Previous Page Next Page 


    రంగారావుగారి కలవరింతల గురించి ఓసారి సుజాత కల్యాణితో చెప్పింది. కల్యాణి తెల్లపోతూ "ఏమంటున్నారు?" అంది మళ్ళీ చెప్పమన్నట్టు. సుజాత మళ్ళీ చెప్పింది. కల్యాణి అదోలా నవ్వింది. "మంచిదే, మమ్మల్నిద్దర్నీ కలిపి చంపితే మంచిదే, కలిసి యెలాగో బ్రతకలేక పోయాం. కలిసి చచ్చిపోయె అదృష్టమయినా కలిసి వస్తుంది" అంది.
    
                                             21
    
    రామకృష్ణని చూసిన మొదటి రోజునే కల్యాణికి ఓ ఆలోచన వచ్చింది. సుజాతకి, అతనికి వివాహం జరిగితే బాగుంటుందన్న ఊహ మనసులో మెదిలింది. ఆ ఆలోచన వచ్చాకే రామకృష్ణని అసిస్టెంటుగా పెట్టుకోడానికి నిర్ణయించుకుంది. ఈడు, జోడు బాగుంటుంది, చదువు కొన్నవాడు. జీవితంలో అభివృద్ధిలోకి తప్పకుండా వస్తాడు. అతనూ సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చినవాడు. సుజాతకి అన్నివిధాలా సరిపోతాడు-అని మనసులో ముందురోజు వచ్చిన ఆలోచన రోజురోజుకీ పెరిగింది తప్ప ఆ అభిప్రాయం పోలేదు కల్యాణికి.
    శెలవు రోజుల్లో సుజాత పిల్లలని తీసుకొని సినిమాకో, గార్డెనుకో, షాపింగ్ కో, ఎక్కడికో అక్కడికి తీసికెళ్ళేది. ఓ రోజు సుజాత పిల్లలని తీసుకొని సినిమాకు బయలుదేరుతుంటే కల్యాణి "ఏమోయ్, రామకృష్ణా! నీవూ సినిమాకి వెళ్ళకూడదుటోయి" అంది.
    "అబ్బే వద్దండీ, నాకేం సినిమాలు అవి చూడడం పెద్ద అలవాటు లేదండి" అన్నాడు మొహమాట పడుతూ.
    "సినిమాలు చూడడం అలవాటుకాదోయ్.....అభిరుచి. నీ వెక్కడో పదో శతాబ్దంతో పుట్టాల్సినవాడులా వున్నావు. వెళ్ళు.....వెళ్ళు......లైఫ్ ఎంజాయ్ చేసే టైము యిదేనయ్యా, ఇంట్లో ఇలా అమ్మాయిలా కూర్చుంటా నంటావేమిటి? అమ్మాయిలే కూర్చోడం లేదు ఇక్కడకు వచ్చి నాలుగయిదు నెలలయింది. ఒక్క పూటన్నా నీవు శెలవుతీసుకోలేదు, ఎక్కడికీ వెడతాఅని అడిగిన గుర్తూ లేదు. నీవూ వాళ్ళతో వెళ్ళు, సరదాగా గడిపిరండి" అంది కల్యాణి.
    "అబ్బే వద్దండీ ఎందుకండీ మీరొక్కరే చూసుకోవాలి పని" నసిగాడు రామకృష్ణ.
    "మరేం ఫరవాలేదు. నీవు లేనపుడు ఇదివరకు నే నొకతినే చేసుకోలేదేమిటి, నా కలవాటే. నా కోసం ఆలోచించకు, వెళ్ళిరండి అందరూ" అంది.
    రామకృష్ణ యింకా సందిగ్ధంగా ఆలోచిస్తూ నిల్చున్నాడు.
    "అంకుల్, రా, అంకుల్, ఆంటీ మనం అందరం సరదాగా వెడదాం" పిల్లలిద్దరూ వచ్చి చెరో చెయ్యి పట్టుకున్నారు.
    రేఖ, రవికి యీ మధ్య రామకృష్ణ దగ్గిర కూడా బాగా చనువు ఏర్పడింది. వచ్చిన మొదటిలో యిద్దరూ అతని గదిలోకి కూడా వెళ్ళే వారు కారు. అయితే రామకృష్ణ మాట్లాడడానికి యింకెవరూ లేక ఇంట్లో వాళ్ళిద్దరితోనే మాట్లాడుతూండేవాడు. 'అంకుల్, అంకుల్' అంటూ ఈ మధ్య అతనితో చనువుగా చుట్టూ తిరగడం మొదలుపెట్టారు పిల్లలు.
    పిల్లలు కూడా వదలకుండా పట్టు పట్టడంతో అతను నిస్సహాయంగా చూశాడు కల్యాణివేపు.
