ప్రమీలవైపు తిరిగి చిరునవ్వుతో తలపంకించింది సీత. మళ్ళీ వెంటనే మనోహర్ వైపుతిరిగింది.
"హాలిడేకి వచ్చారా మనోహర్?"
"బిజినెస్ కమ్ ప్లెజర్!"అన్నాడు బ్రహ్మాజీరావుకలగజేసుకుంటూ.
"అలాగా!సైట్ సీయింగ్ పూర్తి అయిందా?ఎలిఫెంటాకేవ్స్?"
"చూశాం"అన్నాడు మనోహర్.
అతన్నే కొద్దిక్షణాలసేపు తదేకంగా చూసింది సీత.
ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది ఇతన్నిచూస్తుంటే?
ఎక్కడచూసింది తను?
లేకపోతే తనకుతెలిసినవాళ్ళ పోలికలు ఎవరివైనా ఉన్నాయా ఇతనికి?
చటుక్కునదానికి సమాధానం స్ఫురించింది సీతకు. వెంటనే ఆమెమనసుని మంచు తెర ఒకటి ఆవరించినట్లు అయిపోయింది.
ఒక్కక్షణం తర్వాత తేరుకుని, బ్రహ్మాజీరావుతో అంది ఆమె.
"మీరు బిజినెస్ మాన్ అనుకుంటాను."
"అవును! ఇండస్ట్రీస్ ఉన్నాయి" అన్నాడు బ్రహ్మాజీరావు.
"బాంబేలో వర్క్ పూర్తి అయిపోయిందా?"
"ఇంకో రెండు మూడు రోజులుపట్టొచ్చు. మాకు కావలసిన మనిషి అహమ్మదాబాద్ వెళ్ళాడు. ఆయన వచ్చేవరకూ ఇక్కడ ఉండక తప్పదు. అక్కడ హైద్రాబాద్ లో కొంపమునిగిపోయే పనులు ఉన్నాయి. హెల్డ్ఆప్ అయిపోయాం!"అన్నాడు బ్రహ్మాజీరావు నవ్వుతూ.సంభాషణాచాతుర్యం చాలా ఉంది అతనికి. తన విషయాలన్నీ ఓపెన్ గా చెప్పేస్తున్నట్లు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతివాళ్ళూ తనకి చాలా దగ్గరివాళ్ళే అన్న అభిప్రాయం కలిగిస్తూ ఉంటాడు అందరికీ.
కానీ అతనికి నిజంగా దగ్గరివాళ్ళకి మాత్రమే తెలుసు అవసరానికి మించి ఒక్క ముక్కకూడా అతను ఎవరికీ చెప్పడని.
అందుకే అతను మంచి బిజినెస్ మాన్ అయ్యాడు.
"అహమ్మదాబాద్ వెళ్ళారా?ఎవరు?"అంది సీత, ఊరికే మాటలు పొడిగిస్తూ.
ఒకసారి ఆమెవైపు నిశితంగా చూసి, "సేఠ్ మాణిక్ లాలు!" అన్నాడు బ్రహ్మాజీరావు.
అది వినగానే తల వంచుకుని కొద్ది క్షణాలు ఆలోచించింది సీత. తనకు తెలిసిన సమాచారం వీళ్ళతో చెప్పవచ్చా?చెప్పవలసిన అవసరం ఉందా?
తర్వాత నెమ్మదిగా అంది "మాణిక్ లాల్ అహ్మదాబాద్ వెళ్ళలేదు."
అది వినగానే, ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు బ్రహ్మాజీరావు.
"వాట్ డూ యూ మీన్!ఆయన ఇవాళ పొద్దున్న అహమ్మదా బాద్..."
"లోన్ వాలా వెళ్ళాడు" అంది సీత.
కాసేపు నిరుత్తరుడై ఉండిపోయాడు బ్రహ్మాజీరావు లోన్వాలా అంటే బొంబాయికి దగ్గరగా, హైదరాబాద్ రూట్ లో ఉన్న ఒక హాలిడేరిసార్ట్. కొండల మధ్య ఉంటుంది.
మాణిక్ లాల్ తనతో అహమ్మదాబాద్ వెళుతున్నానని చెప్పి....
"మీకెలా తెలుసు?" అన్నాడు సీతతో.
సీత జవాబు చెప్పకుండా ఒక్కసారి అతనివైపు చూసి, తర్వాత మనోహర్ వైపు తిరిగింది.
తనకెలా తెలుసు?
మాణిక్ లాల్ తో బాటు కంపెనీ ఇవ్వడానికి ఒక కాలేజ్ గర్ల్ ని తనే అరేంజ్ చేసింది.
అందుకని తెలుసు తనకి!
అయినా ఇవన్నీ తన కెందుకు? ఎవరేమైపోతే తనకేం?
కానీ.....
ఈకుర్రాణ్ణి చూస్తే.....తనకు గతం గుర్తొచ్చి......మనసు పీకి......వీళ్ళకేమైనా చెయ్యాలనిపిస్తోంది.
కొద్దిగా తటపటాయించి, తర్వాత గబగబ చెప్పింది సీత. "సేఠ్ మాణిక్ లాల్ ఈజ్ ఏ బాస్టర్డ్! అతనికిమీకంటే మంచి టెర్మస్ ఆఫర్ చేసిన పార్టీ ఇంకోళ్ళు దొరికారు. అందుకే మీకు అందకుండా పోవాలని లోన్ వాలా పారిపోయాడు మాణిక్ లాల్! కాగితాలు సైన్ చెయ్యకుండా! బ్రహ్మాజీరావుగారూ! మీ జాగ్రత్తలో మీరు ఉండండి! మాణిక్ లాల్ తో డీల్ సెటిల్ కాకపోవచ్చు." ఆమె అలా అనగానే అక్కడఉన్న అందరినీ మౌనం ఆవరించింది.
కాసేపు నిశ్చేష్టుడైపోయి కూర్చున్న బ్రహ్మాజీరావు తేరుకున్న తర్వాత మళ్ళీ అన్నాడు.
"మీకెలా తెలుసు ఇదంతా?"
దానికి సూటిగా జవాబు చెప్పలేదు సీత. "సేఠ్ మాణిక్ లాల్ అహమ్మబాద్ లో ఉన్నాడో, లోన్ వాలాలో ఉన్నాడో కన్ ఫర్మ్ చేసుకోండి. దాన్ని బట్టి తెలిసిపోతుంది మీకు నేను చెప్పింది నిజమో కాదో!"
"తప్పకుండా కన్ ఫర్మ్ చేసుకుంటాను" అన్నాడు బ్రహ్మాజీరావు...."ఐ గాట్ మై ఓన్ కనెక్షన్!" అని లేచివెళ్ళిపదినిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు.
తెల్లటి అతని మొహం ఎర్రగా కందిపోయి ఉంది ఇప్పుడు.
అతని మొహంలోకే చూస్తున్న ప్రమీల "ఏమయింది?" అంది ఆరాటంగా.
"దట్ మాణిక్ లాల్ ఈజ్ ఏ రియల్ సన్ ఆఫ్ ఏ బిచ్!"అని చెప్పి, తర్వాత "థాంక్స్ సీతగారూ! ఇంకా ఎంబ్రాస్ మెంట్ కలగకుండా టైంలో మమ్మల్ని సేవ్ చేశారు మీరు!" అన్నాడు బ్రహ్మాజీరావు కృతజ్ఞతగా.
"చూశారా! రాష్ట్రం వదిలి బయటికి వచ్చాక తెలుగువాళ్ళంటే తెలుగు వాళ్ళకి ఎంత అభిమానం ఉంటుందో! ఈమె సరిగ్గా సమయానికి వచ్చి ఆదుకోకపోతేమనమింకా....."అంటోంది ప్రమీల.
ఆమె మాటలు పూర్తిగా చెవికెక్కడంలేదు సీతకి.
వాళ్ళుసాటి తెలుగువాళ్ళన్న అభిమానంతోనేనా తను ఈ ఇన్ ఫర్మేషన్ చెప్పింది?
అదొక కారణం కావచ్చు. కానీ అది పూర్తిగా నిజంకాదు!
ఈ కుర్రాడు....ఈ మనోహర్ ని చూస్తే......తనకు తన తమ్ముడు గుర్తువస్తున్నాడు.
ఇలాగే గుర్రపు జూలులా జుట్టు మొహంమీద పడుతూ ఉండేదివాడికి! ఎంతదువ్వినా కూడా!
తమ్ముడు గుర్తొస్తే చెల్లెలు గుర్తొస్తుంది.
చెల్లెలుతోబాటు అమ్మా, నాన్నా, అందరూ!
వాళ్ళతోబాటు గుర్తొస్తుంది తను మర్చిపోయిన ఒకప్పటి తన పేరు.
సృజన!
సీతగామారిన సృజన!
పేరుతోబాటు గుర్తొస్తుంది తాను ఉండిన మలక్ పేట!
