Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 33


    కామినీని తను అంతంచేసినట్లు ఏ చిన్న సాక్ష్యాధారం వుండకూడదు. ప్రమాదములో మరణించినట్లు పధకం రూపొందించాలి.
    ఆ పధకాన్ని ఎలా రూపొందించాలో తెలియక ఆలోచిస్తూ కూర్చున్నాడు కిరణ్.
    ఆ ఆలోచన అలా సాగుతూ ఉండిపోయింది.
    దానికో రూపం అంటూ ఏర్పడలేదు.


                               20
    
    కిరణ్ వెళ్ళేసరికి జగదీష్ ఇంట్లోనే వున్నాడు.
    కిరణ్ ను చూస్తూనే జగదీష్ కిరణ్ కు ఎదురువచ్చి ఆప్యాయంగా ఆహ్వానిస్తూ లోపలికి తీసుకువెళ్ళాడు.
    జగదీష్ వుండేది ప్రక్కవూళ్ళోనే. కిరణ్, జరదీష్ మంచి ఫ్రెండ్స్. కలిసి అల్లరిపనులు చాలానే చేశారు. జగదీష్ కాలేజీలొ చదువుతూండగానే అతడి తండ్రి హార్ట్ ఎటాక్ తో హటాత్తుగా మరణించడముతో అతను చదువు మధ్యలో కాలేజీకి గుడ్ బో బై చెప్పక తప్పలేదు. తండ్రి వదిలి వెళ్ళిన బిజినెస్ ను చూస్తూ ఇంటిపట్టునే వున్నాడు.
    జగదీష్ ది పక్కవూరే కాబట్టి మొదట్లో తరచూ కిరణ్ అతని దగ్గరకువెళ్ళి ఒక రోజంతా అతని ఇంట్లో వుండి రావడం చేస్తుండేవాడు. తరువాత తరువాత నెలకి, రెండునెలలకి, ఒకసారి కలుసుకోవటం మొదలుపెట్టాడు. ఈ మధ్య వాళ్ళిద్దరూ కలుసుకుని నాలుగునెలలపైనే అయ్యింది.
    ఇప్పుడు కిరణ్ జగదీష్ ని కలుసుకోవటానికి వచ్చాడు.
    జగదీష్ ని వాళ్ళింట్లోనే కలుసుకున్నాడు కిరణ్.
    "మీ వాళ్ళంతా ఏరి! కుర్చీలో కూర్చుంటూ అడిగాడు కిరణ్.
    "అందరూ మ్యారేజ్ కి వెళ్ళారు. రెండురోజులబట్టీ మహా బోర్ గా వుంది- సమయానికి వచ్చావురా కిరణ్."
    "అయితే మనకి కావలసినది స్వేచ్చ అన్నమాట." నవ్వుతూ అన్నాడు కిరణ్.
    "మనకి ఎప్పుడు స్వేచ్చ లేదోయ్?" మనకి మించిన ఫ్రీబర్డ్స్ ఎక్కడ వున్నారో చెప్పు!"
    కిరణ్ చెప్పలేదు కాని, కొద్దిగా ఆలోచించాడు. "తను ఎన్నిసార్లు వచ్చినా ఈవూరు, జగదీష్ బిజినెస్ పనులమీద తలమునకలయి అయినా వుండేవాడు. లేకపోతే ఇంటినిండా వాళ్ళవాళ్ళన్నా వుండేవాళ్ళు. తను బయలుదేరిన వేళమంచిది జగదీష్ తో ఒక గంట వంటరిగా మాట్లాడాలనుకున్నాడు. అతనితో మాట్లాడితే తనకు మనశ్శాంతిగా వుంటుంది....అని ఎన్నో అనుకున్నాడు. తన అదృష్టం కొద్దీ జగదీష్ ఒంటరిగా వున్నాడు. జగదీష్ ని మాటలలో పెట్టి..."
    "ఏంటిరా కిరణ్ అంత దీర్ఘాలోచనలో పడ్డావ్!"
    "ఆలోచిస్తున్నాను."
    "ఆలోచిస్తున్నావని తెలుస్తూనే వుందోయ్! ఏమిటి ఆలోచన అని అడుగుతున్నాను." జగదీష్ చిరునవ్వుతో అడిగాడు.
    "మనం గతంలో గడిపిన కొన్ని తియ్యని సంఘటనలు జ్ఞాపకం వచ్చాయి.
    "నిన్ను చూస్తుంటే నాకూ వస్తున్నాయ్. ఆ రోజులే వేరురా! జామ్ జామ్ గా తిరిగేవాళ్ళం. ఇంట్లో చూడబోతే అమ్మపోరు, బైట బిజినెస్ తో చిరాకు, ఒళ్ళు మండిపోతున్నదనుకో. బిజినెస్ వదిలేద్దామా అంటే పదే అదే మాకు ఆధారం. పెళ్ళి చేసుకుందామా అంటే రేపటినుండి ఆవిడగారి సాధింపులు. అందుకే పెళ్ళిమటుకు నాలుగురోజులు వాయిదా వేశాను. కిరణ్ నువ్వు మాత్రం తొందరపడి పెళ్ళి చేసుకోకోయ్. స్వేచ్చ అనే పదానికి ఫులిస్టాప్ ఏమిటో తెలుసా? పెళ్ళామే! అన్నట్లు నీ తిరుగుడు ఇందాకా వచ్చింది?"
