Previous Page Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 33

                   

                                   21

    బాలభానుని బంగారు కిరణాలు కిటికీ లో నుండి వచ్చి పడుతున్నాయి. మెట్లమీద పెట్టి ఉన్న క్రోటను మొక్కలు మంచుతో తడిసి సూర్యుని కాంతిలో మైమరచి తళతళలాడుతున్నాయి.
    సుధీర కిటికీ దగ్గరగా కూర్చుని కాఫీ చప్పరిస్తూ ఆకాశం వేపు చూస్తుంది. అక్కడక్కడా ఉన్న మబ్బులు నిండు గర్భిణిలా మెల్లగా, హుందాగా కదిలిపోతున్నాయి. దూరంగా ప్రహరీ గోడకానుకుని వున్న టెంకాయ చెట్లు లేత ఎండలో వింతగా మెరుస్తున్నాయి. రాత్రి చూసిన సినిమా మనసులో మెదులుతూనే ఉంది.
    అంతస్తులకూ, అంతఃకరణలకూ మధ్య జరిగిన ఘోర సంఘర్షణ . రంగు రంగుల రాట్నం లాంటిది అంతస్తు, గిర్రున తిరగడం వల్ల ఒకవిధమైన ఆనందం కలుగుతుంది.
    ఒక మాయాజాలంలో చిక్కుకున్నట్లు తక్కిన ప్రపంచాన్ని గురించీ, మనుషులను గురించి మరిచిపోవడం జరుగుతుంది. ఆ రంగుల రాట్నం నుండి క్రిందకు దిగడం, మామూలు మనుషుల్లా నేల మీద తిరగడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు.
    కానీ ఆ అంతస్తు మీద ఉన్న మోజు వల్ల అంతిమ విజయం అంతఃకరణకేనన్న విషయాన్నీ మానవుడు తాత్కాలికంగా మరిచిపోతాడు. మరిచిపోయి మానవత్వానికి దూరమవుతాడు. అయినా అది క్షణికమే! అంతఃకరణలనూ, అనురాగాలనూ చివరకు గుర్తించడం తధ్యం! అదే మానవునిలోని మానవతకు నిదర్శనం. అందుకే మానవుడు మానవుడుగానే మనగలుగుతున్నాడు.
    గేటు ముందు ఆగిన రిక్షాలో నుండి మీనాక్షి దిగింది. సుధీర ఆలోచనలు టక్కుమని ఆగిపోయాయి. కాఫీ కప్పుతో పాటే లేచి వరండా లోకి వచ్చింది.మీనాక్షి ముఖం నిండుకూ ఆదుర్దా , విచారం అలుముకొనున్నాయి.
    "అలా ఉన్నావెం? ఏవైంది?" ఆత్రంగా అడిగింది సుధీర.
    "రాత్రి అన్నయ్య ఇంటికి రాలేదు." మీనాక్షి కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి.
    "కాంపు కెళ్ళాడెమో?" అంది సుధీర అది అసంభవమని తెలిసీ.
    "ఊహూ.... నిన్ననేగా కాంపు నుండి వచ్చాడు? ఒకవేళ అలా వెళ్ళేటట్లయితే నాకు చెప్పకుండా వెళ్ళడు" అంది మీనాక్షి నేల చూపులు చూస్తూ.
    "ఇంకెక్కడి కన్నా వెళ్ళాడెమో? అంతగా భయపడిపోతే ఎలా, మీనాక్షి?" అంది సుధీర నవ్వి.
    "లేదు, నాకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళడు. అలా ఎన్నడూ జరుగలేదు."
    "పోనీ యిప్పుడు జరిగిందనుకుందాము. నువ్వేం కంగారు పడకు. ఇంకా సేపటికల్లా బావ వచ్చేస్తాడు. ముందు కూర్చో" అంటూ కాఫీ తెచ్చేందుకు లోపలికి వెళ్ళింది సుధీర.
    సుందరం స్నానం ముగించుకుని అప్పుడే హాల్లోకి వస్తున్నాడు మెల్లగా గోడపట్టుకుని. యుద్ధం నుండి వచ్చాక సుందరం అలవాట్లు చాలా మారిపోయాయి. ఉదయాన్నే స్నానం, చెయ్యడం కొన్ని మంచి అలవాట్ల లో ఒకటి. సోఫా ఆధారం చేసుకోని రావడంతో మీనాక్షి భుజం తగిలింది.
    "ఎవరది? సుధీ?"
    "కాదు"
    "మీనాక్షి?"
    "ఊ"
    "ఇంత ప్రొద్దున్నే వచ్చావెం?"
    "రాత్రల్లా అన్నయ్య యింటికే రాలేదు."
    సుందరం సోఫాలో కూర్చుని ఆలోచించ సాగాడు. సుధీర రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి సుందరానికి ఒకటి, మీనాక్షి కి ఒకటి యిచ్చింది. వెనకనే లలితమ్మ వచ్చింది ఆదుర్దాగా.
    "ఏవైంది మీనాక్షి! రాత్రి యింటి నుండి ఎప్పుడు వెళ్ళాడు?" అంది లలితమ్మ.
    "విజయతో పాటే వచ్చాడత్తయ్య!"
    మేడమేట్లు దిగి వస్తున్న విజయ ఆ మాట విని ఏమైంది?" అంది మీనాక్షి ముఖంలోకి చూస్తూ.
    "నీతో పాటు వచ్చిన అన్నయ్య తిరిగి యింటికే రాలేదు."
    "అక్కయ్యతో పాటే మేడ మీది కెళ్ళాడు" అంది సుధీర.
    "ఏవైంది విజయా? ఇద్దరూ ఏవన్నా ఘర్షణ పడ్డారా?" అన్నాడు సుందరం.
    "ఘర్షణ పడేటంతటి సంబంధం మా యిద్దరి మధ్య ఏం లేదు! ఆ విషయం తెలుసుకుంటే మంచిది.' అందివిజయ ముఖం చిట్లించి.
    ఆ మాటలకు అందరూ ఆశ్చర్యంగా చూశారు విజయ ముఖంలోకి.
    విసవిసలాడుతూ విజయ స్నానాల గది వైపు నడిచింది.
    "పోనీ, సాయంత్రం వరకూ చూద్దాము. అప్పటికీ రానట్లయితే ఏదో ఒక ఏర్పాటు చేద్దాము." అన్నాడు సుందరం.
    "సరే!' అన్నారు ముగ్గురూ.
    లలితమ్మ మటుకు దిగులుగా సోఫాలో జేర్ల పడింది.
    "నువ్వేం దిగులు పడకమ్మా! బావ తప్పకుండా సాయంత్రాని కల్లా వస్తాడు" అంది సుధీర.
    కాసేపటికి విజయ స్నానం ముగించుకుని వచ్చి సుధీర ప్రక్కనే సోఫాలో కూర్చుంది. నౌకరు కాఫీ తెచ్చి టేబిలు మీద పెట్టాడు.
    "నేనీరోజు హైదరాబాదు వెళ్తున్నాను." అంది కాఫీ కప్పు తీసుకుంటూ విజయ.
    "ఇంకా సెలవుందిగా?' అంది లలితమ్మ ఆశ్చర్యంగా కూతురి ముఖంలోకి చూస్తూ.
    "ఇక రెండు రోజులేగా ఉంది? వెళ్తాను."
    అందుకు ఎవ్వరూ ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా విజయ ముఖంలోకి చూస్తుండి పోయారు.
    "నేవెళ్ళి ఐ-స్పెషలిస్టుల్నంతా కన్సల్టు చేస్తాను. ఉత్తరం రాయగానే సుందరాన్ని పంపండి!' అంది విజయ. సుందరం ఏమీ మాట్లాడలేదు.
    "అయితే నీవల్ల కాదా?'అంది లలితమ్మ.
    "ఉహు...." తల అడ్డంగా తిప్పింది విజయ.
    "నేనిప్పుడప్పుడే అంత దూరం ప్రయాణం చెయ్యలేను , విజయా! అందుకేగా నిన్ను పిలిపించింది?' అన్నాడు సుందరం.
    "పోనీ, బాగా బలమోచ్చేకే రా! ఓ నెల తర్వాత.
    "నాకేం నమ్మకం లేదు."
    "అలా అధైర్యపడకన్నయ్య!" అంది సుధీర.
    నౌకరు తో కారు సిద్దంగా ఉంచమని చెప్పి విజయ మేడమీదికి వెళ్ళిపోయింది.
    వెళ్ళేటప్పుడు సుధీరతో -- "భాను వచ్చాక నాకు ఉత్తరం రాయి"అని చెప్పి మరీ వెళ్ళింది.

                                 22
    భానుమూర్తి ఆరోజు సాయంత్రం రాలేదు. ఆ తర్వాత గూడా రాలేదు. మేనేజరుకూ, బస్సు కండక్తర్ల కూ, డ్రైవర్ల కూ అందరకూ భానుమూర్తి విషయం చెప్పి కనిపిస్తే తీసుకు రమ్మన్నాడు సుందరం. 'అత్తయ్యా, మీనాక్షి నీకోసం దిగులు పడిపోయారు 'అని కూడా కొన్ని పత్రికల్లో ప్రకటన వేయించారు. రెండు వారాలు అలాగే జరిగి పోయాయి. మీనాక్షి, కుప్పగా కూలిపోయింది. లలితమ్మ బలవంతం మీద అక్కడే ఉండిపోయింది. లలితమ్మ పైకి ధైర్యంగా కనిపించినా లోలోపలే కుమిలిపోసాగింది. సుధీరా, సుందరం మటుకు ధైర్యం విడిచి పెట్టక చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
    రాఘవయ్య మాస్టారింట్లో మటుకు భానుమూర్తి వెళ్ళిపోయిన విషయం తెలియనీక అతి ప్రయత్నం మీద దాచారు. రాఘవయ్య మాష్టారు చివరకు అడగనే అడిగారు -- దాచకుండా విషయమేమిటో చెప్పమని. బస్సు పర్మిట్ కోసం హైదరాబాదు వెళ్ళాడని చెప్పింది సుధీర చివరకు తప్పించుకోలేక.
    విశాల పరిస్థితి ఇంకా క్షీణించి పోయింది. భానుమూర్తి హైదరాబాదు వెళ్ళేటప్పుడన్నా తనతో మాట మాత్రమైనా చెప్పకుండా ఎందుకు వెళ్ళాడో అర్ధం కాలేదు. సుధీర బలవంతం మీద మెడికల్ లీవు పెట్టి చదువు కొద్ది రోజుల పాటు అపుచేసింది. చెక్కిళ్ళూ, పెదిమలు రక్తం లేక మరీ పాలిపోయాయి. మనిషి బాగా చిక్కిపోయింది. వాంతులూ, విపరీతమైన తలనోప్పీ ఎక్కువయ్యాయేగానీ తగ్గలేదు.
    ఆరోజు ఎలాగయినా సరే విశాలను డాక్టరు దగ్గరకు తీసి కెళ్ళాలని సుధీర తీర్మానించుకొని వెళ్ళేందుకు ప్రయాణమవుతుంది. పోస్టు మన్ వచ్చి సంతకం చేయించుకుని బరువైన రిజిష్టరు కవరోకటి సుధీర చేతిలో పెట్టాడు. కవరు చించి కాగితాల మడతలు విప్పింది.
    'అంత పెద్ద ఉత్తరం ఎవర్రాశారు? శేఖరమేనా?' అక్కడే కూర్చొనున్న మీనాక్షి పాలిపోయిన ముఖంలోకి నవ్వును తెచ్చుకుంటూ అంది.
    "నిన్న సాయంత్రమేగా శేఖరం వచ్చి వెళ్ళింది?" అంది సుధీర నవ్వుతూ.
    'అయితే ఏం? మరి శేఖరం కాదా రాసింది?"
    "కాదు, విజయ" అంది సుధీర కాగితాలు తిప్పుతూ.
    "విజయా!' అంది మీనాక్షి ఆశ్చర్యంగా. మొన్న మొన్ననే వెళ్ళిన విజయకు అంత పెద్ద ఉత్తరం రాయవలసిన అవసరమేమిటో మీనాక్షికి బొత్తుగా అర్ధం కాలేదు.
    సుధీర ఉత్తరం చదవడంలో మునిగి పోయింది. ఉత్తరం చదవడం పూర్తయ్యే సరికి సుధీర కళ్ళ నిండుకూ నీళ్ళు నిండాయి.
    "ఏవిటది?" మీనాక్షి కలవరపడి అడిగింది.
    "చదువు" అంటూ ఉత్తరం మీనాక్షి చేతిలో పెట్టింది సుధీర.
    ఐదు నిమిషాల్లో చదవడం పూర్తి చేసి "ఎంత పనిచేశావు విజయా!" అంది మీనాక్షి.వ్యధిత కంఠంతో దోసిట్లో ముఖం దాచుకొని.
    "ఇప్పుడెం చేయాలి?" అంది సుధీర కన్నీళ్ళు తుడుచుకుంటూ.
    "అన్నయ్య ఎక్కడున్నాడని పంపుతావు?' తలెత్తి అంది మీనాక్షి.
    'అది వీలు కాదు. బావ వెళ్ళిపోవడాన్ని గురించి విశాల ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంది. ఇప్పటి కన్నా విశాలకు నిజం చెప్పడం మంచిది కదూ?"
    "ఏమో సుధీ! నాకేం తోచడం లేదు. ఈ తాకిడికి విశాల తట్టుకోగలదా?"
    "అయినా తప్పదు. ఇంకా ఈ విషయాలను దాచడం ఎన్ని అనర్ధాలకు దారి తీస్తుందో? బావే విశాలకు జాబు రాస్తే ప్రమాదం కదూ?"
    "అవును"
    "నేను విశాలా వాళ్ళింటికి వెళ్తాను. ఈ విషయం నువ్వు యింట్లో చెప్పకు. అన్నయ్యా, అమ్మా చాలా బాధపడతారు." సోఫాలో నుండి లేస్తూ అంది సుధీర.
    "ఎప్పటి కన్నా తెలియవలసిన విషయమే! ఎన్ని రోజులని దాస్తావు?"
    "ఎప్పుడు చెప్పాల్నో అప్పుడే చెప్తాము." జీరగొంతుతో అంది సుధీర.
    మీనాక్షి సరేనన్నట్లు తల ఆడించింది. సుధీర వెళ్ళిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS