం దగ్గరికి లాక్కొని కూర్చుంటూ,
    "ఎలా ఉన్నావు, మీరా" అని అడిగాడు.
    "మీరే చెప్పండి."
    "చాలా చిక్కిపోయావు. డాక్టరేమన్నారు."    
    "ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలన్నారు. ఇంజక్షన్సు ఇస్తున్నా రిపుడు."
    "డబ్బయిపోగానే రాయి. పంపిస్తాను."    
    "మీరు ఇంటికి వెళ్ళొచ్చారా?"
    "లేదు."
    "అయితే ఆకలితోనే ఉన్నారన్నమాట. వెళ్ళి భోంచేసిరండి ముందు."
    "వెడతాన్లే. వచ్చేటప్పుడు బాగా టిఫిన్ పట్టించాను."
    మీర బలవంతంగా అతనికి బత్తాయిపండు ఇచ్చింది. మీర మాట తీసివేయలేక తీసుకున్నాడు, శాము. పండువలచి తొనలు విడిపిస్తూ,
    "ఇంకా ఎన్నిరోజు లుండాలట?" అనడిగాడు.
    "పదిహేనురోజు లుండాలట! ఇప్పటికి మూడు రోజులైంది. తరువాత కూడా రోజూ వచ్చి వెళ్ళాలట."
    గంట మూడైనా శాము పైకి లేచే సూచనలే కనబడకపోవటంతో,
    "మీరు ముందు ఇంటికి వెళ్ళిరండి. తరువాత మాట్లాడుకోవచ్చు. స్పెషల్ వార్డు కదా. ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు." అంది మీర.
    శాము విధిలేక లేచి బయల్దేరాడు. ఇంటికి వెళ్ళి భోంచేసి వెంటనే హాస్పిటల్ కు బయల్దేరాడు. కమలమ్మగారు "కాస్సేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం ఆసుపత్రికి వెళ్ళ"మని చెప్పినా ఆగక ఆస్పత్రికి వెళ్ళి మీరతో మాట్లాడుతూ కూచున్నాడు. భవిష్యత్తును గురించి, మీర భయపడితే, ఆమెకు ధైర్యం చెప్పాడు. తను అధైర్యపడినప్పుడు, ఆమెచేత ధైర్యం చెప్పించు కున్నాడు.
    ఆరు గంటలకు కృష్ణయ్యగారు వచ్చారు ఎనిమిదింటికి ఇద్దరూ ఇంటికి వెళ్ళారు.
    "నే నిక వెడతాను, మీరా. ఉదయమే పల్లెకు వెడతాను."    
    కృష్ణయ్యగారు, "అప్పుడే వెళ్ళిపోవాలటయ్యా" అన్నారు.
    "అవునండి, మళ్ళీ మీర యింటి కొచ్చేరోజు వస్తాను.
    శామును ఇంకా ఉండమని బలవంతంచేసి ప్రయోజనంలేదని వూరుకుంది, మీర.
    పదిహేను రోజులు ఆసుపత్రిలో గడిపేసరికి విసుగెత్తిపోయింది, మీరకు. రోజూ వస్తూన్న జ్వరం తగ్గిపోయి కులాసా చిక్కింది. పెద్ద డాక్టరు, ప్రతిరోజూ వచ్చి పరీక్ష చేయించుకొని వెడుతూండమని హెచ్చరించి, ఇంటికి వెళ్ళటానికి అనుమతించారు.
    మీర ఇంటి కొచ్చేసరికి, ఇంట్లో ఉన్న శామును చూసి ఆశ్చర్యంతో "మీర ఎప్పుడొచ్చారు?" అనడిగింది.    
    "ఇప్పుడే, ఓ ఆరగం టవుతుంది. నువ్వు ఇంటి కొచ్చే రోజున వస్తానని చెప్పానుగా. మరచిపోయావా?"
    "అవును. నేను మరచే పోయాను."
    శాము రెండు రోజులు మైసూరులోనే ఉండి ఉదయంపూట మీరను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు.
    మూడవరోజు ప్రయాణమవుతూ, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరించాడు. మీరని, మీర,
    "మళ్ళీ ఎప్పుడొస్తారు, మీరు?" అనడిగింది.
    "నువు తల్లివి కాగానే."
    "కాని, మీర తల్లి కాకమునుపే శాము రావలసి వచ్చింది.
    మీర ఎప్పటిలాగానే ఒకరోజు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, ఆమెను పరీక్షించిన డాక్టరు, ఆశ్చర్యపోయారు.
    "నొప్పులొస్తున్నాయా, అమ్మాయ్?"
    "లేదు డాక్టర్."
    "సంకోచపడక చెప్పమ్మాయ్."
    "నిజంగాలేదు డాక్టర్."
    "లేబర్ పెయిన్ ప్రారంభమయింది. నరాల బలహీనతవల్ల నీకు తెలియటంలేదు. ఈరోజు ఇంటికి వెళ్ళకు" అని బయటికివచ్చి కమలమ్మ గారితో డాక్టరు,    
    "మీ అల్లుడ్ని పిలిపించండి త్వరగా. ఆపరేషన్ చేయాలి." అని చెప్పారు.
    కమలమ్మగారు గాబరాగా ఇంటికి వచ్చి, కృష్ణయ్య గారితో విషయం చెప్పారు. వెంటనే శాముకు ఎక్స్ ప్రెస్ టెలిగ్రాం వెళ్ళింది.
    డాక్టరు, ఆపరేషనుకు అంతా సిద్ధం చేసుకొని, శాముకోసం ఎదురుచూస్తున్నారు. పిచ్చెత్తినవాడిలా ఆసుపత్రిలోకి ప్రవేశించిన శామును, నర్సు ఆఫీసురూములోకి తీసుకెళ్ళింది.
    లేడీ డాక్టరు అతనిముందో కాయితం ఉంచి, కాలం చేతికిచ్చి, "సంతకం పెట్టండి. మీ భార్యకు ఇంకోసారి కడుపు వస్తే బ్రతికే ఆశలేదు. అందుకని ఇంకోసారి కడుపు రాకుండా గర్భకోశాన్ని తిప్పివేయాలి. దానికి మీ అనుమతి కావాలి" అన్నారు.
    శాము ఏమీ ఆలోచించే పరిస్థితిలో లేడు. వణుకుతున్న చేతితో సంతకంపెట్టి బయట బల్లమీద కూర్చున్నాడు.
    శాము సంతకం చేయగానే, డాక్టరు మీరను ఆపరేషన్ గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టారు. స్విచ్ వేయగానే కళ్ళు చెదిరేలా దీపాలు వెలిగాయి. ఆ వెలుగు భరించలేక కళ్ళు మూసుకుంది మీర. క్లోరోఫారం ఇవ్వగానే, తెలివి తప్పిపోయింది.
    మీరకు మళ్ళీ తెలివి వచ్చేసరికి, సాయంత్రం నాలుగయింది.
    కళ్ళు తెరిచేసరికి చుట్టూ ఉన్న ప్రపంచ మంతా మసక మసకగా కనిపించింది. కుర్చీలో కూర్చొని తనవేపే చూస్తున్న శాము, అపరిచితుడిలా కనిపించాడు.
    క్షీణ  కంఠంతో "ఎవరది?" అంది.
    శాము ఆమె చేతిని మృదువుగా నిమురుతూ, "నేను మీరా" అన్నాడు. మీర పెద్దగా కళ్ళు తెరచి, అతని మొహంలోకి చూసింది. మృదుమందహాసం ఆమె కళ్ళల్లో మెరసి మాయమయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS