"అమ్మమ్మా!" మృదువుగా పిలిచింది స్వప్న.
"నన్ను చెప్పనీ తల్లీ! ఇప్పుడు తప్పితే మళ్ళీ ఇవన్నీ చెప్పుకోలేమోననిపిస్తోంది. ఇతను నీకు అన్ని విధాలా తగినవాడు. రవీ! జాగ్రత్తగా విను. నువ్వు నా కోరిక తీర్చాలి. స్వప్నను పెళ్ళాడు. నేనీ ఆపదనుంచి బయటపడితే నేనే మీ పెళ్ళి బ్రహ్మాండంగా జరిపిస్తాను-లేదా నువ్వు పెళ్ళిచేసుకో. ఎవర్నీ నమ్మద్దు. అంతా మోసగాళ్ళే ఐశ్వర్యం కేంద్రీకృతమైన చోటు చూస్తే అందరికీ ఆశే అసూయే నీ చుట్టూ ఉన్న మనుషులే నిన్ను దగాచేస్తారు. నీ సంపద హరించాలని చూస్తారు. నేను చాలా ఏళ్ల క్రితమే విల్లువ్రాశాను. ఈఆస్తి అంతా స్వప్నకి, ఆమెని పెళ్ళాడే వ్యక్తికి సమానంగా రాశాను. ఒక కాపీ మనప్లీడరు గారి దగ్గరా, ఒక కాపీ సేఫ్ లో వుంది. ఇంటికి సంబంధించిన రికార్డు, బ్యాంక్ పుస్తకాలూ, కేష్ అంతా ఆ సేఫ్ లోనే వుంది ఇవిగో తాళాలు! ఇద్దరూ చేతులు చాచండి!"
"అమ్మమ్మగారూ! అదంతా యిప్పుడెందుకు? మీరు విశ్రాంతి తీసుకోండి!" ఇంకేదో అనబోయిన రవి ఆమె చూపులు చూసి ఆగిపోయాడు.
"రవి! నాది ఆజ్ఞ! నేను బ్రతికినన్నాళ్ళూ అలాగే జరుపుకొన్నాను. ఈ అంతిమఘడియల్లోనూ అంతే! దానికి భంగం రావటం నేను సహించను!" ఆమె కంఠం బలహీనంగా వున్నా స్పష్టంగా పలికింది.
రవి మౌనం వహించాడు.
"స్వప్నా! రవీ! మీ చేతులిలా యివ్వండి! నేను కలిపిచూసి ఆనందిస్తాను. ఈ చేతులు నే కలిపితే అది బ్రహ్మముడి కంటే బలమైంది."
రవి చప్పున స్వప్న వేపు చూశాడు. అదే సమయంలో స్వప్న కూడా అతనివైపు చూసింది. అప్రయత్నంగా చేయి చాచింది స్వప్న. ఏదో తృప్తితో తనూచేయి చాచాడు రవి.
ఆనందంగా యిద్దరి చేతులూ ఏకం చేసింది కృష్ణ వేణమ్మగారు ఆమె కళ్ళలో ఏదో తృప్తి! ఏదో ఆనందం.
"సృష్టిలో విచిత్రం చూడు! అటు మీ అమ్మ చనిపోయింది. ఇటు మీ పెళ్ళి జరిగిపోయింది. నేను మరణశయ్య మీద ఉన్నాను. ఒక కంట్లో దుఃఖం, మరో కంట్లో ఆనందం అంటే యిదే" నీరసంగా అందామె.
మెల్లిగా యిద్దరి చేతులు వదిలేసి నీరసంగా కళ్ళు మూసుకుంది. ఇద్దరూ ఆమెకి చెరోవైపు కూర్చున్నారు. జరిగిందంతా చిత్రంగా, విచిత్రంగా వుంది ఇద్దరికీ. మరికొద్దిసేపు తర్వాత ఇద్దరూ మంచందిగి చెరోవైపు కుర్చీల్లో కూర్చున్నారు. అమ్మమ్మగారు కళ్ళుమూసుకుని పడుకున్నారు మరికొద్దిసేపటికి నిద్రపోతున్నట్టుగా గమనించారిద్దరూ.
"వెంకట్రామయ్య గారూ!"
రవి పిలుపువిని దగ్గరిగా వచ్చాడు ఆయన.
"చూడండి! రేపు ఉదయమే ఆమెకి అంత్యక్రియలు ఏర్పాటుచేయండి. నరసింహంగారు ఎక్కడున్నారో విచారించండి. ఎంతయినా ఆయన ఆమెకి భర్త-స్వప్నకి తండ్రి-ఈ ఇంటి అల్లుడు-ఆమె అంత్యక్రియలు ఆయనే నెరవేరిస్తే మంచిది."
ఆయన స్వప్న వేపు చూశాడు.
"అవును అలాగే చేయండి!" అంది స్వప్న గంభీరంగా.
తలూపి వెళ్ళాడు వెంకట్రామయ్య.
ఆరాత్రి యిద్దరికీ నిద్దర్లేదు. అలాగే కుర్చీలో కూర్చుండిపోయారు. అయినా వేకువన ఎప్పుడో మగతలోకి జారిపోయారు.
24
హఠాత్తుగా మెళుకువైంది స్వప్నకి. చప్పున కళ్ళు తెరిచి అమ్మమ్మవైపు చూసింది. ఆమె పడుకున్నతీరులో ఏదో అసహజత కనిపించింది. గాబరాగా 'అమ్మమ్మా!' అంటూ పిలిచింది.
ఆ పిలుపు వింటూనే కళ్ళు తెరిచాడు రవి. వెంటనే అమ్మమ్మవైపు చూశాడు అతనికి స్వప్నపిలుపులోని గాబరాకి అర్ధం కనిపించింది.
"పోయారు! అమ్మమ్మగారు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించిన దానిలా హాయిగా వెళ్ళిపోయారు. సుఖంగా నిద్రలోనే పోయారు. ఎంత పుణ్యాత్మురాలు. పడుకున్నది పడుకున్నట్లుగానే చనిపోయింది. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం!"
అతని ధోరణిని భంగపరుస్తూ 'అమ్మమ్మా!' అంటూ కేకేసింది స్వప్న. ఆమె గొంతులో దుఃఖం వేల అడుగుల ఎత్తునుంచి దూకే సెలయేరులా వుంది.
"స్వప్నా!" తొలిసారిగా పిలిచాడు రవి.
చప్పున అటు చూసింది స్వప్న.
"మనస్సుని నిగ్రహించుకో! అమ్మమ్మగారు ప్రశాంతంగా పోయారు. ఆమె మనస్సుకి గాఢమైన దెబ్బ తగిలింది. ఆ దెబ్బనుంచి కోలుకోలేక పోయారు. ఏంచేస్తాం? చెప్పు. అది మన చేతుల్లో లేదు."
ఆమెకళ్ళు నీటిజలదాల్లా వున్నాయి.
ముఖం వర్షించే కారుమేఘంలా వుంది.
అంతలో వెంకట్రామయ్య వచ్చాడు. "బాబూ! ఎంత గాలించినా నరసింహం జాడ తెలియలేదు. ఊళ్ళో అతనుండే చోట్లల్లో వెతికించాను. ఎక్కడాలేదు భార్య పోయిన విచారంలో ఏమైపోయాడో"
