ఎప్పుడొచ్చారు?"
"అయిదురోజులవుతోంది, నేను వచ్చి."
"వచ్చి అయిదురోజులయినా నాదగ్గరికి రాలేదేం?"
"అయిదు రోజులుగా నీ దగ్గరే కూర్చున్నా. నీకు ఆపరేషన్ చేసిన రోజునే వచ్చాను, నేను."
"అయితే ఈరోజు ఏవారం?"
"శుక్రవారం."
"అయితే నాకు ఆపరేషన్ చేసి అయిదురోజులయ్యాయన్నమాట. మరి ...... బిడ్డ ...... బిడ్డ" అంటూ చుట్టూ చూసింది మీర. పక్కలో గాని, మంచానికి ఆనుకుని ఉన్న ఉయ్యాలలో గాని బిడ్డ కనిపించలేదు.
శాము, "కంబారుపడకు మీరా. నీకు శ్రమ గలగకూడదని, నర్సు బిడ్డను, వేరే చోటికి తీసుకువెళ్ళింది."
"ఏం బిడ్డ?"
"అమ్మాయి."
మీర ఆశా మమతలతో "పిలిపించండి. నేను చూడాలి" అంది.
శాము లేచి బయటికి వెళ్ళాడు. మీర ఆతురతతో తలుపువేసే చూస్తోంది. అయిదు నిమిషాలయ్యాక శాము లోపలికి వచ్చి "బిడ్డ నిద్రపోతోంది. లేచాక తీసుకొస్తారట" అన్నాడు.
మీర రుద్ధకంఠంతో "నిద్రపోతూంటేనేం? నేనేం లేపను. తెహేసుకురండి. బిడ్డపుట్టి అయిదురోజు లయినా, ఇంతవరకూ నేను బిడ్డ మొహమే చూడలేదు. తీసుకురారూ" అని బ్రతిమాలుకో సాగింది. ఆమె
కంఠంలోని దైన్యత, తపన గమనించి, 'నాకు పిల్ల లొద్దన్న' మీర ఈమేనా? అని ఆశ్చర్యపోయాడు శాము.
తెల్లటి గుడ్డలు వేసుకున్న నర్సు ఆకుపచ్చ రంగు గుడ్డలో చుట్టిన బిడ్డను ఎత్తుకువచ్చింది. మీర పెద్దగా కళ్ళు తెరచి చూడసాగింది. దూరం నుండి బిడ్ద నల్లజుత్తు మాత్రమే కనిపిస్తోంది. నర్సు దగ్గరికి రాగానే, మీర పైకి లేవటానికి ప్రయత్నించింది.
"ష్ .... పైకి లేవకండి, మీరు. ఇంకో వారం మిమ్మల్ని పైకి లేవనివ్వకూడదని, చెప్పారు డాక్టరు. ఎక్కువగా మాట్లాడకండి. నోరెండి పోయి, నీరు కావాలంటే ఇవ్వం. అసలు బిడ్డను ఇక్కడికి తేవద్దనే చెప్పారు డాక్టరు. మీ వత్తిడి వల్ల ...." అంటూ బిడ్డను ఉయ్యాల్లో పడుకో బెట్టి రగ్గు సరిగ్గా కప్పింది.
లే చిగుళ్ళలాంటి గుప్పిళ్ళు బిగించి, శాంతంగా నిద్రపోతోంది, బిడ్డ. పాలబుగ్గలనూ, మృదువుగా పువ్వులా ఉన్న చేతులూ, కాళ్ళనూ చూసి చెప్పలేని ఆనందం అనుభవించింది మీర.
ఇలాటి బిడ్డనా నే నొద్ధన్నాను? అనుకుంది మనసులోనే.
"బిడ్డ మంచి ఆరోగ్యంగా ఉంది. పుట్టి నప్పుడు తొమ్మిదిపౌనులుంది." నర్స్ చెప్పింది.
"నా ప్రక్కలో పడుకోబెట్టండి, కాస్సేపు" మీర ప్రాధేయపడింది.
"ఊహుఁ. వీల్లేదండి, బిడ్డను ఇక్కడికి తీసుకొచ్చానని తెలిస్తేనే కోప్పడుతా రసలు. మీకు కులాసా చిక్కాక, మీరే చూసుకుందురుగాని" అంటూ బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోయింది, నర్సు.
"వెళ్ళిపోయింది, చూశారా" అంది మీర నిరాశతో.
ఆమె కంఠంలోని ఆర్ద్రత అతని హృదయాన్ని కదలించింది. ఆమె నుదుటిమీద చేతితో నిమురుతూ.
"ముందు నీకు నయంకాని. మన పాప మన ఇంట్లో ఉండక, ఎక్కడికి పోతుంది? తల్లి వి నువ్వు కాకపోతే, ఎవరు చూస్తారు?" అంటూ వోదార్చాడు.
పాప పుట్టి ఇరవై అయిదురోజులయ్యాయి, ఇంటికి వెళ్ళొచ్చని చెప్పారు, డాక్టరు.
చంటిపాప నెత్తుకొని ఇంటికి వచ్చింది, మీర. ఆ మరునాడే బారసాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. సాయంత్రం పాపను ఉయ్యాలలో వేసే శాస్త్రముంది. ముందురోజునుండి శాము, మీర పాపకు ఎలాటి ఉయ్యాల తేవాలి అని చర్చించుకోసాగారు.
"నేనూ బజారుకు వస్తాను. టెక్నలాజికల్ ఇన్ స్టిట్యూట్ లో మంచి ఉయ్యాల దొరుకుతుంది. చూసి తెద్దాం" అంది, మీర.
"మీరా, నీ కెన్నేళ్ళొచ్చినా, ఇంకనూ పసీ పాపాయినే! ఇంకా మూడు నెలలు బయట తిరగకూడదని చెప్పలా, డాక్టరు? ఈసారి నువ్వు నాకు దక్కటం, నా అదృష్టం. నువ్విలా పట్టు పట్టావంటే, నే నిప్పుడే వూరికి వెళ్ళిపోతాను" అని బెదిరించాడు, శాము.
మీర "ఊఁ ఊఁ" అని రాగం తీసింది. శాము,
"కాస్త స్థిమితంగా ఆలోచించుకో, మీరా. నా కూతురి కెలాటి ఉయ్యాల తేవాలో నాకు తెలీదూ? నేను తెచ్చింది, నీకు నచ్చకపోతే అపుడు చూద్దాం. మళ్ళీ మార్చి ఇంకోటి తెస్తాను. సరేనా? చెప్పు" అని వోదార్చాడు.
"ఇంకా నీకూ, పావకూ ఏమేమి కావాలో చెప్పు తెస్తాను."
"కాయితం, కలం తీసుకోండి అన్నీ చెపుతాను, రాసుకుందురుగాని." శాము కాయితం, కాలం చేత పట్టుకుని సిద్ధముగా కూర్చున్నాడు.
"ఒక్క ఫీడింగ్ బాటిల్, నిప్ ల్స్, రబ్బర్ షీట్, దోమతెర, నాలుగు డబ్బాలు కుటికురా పౌడరు...."
"ఇంతేనా?"
"ఉండండి.......గ్రైప్ వాటర్, గ్లాక్సో, గ్లూకోజ్ గెలకి ..."
కాయితం రెండు వేపులా నిండిపోయింది.
"కాయితం పూర్తయింది."
తదేకచిత్తంతో ఏం కావాలో ఆలోచిస్తూన్న మీర, "వేరే కాయితం తెచ్చుకోండి" అంది.
శాము బుద్ధిమంతుడైన విధ్యార్ధిలా, లేచి వెళ్ళి మరో కాయితం తెచ్చుకుని కూర్చొని, "ఊఁ. సరే చెప్పు" అన్నాడు.
మీర కావలసిందంతా చెప్పి, ఒకసారి లిస్టు చదివించుకుని, విని, తృప్తితో తల వూపింది.
తన కూతురి అందాన్ని చూసి సంబర పడింది, మీర. తమిద్దరి రూపలావణ్యాలనూ పుణికి పుచ్చుకొని జన్మించిన చిన్నారి పాపను ఎంత చూచినా తనివితీరేదికా దామెకు. పసిపాప ముగ్ధ సౌందర్యానికి తగినట్టుగా, బుగ్గలమీద సొట్టలు పడటం చూసి మురిసిపోయింది, మీర. "నా పాప అదృష్టవంతురాల"ని పొంగిపోయింది.
శామూ, కృష్ణయ్యగారు ఇంటికి వచ్చేసరికి మద్యాహ్నం రెండయింది. శాము తెచ్చిన రోజ్ ఉడ్ ఉయ్యాల మీరకు నచ్చింది.
"ఫరవాలేదు. మీ అభిరుచిని మెచ్చుకోవచ్చు" అంది.
శాము నవ్వుతూ "నిన్ను ఎన్నుకున్నప్పుడే తెలియలేదా ఆ సంగతి?" అన్నాడు. మీర చెప్పిన సామానులు కాకుండా, పాపాయికి రెండు జతల బంగారు గాజులు, ఓ గొలుసు, కాళ్ళకు పాంజేబులు తెచ్చాడు. మీర, శాము బంగారం కొనటాన్ని ఆక్షేపించింది.
"ఇంట్లో మీ అమ్మగారి నగలు అని ఉన్నాయి కదా? బంగారు వెల మండిపోతున్నప్పుడు, ఇవెందుకు కొన్నారు?"
"ఎప్పుడైనా ఆ నగలు మన అమ్మాయి వేసుకోవలసినవేగా?"
"ఈ పూర్వకాలపు నగలు నా కక్కర్లేదంటే......"
"అప్పటికి చూసుకుందాంలే. ఆడపిల్లకు రేపటికి లక్షణంగా, గాజులు గొలుసూ ఉండక్కర్లేదా?
ఆరోజు రాత్రి పిల్లకు పేరేమి పెట్టాలన్న విషయంలో పెద్ద చర్చే జరిగింది.
కమలమ్మగారు "రేపు పాపకు ఏంపేరు పెడదాం" అన్నారు.
కృష్ణయ్యగారు, "శామన్నా, మంచిపేరొకటి చూసి చెప్పు నాయనా" అన్నారు.
శాము మీరవేపు చూస్తూ "నాకేమో మా అమ్మపేరు పెట్టాలనుంది. పెద్దవారి పేరు పెట్టి నట్టూ ఉంటుంది. దేవుని పేరూ కలిసి వస్తుంది" అన్నాడు.
మీర తన సూచనను నిరోధిస్తుందని శాముకు మొదటే తెలుసు. తెలిసే యుద్ధానికి సన్నద్ధుడై శంఖాన్నిపూరించాడు. మీర శాము మాట తఃనకు వినిపించనట్టు నటించి,
"నేనో పేరు పెట్టాలని నిశ్చయించుకున్నాను" అంది.
బారసాలకోసం వచ్చిన గోవిందుడి భార్య కరుణ "ఏం పేరు నిశ్చయించుకున్నారో చెప్పండి. మీరు చెప్పే పేరు తప్పక బాగుంటుంది" అంది.
కరుణకు మీరంటే అమిత ఆత్మీయత. మీర మాటలన్నీ హాస్యమయం. ఆమె ఎన్నుకునే దుస్తులంతా కళామయం అని భావించి, ఆమెకు తన ఆదర్శవ్యక్తిగా రూపొందించుకుంది.
శ్రీపాదు "చెప్పు మీరా, నీవేపేరు చెప్పినా, నేను దానికే ఓటు వేస్తావు" అన్నాడు.
"నేను 'వీణా' అని పెట్టాలనుకున్నా."
ఆ పేరు విని శాము పులుపు తిన్నవాడిలా మొహం పెట్టాడు.
"అంత తియ్యటి పేరు పుల్లగా అనిపించిందా, మీకు?" అంది, మీర.
పూర్వకాలపువాళ్ళయిన కృష్ణయ్యగారికి, కమలమ్మగారికి మీర చెప్పిన పేరు నచ్చలేదు.
"శామన్న చెప్పిన పేరే బాగుందమ్మాయ్. పేరూ బాగుంది, తల్లిపేరు పెట్టుకున్నట్టూ ఉంటుంది."
మీర మాట్లాడకుండా క్రింది పెదవి కొరుక్కుంటూ కూర్చుంది. తన కోపాన్ని దిగమింగుకుంటున్న ఆమెను చూసి నవ్వు వచ్చింది శాముకు.
మీర తేరుకుని "అది పూర్వకాలపు పేరు. బాగాలేదు" అంది.
కమలమ్మగారు "పూర్వకాలపు పేరైతేనేం? వాటిలో ఉండే మాధుర్యం ఇప్పటి కాలం పేర్లలో ఏదీ? నీ పేరే చూడు పూర్వకాలపు పేరైనా ఎంత మధురంగా ఉందో" అన్నారు.
కరుణ, శ్రీపాదు, మీర పరంగానే వాదించారు. కాని, పెద్దవారి నిర్ణయం ఎదుట చిన్నవాడి వాదం నిష్ప్రయోజన మయింది.
