ఆ పదాలు వినగానే సృజనపాదాలు మంత్రంవేసినట్లు ఆగిపోయాయి.
తర్వాత నెమ్మదిగా పంజరందగ్గరికెళ్ళి ఒణుకుతున్న గొంతుతో అంది.
"మర్చిపోచిలకా! మర్చిపో ఇవన్నీ! నాన్నా, అమ్మా, తమ్ముడూ, చెల్లీ.....అన్నీ మర్చిపో ఓ రామచిలకా! మారిపో ఇంక!"
అలా అంటుంటే ఒక వెచ్చాయి భాష్పకణం ఆమె కనుకొలకుల్లోనుంచి చెంపమీదికి జారింది.
బొంబాయి: నారీమన్ పాయింట్
నలభై అంతస్తుల ఆ స్కై క్రేపర్ బిల్డింగ్ బీచ్ ఒడ్డున నిటారుగా నిలబడి సముద్రంలోకి చూస్తున్న జెయింట్ లాగా ఉంది.
దాని ముఫ్ఫయ్ తొమ్మిదో అంతస్తులో ఉంది ఆ ఎక్స్ క్లూజివ్ రెస్టారెంటు ఖరీదయిన డెకరేషన్ తో ఉన్న ఆ పెద్దహాలులో దూర దూరంగా వేసి ఉన్నాయి యిదే అయిదు టేబుల్సు. అందువల్ల కస్టమర్సులి ఎంతో ప్రైవసీ లభిస్తోంది. అక్కడ ఉన్న కస్టమర్సు కంటే వెయిటర్సే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. భయభక్తులతో, శ్రద్దా సక్తులతో కస్టమర్సు అవసరాలు గమనిస్తున్నారు వాళ్ళు.
ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు బ్రహ్మాజీరావు. యాభై ఏళ్ళు ఉంటాయి అతనికి. ఒత్తుగా ఉన్న జుట్టులో అక్కడక్కడ అయిదారు తెల్లవెంట్రుకలు వెండి తీగల్లా మెరుస్తున్నాయి. అది తప్పిస్తే మనిషి ఎక్కువ వయసు ఉన్న వాడిలా కనబడటంలేదు. మొహంమీద స్కిన్ క్లియర్ గా, యంగ్ గా కనబడుతోంది. చాలా స్లిమ్ గా, కానీ చాలాబలంగా ఉంది అతనిశరీరం.
జాగ్రత్తగా కట్ చేసి కుట్టిన తెల్లటి సఫారీ సూటు అతనికి బాగా నప్పింది.
అతనికి ఒకవైపున అతని భార్య ప్రమీల కూర్చుని ఉంది. రెండో వైపున కొడుకు మనోహర్ కూర్చుని ఉన్నాడు.
అప్పుడేడిన్నరు పూర్తిచేశారు వాళ్ళు.
చెక్ ని ఒక అందమైన ఫోల్డరులో తెచ్చి వాళ్ళముందు పెట్టాడు బేరరు. (పెద్ద హోటల్సులో బిల్ ని చెక్ అనడంవాడుక.)
మామూలు మనుషులయితే, ఆ బిల్లుని చూడంగానే దడుచుకోవాలి.
యధాలాపంగా బిల్లుని పోల్డరులోనుంచి తీసి చూసింది ప్రమీల.
ఐటమ్స్ వరుసగా రాసి ఉన్నాయి.
రష్యన్ సెవ్ రుగా కేవియర్: రూ. 690-00
పేట్ ఆఫ్ గూస్ లివర్: రూ. 580
వన్ బాటిల్ ఆఫ్ ఛటూలాటూర్(1980): రూ. 2,490-00
స్టీక్ స్కాట్స్ బ్లాక్ అంగూస్:రూ.560-00 టూ సిగార్స్(డానిడోఫ్స్) ఈచ్:రూ. 300-00 రూ. 600-00 అక్కడిదాకా చదివి, మొహం చిట్లించింది ప్రమీల. ఇంతింత ఖరీదు లేమిటి! అబ్సర్డ్! చేపకూర ఆరొందల తొంభయ్యా! లిక్కర్ బాటిల్ రెండువేల నాలుగొందల తొంభయ్యా! ఒక్కొక్క చుట్టా మూడొందలరూపాయలా! దోపిడీ ఇది! పోనీ రుచీపచీ ఏమన్నా మత్తరంగా ఉన్నాయా అంటే అదీ లేదు! వీటికంటే గుంటూరు శంకర్ విలాస్ లో టిఫిన్ నయం!" అంది.
చిన్నగా నవ్వి ఊరుకున్నాడు బ్రహ్మాజీరావు.
"నవ్వుతారేమిటండీ! అసలు ఈ హోటలుకి ఎందుకొచ్చినట్లూ అనవసరంగా! ముగ్గురు డిన్నర్ తీసుకుంటే బిల్లు పధ్నాలుగు వేల రూపాయలా? పైగా సేల్సు టాక్సు పదిహేనుపర్సెంట్. ఇంపోర్టెడ్ లిక్కర్ మీద టాక్సు ఇరవై అయిదు పర్సెంట్, మొత్తం బిల్లులో టిప్ పదిహేను పర్సెంట్! మైగాడ్! మన ఊరెళ్ళాక ఎవరితోనైనా చెప్పినా నమ్మరు! నవ్వుతారు!" అంది ప్రమీల.
"భోజనంతోబాటు చాక్లెట్లు ఫ్రీగా ఇస్తున్నారు. వాటిని లెక్కపెట్టవేం!" అని నవ్వాడు బ్రహ్మాజీరావు. తర్వాత అన్నాడు "ఇవాళ చాలా శుభదినం ప్రమీల! మన కొత్త ఇండస్ట్రీలో పార్టనర్ గా కలవడానికి సేఠ్ మాణిక్ లాల్ వప్పుకున్నాడు. సేఠ్ మాణిక్ లాల్ అంటే ఎవరు? బిజినెస్ మాగ్నేట్! అతనుదేన్ని తాకితే అది బంగారం అవుతుంది. ఈ సంతోష సమయంలో కొన్నివేలు సరదాగా తగలేస్తేనేం! సెలెబ్రేషన్ కి సమయం ఇది!"
పైగా, మనం పే చేస్తున్నది ఈ డిన్నర్ కి కాదు, డైన్ మీద ఉన్న ఆ అమ్మాయి పాటకి అనుకుంటే పోలా? అప్పుడు ఈ బిల్లు రీజనబుల్ గా కనబడుతుంది. చాలా బాగా పాడుతోంది ఆ అమ్మాయి. కాదా?" అన్నాడు.
డైన్ మీద దేవకన్యలా నిలబడి, లయబద్దంగా పాదాలూ, పెదాలూ కదుపుతూ, కిన్నెర కంఠంతో గంధర్వగానంచేస్తున్న ఆ అమ్మాయివైపు తదేకంగా చూసింది ప్రమీల.
నిజంగానే అద్భుతంగా పాడుతోంది ఆ అమ్మాయి. ఆమె ఆ సమయంలో నృత్యం చెయ్యడంలేదు. కానీ అప్రయత్నంగానే ఆమె పడుతున్న ముద్రలూ, వాటికి అనుగుణంగా మారిపోతున్న హావభావాలూ ఆమెకి నృత్యంలో మంచి ప్రవేశముందని చెబుతున్నాయి.
"ఆ అమ్మాయి పేరు ఏమిటి?" అంది ప్రమీల స్వగతంలా.
"సీత!" అన్నాడు వాళ్ళబ్బాయిమనోహర్ వెంటనే.
సీత అనే ఆ పేరుని పలికేటప్పుడు అతను మనసులో అనుకున్నాడు.
షీ ఈజ్ డివైన్! యా! సింప్లీ డివైన్!
ఆమె పాట పూర్తి అయ్యాక క్లాప్స్ వినబడ్డాయి.
శ్రోతల అభినందల స్వీకరిస్తున్నట్లు అభివాదం చేసింది సీత. తర్వాత తనకు సహజమైన వయ్యారం నడకలోకనబడిపోతూ ఉండగా డైస్ దిగింది.
"గొప్పగా పాడింది" అంది ప్రమీల తన భర్త బ్రహ్మాజీరావుతో.
"అవును!" అన్నట్లు తలపంకించి, "ఆమె వస్తోంది" అన్నట్లు సైగచేసాడు బ్రహ్మాజీరావు.
అది గమనించని మనోహర్ అన్నాడు.
"సీత అనే పేరు ఎక్కువగా తెలుగువాళ్ళు పెట్టుకుంటారు కదూ?"
పక్కనుంచి వెళుతున్న సీత ఆ మాటలువిని, ఆగి చిరునవ్వుతో దగ్గరికి వచ్చింది.
"మీరు ఎక్కడనుంచి వచ్చారు? హైదరాబాద్?" అంది తెలుగులోనే.
ఆమె ఆగి తనతో మాట్లాడుతుందని ఊహించని మనోహర్ ఉబ్బి తబ్భిబ్బై, "అవును!" అన్నాడు తడబడుతూ.
ప్రమీల ఒకసారి ఇబ్బందిగా భర్తవైపు చూసి, తర్వాత సీతతో అంది.
"కూర్చోండి"
సంకోచించకుండా, ఖాళీగా ఉన్న నాలుగోకుర్చీలో కూర్చుంది సీత. మనోహర్ వైపే చిరునవ్వుతో చూస్తోంది తను. వెరీయంగ్ ఛాప్! పొగరు మోతు గుర్రపు జూలులా విశృంఖలంగా నుదుటిమీద పడుతున్న జుట్టు.
"నీపేరేమిటి?" అంది.
ఆమె తనని చిన్నపిల్లాడిలా చూస్తూ ఏకవచనంలో సంబోధించడం అతనికి నచ్చనట్లుంది. కుర్చీలో నిటారుగా కూర్చుని, "మనోహర్! ఇంజనీరింగ్ చదువుతున్నాను." అన్నాడు.
"ఇంజనీరింగా! ఓహ్! బట్ యూలుక్ సో యంగ్!" అని నవ్వింది సీత.
"నేను బ్రహ్మాజీరావ్!" అన్నాడు బ్రహ్మాజీరావు మర్యాదకోసం తననితాను పరిచయం చేసుకుంటూ "అండ్ దిసీజ్ మై వైఫ్! ప్రమీల!"