    "ఆయన మొహమాటం, నాతో సినిమాకి రావాలనే అనుకుంటాను, మీరు యెందుకలా బలవంతపెడతారు" అంది సుజాత అతని వంక చిలిపిగా చూస్తూ.
    "అబ్బే, అదేం కాదు, మీతో సినిమాకి వెళ్ళడానికి యెవరు కాదంటారు? ఇటీజ్ ఎ ప్లెజర్" అన్నాడు తొందరగా. అన్నాక మళ్ళీ మాట సర్దుకొంటూ "అంటే అంటే నా ఉద్దేశం....." సుజాత, కల్యాణిలు గొల్లున నవ్వారు. అతని మొహం సిగ్గుతో యెర్రనయింది.
    అతని బిడియం పోగొట్టాలన్న ప్రయత్నంలో సుజాతే చేసేది చొరవ. రోజులు గడిచినకొద్దీ ఆమెకు తెలియకుండానే అతనికి చేరువవడం మొదలుపెట్టింది. రామకృష్ణ కూడా పూర్వం అంత మొహమాటపడకపోయినా యిప్పటికీ కల్పించుకుని చొరవగా మాట్లాడడు. అతని మనసులో సుజాతపట్ల యే భావం వుందో అతనికే తెలియదు. మొదటిలో అయితే అసలు అతను ఆ విషయం గురించే పట్టించుకునేవాడు కాడు. ఈ మధ్య సుజాత కల్పించుకుని చనువుగా మాట్లాడడం ఆరంభించాక, అతనికీ మొహమాటం తగ్గి సుజాత అంటే యేదో తెలియని ఆకర్షణా, అభిమానమూ ఆరంభించింది. సుజాత చూడనప్పుడు ఆమె మొహంలోకి దొంగచాటుగా చూస్తూండేవాడు. గదిలో అలా వంటరిగా కూర్చున్నప్పుడు సుజాతతో మాట్లాడితే బాగుండుననిపించేది. అతని కళ్ళు అతనికి తెలియకుండానే సుజాత కోసం వెతికేవి. ఆమె కన్పించగానే యేదో కావల్సింది దొరికిందన్న తృప్తిపడేవి కళ్ళు.
    తనలో వస్తున్న మార్పులు, సుజాతపట్ల ఆకర్షితుడవుతున్నాడన్న విషయం యీ మధ్య రామకృష్ణకీ తోచసాగింది. మనసులో సుజాతతో కలిసి సినిమాకి వెడితే బాగుంటుందేమో ననిపించినా మొదటిసారి స్వతహాగా వుండే బిడియం అతన్ని నిలబెట్టేశాయి.
    "ఉ.....ఇంక అడ్డు చెప్పకు, నలుగురూ కలిసి వెళ్ళండి. సుజాతా, ముందు ఫోను చేసి టిక్కెట్లు బుక్ చెయ్యి, లేకపోతే దొరకవు. టాక్సీ వేయించుకు వెళ్ళండి. డ్రైవరు లేకపోవడంతో కారుండీ లాభంలేకపోతూంది. రామకృష్ణా, నీవు డ్రైవింగ్ నేర్చుకో కూడదోయ్. ఇలాంటప్పుడు ఉపయోగిస్తుంది."
    ఇక తప్పదనుకొని "నాకు డ్రైవింగ్ వచ్చండీ" నెమ్మదిగా అన్నాడు.
    కళ్యాణి ఆశ్చర్యంగా చూసింది. "మరి చెప్పవేం ఆ మాట!"
    "అవకాశం లేదు కదండీ."
    "మంచివాడివే, ఇప్పటికయినా చెప్పావు. మరింక టెన్షన్ తీరిపోయింది. హాయిగా కారు తీసుకొని సినిమాలకి వాటికి తిరుగుతూండండి శెలవు రోజుల్లో ఐతే చూడు రామకృష్ణ, నన్ను హాస్పిటల్లో దింపేసి కారు తీసుకొచ్చేయి. మీరు సినిమాకు వెళ్ళండి. ఇంగ్లీషు పిక్చర్ గనక తొందరగా అయిపోతుంది. వచ్చేటప్పుడు నన్ను పిక్ చేయండి. ఓ.కే" అంది.
    పిల్లలు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. ఇన్నాళ్ళూ వాళ్ళకి టాక్సీలలో, రిక్షాలలో వెళ్ళడం చిరాగ్గా వుంది. కారుంది. అంకుల్ డ్రైవ్ చేస్తాడు. ఆంటీ వుంది. ఓహ్ ఇంకేం కావాలనిపించింది. సుజాతకీ మొదటిసారి రామకృష్ణతో వెళ్ళడం అంటే యెక్కడలేని ఉత్సాహం వచ్చింది. గబగబ పనులన్నీ పూర్తి చేసుకోటానికి వంటింటిలోకి వెళ్ళిపోయింది సుజాత.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS