అప్పారావు (నేటి సంగీత దర్శకులు చక్రవర్తి) గారికి అదే మొదటి పిక్చర్ 'మహారాజుకీ జై' అనే డైలాగ్ ముందు ఇచ్చాం.
ఆయన మైక్ దగ్గరికి రావడానికే చాలా భయపడ్డారు. నేను ధైర్యం చెప్పాను "చూడండి అప్పారావుగారూ! ఎవరూ మన ప్రాణం తీసెయ్యరు. ఒకే అయితే అయ్యింది. లేకుంటే లేదు. నేనున్నాగా మీకెందుకు భయం" - అని మైకు ముందుకు లాక్కెళ్ళి రెండుసార్లు రిహార్సల్స్ ఇచ్చి "టేక్" అన్నాను.
ఒకే టేక్ లో ఆ ఒక్క డైలాగ్ చక్కగా లిప్ కి కరెక్ట్ గా చెప్పేశారు. అంతే అదే పిక్చర్లో రెండు మూడు వేషాలకి చాలా బాగా మాట్లాడారు. (ఈనాడు డబ్బింగ్ లో అతనిలా మాట్లాడే ఆర్టిస్ట్ లేడని మంచి పేరు వుంది. అది వేరే సంగతి)
"మరి మొదట వేసిన లూప్ తీయించేసేవేఁ సరోజా?" అని శ్రీశ్రీగారు అడిగారు.
వారిని మోసగించడం అంత తేలికైన పని కాదని బాగా తెలుసుకున్నాను.
"అందులో చిన్న మార్పు ఉందండీ. ఇప్పుడు తీసేద్దామా" - అన్నాను.
"నీ పట్టు ఉడుము పట్టేనని నాకు తెలుసులే. ముందు లూప్ వేయించు. పద, ఎక్కడ మార్చాలో చెప్పు" - అనగానే.
లూప్ వేయించి తెర ముందుకి వెళ్ళాం. పిక్చర్ లూప్ చూసి మార్చాల్సిన చోటు చెప్పాను.
ఖజానాలో నుండి వెంటనే డైలాగ్ తీసి ఇచ్చేశారు. లోపలికి వెళ్ళి ఇంజనీరింగ్ రూమ్ లో కూర్చున్నారు. ఆ వేషానికి డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్ మైక్ ముందుకి వచ్చాడు.
వచ్చినాయన తన డైలాగ్ చెప్పి వెళ్ళిపోవచ్చుగా!" లేడిపిల్లేదీ పారిపోయే" అని పిక్చర్లో వున్న పాట పల్లవి పాడాడు. అంతే - "కట్" అని శ్రీశ్రీగారి గొంతు థియేటర్ లో వున్న స్పీకర్ లో వినిపించి నడుస్తున్న లూప్ ఆగిపోయింది.
సిగరెట్టు దమ్ముగట్టిగా లాగుతూ - రుద్రుడిలా థియేటర్లోకి వచ్చారు. నాకప్పుడే గుండె దడదడలాడింది. ఏదో గొడవ జరుగుతుందని భయం వేసింది.
"సరోజా!" - అని ఒక్క కేక వేశారు.
"ఏమిటండీ" - అని తెల్లమొహం వేశాను.
"ఇక్కడ డైలాగ్స్ డబ్ చేయడానికి వచ్చావా? పాడడానికా అని అడిగారు.
"నేను పాడలేదండీ. అతను పాడితే నేనేం చెయ్యను?" - అని బిక్కమొహం వేశాను.
"ఏఁవయ్యా? ఎవరా లేడిపిల్ల? మైకు ముందు ఆ పాటలేమిటి? డిసిప్లిన్ అక్కర్లేదూ? ఆ లూప్ కట్ చేశాను. ఆ పాతలేవో బైటకి వెళ్ళి పాడుకో నీ వర్క్ మధ్యాహ్నమే ఇప్పుడు తియ్యను" - అనేశారు.
థియేటర్లో నిజంగానే ఇటువంటి చేష్టలు కూడవని నాకూ అనిపించింది. కానీ ఏం చెయ్యను? ఆర్టిస్ట్ లతో గట్టిగా చెప్పేటంత వాయిస్ అప్పటికి నాకు మాత్రం ఎక్కడుంది? నాకూ అనుభవం కూడా లేదు.
ఆర్టిస్టులంతా నిజంగానే భయపడిపోయారు. అందరికీ శ్రీశ్రీగారంటే విపరీతమైన భయం. భక్తీ కూడా అదీగాక - డబ్బింగ్ చరిత్ర ప్రారంభం శ్రీశ్రీగారితోనే ఆనాడు వారొక్కరే లీడింగ్ లో వున్నారు. ఇదీ ఒకందుకు మంచికే అనుకున్నాను. డబ్బింగ్ లో డిసిప్లిన్ వుండాలి. కొన్ని పద్దతులూ ప్రవేశపెట్టడం చాలా అవసరం అని అప్పుడనిపించింది. మధ్యాహ్నం ఒంటిగంటవరకూ స్పీడుగా వర్క్ చేశాం.
శ్రీశ్రీగారు ఇటున్న సూర్యుడు అటుపడినా సరే లంచ్ మాత్రం ఎక్కడా చేసేవారు కారు. ఇంటికి వెళ్ళాల్సిందే. తొంభై తొమ్మిది పాళ్ళు ఆఖరి వరకూ ఆ పద్దతిని పాటించారనే చెప్పాలి.
"నువ్వెక్కడ భోంచేస్తావు" అనడిగారాయన.
"అందరితో పాటు నేనూ ఇక్కడే వుండిపోతానండీ" - అన్నాను పిచ్చిమొద్దులా.
"ఏం ఇంట్లో భోజనం లేదా?" అనడిగారు.
"ఆ డొంక తిరుగుళ్ళెందుకు? సూటిగా చెప్పండి" - అన్నాను.
"నిన్నింట్లో దిగబెడతాను" అన్నారు.
"మీరు మూడుగంటలైతే కానీ రారు. కాల్ షీట్ రెండు గంటలకే కదా" అన్నాను.
"నేను దిగి కారు నీ దగ్గరికి పంపించేస్తాను. నువ్వు భోంచేసి వెంటనే వెళ్ళు" అన్నారు. ప్రొడ్యూసర్ల గుండెలో రాయి పడింది.
"నన్ను మొదట ఇంట్లో దింపిన తర్వాత శ్రీశ్రీగారిని దింపి నా కారు నా దగ్గరికి వస్తుంది. నేను వెంటనే వచ్చేస్తాను సార్" - అని ప్రొడ్యూసర్లతో చెప్పాను.
* * *
కార్లో కూర్చున్నాం.
"ఆ పాట ఎవర్ని చూసి పాడేడంటావ్?" అని అడిగారు.
"నాకు తెలీదండి. నన్ను చూసి మాత్రం కాదు" అన్నాను.
ఆడవాళ్ళు నలుగురైదుగురున్నారు. అందులో మా పెద్ద చెల్లి రామం కూడా డబ్బింగ్ చెప్తోంది. ఆమెది మంచి పర్సనాల్టీ. బహుశా ఆమెను చూసే పాడాడనుకున్నాను. కానీ ఆ మాట శ్రీశ్రీగారితో చెప్పలేదు. చెప్తే మరేమైనా వుందా? కొంపలంటుకోవూ?
"నిన్ను చూసే అనుకుందాం. ఏమిటి చేస్తావు?" అన్నారు.
"పళ్ళు రాలగొట్టేస్తాను"
"అది కాదు సరోజా! డబ్బింగ్ అంటే డబ్బింగ్ ధ్యాసలోనే వుండడం కాదు. చుట్టూ వున్న వాతావరణాన్ని మనుషుల్ని గమనిస్తూ వుండాలి. గొడ్డులా ఏమిటా పని?" "ఏమయిందండి" అన్నారు.
"ఏమీ కాకూడదనే అంటున్నాను. మనకి ఒకరు గౌరవం ఇవ్వాలంటే మనం మసలుకోవడంలోనూ, ఎదుటివారికి నువ్విచ్చే ట్రైనింగ్ మీద ఆధారపడుతుంది" అన్నారు.
"చూడండి. నా ధ్యాస అంతా డబ్బింగ్ ఎలా పూర్తి చేస్తామా, లిప్ ఎలా వస్తుందా, రోజుకి ఎన్ని లూప్స్ తీస్తామా, ఎన్ని తియ్యాలా - అనే వాటిమీదే వుంటుంది. కానీ అకస్మాత్తుగా వచ్చే ఇలాంటి సంఘటనల్ని పట్టించుకొనే స్థితిలో నేను వుండనండీ"
"ఉండాలి సరోజా! మధ్యాహ్నం కాల్ షీట్ కి మూడు గంటలకి కూడా నేను రాను. నాలుగు గంటలకి వస్తాను. నువ్వు మెసేజ్ చెయ్యగలవని నాకు ధైర్యం, నమ్మకం రెండూ ఉన్నాయి. ఏం చేస్తావో, ఎలా చేస్తావో, చేసుకో" - అన్నారు.
నా గుండె చల్లగా జారిపోయింది.
"ఏవండీ - మీకు పుణ్యం వుంటుంది. నామీద ఇంత పెద్ద భారం మోపకండి. ఆర్టిస్టులతో కొత్త, డబ్బింగ్ కొత్త ఏమైనా కానీయండి - మీరు లేకుండా నేను వెళ్ళను" "ఎందుకంత భయం?" అన్నారు.
"భయం కాదండి. మీరు రాసిన డైలాగ్స్ అయితే అలాగే మాట్లాడించేసి, టేక్ చేయించేస్తాను. ఖర్మకాలి, ఏమైనా మార్పు చేయాల్సి వస్తే ఏం చెయ్యను?" అన్నాను.
"ఏమీ మార్పురాదు. వచ్చినా చెయ్యకు" అన్నారు.
"అది మాత్రం నావల్ల కాదు" అన్నాను.
"కాని లిప్ కి తగినట్టుగా ఏమైనా చిన్న చిన్న మార్పులొస్తే చెయ్యి, నేను పర్మిషనిస్తున్నాను"
"పెద్ద డైలాగ్స్, ఒక పేజీ డైలాగ్ వుండే లూప్ వస్తే ఏం చెయ్యను?" అన్నాను.
"అది అట్టే పెట్టేయి. నేను వచ్చాక తీద్దాం" అన్నారు.
"అది అన్యాయమండీ" అన్నాను.
"అదేమిటి సరోజా! నేను లేకుండా డబ్బింగ్ చెయ్యాల్సివస్తే ఏం చేస్తావు! దాని కిప్పటి నుండే ట్రయినింగ్" అన్నారు.
"నిజంగా ట్రయినింగేనా? లేక ఇదో విధమైన కొత్త పరీక్షా? ఇంకా ఇది రెండవ పిక్చరండి" అన్నాను.
"తెలివుంటే ఒక పిక్చర్ చాలదా?" అన్నారు.
ఇక వాదించి ఏమీ లాభంలేదు. ఇదేదో నలుగురిలో నగుబాట్లకే వచ్చిందనుకున్నాను.
నేను ఇంటి దగ్గర దిగుతూ వుంటే, "ఈ రోజు లేడి పిల్లబ్బాయ్ వర్క్ తియ్యకని" చెప్పారు.
నేనేం మాట్లాడలేదు.
"వినిపించిందా?" అనడిగారు.
"అలాగేనండి. మీరొద్ధన్న పని ఎందుకు చేస్తాను?" అన్నాను.
* * *
శ్రీశ్రీగారు లేకుండా రెండు గంటల సేపు డబ్బింగ్ వర్క్ మేనేజ్ చెయ్యడం కఠిన శిక్ష అనుకున్నాను.
మొదటిసారిగా నా మీద డబ్బింగ్ బాధ్యత వదలి నా శక్తి సామర్ధ్యాలను మహాకవి పరీక్షించదలచుకున్నా రనుకున్నాను.
'నిజంగానే ఈవిడకి సామర్ధ్యం వుందా? ఈవిడ కేం తెలుసని శ్రీశ్రీగారు అసిస్టెంట్ గా పెట్టుకున్నార'ని అప్పటికే గుసగుసలు ప్ర్రారంభమయ్యాయన్న సంగతి నాకు తెలుసు. రోట్లో తలపెట్టి రోకలిపోతుకి వెరిస్తే ఎలాగ? - అన్న సామెత జ్ఞాపకం వచ్చింది." "అదేమిటి సరోజా! నిజంగానే శ్రీశ్రీగారు నాలుగు గంటలవరకూ రారా?
వారు లేకుండా నువ్వొక్కర్తివీ డబ్బింగ్ ఎలా చేస్తావే?" - అని కారెక్కుతూ అమ్మ అంది.
"ఉండమ్మా! నువ్వొక్కర్తివి. అసలే నేను భయంతో చస్తూ వుంటే" - అన్నాను. ఆర్టిస్టులందరూ భోజనాలు చేసి సిద్దంగా వున్నారు. శ్రీశ్రీగారు వస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను పది నిముషాల్లో 20 లూప్స్ దాకా శ్రీశ్రీగారు లేకుండా చెయ్యాల్సినవి గబగబా ఎంచేసుకున్నాను.
"ఏవండీ - ఇవాళ నా వర్క్ ఉందా?" - అని ఉదయం గొడవతెచ్చిన పుణ్యాత్ముడు అడిగాడు.
