Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 33


    అది ఆత్రం కాదు. పగిలిన కాలకూట ఫాలనేత్రం వర్షిస్తున్న అగ్ని సాగరాల బడబాగ్ని.....వయసు గ్రహణం ఉత్తేజాన్ని నులిమేస్తున్నా భీభత్సోత్సవ ప్రకరణాల ఒరిపిడిలో కొత్త అధ్యయాల్ని తెరుస్తున్నాడు.
    నిట్టూర్పుల సెగళ్ళ కాంతిలో ఎన్ని లిప్తలు గడిచాయో గుర్తులేదు.
    ఎన్ని ఆలోచనల తూణీరాలు అతడి గుండెల్లో చిక్కుకుని ఉన్మాదానికి గురిచేసిందీ జ్ఞప్తికి రాలేదు.
    మెదడు లోపల "నినదించే" శబ్దరహిత భాషకి అసలు ఏ భావమైనా వుందో లేదో తెలీదు. అలాగే.....ఉప్పెన తరువాత ఉపశమించిన కడలిలా మీద వాలిన సుకృతిని చూస్తూ చాలాసేపు వుండిపోయాడు.
    "థేంక్స్" స్వప్నంలోలా అన్నాడు.
    జుగుప్సగా వుంది. అయినా అడిగింది- "దేనికి?"
    "ఇంత గొప్ప అనుభవాన్ని దక్కించుకోడానికి ఒక జీవితకాలం ఎదురుచూడాల్సివచ్చింది సుకృతీ!"
    అసహ్యంగా రాలిపడబోయిన ఓ నీటిబొట్టుని అలాగే అదిమిపెట్టి పెదవులకి నవ్వు పులుముకుంది. తనకోసం అతడి కోరికల కావ్యానికి తొలి శ్లోకమైంది.
    "చెప్పు! ఇంకా ఏం కావాలి?" అడిగాడు శెట్టి. ఆ క్షణంలో సుదర్శనరావు మాటలు జ్ఞప్తికి వచ్చి మనసుని మండిస్తుంటే ఉద్విగ్నంగా అన్నాడు. "మొహమాటపడకు సుకృతీ! నా నుంచి ఏం కోరుకుంటున్నావు?"
    పద్దెనిమిది సంవత్సరాల వయసునీ, యవ్వనాన్నీ పదిలంగా అర్పిస్తే మొన్నొకడు దోచుకునే మోసం చేశాడు. ఇప్పుడింకో వ్యక్తి తను దోచి పెట్టడానికి సంసిద్దతని వ్యక్తం చేస్తున్నాడు. ఇద్దరూ కోరింది తన యవ్వనాన్నే అయినా అతడికన్నా శెట్టి చాలా నయం కదూ!
    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?" అడిగాడు శెట్టి.
    "నిస్సహాయంగా నేను పోగొట్టుకున్న జీవితం గురించి...." నిర్వేదంగా నవ్వింది. "మీరు ముందే పరిచయమైతే కనీసం మీకు మాత్రమే కట్టుబడిన ఆడపిల్లనయ్యేదాన్ని శెట్టిగారూ! కానీ నా అవసరాన్ని అవకాశంగా మలుచుకున్నాడు సుదర్శనరావు."
    సాలోచనగా చూశాడు శెట్టి. నిజాయితీగా తన గురించి తాను చెప్పిన సుకృతి అతడి దృష్టిలో ఎంత ఎదిగిపోయిందీ అంటే ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. తనవాళ్ళూ అనుకుంటే తప్ప ఏ ఆడపిల్లా తన రహస్యాన్ని విప్పి చెప్పదని బలంగా నమ్మే వ్యక్తి కావడంతో "ఇక నీకు దేని గురించీ దిగులు వుండదు సుకృతీ! చెప్పు..... నా నుంచి యింకా ఎలాంటి సహాయాన్ని కోరుకుంటున్నావ్?" అన్నాడు పట్టుదలగా.
    "తప్పకుండా తీరుస్తారా?"
    "నా మీద అనుమానమా?"
    "మాటివ్వకుండానే నాకిన్ని సమకూర్చిన మీరు ఎంత ఉన్నతులో నేను ముందే గ్రహించాను శెట్టిగారూ!" క్షణం ఆగి అంది "మీరో వ్యక్తికి సహకరించాలి."
    "డబ్బు కావాలా?"
    "కాదు"
    "మరి?"
    "దర్శకుడ్ని చేయాలి! ఎవర్నో కాదు....నా మూలంగా సుదర్శనరావు యూనిట్ నుంచి తరిమేయబడ్డ శివని......అతడిలో గొప్ప డైరెక్టర్ కాగల శక్తి వుందో లేదో నాకు స్పష్టంగా తెలీదు. కానీ తపన వుంది. కృషితో అహోరాత్రులు శ్రమించగల పట్టుదల వుంది...... ప్రత్యేకించి మిమ్మల్నే ఎందుకడుగుతున్నానూ అంటే- ఇది మీకు మాత్రమే సాధ్యమయ్యే విషయం కాబట్టి! ఇట్స్ మై లాస్ట్ ఏంబిషన్.....యస్.....మీ నుంచి నేను ఆశించే చివరి సహాయమిది!"
    ఆమె ఎందుకడిగినాగాని, ప్రపోజ్ చేసింది ప్రపంచానికింకా తెలీని ఓ అణ్వాస్త్రం గురించిన అతడికీ తెలీదు.
    అంతే....
    ఆ మరుసటి రోజు ఉదయమే శివకోసం కారు పంపాడు నారాయణ శెట్టి సినిమా తీయాలన్న ఉత్సాహంతో కాదు. కేవలం సుకృతి అభ్యర్దనపై శివ కోసం సినిమా తీయాలని.
    తెలుగు సినిమారంగాన్ని ఓ అనూహ్యమైన మలుపు తిప్పిన తొలి సంఘటన అది!
    సహజంగా ధైర్యవంతుడయినా నారాయణశెట్టి ఫ్లాట్ లో అడుగుపెడుతూనే తడబడ్డాడు శివ.
    ఇది అతను ఊహించని మలుపు. అందులోనూ తన కోసం కారు పంపింది సామాన్యుడు కాదు!
    "గుడ్ మాణింగ్ సర్"
    హాల్లో పేపరు చదువుతున్న శెట్టి తల పైకెత్తి చూశాడు. "రండి! కూర్చోండి" మర్యాదగా సోఫా చూపించాడు.
    ఓ అమ్మాయి సంపర్కం మగాడిలో ఎలాంటి మార్పుకి కారణమయ్యేదీ తెలియజెప్పగల ఉదాహరణలా ఎవర్నీ లక్ష్యపెట్టే అలవాటులేని శెట్టి, ఇప్పుడిప్పుడే కొన్ని సభ్యతలకు అలవాటుపడిపోతున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS