22
సినిమాకి వెళ్ళితే పిల్లలిద్దరిని మధ్యన కూర్చోపెట్టి యిద్దరూ చెరోవేపు కూర్చునేవారు రామకృష్ణ, సుజాత. కారులో రవి ముందు కూర్చుంటే రేఖ, సుజాత వెనక సీటులో కూర్చునేవారు. పార్కుకి వెడితే పిల్లలిద్దరి కేదో ఆనందం, తృప్తి అయ్యేది. కారు డ్రైవ్ చేస్తూ ముందు అద్దంలోంచి సుజాతని చూస్తుండేవాడు రామకృష్ణ. అది సుజాత గుర్తించీ గుర్తించనట్లే ఎటో చూస్తుండేది. పార్కులో కూర్చున్నప్పుడు పిల్లలిద్దరూ వీళ్ళని వదిలి చుట్టుప్రక్కల ఆడుతూ గెంతుతూండేవారు వంటరిగా ఇద్దరూ యేం మాట్లాడుకోవాలో తెలియనట్టు-ఒకరు చూడనపుడు ఒకరి మొహం ఒకరు దొంగతనంగా చూస్తూ, పట్టుపడినప్పుడు సిగ్గుతో మొహాలు తిప్పుకొనేవారు. అలా మూడు నాలుగుసార్లు జరిగాక ఓసారి సుజాత ముఖం యెర్రబరుచుకుని, తెచ్చిపెట్టుకున్న కోపంతో "ఏమిటి చూస్తున్నారు?" అంది గంభీరంగా.
"అబ్బే అబ్బే, నే నెక్కడ చూశాను" నవ్వుతూ కాస్త ధైర్యం గానే అన్నాడు రామకృష్ణ. 'అబ్బో, అబ్బాయిగారు యీమాత్రం ధైర్యంగా మాట్లాడేటంతవరకు వచ్చారన్న మాట' అనుకుని పెదాలు బిగించి వస్తున్న చిరునవ్వు ఆపుకొంది. "చూడ్డంలేదూ, నే చూసేసరికి మళ్ళీ తలతిప్పేస్తున్నారు" కంప్లయింట్ చేస్తున్నట్టు అంది సుజాత కొంటెగా.
"మీరు చూడకపోతే నే చూసినట్టు యెలా తెలిసిందండీ, బాగుంది. ఇంతకీ యెటూ చూడకుండా కళ్ళు మూసుకు కూర్చోమన్నారా ఏమిటి? మిమ్మల్ని చూడలేదు నేను.....అదిగో అటు చూడండి, మీ వెనక ఓ అమ్మాయి కూర్చుంది, ఆ అమ్మాయిని చూస్తున్నాను" అన్నాడు రామకృష్ణ కొంటెగా నవ్వుతూ.
ఆ మాత్రం మాట్లాడతాడని, మాట్లాడగలడని సుజతః యెదురు చూడలేదు. ఒకవేపు ఆశ్చర్యపోతూ, మరోవేపు ఆ మాత్రం మనుష్యులలో పడుతున్నందుకు సంతోషిస్తూ, "అమ్మో, మీకూ మాటలు వచ్చానన మాట" అంది నవ్వుతూ. అతను కొద్దిగా సిగ్గుపడి నవ్వి, "సావాస దోషం" అన్నాడు. ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు.
"నాకు తెలీక అడుగుతాను, ఇలా హాయిగా నవ్వుతూ మాట్లాడడానికి యెందుకండీ అంత మొహమాట పడతారు? నేనేం మిమ్మల్ని మింగేస్తానేమిటి మాట్లాడినంత మాత్రాన" కవ్విస్తూ అంది సుజాత.
రామకృష్ణ నవ్వి "అదేం లేదుగానీ, అసలు నా స్వభావమే అంత యెక్కువ మాట్లాడడం నాకు అలవాటు లేదు. అందులో అమ్మాయిలతో మాట్లాడడం ఆలు అలవాటులేదు. చదువుకొనే రోజుల్లోనూ అంతే."
"మాట్లాడుతూంటే అదే పోతుంది మొహమాటం. ఇన్నాళ్ళనించి ఒకే ఇంటిలో కలిసి వుంటున్నాం, ఇంక క్రొత్తేనా" అంది చనువుగా సుజాత, రామకృష్ణ నవ్వాడు చిన్నగా.
ఆ తర్వాత అలా షికార్లకి వెళ్ళినపుడు యిద్దరూ కూర్చుని ఏదో ఒక విషయం గురించి బాగానే మాట్లాడుకునేవారు.
మొత్తంమీద కల్యాణి అనుకున్నట్టుగానే ఇద్దరూ రోజురోజుకి దగ్గరరాసాగారు. మరి కొన్నాళ్ళు ఆగి వాళ్ళిద్దరి అభిప్రాయం అడగాలని నిర్ణయించుకుంది కల్యాణి.
ఈ లోపల రామకృష్ణకి టైఫాయిడ్ జ్వరం రావడం, అతనికి తగ్గాక సుజాతకి ఫ్లూ రావడం-ఈ రెండు సంఘటనలు రామకృష్ణని, సుజాతని చాలా దగ్గిర చేశాయి.
రామకృష్ణ మొత్తం పది రోజులు వళ్ళు తెలియని జ్వరంతో పడుకుంటే సుజాతే అతనికి సేవ చెయ్యాల్సి వచ్చింది. మొదటి రెండు రోజులూ టెంపరేచర్ వున్నా లెక్కచెయ్యక ఆస్పత్రికి వెళ్ళిపోయాడు.
మూడోరోజు ఇంక శరీరం వశంలో లేక తెల్లారి పక్కమీదనించి లేవలేక పోయాడు. సుజాత కంగారుపడి కల్యాణిని పిలిచింది. టెంపరేచర్ నూటరెండు పైన వుంది. ఆ జ్వరం టైఫాయిడ్ లోకి దించి పదిరోజులకిగాని నార్మల్ కి రాలేదు. "అతని కేం కావాలో నీవే చూడాలి పాపం. ఇక్కడ అతనికి ఇంకెవరున్నారు" అంది కల్యాణి సుజాతతో. ఒకవైపు ఇంటి పని, వంట పని, రోగిని అన్నీ చూసుకోడం కష్టం అయినా రామకృష్ణ విషయం తను చూసుకోగలనంది. అతనికి కావల్సినవి స్వయంగా చూసుకున్నానన్న సంతృప్తి ఆమెకి కావాలనిపించింది.
అతనికి టెంపరేచర్ చూడ్డం మొదలు, మందులు యీయడం, కాఫీ త్రాగించడం, ప్రక్కబట్టలు మార్చడం వరకు అన్నీ స్వయంగా చేసేది. ఏ పనన్నా చేస్తున్నప్పుడు, తెలివిగా వున్నప్పుడు "మీకు నానించి ఎంత శ్రమ, మీకు ట్రబుల్ ఇస్తున్నాను. పనివాడిని చేయమనకూడదూ అంటూ నొచ్చుకొనేవాడు. మరీ జ్వరం ఎక్కువగా వున్న రోజుల్లో ఏవేవో కలవరిస్తూండేవాడు. ఓరోజు మధ్యాహ్నం సుజాత అతని నుదుటిమీద ఉడుకులాంలో గుడ్డ తడిపి వేస్తోంది. ఆ రోజు నూట నాలుగుంది టెంపరేచర్. రామకృష్ణకి వంటిమీద తెలివి లేదు. "నేను చచ్చిపోతాను సుజాతగారూ ..... నాకు జ్వరం తగ్గుతుందంటారా" అంటూ ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ నుదుటిమీద గుడ్డవేస్తున్న సుజాత చేతిని పట్టుకున్నాడు. సుజాత ఒక్కక్షణం వణికింది. "ఛా......ఛా.....యీ మాత్రం జ్వరానికే చచ్చిపోతారా! డాక్టరై వుండి ఇలా మాట్లాడుతారేమిటి" అంటూ మృదువుగా చెయ్యి వదిలించుకోబోయింది.
