13
సుబ్బారావుగారి భార్య కావేరమ్మకు తాము ధనవంతులన్న గర్వం ఎక్కువ. మీర వాళ్ళధోరణికి తగ్గట్టుగా పెద్ద జరీఅంచుగల బాదామీ కలర్ కంచి పట్టుచీర కట్టుకుంది. కమలమ్మగారు ఆ చీరనుచూసి ఆశ్చర్యంతో.
"ఈ చీరెపుడు కొన్నావ్ మీరా?" అనడిగారు,
"ఆయన బెంగుళూరు వెళ్ళినపుడు తెచ్చారు"
"ఫరవాలేదే. శామన్న మంచి చీరలే ఎన్నుకుంటాడు. వెలెంత?"
"రెండువందలట."
అంత భారీ చీర కట్టుకున మీరాతో సాదాచీరతో బయలు దేరటానికి ఒక్క నిమిషం బాధ పడ్డాడు కమలమ్మగారు. అసూయ తొంగిచూసింది. మరుక్షణమే "చ, మీర నేను పెంచి పెద్ద చేసిన పిల్ల. అది మంచి గుడ్డలు కట్టుకుంటే చూసి సంతోష పడాలిగాని......" అని తమ్ముతామే సమాధాన పరచుకొన్నారు.
వరండాలో కూర్చొని అల్లరి చేస్తున్న కిశోర్ ని ముద్దులాడుతూ, పుస్తకంలోని పేజీలను తిరగేస్తున్న నమ్ర్ధ మీరను చూసి "రండి రండి" అని ఆహ్వానించింది.
కొత్తవారి రాకతో కిషోర్ ఒక్క క్షణం స్తబ్దంగా నుంచున్నాడు. కమలమ్మగారిని గుర్తుపట్టి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, "బామ్మా" అంటూ ఆమె కాళ్ళకు పెనవేసుకున్నాడు. కమలమ్మ గారు కిశోర్ ని ఎత్తుకుని ముద్దులాడుతూ "అత్తయ్యరా" అంటూ మీరను చూపించారు. ఇంతకు మునుపు తను చూసినప్పుడు ఎర్రగా మాంసపు ముద్దలా ఉన్న బిడ్డ ఇపుడు మూర్తీభవించిన ముగ్ధత్వంతో ముద్దొస్తూ ఉండటంచూసి ఆశ్చర్యపోయింది మీర." "రా బాబు" అంటూ చేతులు చాచింది.
"ఊహు" అంటూ కమలమ్మగారి భుజం మీద తల దాచుకున్నాడు కిశోర్.
"ఇంకా కొత్త కాస్త పాతపడనీ, తరువాత నీ పని చెపుతాడు" అన్నారు కమలమ్మగారు.
అంతలో రాధవచ్చి "లోపలికి రండత్తయ్యా. రా మీరా. అప్పుడే ఈ కొంటె మిమ్మల్ని నిలవేశాడన్నమాట." అంది,
"నీకు వంట్లో కులాసాగా ఉందామ్మాయ్"
"ఊఁ"
లోపల ఏదో పై చేసుకుంటూన్న కావేరమ్మ గారు, త్వర త్వరగా చేతులు కడుక్కుని బయటికి వచ్చి "రండి రండి" అన్నారు. మీరనుచూసి "పెళ్ళిలో ఇంతున్న పిల్ల ఎంతయిందిపుడు. మా నర్మద చెప్పిందమ్మాయ్. మీ ఇంట్లో చాలా బాగా చూశారట. అక్కడనుండి వచ్చాక నెల రోజులదాకా అదే మాట మా నర్మదకు....."ఏ నర్మదా ఎక్కడున్నావే ఇలారా."
"వస్తున్నా ఆగమ్మా కాస్త" లోపలనుండే బదులు చెప్పింది నర్మద, కావేరమ్మగారు మీరకు చేస్తున్న మర్య్హాదలను కమలమ్మగారు కూడా గమనించారు. చిన్నప్పుడు పరికిణీలు కట్టుకొని నర్మదతో ఆడుకోటానికి వస్తూన్న అల్లరిపిల్ల ఇప్పుడో పెద్ద జమీందారు భార్యగా తను ఇంట్లో అడుగు పెట్టడం గొప్పగా ఉందావిడకు.
చిన్నప్పుడు నర్మధతో ఆడుకోటానికి వెళ్ళినప్పుడు తనవేపు కన్నెత్తి చూడని కావేరమ్మగారు ఇప్పుడు తనను ఎంతో ఆదరాభిమానాల్తో పలుకరిస్తూండటం గమనించి మీర "ఈలోకంలో డబ్బుకున్న స్థానం దేనికీలేదు' అనుకుంది మనసు లోనే.
నర్మద, ఒక పళ్ళెంలో చక్కిలాలు, రెండు గ్లాసుల కాఫీ తెచ్చి వారి ముందుంచింది.
"ఏమిటే నర్మదా, వాకీ మర్యాదలన్నీను."
"మీ ఇంట్లో నువ్వు చేసినంతగా చెయ్యలేదు గానీ తీసుకో"
మీర రాత్రి ఎనిమిదింటిదాకా వారింట్లోనే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంది.
పెదనాన్న ఇంట్లో మీరకు అన్ని విధాలా అనుకూలంగానే ఉంది. కమలమ్మగారు కూతురిచేత ఏ పనులూ చేయించేవారుకాదు. మీర కోరిన వంటలు, ఫలహారాలు వెంటనే చేసి పెట్టేవారు. శ్రీపాదు కాలేజి లైబ్రరీ నుండి కన్నడం, ఇంగ్లీషు నవలలు తెచ్చి పెడుతూండేవాడు. శామునుండి తప్పక వారానికో ఉత్తరం వచ్చేది. ఎక్కువ చదువు లేకపోయినా, రసవత్తరంగా ఉత్తరాలు రాసే శాము రసికత్వాన్ని మెచ్సుకునేది మీర.
గోవిందుడి పెళ్ళి ముహూర్తానికెక్కడ రాధకు పురుడొస్తుందోనని బెంగ పెట్టుకున్న కమలమ్మ గారిని, మనవరాలు పుట్టిందన్న వార్త సమాధాన పరిచింది. కూతురి బరస్లకు గోపాల్ రాలేదు. తమ్ముడి పెళ్ళికోసం, శలవు అట్టే పెట్టుకు న్నాడు. గోవిందు పెళ్ళికిముందు రోజున శాము వచ్చాడు. అదేరోజు సాయంత్రం గోపాల్ దిగాడు. ఇల్లు చుట్టాలతో నిండి, సందడిగా ఉంది.
మీర, గోపాలం అన్నయ్యని శాముకు పరిచయం చేసింది. శాము సంకోచంతో, "మీపరిచయం అవటం చాలా సంతోషంగా ఉందండీ" అన్నాడు.
గోపాల్ తన స్నేహమయమైన ఒక్క చిరు నవ్వుతోనే శాము హృదయాన్ని ఆకర్షించాడు. గోపాల్ శాము రూపాన్ని, మాటల్లోని మొరటు తనాన్ని, దాని వెనుక డాగిన సరళతను, మృదుత్వాన్ని మెచ్చుకున్నాడు.
మీర ఎదుట శామును "నీ భర్త హెర్కులిస్" అని పొగడాడు. గోవిందుడి పెళ్ళి నిర్విఘ్నంగా నెరవేరింది. నూతన వధు కరుణ, మీర వెనువెంటనే స్నేహితులయ్యారు. రెండు రోజుల్లో విడిదినుండి పరివార సమేతంగా తమ ఇంటికి మరలి వచ్చరు కృష్ణయ్యగారు.
పెళ్ళయిన మరుసటిరోజే శాము పల్లెకు వెళ్ళి పోతానన్నాడు.
"అప్పుడే ఏం తొందరయ్యా గోపాలం కూడా వచ్చాడా. అందరూ ఒకచోట కలవటమే అరుదు. ఇంకెప్పుడు ఇలా కలుస్తామో ఏమో. ఈ నాలుగు రోజులూ ఉండి వెడుదుగాని" అన్నారు కృష్ణయ్య గారు. శాము ఒప్పుకున్నాడు.
మీర, గోపాల్ ఇంగ్లీషు సినీమాలంటే మోజు పడేవారు. స్త్రీలు అర్ధ నగ్నంగా నృత్యం చేస్తూంటే అసహ్యం వేసేది, శాముకు. ఇలాంటి సినీమాలను ఎందుకంత ఇష్టపడి చూస్తారో అర్దమయ్యేది కాదతనికి. మీరకోసం కాకపైనా, గోపాలంతో రానని చెప్పలేక వాళ్ళతో కలసి వో రెండు ఇంగ్లీషు సినీమాలకు వెళ్ళొచ్చాడు శాము.
గోపాల్ శలవు లయిపోగానే బొంబాయికి ప్రయాణమయ్యాడు. వెళ్ళేముందు మీరతో.
"మీరా నువ్వు పెద్దదాని వయ్యావు. నీ జడ పట్టుకొని లాగటానికి వీలులే దిపుడు. కాని, ఈ నా చేతికి. మా కిశోరే నీ అల్లుడు. ఇప్పటినుంచి మర్యాదగా చూస్తూండు వాడిని" అని హాస్యం చేశాడు. "నేనూ వత్తా" నని ఏడుస్తున్న కిశోరుని "హాస్పిటల్ కు వెళ్ళొస్తారా బుజ్జీ" అని మరిపించి వెళ్ళాడు.