    జగదీష్ ప్రాణమిత్రుడయినా తనకి అనుకోని పరిస్థితులలో పెళ్ళి అయిందని చెప్పలేకపోయాడు కిరణ్.
    "నా తిరుగుళ్ళు మామూలే నన్ను అడ్డుపెట్టేవాళ్ళు, ఆపేవాళ్ళూ ఎవరూ లేరుకదా! మరి నీ సంగతేమిటి?"
    "అదివరకులాగా సాహసాలు చిలిపిపనులు చేయటానికి టైమెక్కడ వుందోయ్! అవసరానికి ఓ పువ్వుల గోవిందమ్మని పట్టాలే."
    "ఏమిటి ముసలిదాన్నా!" ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్.
    "దాన్ని కాదురాబాబూ దాని కూతుళ్ళని. పట్టటం అంటే దాని చేతుల్ని అన్నమాట. రంభా, ఊర్వశి, తిలోత్తమ ముగ్గురు కూతుళ్ళు వున్నారు దానికి. కూతుళ్ళంటే నిజంగా కూతుళ్ళు కాదురోయ్. మూడులోకాలనుండి ముగ్గురు ముద్దుగుమ్మల్ని తీసుకువచ్చి పెంచుకుంటున్నది. నాకు వీలైనప్పుడల్లా దాని చేతులు తడుపుతూ వుంటాను. అదేమో రంభ దగ్గరకో, ఊర్వశి దగ్గరకో పంపిస్తూ వుంటుంది. ముగ్గురూ ముగ్గురే చాలా వెరయిటీ సరుకు" జగదీష్ వివరించాడు.
    "ఇదేదో బానే వున్నట్టుందే!" నవ్వుతూ అన్నాడు కిరణ్.
    "ప్రస్తుతానికి బానే వుంది." అంటూ జగదీష్ లేచివెళ్ళి ఫ్రిజ్ తెరచి రెండు లిమ్కాలు తెచ్చాడు.
    ఓ సీసాని కిరణ్ కి అందిస్తూ "ప్రస్తుతానికి చల్లచల్లగా ఇది పుచ్చుకో మిత్రమా! రాత్రికి మందు విందు, పసందు అన్నీ చవిచూపిస్తాను. అందిస్తూ అన్నాడు.
    సీసా అందుకుని "రాత్రికి వెళ్ళిపోవాలిరా" నెమ్మదిగా చెప్పాడు కిరణ్.
    "అరె! నువ్వు వచ్చావని చాలా సంతోషిస్తూ వుంటే"
    "సంతోషించుభాయ్! ఎవరొద్దన్నారు."
    "అదికాదు కిరణ్! రాత్రికే వెళ్ళే అర్జంట్ పనేమిటి?
    "నీకు తెలిసిందేకదా ఇది పెళ్ళిళ్ళ సీజన్. రాత్రి పన్నెండింటికి అమ్మానాన్నతో కలిసి ఒక మ్యారేజ్ కి వెళ్ళాలి. ఇపుడు సమయం ఎంత నాలుగు. బైక్ మీద గంటలో ఇక్కడకు వచ్చేశాను. ఇప్పటినుండి 4 గంటలు నీదగ్గర వుంటాను. ఎనిమిదిన్నర ప్రాంతంలొ తిరిగి బయలుదేరతాను. బైక్ మీద గంట ప్రయాణం. అయినా పది గంటలకి ఇంట్లో వుంటాను. పెళ్ళి కెళ్ళటానికి ఇంకా చాలా టైము వుంటుంది. నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని అనిపించింది. ఉన్నట్లుండి బయలుదేరి వచ్చేశాను."
    "నీ రాక ఆనందము, నీవు వెడతానంటే నిరాశ కల్గుతున్నాయి."
    "జీవితమే సుఖదుఃఖాల కలయిక.
    "ఈ మెట్టవేదాంతము ఎప్పటినుండిరోయ్" జగదీష్ ఆశ్చర్యంగా అడిగాడు.
    "ఈ మధ్య ఓ స్వామీజీ వుపన్యాసం విన్నాలే!"
    "అంతేనా, ;లేక గిరీశం గారి వెంకాయమ్మ ఎక్కడైనా తగిలిందా!"
    కిరణ్ నవ్వి వూరుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS