దాంతో అవి విషాద పూర్ణమయిన శబ్దాలను చేస్తూ తల్లి చుట్టూ తిరగసాగినాయి. అయినా తల్లిలో చైతన్యం రాలేదు. మాతృమూర్తిని కోల్పోయిన పులి పిల్లలు అమాయకంగా రోదన ధ్వమలు చేయసాగినాయి.
ఆ దృశ్యాన్ని గమనించిన కెప్టెన్ మాలతి కరిగిపోయింది. ఏ ప్రాణికయినా జన్మనిచ్చిన తల్లి అపురూపమయినది. మాతృమూర్తిని కోల్పోయిన దుఃఖం ఏ ప్రాణిని అయినా కలచివేస్తుంది. మామూలు స్థితిగతులలో అయితే ఏ ప్రాణికుండే గొప్పతనాన్ని ఆ ప్రాణి ప్రదర్శించుకుంటుంది. కాని దుఃఖభారం ముంచెత్తిన సమయంలో అందరిలోనూ మూర్తీభవించేది ఆ విషాదమే!
ఆనందం స్వార్ధాన్ని రేకెత్తించి ప్రాణులను దూరం చేస్తుంది. విషాదం ప్రాణుల సయోధ్యకు సహజీవనానికి వారధిలా నిలుస్తుంది. అదే యిప్పుడు కెప్టెన్ మాలతిని కట్టి పడేసింది.
ఆమె పరుగున వెళ్ళి పులిపిల్లల్ని చేపల్లోకి తీసుకుంది. అవి దూరమయిపోతున్న మాతృమూర్తి మృత కళేబరాన్ని నిదానంగా చూస్తున్నాయి.
వడివడిగా వచ్చి ఫిజోతోపాటుగా గుహాముఖాన్ని చేరుకున్నదామె. పులిపిల్లల్ని క్రిందికి దింపగానే అవి త్వరగా పరుగెడుతూ గుహ లోపలికి చేరుకున్నాయి. భయంతో వొణికిపోతూ ఒక మూల ఒదిగి నిలుచున్నాయి.
ఏనుగు దంతాల్ని మంచం కోళ్ళలా నిలిపి మంచి గంధపు కర్రల్ని పట్టెల్లా అమర్చి చాల విలువయిన మంచెలాంటి దాన్ని తయారు చేసుకున్నాడు అర్ధమానవుడు. దాని మీద చమరీ మృగాల చర్మాన్ని అమర్చి పరుపులా తయారుచేశాడు.
ఫిజో అర్ధమానవుడి శరీరాన్ని భారంగా మోసుకొచ్చి దానిమీద పడేశాడు. అతనికి యింకా స్పృహరాలేదు. ఎటు త్రిప్పితే అటు తల వ్రేలాడపడిపోతోంది.
మధ్యాహ్నం తినగా మిగిలిన శేషమాంస ఖండాల్నిచాకులుగా తయారుచేసి నెగడులో కాల్చాడు. కిట్టులోంచి అవసరమయిన వస్తువులన్నీ తెచ్చి దానికి దట్టించాడు.
చాల రోజుల తరువాత నాగరికులు తినే రుచికరమయిన ఆహారాన్ని తిన్నారు యిద్దరూ! ఫిజోని వేరే చోటుకి వెళ్ళి పొమ్మని ఆదేశించంది కెప్టెన్ మాలతి. అతడు మరొకచోటుకి వెళ్ళిపోయినాడు. అర్ధమానవుడికి సపర్యలు చేసింది మాలతి. కానీ అతనికింకా తెలివి రాలేదు. రక్తం విపరీతంగా నష్టమయిపోయింది.
వైద్యశాస్త్రంలో తనకున్న ప్రాధమికమయిన పరిచయాన్ని ఉపయోగించి అతనికి ప్రాణ మోసం లేదని గ్రహించిందామె. ఏ క్షణంలో అయినా అతడికి తెలివి రావచ్చు. అప్పటికే మంచు కురవటం ప్రారంభమయింది. మరింక విడిగా కూర్చోవటం అసాధ్యమనిపించింది. అదే శయ్యమీద అతని ప్రక్కనే వెచ్చదనంకోసం జంతుచర్మాన్ని కప్పుకుని మూడంకె వేసి పడుకుంది. అర్ధమానవుడు కదలలేదు. మెదలలేదు. చాలసేపటి తరువాత ఆమె కనురెప్పలు బరువుగా వాలాయి. నిద్రాదేవత ఒడిలో ఒడలు మరచి శయ నించిందామె.
13
సూర్యోదయమయింతరువాత ఫిజోముందుగా నిద్ర లేచాడు. మాలతి మీద సంపూర్ణమయిన విశ్వాసంతో అర్ధమానవుని ఆరోగ్యాన్ని పరామర్శించేందుకు బయలుదేరాడు. గుహాముఖాన్ని చేరుకునే వేళకు మాలతి యింకా నిద్రనించి లేవలేదు. దంతాలతో మంచి గంధపు చెక్కతో తయారయిన ఖరీదయిన మంచంపై యువరాణిలా పడుకొనివుంది. అయితే గుహలో కూడా అర్ధమానవుడు కన్పించలేదు. విలువయిన దంతాలతో తయారయిన కోళ్ళూ, మంచి గంధంతో తయారయిన మంచం పట్టెలూ అమర్చుకోవాలంటే అధమం లక్షరూపాయలయినా అవుతుంది.
అటువంటి దంతాలూ మంచి గంధపు కర్రా ఎంత కావాలంటే అంత అర్ధమానవుడి దగ్గర సిద్దంగా ఉంది. ఉన్నదాన్ని ఉపయోగించుకోవటమే కాని అవసరానికిమించి దాచుకోవటం అర్ధమానవుడికి తెలియదు.
అందునించి విలువయిన దంతాలు గుహలో చిందర వందరగా ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. మంచి గంధపు కర్ర నెగడు మండించేందుకు ఉపయోగిస్తోంది.
అంత ఖరీదయిన అర్ధమానవుడి శయ్యమీద యువరాణిలా మాలతి అయితే పడిఉంది. కాని అర్ధమానవుడి అయిపూ ఆజా కన్పించలేదు. దాంతో కంగారు పడిపోయి వాడు ఫిజో! రవంత భయపడ్డాడు కూడా! అతడు తన రాకను గమనించాడేమో! ఏ మూలయినా మాటు కాచాడేమో! హఠాత్తుగా తన మీద దాడి చేసేందుకు సంసిద్ధుడయినాడేమో!
