Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 33


    ఇదంతా గమనిస్తున్న విశ్వనాథంగారికి ఓ తమాషా ఆలోచన వచ్చింది. తను గమనించనట్టే కూర్చుంటే నాగేషు ఏం చేస్తాడో! ముఖం తిప్పుకొని దూరంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తున్నట్లు కూర్చున్నారు జడ్జిగారు. నాగేషు అటూ ఇటూ చూసి, రెండుసార్లు విశ్వనాథంగారి ముందుగా అటూ ఇటూ నడిచాడు. ఆయనకు నవ్వొచ్చింది. వాణ్ణి గమనించనట్లే దీక్షగా మరోవైపుకు చూడసాగారు. నాగేషు పండ్ల దుకాణం దగ్గిరకు, నడవాలనే ఉద్దేశం లేనట్లే నడిచాడు. అటూ ఇటూ ఓసారి చూసి వంగి గబుక్కున ఓ పండు తీసి చొక్కా కింద పెట్టుకొని విశ్వనాథంగారివైపు చూశాడు. ఆయన తనను గమనించలేదని నిశ్చయించుకున్నాక ఆయనగారు కూర్చున్న బెంచీ వెనక్కు వెళ్ళి, బెంచీకింద గడ్డిలో పెట్టాడు. పండుమీద ఆ పక్కనేవున్న ఎండుటాకుల్ని కప్పాడు. మళ్ళీ ఏమీ ఎరగనట్లు వచ్చి బెంచీ చేతిమీద కూర్చుని, ముందుకూ వెనక్కూ ఊగుతున్నాడు. విశ్వనాథంగారు సర్దుకొని కూర్చుని నాగేష్ ముఖంలోకి చూశారు. వాడి కళ్ళల్లో ఏదో సాధించినట్లు సంతృప్తి వెలుగుతుంది. విశ్వనాథంగారు తనవైపే చూడటం గమనించిన నాగేష్ గుర్రాన్ని వేగంగా నడిపిస్తున్నట్లు ఆటలో మునిగిపోయాడు. మల్లమ్మ తిరిగి వచ్చింది. అనుమానంగా పళ్ళకేసి చూసుకుంది. మళ్ళీ నాగేషు కేసి చూసింది. విశ్వనాథంగారి ముఖంలోకి చూసి ఏదో అడగబోయి మళ్ళీ ఊరుకుంది. పళ్ళను చేత్తో తాకి లెక్కపెట్టుకుంది. తల గోక్కుంటూ ఆలోచనలో పడింది మల్లమ్మ. బొడ్లో నుంచి డబ్బుల సంచి తీసి డబ్బులు లెక్కచూసుకోసాగింది. నాగేష్ మల్లమ్మను చూస్తున్నాడు. విశ్వనాథంగారు పసివాడి ముఖంలోని భావాలను చదవసాగారు.  
    "ఏం అవ్వా! నా పండు ఇస్తావా లేదా!" కళ్ళెగరేస్తూ ప్రశ్నించాడు నాగేషు. ఈసారి వాడి స్వరంలో మొదటి దైన్యంల్;లేదు. మల్లమ్మ మాట్లాడకుండా చిల్లర డబ్బులు సంచిలో వేసి, మూతికట్టి, మళ్ళీ బొడ్లో దోపుకుంది.
    నాగేషు బెంచీ దిగి మల్లమ్మ దగ్గిరగా వెళ్ళి చేతులు వెనక్కు కట్టుకొని నిల్చుని "నా పండు నాకిస్తావా లేక తీసుకోమంటావా!" అన్నాడు కనుబొమ్మల్ని ఎగరేస్తూ.
    "దొంగవెధవ! ఈ ముసల్దాన్ని ఎంత ఏడిపిస్తున్నాడు! అయినా ఆ మల్లమ్మదిమాత్రం తప్పుకాదా!" జడ్జీగారు మీమాంసలో పడిపోయారు. ఆ సంఘటన అంతా తను కళ్ళారా చూశాడు, అంటే తను ఐ విట్నెస్ అన్నమాట! "దేముడిముందు ప్రమాణంచేసి, ఉన్నదున్నట్లూ, జరిగింది జరిగినట్టూ, అంతా నిజమే...." బోనులో నిలబడిన ప్రాసిక్యూషన్ సాక్షి కథనం, జడ్జీగారి బుర్రలో గిర్రున తిరిగింది.
    కుర్రాడిచేత పనిచేయించుకున్న మల్లమ్మ అతడికి ప్రతిఫలం ముట్టజెప్పాలి. అంటే పండు వాడికి న్యాయంగా రావాల్సిందే! "ఆమె ఇచ్చింది కుళ్ళిపోయింది" అని వాడంటాడు. ఆమె కుళ్ళిపోలేదంటుంది. నిర్ణయించాల్సింది వాళ్ళిద్దరూ కాదు. "కుళ్ళిన పండు కాకపోతే పారెయ్యడు కాబట్టి అది కుళ్ళిందే అయివుండాలి!" నేచురల్ ఇన్ఫరెన్స్!
    అయితే కూజా పగులగొట్టి మల్లమ్మకు నష్టం కలిగించాడు వాడు. వాడికి మించిన బరువు మోయమన్నది అది. యాక్సిడెంటల్ గా కిందపడిపోయాడు వాడు. కాబట్టి నాగేష్ నిర్దోషి. మల్లమ్మకు నష్టపరిహారం చెల్లించనవసరంలేదు. "దేర్ ఫోర్! మల్లమ్మ నాగేషుకు వాడి శ్రమకు ప్రతిఫలంగా __ వాడు కోరినట్టు __ మామిడిపండు ఇవ్వాల్సివుంది. కాని ఆమె ఇవ్వలేదు. అయినా వీడు తీసుకున్నాడు. దటీస్ ఇల్లీగల్! టాంట్ అమౌంట్ టూ క్రైం. అది నేరం.... అంతేకాదు.... నేరాన్ని దాస్తున్నాడు. అది మరొక కౌంట్ కింద శిక్షార్హం. పైగా మల్లమ్మను పండివ్వమని బెదిరిస్తున్నాడు. దట్ కమ్స్ అండర్ సెక్షన్ .... మల్లమ్మ లేచి నిలబడి జడ్జీగారి ముందుకొచ్చి ప్రాధేయపూర్వకంగా న్యాయాన్ని అర్ధించింది. నాగేషు భయంగా చెదురుగా జడ్జీగారి కళ్ళలోకి చూశాడు. జడ్జి విశ్వనాథంగారి ముఖం గంభీరమయింది. ఏది ఏమయినా నాగేషు 'లా' తన చేతుల్లోకి తీసుకున్నాడు. వాడికా అధికారం లేదు, పసితనం కావచ్చు! తెలియక చేసినా నేరం నేరమే! శిక్షార్హమే!....
    జడ్జీ విశ్వనాథంగారు బెంచీమీదనుంచి చివాల్నలేచి నిలబడ్డారు. "ఓ అమ్మా! బల్లకింద చూడు!"
    విశ్వనాథంగారి మాటలు మల్లమ్మ పూర్తిగా అర్థంచేసుకొనే ప్రయత్నంలో వుండగానే, నాగేషు బల్లకింద దూరి, పండును తీసుకొని పరుగు లంకించుకున్నాడు.
    "అయ్యో! అయ్యో! అర్ధరూపాయి పండర్రో! నీ జిమ్మడ! నీకు పోయేకాలం రాను!" అంటూ మల్లమ్మ శక్తికొలదీ నడక రూపంలో వున్న పరుగులోనే వెంటబడింది.
    విశ్వనాథంగారు చేతికర్ర తీసుకొని ముందుకుసాగారు. రోడ్డుమీద బ్రహ్మరాక్షసి అట్టహాసంలా లారీ ధ్వని వినిపించింది. వెంటనే జనం కేకలు. విశ్వనాథంగారు పబ్లిక్ గార్డెన్ గేటుదాటి రోడ్డుమీదకు వచ్చాడు, ఎదురుగా లారీ, దానిచుట్టూ జనం. పళ్ళమ్మి మల్లమ్మ "అయ్యో బిడ్డా!" అంటూ రోదిస్తోంది. విశ్వనాథంగారు జనాన్ని తోసుకొని ముందుకు వచ్చారు.
    ఒక పసివాడి చెయ్యి.... ఆ చేతికి పక్కగా రక్తపు మడుగులో చితికిపోయిన మామిడిపండూ.... ఉరిశిక్ష వేయబడినవాడి కాళ్ళకింద బల్లలా, జడ్జీగారి కాళ్ళకింద నేల దూరమయింది. విశ్వనాథంగారు శరీరాన్ని రిక్షాలో వేసుకొని ఇంటికి చేర్చుకున్నారు.
    రిక్షాదిగి లోపలకు వస్తున్న విశ్వనాథంగారికి, అప్పుడే గేటులో నుంచి బయటకు వస్తూ ఒక పంచెకట్టు పెద్దమనిషి తారసపడ్డాడు. విశ్వనాథంగార్ని చూసి ఆయన తత్తరబిత్తరలాడుతూ, రోడ్డుమీద ఆగివున్న టాక్సీలోకి దూకి అదే పోతపోయాడు.
    ఎవరు! ఎక్కడో చూసినట్టుందే.
    జడ్జీగారు ఆలోచించే మానసిక స్థితిలో లేడు.
    హాల్లోకి ప్రవేశించిన విశ్వనాథంగారికి పెద్ద మామిడిపండ్ల గంప ఒకటి స్వాగతం పలికింది. నిశ్చేష్టుడై నిలబడ్డ భర్త చేతిలోని ఒంకికర్ర అందుకొంది పార్వతమ్మ.
    "ఏమిటవి?"
    "మామిడిపళ్లు! కనిపించటంలా!" అంటూ పార్వతమ్మ వంటింట్లోకి వెళ్ళింది.
    పళ్ళ గంపను చూస్తూ కుర్చీలో కూలబడ్డారు విశ్వనాథంగారు. అంతలో పార్వతమ్మ ఓ పెద్ద వెండిగ్లాసుతో తిరిగివచ్చింది.
    పార్వతమ్మ చేతులో వున్న గ్లాసు చూస్తూ "ఏమిటది?" అన్నారు విశ్వనాథంగారు.
    "రెండు పళ్ళు తీస్తేనే గ్లాసుడు రసం వచ్చింది. పెద్దరసాలు గదూ?" అంటూ గ్లాసు అందించబోయింది.
    జడ్జి విశ్వనాథంగారు గుండెమీద చెయ్యి వేసుకొని ఇంకా అది ఆగిపోకుండా ఆడుతూనే వున్నందుకు ఆశ్చర్యపోయారు.
    భార్యకాళ్ళకేసి చూశాడు. అవి ఇంకా నేలమీదే ఆని వుండటం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించింది.

                             * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS