అలా కోసులా రూపొందించిన శిలా శకలాన్ని సిద్దంగా పట్టుకుని బెబ్బులికి ఎదురు నిలిచాడు అర్ధమానవుడు. అది తగిన జాగా తీసుకుని తిరిగి తుఫానులా ఎగిరి వచ్చి అతని మీదపడింది. తన పంజాతో అతని వక్షస్సుని చీల్చాలని, తన కోరలతో అతని కంఠ నాళాలను కొరికి రక్తం త్రాగాలని దాని ఉబలాటం.
కాని అర్ధమానవుడు తన చేతిలోని పరికరాన్ని ప్రయోగించి తాను ప్రక్కకు తప్పుకున్నాడు దాని పొట్టకింది చర్మం చీలిపోయింది. రక్తం కారుతోంది.
అంతటితో బాలెంతరాలయిన బెబ్బులి అలిసిపోయింది.
కాని తన ప్రయత్నం మానుకోలేదు. పౌరుషాన్ని తగ్గించుకోలేదు. మళ్ళీ విజ్రుంభించింది.
ఈమారు అది మరింత విసురుగా అతనిమీద పడాలని ప్రయత్నించింది. గురి తప్పకుండా పంజా విప్పికొట్టింది. అది ఆశించినట్లుగా దాని గోళ్ళు అర్ధమానవుని వక్షస్థలంలో లోతుగా దిగబడ్డాయి.
అతని చేతిలోని రాయి తెరిచిన నోటిలో కత్తిలా దిగబడిపోయింది. బెబ్బులి పెడ బొబ్బ పెట్టింది. బాధతో మూలిగింది. అతడు వక్షస్సు చీలిపోగా పొలిరంకె వేశాడు.
గాలిలో ఉండగానే దాని వెనుక కాళ్ళు అందిపుచ్చుకున్నాడు. అటువంటి అవకాశాన్ని వృధా పోనివ్వకుండా బెబ్బులిని గాలిలో గిరగిరా త్రిప్పి దూరంగా విసిరివేశాడు.
కత్తిలాంటి రాయి కంఠంలోకి దిగినప్పుడే దాని ఆయువు కృంగిపోయింది. గిరగిరా త్రిప్పిదూరంగా విసిరేయటంతో అది వెళ్ళి ఒక బండరాయిని గుద్దుకుంది. దాని తల రెండుగా చీలింది. చెవులనుంచి నోటినుంచి, వెనుక భాగంనించి రక్తంకారి చారికలుకట్టింది.
పాపం బెబ్బులి బాలెంతరాలు కావటంనించి మరణానికి ముందు ఆ మాతృ వృక్షంలో క్షారాధారలు ఒలికినాయి. దయనీయమయిన దాని చూపు చూసి తల్లడిల్లిపోయింది కెప్టెన్ మాలతి.
వీర కిశోరమయిన అర్ధమానవుడు దాని చివరి పంజాదెబ్బకు వక్షం చీలిపోయి ఉన్నాడు. రక్తం జల యంత్రంలోంచి నీరుచిమ్మినట్టుగా, చిమ్ముతోంది కళ్ళు తిరిగి అతడూ క్రిందపడిపోయినాడు. వెంటనే వచ్చి అతని తలను తనఒడిలోకి తీసుకుంది మాలతి. అర్ధమానవుడు కన్ను తెరవలేదు అందాకా వారిని రహస్యంగా అనుసరించిన ఫిజో అర్ధమానవుడు మూర్చపోయాడని తెలిశాక బయటపడిపోయినాడు. నెమ్మదిగావచ్చి మాలతివెనక తట్టున కూర్చున్నాడు. అర్ధమానవుడు కన్ను తెరిస్తే తాను కన్పించకుండా వుండేందుకు ఆ జాగ్రత్త తీసుకున్నాడు.
కాని అర్ధమానవుడు వ్యాఘ్ర అఘాతానికి విస్మృతుడయి పడి వున్నాడు. కన్ను తెరవగలడు అన్పించలేదు. "కెప్టెన్, ఇతడు చనిపోయాడా?" ఆశ్చర్యంతో ముందుకు వచ్చాడు ఫిజో మాలతి అతడిని చూసి ఆశ్చర్యపడిపోయింది. అటువంటి సమయంలో సాయం వచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంది.
ఇద్దరూ కలిసి ఉపచారాలు చెయ్యడం ప్రారంభించారు. అందుబాటులో వున్న ఆకులన్నిటినీ తీసుకునివచ్చి చిదిమి బంతిలా చేసి వాసన చూపించాడు ఫిజో. వెదురు కొల్లలో నిర్మలమయిన నీరు తెచ్చి ముఖంమ్మీద చిలికించింది మాలతి.
అర్ధమానవుడి శరీరమంతా రక్తం చారికలు కట్టి ఉంది. దాన్ని శుభ్రంగా కడిగి చిత్తం వచ్చిన ఆకు పసరులిచ్చి ఒళ్ళంతా పులిమారు. అలా చేస్తున్నపుదు రవంత కదిలాడు అర్ధమానవుడు. ఉపచారాలు చేస్తున్నంతసేపూ ఫిజో నోరు మూతపడలేదు. నేరుగా బెబ్బులి మీద పోరాడిన అర్ధమానవుడి పరాక్రమాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. అతడి శరీరదార్ధ్యతని పదేపదే పొగిడి పదే పదే ఆశ్చర్యపడిపోయినాడు.
అంతా విన్న తరువాత "అవును అతడు ప్రకృతి పుత్రుడు." అంటూ ఒక చిన్న వ్యాఖ్యానం చేసింది మాలతి. అతడిని తన భుజాలమీదికి ఎత్తుకున్నాడు ఫిజో. వారితోపాటు తిరిగి గుహలోకి వెళ్లేందుకు బయలుదేరింది మాలతి.
అయితే అటువైపుగా కదిలిపోతున్న ఆమెకు ఒక కరుణామయమయిన దృశ్యం కనిపించి కదిలించివేసింది. అర్ధమానవుడి చేతిలో అసువులు పోగొట్టుకున్న బెబ్బులి అల్లంత దూరంలో పడి వుంది. దాని తాలూకు పసి కూనలు తప్పటడుగులు వేస్తూవచ్చాయి. తమను చూడగానే ఉత్సాహంతో నాలుక బయటపెట్టి స్తన్యమిచ్చే తల్లి నిర్జీవంగా పడి ఉండటాన్ని చూచినాయి.
అవి ఆకలితో అలమటించుతున్నాయి. తల్లి లేచి తమకు స్తన్యమివ్వగలదని ఆశతో ఎదురు చూచినాయి. కాని అలా జరుగకపోగా బెబ్బులి చైతన్యం లేకుండా నిర్జీవంగా పడిఉంది. పాలకై పొదుగులో తలదూర్చితే ఇదివరకటి వెచ్చదనం కనిపించలేదు. తల్లి శరీరం మంచులా చల్లబడిపోయింది. అంతేకాదు ఎంత ప్రయత్నించినా పొదుగులోంచి క్షీరధారలు కురియలేదు.
