Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 33


    "బుచ్చమ్మా? వా రొచ్చారే!" వరూధిని మాటల్లోని మాధుర్యం వెంకటపతి వళ్ళంతా పాకింది.
    "బాబుగారూ, స్నానానికి రండి!" అంది బుచ్చమ్మ వచ్చి.
    స్నానంచేసేచోట పెట్టిన సబ్బుతో తోముకోకుండా, వళ్ళంతా గోళ్ళతో గీకి స్నానం చేశాడు. కొత్త గ్లాస్కోపంచా, చొక్కా తెచ్చి ఇచ్చింది బుచ్చమ్మ.
    "ఇప్పుడెందుకివీ?" అంటూనే కట్టుకొన్నాడు.
    వెంకటపతి అన్నానికి లేచాడు. రెండుపీటలు వేసి, రెండు కంచాల్లో వడ్డించివుండటం చూసి----
    "నాయనేడీ?" అన్నాడు వెంకటపతి.
    వరూథిని ఫక్కున నవ్వింది. వెంకటపతికి వళ్ళంతా చక్కలిగింతలు పెట్టినట్టయింది. కొంచెం సిగ్గుపడి తలవంచుకొని పీటమీద కూర్చున్నాడు. వరూధిని వెంకటపతి పక్కనవచ్చి కూర్చుంది. ఆకలిగొన్న ఎద్దు పెసరచేలో పడ్డట్టు తినసాగాడు. వరూధిని సగం కొరికిన జిలేబీలు, గారెముక్కలూ వెంకటపతి పళ్ళెంలోకి విసరటం మొదలుపెట్టింది. వెంకటపతి అయోమయంలో పడిపోయాడు. వరూధిని కొరికి పడేస్తుందన్న సంగతి చాలాసేపటికిగాని అర్ధం కాలేదు. వెంకటపతి అటూ ఇటూ చూసి ఎంగిలిచేత్తో జిలేబీ ముక్క వరూధిని నోట్లో కుక్కాడు.
    "ఛీ! పొండీ!" వరూథినీ ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. "అబ్బా! ఏం చేతులు! బండచేతులు!" ముక్కూ చెంపలూ జిలేబీరసంతో మెరిశాయి.
    తలుపు చాటునుంచీ చూస్తున్న బుచ్చమ్మ 'అమ్మాయిగారి సంసారం తోవలో పడ్డది' అనుకొంటూ నిట్టూర్చింది.
    భోజనం పూర్తయిన దగ్గర్నుంచీ వెంకటపతి మనసు మనసులో లేదు! నాళాల్లో రక్తం చిమ్ముతూంది. నరాలు లాగుతున్నాయి. బుర్ర అసలేం పనిచెయ్యటంలేదు. వరూధిని వంటరిగా ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. బుచ్చమ్మ సింగారించే మిషతోనో, ఏవేవో సంగతులు చెబుతూనో వరూధిని వెంటవెంటనే మసులుతూంది.
    వెంకటపతి తండ్రికోసం వేసిన పక్కమీదపడి దొర్లుతున్నాడు.
    "బాబుగారూ, ఇది నాన్నగారి పక్క మీ పక్క అక్కడవేశాం!" అంటూ పడకగది చూపించింది బుచ్చమ్మ.
    బుచ్చమ్మ ఇంట్లోనుంచి బయటకు వెళ్ళకముందే వెంకటపతిలేచి పడగ్గదిలో జొరబడ్డాడు. తలుపులు బిగించి వరూథిన్ని చూశాడు.
    వరూధిని వయ్యారంగా పడుకొని విసనకర్రతో విసురుకొంటున్నది. వెంకటపతిని ఓరగాచూసి తల తిప్పుకొని, గోడవేపుకు తిరిగి పడుకొంది......
    "ఛీ! వాసన.....డోకొస్తుంది! వదులు!"
    "వదలమంటుంటే? ఏమిటా మోటుసరసం?" అంటూ వరూధిని పక్కమీద నుంచి దూకి తలుపులు తెరచుకొని బయటకొచ్చింది. వరూధిని వెనకే పరుగెత్తుకొచ్చిన వెంకటపతి, తండ్రి వచ్చి చొక్కా విడిచి మంచంమీద కూర్చోవడం చూశాడు.
    వెంకటపతి స్వర్గలోకంలోనుంచి కిందకు త్రోసినట్లు బాధపడ్డాడు. జిలుగు వెలుగుల్లో మసకచీకట్లు కన్పించాయి. వరూధిని అందగత్తె! చదువుకొంది కూడా! బస్తీలో తిరిగిన పిల్ల. సుకుమారంగా పెరిగింది. షావుకారు బలరామయ్యగారి ముద్దుబిడ్డ! దాసీలూ, పరిచారికల్తో సేవలు చేయించుకొన్నది. తనకు భార్య అయింది. అంత ఇదిగా, అంత ప్రేమగా చేసింది ఎందుకిలా చేసింది? ఏందో తన కంతా అయోమయంగా వుంది. తనేమన్నా తప్పుచేశాడా? ఏం చేశాడూ? తనదగ్గర వాసనంది. ఏంటా వాసన? నీళ్ళుగూడా పోసుకున్నాడుగా? మరి వాసనేంటి? వరూధిని! ఎంత అందమైన పేరు! ఎంత అందం!
    వెంకటపతి మనసు వరూధినికోసం ఆరాటపడింది. గుండెలు కోతపెట్టాయి. బయట మంచంమీద పడుకున్న వెంకటపతి, పడగ్గదిలో తలుపులు బిడాయించుకొని పడుకొన్న వరూథిన్ని గురించిన ఊహల్తో, ఆశల్తో రాత్రంతా జాగారం చేశాడు.
    తెల్లవారకముందే నిద్రలేచాడు సాంబయ్య. తండ్రి గొడ్లసావిట్లో గేదెపాలు తీస్తుండగా లేచాడు వెంకటపతి. కాని కోడలు ఇంకా పడుకొనేవుంది. బుచ్చమ్మ సాంబయ్యకు ముఖంపుల్లా, నీళ్ళూ అందించింది. సాంబయ్య పుక్కిలించి వుమిసి, బుచ్చమ్మ అందించిన కాఫీ గ్లాసువైపన్నా చూడకుండా "అన్నం వడ్డించండి!" అన్నాడు బుచ్చమ్మ తెల్లముఖంవేసి "ఇంకా వంటకాలేదు బాబుగారూ!" అంది.
    వెంకటపతి పొలంవెళ్ళటానికి సిద్దమయి, వరూధిని లేచేదాకా ఇంట్లోనే తారట్లాడటం మొదలుపెట్టాడు.
    బారెడు పొద్దెక్కాక నిద్రలేచి, చెదిరిన ముంగురులూ, నలిగినా చీరతో బయటకొచ్చిన వరూధిని వెంకటపతి కళ్ళకు రాత్రికంటే అందంగా గన్పించింది. వెంకటపతి ఆశగా చూశాడు. రెప్పలాడించి, కళ్ళు మెరిపించింది వరూధిని. వచ్చే నవ్వును ఆపుకోటానికి ప్రయత్నించింది. చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. వెంకటపతి గబగబా వరూధిన్ని సమీపించాడు.
    "బుచ్చమ్మా! అయ్యగారికి కాఫీ ఇచ్చావా?" అంది. వెంకటపతికేసి లజ్జుగా చూసి "వుండండి ఇప్పుడే వస్తా!" అంటూ తాటాకుల చాటుకు వెళ్ళింది వరూధిని.
    వెంకటపతి పడగ్గదిలో వరూధిని తల్లోనించి రాత్రి రాలి నలిగిన మల్లెపూలు వాసనచూసి, మంచంమీద బొటనవేలు గోరు కొరుక్కుంటూ కూర్చున్నాడు. వరూధినివచ్చి భర్తముందే చీరా, రవికా మార్చుకుంది. వెంకటపతికి పిచ్చెక్కిపోయింది. బుచ్చమ్మ గదిబయట నిలబడి "అమ్మాయి గారూ, కాఫీ!" అంది.
    వరూధిని వెళ్ళి రెండుగ్లాసులు పట్టుకొచ్చి వెంకటపతి పక్కన కూర్చుంది. ఓ గ్లాసు భర్తకు అందించింది. గ్లాసుచుట్టూ వున్న ఆమె వేళ్ళను నొక్కిపట్టుకున్నాడు వెంకటపతి.
    "కాఫీ ఒలుకుతుంది." అంటూ వరూధిని చేతిని వెనక్కు తీసుకొంది.
    "ఊఁ తాగండి మరి!" గారంగా అని తను కాఫీ తాగసాగింది. వెంకటపతి కాఫీ రెండుగుక్కలువేసి ముఖం అదోలా పెట్టాడు.
    "ఏం? కాఫీ బాగాలేదా?"
    "చేదుగా ఉంది."
    వరూధిని విరగబడి నవ్వింది.
    "బుచ్చమ్మా! పంచదారడబ్బా తీసుకురా! అయ్యగారు పానకం తాగుతారట!"
    "నాక్కాఫీ అలవాటులేదు మరి!"
    "చద్దన్నం అలవాటా?" వరూధిని పొట్టచెక్కలయ్యేట్టు నవ్వింది.
    "ఏం? కాఫీకంటే చద్దన్నమే మంచిది తెలుసా?" నంగినంగిగా అన్నాడు వెంకటపతి.
    "చద్దన్నం తింటే బుర్ర పనిచేయదు తెలుసా?" వరూధిని పలువరుస నక్షత్రాల్లా మెరిశాయి.
    "రెక్కలకష్టం మీద బతికేవాళ్ళకు బుర్రెందుకు?" అన్నాడు వెంకటపతి.
    వరూధిని ముఖంలో నవ్వు మాయమయింది. కాఫీ గ్లాసు అందుకొని పక్కన పెట్టి వెంకటపతి దుబ్బుతల్లోకి వేళ్ళుపోనిచ్చి ఆడించింది. వెంకటపతి వరూధిని నడుంచుట్టూ చేతులువేసి నొక్కి పట్టుకొని అడిగాడు.
    "నేనంటే నీ కిష్టం లేదా?"
    "తలంతా మాసింది." మాటమార్చి అంది వరూథిని.
    "రాత్రెందుకలా చేశావ్?"
    "బుచ్చమ్మా! రాముడ్ని పంపించి మంగల్ని పిలిపించూ!" వెంకటపతినుంచి దూరంగా జరుగుతూ కేకపెట్టింది వరూధిని.
    వెంకటపతికి నలుగుపెట్టి తలంటిపోశాడు మంగలి. మధ్యమధ్య వరూధిని వచ్చి బుచ్చమ్మనూ, మంగల్నీ పురమాయించి తను దగ్గిరుండి భర్తకు సబ్బు రుద్దించింది.
    తలంట్లు కాగానే టిఫినూ, కాఫీ తెచ్చి వెంకటపతిముందుపెట్టి  ఎదురుగా కూర్చున్నది వరూధిని.
    "ఎన్నిసార్లు కాఫీ తాగుతారూ?" అన్నాడు వెంకటపతి.
    "ఎన్నిసార్లయినా తాగొచ్చు!" చిలిపిగా నవ్వింది వరూధిని. వెంకటపతికి నెత్తిమీద నుంచి బరువు దిగిపోయినట్టయింది. హాయిగావుంది. అలా కూర్చొని ఎంతసేపయినా వరూథిన్ని చూస్తూ మాట్లాడాలనిపించింది. బయట జీతగాడు గొడ్లను విప్పుతూ అరవటం వినిపించింది. వెంకటపతి చివాల్నలేచి నిలబడ్డాడు. వరూధిని చెయ్యిపట్టుకొని లాగింది.
    "ఇయ్యాల తూరుప్పొలం నాటేస్తున్నారు. ఎప్పుడో ఎల్లాల్సింది" అన్నాడు వెంకటపతి ఆదుర్దాగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS