-ఆ రోజు తర్వాత యీ రోజు మళ్ళా యింకో ఆశ్చర్యమైన సంఘటన యెదురైంది అతనికి. భర్తని ఆమె చూడకుండా తనని చూడమని పురమాయించడం యేమిటి? ఆశ్చర్యంగానే సుజాత వెంట మేడమీద రంగారావు గదికి వెళ్ళాడు.
రంగారావు జ్వర తీవ్రత వల్ల మూలుగుతూ పడుకున్నాడు. వంటిమీద తెలివి లేకుండా. జ్వరం ఎప్పటినుంచి వచ్చిందో వివరాలు అడిగాడు. సుజాత తనకి తెలిసినంత వరకు చెప్పింది.
టెంపరేచర్ నూటమూడు చ్పూపిస్తూంది..... 'మేడమ్ వున్నారా, ఆమెని పిలుస్తారా ఒకసారి" అన్నాడు రామకృష్ణ. ఆమెతో సంప్రదించాలని. సుజాత ఇబ్బందిగా చూసింది. కల్యాణి యీ గదిలోకి రాదు, రాకూడదని ఎలా చెప్పాలో తెలియక, ఒక్కక్షణం ఆలోచించి తెలివిగా "యిలా రండి, ఆవిడ గదిలో వున్నారు మీరే మాట్లాడుదురుగాని....."అంటూ వరండాలోకి తీసికెళ్ళింది. మాటలు విని కల్యాణి బయటికి వచ్చి రామకృష్ణని చూసి "పేషంటుని చూశారా! ఎలా వుంది!" అడిగింది.
రామకృష్ణ ఆమెని విచిత్రంగా పరిశీలిస్తూ "టెంపరేచర్ నూటమూడుంది. లోపల్స్, టైఫాయిడ్ ఏమోనని అనుమానంగా వుంది. మీరూ ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది" అన్నాడు. కల్యాణి మొహం కొంచెం నల్లబడింది. క్రింది పెదవి కొరుక్కుంటూ సుజాత వైపు చూసింది. జవాబుకోసం చూస్తున్న రామకృష్ణవంక చూడకుండానే "మళ్ళీ నే చేసేదేముంది నీ కా మాత్రం తెలియదా ఏమిటి?" అంది.
"అఫ్ కోర్స్, కాని మీరు చూస్తే...."
కల్యాణికి ఆ పరిస్థితి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇబ్బందిగా సుజాతవైపు చూసింది. "సుజాతా, ఆయనేం చేస్తున్నారు. మేలుకున్నారా, నిద్రపోతున్నారా?" అంది కల్యాణి.
"ఆయన కాస్త మగతలో వున్నట్టున్నారు. అందుకే మిమ్మల్ని చూడమంటున్నాను" అన్నాడు రామకృష్ణ. కల్యాణికి ఇంక తప్పించుకునే మార్గం కనపడక, రంగారావు తెలివిగా లేడనే ధైర్యంతో, రామకృష్ణ చేతిలోంచి స్టెతస్కోపు అందుకుని గదిలోకి నడిచింది. రంగారావు చేయి అందుకుని పల్స్ చూసింది. స్టెతస్కోపుతో గుండెలని పరీక్షిస్తుండగా రంగారావు హఠాత్తుగా కళ్ళు విప్పి చూశాడు. జ్వరం తీవ్రతతో ఎర్రపడ్డ మొహం, అంతకంటే ఎర్రబడిన అతని కళ్ళు, కల్యాణిని చూడగానే అంత మగతలోనూ మరింత ఎర్రబడ్డాయి. ఒక్క ఉదుటున కల్యాణి చెయ్యిని విదిలించేసి లేచి పోయాడు ప్రక్క మీదనించి..... "గెటౌట్ ఫస్ట్, గెటౌట్ ఫ్రం మై రూమ్' అంటూ పిచ్చిగా అరిచాడు. అతని ఎర్రబడ్డ మొహం కళ్ళు, ఆ కేకలు సుజాత బిత్తరపోయి చూసింది. రామకృష్ణ తెల్లబోతూ ఇద్దరిని మర్చి మార్చి చూస్తున్నాడు.
"మీరు ఆవేశ పడకండి. చాలా జ్వరంగా వుంది పడుకోండి" అంది కల్యాణి స్థిరంగా.
"షటప్ నాకు జ్వరం అని తమరు చెప్పక్కరలేదు. నౌ యూ గెటౌట్" అంటూ కోపంగా హుంకరిస్తూ వేలుపెట్టి గుమ్మంవంక చూపించాడు రంగారావు.
కల్యాణి నల్లబడ్డ మొహంతో ఓసారి రామకృష్ణ, సుజాతలవంక చూసి రంగారావు విసిరిన విసురుకి దూరంగా పడ్డ స్టెతస్కోపు అందుకుని మౌనంగా గదిలోంచి వెళ్ళిపోయింది. జరిగిన దాన్ని తెల్లపోతూ చూస్తూ ఏం చెయ్యాలో తోచక రామకృష్ణ, సుజాత అలాగే నిలబడ్డారు. వెడుతున్న కల్యాణిని వెనకనించి తీక్షణంగా చూస్తూ రంగారావు మళ్ళీ మంచంమీద వ్రాలి పడుకున్నాడు-ఆయాసంతో వగరుస్తూ, రామకృష్ణ నెమ్మదిగా మంచం దగ్గిరకి వెళ్ళి "జ్వరం నూటమూడుంది. ప్రస్తుతానికి మాత్రలు ఇస్తాను. రేపటికీ జ్వరం తగ్గకపోతే అప్పుడు ఇంజక్షనిస్తాను, టైఫాయిడ్ ఏమోనని అనుమానంగా వుంది" అన్నాడు. రంగారావు రామకృష్ణ వంక చూస్తూ "నేనూ అదే అనుకుంటున్నాను. రేపు చూద్దాం, ప్రస్తుతానికి మందులు నేను వేసుకుంటున్నాను" అన్నాడు సౌమ్యంగానే. సుజాత వంక తిరిగి "కాస్త హార్లిక్స్ కలిపి పంపు" అన్నాడు.
"మీరు విశ్రాంతి తీసుకోండి, రాత్రి మరోసారి చూస్తాను" అన్నాడు రామకృష్ణ గదిలోంచి వెడుతూ, సుజాత బయటికి వచ్చి ఏదో పెద్ద ఉపద్రవం నించి తప్పించుకున్నట్టు నిట్టూర్చింది. కల్యాణి ఆ గది లోకి వెళ్ళడానికి యెందుకు అంత సందేహించిందో అర్ధం అయింది. భార్య నీడకూడా ఆయన సహించలేడన్న మాట!
రంగారావు జ్వరం టైఫాయిడ్ లోనే దింపింది. ఆ తర్వాత వారం అంతా హై టెంపరేచర్ తోపాటు డెలీరియంతో యేదేదో మాట్లాడుతూ ఆ వారం అంతా ఇంటిలో అందరినీ గాభరా పెట్టేడు. రామకృష్ణ కల్యాణి సలహా సంప్రతింపులతో వైద్యం చేసేవాడు. మొదటి వారంలో హై టెంపరేచర్ వుండగా యేవేవో కలవరిస్తూండేవాడు రంగారావు. "కల్యాణీ.....చూడు, నిన్నేం చేస్తానో, చూడు.....నా కాసు యెలా తీర్చుకుంటానో చూద్దువుగాని......ఆ ఆనంద్గాడిని చంపకపోతే చూడు.......ఇద్దర్నీ కలిపి ఒక్కసారె పై లోకానికిపంపిస్తాను. అక్కడ ప్రేమించుకుందురుగాని.....ఆహా......హా....." ఇలా ఏవేవో పిచ్చిపిచ్చిగా కేకలు పెడుతూ కలవరించేవాడు.
దగ్గిరున్నప్పుడు రామకృష్ణ, సుజాత మొహాలు చూసుకొనేవారు. రామకృష్ణ కళ్ళల్లో ఆశ్చర్యం, అనుమానం, ప్రశ్నలు చూసి సుజాత ఆ తప్పు అర్ధం అయినట్లు, జవాబు లేనట్టు మొహం తిప్పుకొనేది.
